పిల్లల ముందు తల్లుల హత్యలు: కొలంబియా

దక్షిణ అమెరికాలోని, కొలంబియాలో, పట్టపగలు, నడివీధిలో, పదేళ్ళ పిల్లాడు చూస్తుండగా, పిల్లాడి తల్లిని గన్ మ్యాన్ దారుణంగా  కాల్చి చంపాడు. అంత వరకు శాంతి కోసం, మానవ హక్కుల కోసం నినదించిన మరియా దెల్ పిలార్ హుర్తదొ (Maria del Pilar Hurtado) నిర్జీవంగా నేలకు ఒరిగిపోగా, ఆమె కొడుకు  పదేళ్ల పసివాడు గుండెలు బాదుకుంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదించాడు. పిల్లాడిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దేశం అట్టుడికి పోయింది. కొలంబియా దేశం వీధులు జన సముద్రమై పోటెత్తాయి. 

“శాంతిని పరిరక్షించండి, రక్తపాతాన్ని ఆపండి” అనే నినాదాలతో ఏర్పడిన ‘డిఫెండమొస్ లా పాజ్’ (Defandamos La Paz (DLP) సంస్థ  పిలుపుతో జులై 26 న కొలంబియా దేశంలోని 50 నగరాల్లో వేలాది జనం నిరసన ప్రదర్శనలు జరిగాయి. డి. ఎల్. పి. ప్రముఖ రాజకీయ నాయకులతో,  సామాజిక సమస్యలపై పనిచేసే అనేక సంఘాలతో కలిసి ఏర్పడిన సంస్థ. ‘’సామాజిక సమస్యలపై పనిచేస్తూ హత్యలకు గురైన నాయకులకు నివాళులు అర్పించడం కోసం, ఈ నేరాలను ఆపాలని డిమాండ్ చేస్తూ కొలంబియాలో, విదేశాల్లో వీధుల్లోకి, చౌరస్తాల్లోకి రావాలని మన దేశీయులను కోరుతున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేయడంలో సహాయ సహకారాలు అందించాలని ప్రసార సాధనాలను, రాజకీయ పార్టీలను, చర్చిలను, ట్రేడ్ యూనియన్లను, యూనివర్సిటీలను, సోషల్ ఆర్గనైజేషన్లను, అశేష ప్రజానీకాన్నీ కోరుతున్నాం’’ అని పిలుపు నిచ్చింది.  

ఈ సంస్థకు మద్దతుగా  అమెరికాలోని వాషింగ్టన్ డి.సి., లండన్, పారిస్ లోనే కాక, మెక్సికో నుంచి ఏథెన్స్ దాకా సాగిన నిరసన ప్రదర్శనలతో కొలంబియా ఘోష ప్రపంచానికి తెలియవచ్చింది. మరియా దెల్ పిలార్ వంటి అనేక మంది ప్రజా నాయకుల హత్యలను నిరసిస్తూ లక్షలాది మంది వీధులోకి రావడంతో హింస ద్వారా శాంతి నెలకొల్పడం అసాధ్యమని ఆ దేశ పాలకులకు మరోసారి అర్థమయిందని చెప్పవచ్చు.

50 ఏళ్ళు సాగిన అంతర్యుద్ధం ( సివిల్ వార్) కారణంగా 220,000 మంది చనిపోగా, స్కూళ్ళు, ఆసుపత్రులు మూతబడి, కొలంబియా దేశం పేద దేశంగా మిగిలిపోయింది.   కొలంబియా ప్రభుత్వానికి ఫార్క్ ( రెవల్యూషనరీ ఆర్మడ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా) కు మధ్య 2016, సెప్టెంబర్ లో జరిగిన శాంతి ఒప్పందం తరువాత గెరిల్లా గ్రూపు ఆయుధాలు అప్పగించింది. కానీ ప్రభుత్వం తను చేయాల్సిన ప్రజా ప్రయోజిత కార్యక్రమాలు చేపట్టకపోగా, హింసను ప్రోత్సహిస్తున్నది.  ప్రభుత్వ కనుసన్నల్లో మెలిగే వార్ క్రిమినల్స్ మాఫియాగా మారి ప్రజల దైనందిన సమస్యల కోసం పనిచేసే సామాజిక కార్యకర్తలను చంపడం కొనసాగిస్తున్నారని ప్రదర్శనల్లో పాల్గొన్న కార్యకర్తలు మీడియాకిచ్చిన ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. శాంతి ఒప్పందం తరువాత, గత రెండున్నర ఏళ్లలో దాదాపు 500 మంది చంపబడ్డారని తెలియవస్తున్నది. వీరిలో శాంతి కోసం, మానవ హక్కుల కోసం, ప్రభుత్వ స్కూళ్ల ఏర్పాటు కోసం, భూమి కోసం, తాగు నీటికోసం, వైద్యం కోసం,  మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా, అక్రమ గనుల తవ్వకానికి వ్యతిరేకంగా పనిచేసే సామాజిక కార్యకర్తలు, ఆఫ్రో- కొలంబియన్లు, ఆదివాసీ నాయకులు, పర్యావరణ కార్యకర్తలు వున్నారు. 

కొలంబియా శాంతి ఒప్పందం ఆ దేశంలోని అంతర్యుద్ధాన్ని ఆపడానికి యు.ఎన్. చొరవతో, అనేక దేశాల మధ్య వర్తిత్వంతో జరిగింది. ఇందులో క్యూబా, నార్వే, వెనుజులా, చిలీ వంటి అనేక లాటిన్ అమెరికన్ దేశాలు, కరేబియన్ దేశాలు మాట సాయం కూడా చేశాయి. ఒప్పందం కుదిరాక, అప్పటి కొలంబియా దేశాధ్యక్షుడైన జువాన్ మాన్యుయేల్ సాంటోస్ కు నోబెల్ బహుమతి ఇచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉన్న రైట్ వింగ్ ప్రభుత్వ అధ్యక్షుడు ఇవాన్ డుక్యు అంతర్జాతీయ స్థాయిలో జరిగిన శాంతి ఒప్పందాన్నీ అమలుచేయడానికి ప్రయత్నించక పోగా, వార్ క్రిమినల్స్ కు ప్రభుత్వ సహకారం వుండడంతో వీరు ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులను చంపుతున్నారు. శాంతి ఒప్పందాన్ని అమలుచేసే తీరుతెన్నుల గురించి చర్చించడానికి, సమీక్షించడానికి నేషనల్ కమీషన్ అని ఒక వేదిక వున్నా, దాని సమావేశాలు జరగడం లేదని తెలుస్తున్నది.

 ప్రజలు తమ ప్రాంతాల్లో తాము సురక్షితంగా జీవించే హక్కును కోరుకుంటున్నారని, జీవ వైవిధ్యం హక్కును, శాంతి ఒప్పందాన్ని గౌరవించాలని కోరుతూ అందుకోసం పనిచేసే కార్యకర్తలను, ఆఫ్రో- కొలంబియన్ నాయకులను, స్థానిక ఆదివాసీ నాయకులను, రైతు నాయకులను, విద్యార్థి నాయకులను అంతం చేయడం ఆపాలని, ‘‘నాయకులు లేకుండా, శాంతిని సాధించడం అసాధ్యం, రక్తపాతం ఇక వద్దు” అంటూ గ్లోరియా కూర్టస్ అనే కార్యకర్త ‘ డెమోక్రసీ నౌ” కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ అభిప్రాయం వెల్లడించారు. 

ఒబామా అధ్యక్షుడిగా వుండగా జరిగిన కొలంబియా శాంతి ఒప్పందానికి అమెరికా కూడా మద్దతు తెలిపింది. కాని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ శాంతి ఒప్పందం నుంచి దృష్టి మళ్లించి. కోకెయిన్ నిర్మూలన వెనుక దాక్కుంది. కోకో ను నిర్మూలించడానికి మన్ సాంటో కంపెనీ తయారుచేసిన ‘రౌండప్’ మందును కొలంబియా పొలాల్లోనే కాక, కొండకోనల్లో విమానాల ద్వారా చల్లించడం వల్ల ఈ కాలుష్యంతో అనేక మంది జబ్బు పడుతున్నారు. కొలంబియా కొండకోనలు బ్రెజిల్ తో కలిసి అమెజాన్ అడవుల్లో భాగంగా వున్నాయి. ఈ మందుల వల్ల అమెజాన్ అడవికి ముప్పు ఏర్పడిందని పర్యావర్తణ వేత్త, లూయిస్ గిల్బర్టో మురిల్లో  అంటారు. బ్రెజిల్ లో కూడా వున్న రైట్ వింగ్ ప్రభుత్వమే అధికారంలో వున్నది. ఈ ప్రభుత్వం గత ఏడాది పాలనలో 10 % అమెజాన్ అడవి నాశనమైంది. ప్రమాదకర మందుల కాలుష్యం పై, పర్యావరణం నాశనం కావడం పై, ఈ రెండు సమస్యలపై కొలంబియా సామాజిక వేత్తలు, పర్యావరణ వేత్తలు, రైతు నాయకులు పనిచేస్తున్నారు. 

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.