అస్సామీ కవి నీలిమ్ కుమార్ కవితలు

1.మైనం

నా మనసులోని చీకటిని తరమడానికా అన్నట్టు
నువ్వు కాలిపోతున్నావు

నీ జీవితంలో సగం ముగిసింది
కానీ చీకటి ఇసుమంతైనా మాయమవలేదు

నువ్వు తప్పకుండా
చీకటిలో మునిగిపోతావు

దేవుడొక్కడే నీకోసం దేవులాడుతాడు
కానీ ఈ చిత్రమైన చీకటిలో
నీ ఆత్మను అవలోకించలేడు

ఓ నా పిచ్చి మైనమా!
నిన్ను వెతికే క్రమంలో
దేవుడు వెలిగిస్తాడు నిన్ను
చీకటి నిన్ను చూసి
పక్కకు పారిపోతుంది

2. సముద్రం

కాబట్టి సముద్రానికి అసలే నిద్ర పట్టలేదు
జాబిల్లి ఎప్పుడూ చుక్కలతో కలిసి వస్తుంది
కడలిగుండెలో జలకమాడేందుకు

గాలి, చేపలు, నత్తలు కూడా కోరుకుంటాయి 
సముద్రంతో కలిసి పడుకోవాలని

పడవలు, ఓడలు దాని హృదయానికి
సిందూరవర్ణం పులుముతాయి

కాని అది నత్తలేరుకుని
మనసులోకి ప్రవేశించని
అమ్మాయిని ప్రేమిస్తుంది

కాబట్టి సముద్రానికి అసలే నిద్ర పట్టలేదు

*** 

నీలిమ్ కుమార్ సమకాలీన అస్సాం కవితారంగంలోని అత్యంత ప్రసిద్ధులలో ఒకడు. పదిహేడు కవితా సంపుటాలనూ, కొన్ని నవలలనూ రాసిన ఈయన ‘ద కాల్ ఆఫ్ ద బ్రహ్మపుత్ర’ అనే సంస్థకు అధ్యక్షుడు. రజా ఫౌండేషన్ పురస్కారం (2009), ఉదయ్ భారతి జాతీయ పురస్కారం (1994) పొందాడు. ఇతని కవితలు మణిపురి, స్పానిష్ భాషలలోకి అనువదింపబడినాయి. అస్సాంలో జన్మించిన ఇతడు ప్రస్తుతం అస్సాంలోని గువాహటిలో నివసిస్తున్నాడు- ఎలనాగ (అనువాదకుడు).   

 

ఎలనాగ

ఎలనాగ: అసలు పేరు డాక్టర్ నాగరాజు సురేంద్ర. కరీంనగర్ జిల్లా, ఎలగందుల లో పుట్టారు (1953).
వృత్తిరీత్యా చిన్నపిల్లల డాక్టరైనా ప్రాక్టీసు చెయ్యటం లేదు. సాహితీ వ్యాసంగమే వ్యాపకం. మొదలు నైజీరియాలో, తర్వాత ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖలో పని చేసి, 2012 లో రాష్ట్రస్థాయి అధికారిగా పదవీ విరమణ. చాల కథలు, కవిత్వం అనువాదాలు చేశారు. వివిధ రచయితల కవితలు, కథలు, సాహితీవ్యాసాలను ఆంగ్లం నుంచి తెలుగు కూడా చేశారు. సొంతంగా చాల కవిత్వం రాశారు. వీరి గళ్ళ నుడికట్టు ప్రసిద్ధం. చాల బహిమతులు కూడా పొందారు.

8 comments

 • చక్కని కవితలను అనువాదానికి ఎంచుకున్నారు.మీ అనువాదం సరళసుందరం. రెండిటికి రెండు గుండెను తట్టేవే.కరిగిపోయే మైనం,శాంతి లేని సముద్రం జీవనస్పృహల చిహ్నాలుగా.అభినందనలు.

 • బాగుంది సార్ అనువాదం. మంచి కవిత్వం.

 • అస్సాం నీలోమా కుమార్ కవితలు త్రన్స్లతిఒన్
  చదివాను సర్, బాగున్నాయి, మైనం మీద కవిత
  కవిత చాలా గుంది,
  తెలుగులో ఉన్నాయి గాని, కరిగి పోతూ వెలుగు నీయటం త్యాగం ఇలాంటివి, ఇది డిఫరెంట్ గా ఉంది.

  యూవీరత్నం

 • సర్
  రీడ్ నీలిమ కుమార్ మైనం కవిత బాగుంది

 • అనువాదాలు, బాగున్నాయి, సర్!💐సముద్రం బాగా నచ్చింది,నాకు.ధన్యవాదాలు సర్.అనువాదాలు కంటిన్యూ చేయండి సర్,మాకోసం!👍

 • అవును, అనువాదం చేసేందుకు సరైన కవితలను ఎంపిక చేసుకోవటం ముఖ్యమైన విషయం. అయితే, అనువాదకళలో నైపుణ్యం సంపాదించడం కూడా ప్రధానమైనది. నా అనువాదం మీకు నచ్చినందుకు సంతోషం, కృతఙ్ఞతలు.

 • రామ్మోహన్ తుమ్మూరి గారూ, విలాసాగరం రవీందర్ గారూ, యు. వి. రత్నం గారూ! మీ ముగ్గురికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

 • అనువాదంలో గాఢత చెక్కు చెదరలేదు. పద్యాలు బావున్నాయి.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.