ఒక దేవుళ్ళు…

దేవుడా!

నాకు చాలా డౌట్లున్నాయి! తోడు నువ్వు కూడా!

‘దేవుడు అంటే యేమిటి?’

నా ప్రశ్నకు వొక్కొక్కరు వొక్కో సమాధానం యిచ్చారు! ఒకే సమాధానం యివ్వలేదు?!

ఔను! ‘నీకు అన్నం పెట్టేవాడు దేవుడు’ అంది అమ్మ! ‘అయితే నువ్వే’ అన్నాను! ఎందుకంటే అమ్మే కదా, నీకయినా నాకయినా అన్నం పెడుతుంది! కాని అప్పుడు అమ్మ అంది కదా?, ‘నాదేముంది?, మీ నాన్న తెచ్చి పెడుతున్నారు, నేను వండి వడ్డిస్తున్నాను’ యేదో ఆలోచిస్తోంది అమ్మ! ‘అయితే నాన్న కూడా దేవుడే’ అన్నాను! ‘అమ్మానాన్నలే దేవుళ్ళు’ అంది నాకు వత్తాసు పలుకుతూ నానమ్మ!

‘అయితే అమ్మానాన్నల ఫోటో దేవుళ్ళ ఫోటోల మధ్య యెందుకు లేదో?’ నా అనుమానం తీర్చకుండానే మావయ్య ‘అక్కా… నీకొడుకు నిన్నూ బావనీ పైకి పంపెయ్యాలని చూస్తున్నాడు’ అని నవ్వాడు! టెంకి మీద వొక్కటిచ్చాడు! నేను తప్పు మాట్లాడినట్టు మెత్తగా నానమ్మ నా బుగ్గలమీద లెంపలు వేసి తనూ వేసుకుంది!

నేనన్నది తప్పని అర్థమయ్యింది! కానీ యెందుకు తప్పో అర్థం కాలేదు?!

మరి బడికి వెళ్తుంటే అమ్మ ముద్దిచ్చి మరీ చెప్పింది! ‘గురువే దైవం’ అని! టీచర్ చెప్పినట్టు వినమని! నడుచుకోమని! టీచర్ మా అందరి పేర్లు అడిగి, తన పేరు కూడా చెప్పింది! చెప్పి, ‘నేనెవర్ని?’ అని అడిగింది! ‘యూ ఆర్ మై గాడ్’ అని చెప్పాను! టీచర్ మొదట్లో మెచ్చుకున్నా తరువాత మాత్రం ‘యెక్కువయింది తగ్గించు’ అని కోప్పడింది! అంతేనా? కాదు, మా టీచర్ని పేరు పెట్టి తిట్టి, ‘పిల్లలకి సరిగా నేర్పడం లేదు, చెప్పడంలేదు… వీళ్ళకి జీతాలు యెలా అరుగుతాయో?’ అని అమ్మే తిట్టింది?!

ఆ తర్వాత ‘అతిథి దేవోభవ’ అన్నారు! ఇంటికి వచ్చిన అతిథులెవరు? చుట్టాలూ బంధువులూ స్నేహితులూ యెవరు వచ్చినా రెండు చేతులూ జోడించి ‘నమస్తే అంకుల్… నమస్తే ఆంటీ’ అంటామా? ‘ఇదీ కల్చర్… యిదీ ట్రెడిషన్…’ అని నన్నూ చెల్లినీ మేచ్చేసుకుంటారా? అమ్మానాన్నా మమ్మల్ని చూసి మురిసిపోతుంటారా? మైమరచిపోతుంటారా? అక్కడికి కొద్ది రోజులకి ఆ అతిథిల్ని వాళ్ళ బుద్దుల్నీ గుర్తు చేసుకొని అమ్మానాన్నా నానమ్మా అంతా తిట్టుకుంటూ వుంటారా? దేవుళ్ళు దెయ్యాలయిపోతారా? చీటీ పాట యివ్వలేదని కానివ్వలేదని చిన్నారావు అంకుల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు?!

అతిథిలందరూ దేవుళ్ళు కాదన్నమాట?!

ఎవరైనా పెద్దవాళ్ళు యింటికి వస్తే నమస్కారం పెట్టాలని మరెందుకు చెప్పారో అర్థం కాక అడిగితే, నాన్న యేమన్నారు? ‘దేవుడు ప్రతి వొక్కరిలో వుంటాడు… నీలో వుంటాడు… నాలో వుంటాడు… అందరిలో వుంటాడు’ అన్నారు! ‘డు’యే అన్నారు! అలాగని బడికెళ్లే దార్లో బిచ్చమెత్తుకొనే ముసలాయన నమస్కారం పెడితే- తిరిగి నమస్కారం పెడితే మాత్రం తిట్టారు?!

దేవుడు అందరిలో కాక కొందరిలోనే వుంటాడన్నమాట?!

‘అంకుల్ వచ్చాడు’ అని వొకరోజు చెప్తే- ‘డు అనకూడదు, రు అనాలి’ అని చెప్పి యింట్లో తిట్టారు! ‘చిన్న పిల్లలు’ అని ఆ అంకులే సేవ్ చేశాడు! కాదు, రు! అయితే నాకో మరో డౌట్ వచ్చింది! రాదా?

‘దేవురు గుడికి అమ్మ వెళ్ళింది’ నాన్న అడిగితే చెప్పానా? ‘రామురు దేవురు… ఆ దేవురి భక్తురు ఆంజనేయురు’ అని చెల్లికి కథ చెప్పానా? అది విన్న అమ్మా నాన్నా గయ్ గయ్ మన్నారు! నడిచి నడిచి బంగురుతున్నావేం?- అని తిట్టారు?! ‘డు’ పలకడం రావడం లేదా వెధవకి- అని అంటే, ‘లేదు, దేవుర్ని గౌరవిస్తున్నాను’ అన్నాను! ‘మెంటల్ ఫెలో’ అన్నారు! మామూలుగా మాట్లాడమన్నారు! వాడూ వీడూ- అన్నట్టే దేవుడూ అన్నాను! ఇంకేం చేస్తాం?!

మగ దేవుడులని ‘డు’ అంటే- మరి ఆడ దేవుడులని ‘ది… అది… యిది’ అంటే- ప్చ్… వద్దులే డౌట్స్ పెంచుకొని అనవసరంగా దెబ్బలు కాయడం దేనికి?

రేసుగుర్రం సినిమాలో అల్లూ అర్జున్లాగ మావయ్య ‘ద్యావుడా’ అంటే యే తప్పూ లేదు?!

‘దేవుడ్ని తప్పుగా అంటే నోరు పడిపోతుంది’ అంటుంది నానమ్మ! ‘మొక్కిన మొక్కులు చెల్లించకపోతే దేవుడు చూస్తూ వూరుకుంటాడా… నాశనం చేసెయ్యడూ?’ అంటుంది అమ్మ! ‘దేవుడు లేడూ దెయ్యం లేదూ అని అంటాడు కదా… అందుకే సావిత్రమ్మ కొడుక్కి యాక్సిడెంటయ్యి- దేవుడు కాళ్ళూ చేతులూ సుబ్బరంగా విరిచేశాడు’ అని నాన్న అంటారు! ‘దేవుణ్ణి అంటే కళ్ళు పోవూ’ అని పక్కింటి పిన్ని వత్తాసు పలుకుతుంది!

ఇలాంటివి దేవుడి గురించి విన్నప్పుడల్లా దేవుడున్నాడన్న ధైర్యంకంటే భయమే యెక్కువ వేస్తుంది! ‘దేవుడు అంత టెర్రరిస్టా అమ్మా?’ అని డౌట్ వస్తుంది! అలాగని అడిగామా మన పని అయిపోతుంది! 

‘దేవుడు అంతా చూస్తున్నాడు… దేవుడు అంతా వింటున్నాడు’ అని నానమ్మ అంటుందా? ఎక్కడి నుండి చూస్తున్నాడో డౌట్?! ఎక్కడి నుండి వింటున్నాడో డౌట్?! నా డౌట్ కనిపెట్టినట్టే నానమ్మ అంటుంది కదా?, ‘దేవుడు అంతటా నిండి వున్నాడు’ అని! ప్రతి అణువులో వున్నాడని! ‘మనసులో అనుకున్నది కూడా దేవుడికి తెలిసిపోతుందా?’- అని డౌట్ చెప్పకముందే, మనసులో మొక్కుకుంటే యెలా తెలుస్తుందో, దేవుడి గురించి కూడా నువ్వేమనుకుంటున్నావో దేవుడికి తెలిసిపోతుంది’ చెప్పింది నానమ్మ!

నేను లెంపలు వేసుకున్నాను!

‘దేవుడి గురించి యేమనుకున్నావురా?’ అని నానమ్మ అడిగింది! ‘ఊ… ఆ…’ అని నేను వెదుక్కుంటుంటే, ‘నీళ్ళు నమలకు చెప్పు’ అంది! ‘చెప్పకపోయినా దేవుడికి తెలిసిపోతుంది కదా’ అన్నాను! దేవుడ్ని చూస్తే టెర్రరిస్టుని చూసినట్టు భయం వేస్తోందని మాత్రం చెప్పలేదు! ‘కాని దేవుడు అంటే భయంగా వుంది’ అన్నాను! ‘ప్రతొక్కరూ దేవుడికి భయపడి బతకాలి’ అంది నానమ్మ! ‘దేవుడి భయం లేకపోతే యీ మనుషులు లొంగుతారా? వొంగుతారా?’ అంది! ‘ఇంతకీ నువ్వు దేవుడు గురించి యేమనుకున్నావో చెప్పలేదు?’ వదల్లేదు నానమ్మ!

‘దేవుళ్ళందరూ వొకటేనా?’ అడిగాను! ‘ఒకటే, యే పేరున పిలిచినా వొకటే’ నానమ్మకు తోడు అమ్మ!

‘ఓహో… మనుషులందరూ వొకటే- లాగ! ఏ పేరున పిలిచినా అందరూ మనుషులే- లాగ… అర్థం చేసుకుంటూ అన్నాను! ‘ఎలాగ?’ అన్నారు నేను చెప్పింది అర్థం కానట్టు!

‘రాము అంటే హిందువు! రాబర్ట్ అంటే క్రిష్టియన్! రహీమ్ అంటే ముస్లిమ్! కాని అందరూ మనుషులు!’ అని నేను యింకా చెపుతున్నాను!

మధ్యలో ‘నీ బొంద’ అంది నానమ్మ! ‘నీ వెర్రి’ అంది అమ్మ!

‘ఇప్పుడు రాముడు అంటే హిందువు! ఏసుప్రభు అంటే క్రిష్టియన్! అల్లా అంటే ముస్లిమ్! కాని అందరూ దేవుళ్ళు’ అన్నాను!

అమ్మా నానమ్మా యిద్దరూ ముఖాముఖాలు చూసుకొని నావంక చూశారు! ‘దేవుడికి మతమేమిట్రా?’ అన్నారు!

‘దేవుడి పేరు చెపితే- ఆదేవుడిది యే మతమో తెలిసిపోతుంది కదమ్మా’ అన్నాను!

మూగోళ్ళలా చూశారు అమ్మా నానమ్మా!

‘మతం లేని దేవుడు లేడు కదమ్మా?’ అని అడిగాను!

అప్పుడే నాన్న వచ్చారు! ఊళ్ళో సంబరాలు చేస్తున్నట్టు కబురు తెచ్చారు! ఇప్పుడెక్కడ వెళతాం అంది అమ్మ! ‘మన కుల దేవత… వెళ్ళక పోతే యెలాగ?’ అంది నానమ్మ!

‘దేవుడికి కులం కూడా వుందన్న మాట?’ అన్నాను!

‘ఊ… యెవరి దేవుడ్ని వాళ్ళు పూజించుకుంటారు’ అంది నానమ్మ!

దేవుళ్ళకే కులమతాలు వున్నప్పుడు మనుషులకు మాత్రం యెందుకుండవు?- అనుకున్నాను! అడిగితే తంతారని తెలుసు! ఆన్సర్ లేనప్పుడు పెద్దాళ్ళు చేసేది అదే! ‘నోర్ముయ్’ అని యెన్నిసార్లు అనిపించుకోలేదు?!

స్కూల్లో టీచర్లు కులం లేదు, మతం లేదని అబద్దాలు చెపుతారు!

మనుషుల్లోలాగే దేవుళ్ళలో కూడా పేదవాళ్ళూ డబ్బుగలవాళ్ళూ వుంటారు! నాన్న న్యూస్ చూస్తూ తిరుపతి వెంకటేశ్వరుడి ఆదాయం వొక రోజుకే రద్దీ రోజుల్లో నాలుగు కోట్ల వరకూ వుంటుందని అమ్మకి చెప్పారు! ఆ డబ్బు అంతా యేమి చేస్తారని అమ్మ అడిగింది! ‘భక్తుల డబ్బుతో’- అని నాన్న చెప్పబోతే, నానమ్మ వొప్పుకోలేదు… ‘దేవుడికిచ్చాక అది దేవుడి డబ్బే’ అంది! సరే, ఆ దేవుడి డబ్బుతో భక్తులకి సౌకర్యాలు కల్పిస్తారని నాన్న చెప్పారు! ‘లడ్డూ ప్రసాదాల రేట్లు మాత్రం పెంచేస్తారు’ అని నానమ్మ మధ్యలో గొణిగింది! ఇంకా కళ్యాణ మండపాలు కట్టిస్తారని నాన్న చెప్పారు! ‘హిందూ మత ప్రచారం చేస్తారు’ అని కూడా చెప్పారు!

‘నాన్నా… అందరు మనుషుల్లాగే అన్ని మతాలూ సమానమే కదా?, మరి అలాంటప్పుడు వొక్క హిందూ మతానికే యెందుకు?, అన్ని మతాలకూ పబ్లిసిటీకి యెందుకు ఖర్చు చెయ్యరు?’ అని అడగడం పూర్తికాలేదు! ‘పబ్లిసిటీ యేమిట్రా?’ మధ్యలో గుర్రుగా చూసింది నానమ్మ! ‘ప్రచారం’ అమ్మ నాకు తెలుగు నేర్పించబోయింది! ‘ప్రచారం అంటే పబ్లిసిటీయే కదా?’ అన్నాను! తప్పన్నారు నాన్న! మార్కెట్ చేస్తే అది పబ్లిసిటీ అని, భక్తితో చేస్తే ప్రచారమన్నారు! కాని ఆ తేడా నాకు బోధ పడలేదు!

ఏ దేవుడి ఆదాయం ఆ మత ప్రచారానికే ఖర్చు పెడతారని నాన్న చెప్పారు!

అంటే దేవుడికి కూడా రిలిజియస్ ఫీలింగ్ వుందని నాకర్థమయ్యింది!

తిరుపతిలో అన్యమత ప్రచారం జరగడం గురించి అప్పుడే మరో న్యూస్ వస్తోంది! నాన్న ఆగమనట్టు చేత్తో సౌజ్ఞ చేశారు! కొండమీద వేరే మత ప్రచారం చేసే వాళ్ళని పోలీసులు అరెస్టు చేశారట!

నేను కన్ఫాం చేసుకున్నాను!

ఆ న్యూస్ అయ్యాక ‘ఏడుకొండలవాడి ఆదాయం వల్ల యెన్నో గుడుల్లో దీపాలు వెలుగుతున్నాయి, అర్చకుల్ని పెట్టి నైవేద్యం అందిస్తున్నారు’ గొప్పగా అన్నారు నాన్న! అంటే డబ్బుగల దేవుడు పేద దేవుడికి అదీ తన మతం దేవుడికి… తనకెక్కువయిన ఆదాయాన్ని పంచుతున్నాడన్న మాట! అయినా దేవుళ్ళలో కూడా బీదా గొప్ప తేడా యేమిటో మనుషుల్లాగ?!

‘మరి తిరుపతి దేవుడిలాగే ఇన్కమ్ యెక్కువ వచ్చిన మనుషులు కూడా అస్సలు ఇన్కమ్ లేనివాళ్ళకు యివ్వొచ్చు కదా’ డౌట్ అడిగాను!

అందరూ నావంక అదోలా చూశారు!

నాన్న పెద్దగా వూపిరి వొదిలి మరేం మాట్లాడకుండా న్యూస్ మ్యూట్ తీసేశారు!

టీవీలోనూ దేవుడే! కలుషిత ప్రసాదం తిని భక్తులు ఆసుపత్రి పాలయ్యారని!

నాకు నవ్వొచ్చింది! నవ్వాను!

ఎందుకు నవ్వుతున్నావన్నట్టు నాన్న నన్ను చూశారు!

‘కలుషితం అయితే మాత్రం అది దేవుడి ప్రసాదం కదా?’ అన్నాను! 

అసలు దేవుడి ప్రసాదం కలుషితం యెలా అవుతుంది? ఎవరయినా దేవుడి ప్రసాదాన్ని యెలా కలుషితం చెయ్యగలరు? చెయ్యలేరు కదా? పోని… కలుషితం అయినా గాని తిన్నవాళ్ళకి యేమీ కాకూడదు కదా?- కానీ యివేవీ అడగలేకపోయాను!

‘ఫుడ్ పాయిజన్ అయితే దేవుడేం చేస్తాడు?’ అన్నారు నాన్న!

‘అది కూడా చెయ్యలేడా?’ నేను ఆశ్చర్యపోయాను! దేవుడికి పవర్ లేదా?- మళ్ళీ డౌట్!

దేవుడి గుడి తాళం పగులగొట్టి ఆభరణాలు చోరీ అని వార్త రావడంతో అందరూ చూస్తున్నారు!

‘అసలు దేవుడి గుడికి తాళం యెందుకు?’ నోరు జారాను!

నాన్న నన్ను కోపంగా చూశారు!

పోలీసుల గాలింపు… డాగ్ స్క్వాడ్… సీసీ ఫుటేజీ పరిశీలన… దర్యాప్తు ముమ్మరం… యేవేవో న్యూస్లో చూపెడుతున్నారు!

నేను పుసుక్కున నవ్వాను!

మళ్ళీ నాన్న నన్ను కోపంగా చూశారు!

ఇంతలో టప్పున కరెంటు పోయింది!

అమ్మ ఛార్జింగ్ లైట్ తెచ్చి పెట్టింది!

ఆ లైటింగులో చూశాను! దేవుడి గదిలో కూడా కరెంటు పోయింది! ఆ మాటే అన్నాను! ‘దేవుడి గదిలో కరెంటు పోవడమేమిటి?’ అని!

‘కరెంటు పోతే మొత్తం పోతుంది, దేవుడి గదిలో మాత్రం యెందుకు వుంటుంది?’ అని నాన్న అడిగారు!

‘దేవుడి గది కదా?’ అన్నాను!

‘అయితే?’ అన్నారు నాన్న!

‘దేవుడికి పవర్ వుంటే పవర్ పోకూడదు కదా, ఎట్ లీస్ట్ తన రూమ్లో… తన గదిలో?’ డౌట్ వచ్చిందే అన్నాను!

‘ఎదవ డౌట్లు యెదవ్వేషాలు వేస్తే…’ నాన్న కోపంగా చూశారు, తంతానన్నట్టు!

‘అయినా పిల్లడికి యీ మద్య బొత్తిగా భయమూ భక్తీ లేకుండా పోతోంది’ బాధపడుతూ అంది నానమ్మ!

‘నువ్వూ… నీ చెత్త డౌట్లూ…’ అమ్మ కూడా తిట్టింది!

అప్పుడు చెల్లి అంది కదా- ‘పిల్లలకి డౌట్లు రావాలి, పెద్దవాళ్ళు ఆ డౌట్లు తీర్చాలి, అప్పుడే నేర్చుకుంటారు- అని మా టీచర్ చెప్పింది’

-హరి నారాయణ్,

నాల్గో తరగతి,

ఓం శాంతి విద్యా ధామం.

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

3 comments

  • మన కుటుంబాల్లోని పద్దతులను మనం సాంప్రదాయం అంటున్నము. అవి తరతరాలుగా గుడ్డిగా ఒక తరం నుండి మరో తరానికి బదిలీ చేయబడుతున్నవి మారుతున్న సమాజంలోని మనుషుల అవసరాలతో ప్రమేయం లేకుండానే. ఆ సంక్షోభం పిల్లలను అందునా వైవిధ్యంగా ఆలోచించేవారిని వెంటాడుతూనే వున్నాయి. మీ కథల్లో ఆ సంక్షోభం కనిపిస్తుంది దానికితోడు వ్యంగం తో కూడిన హాస్యం.

  • దేవుడి ముసుగులో దాగున్న దేవులాటను పిల్లాడి సందేహాల రూపంలో బొమ్మకట్టించి.. ముగింపులో సాధారణ కొసమెరుపు.. సిగ్మాండ్ ఫ్రాయిడ్ థి యరీకి దగ్గరగా..వాస్తవికతలోని భౌతికసత్యాన్ని కళ్ళకి కట్టించిన తీరు బావుంది..బజరా..జీ… అభినందనలు!

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.