ప్రగతికి ప్రథమ శతృవు ఆత్మన్యూనత

                                                                                     

‘ఆత్మన్యూనత మన బద్ధశత్రువు. ఒకసారి దానికి లొంగితే ఇక ఈ ప్రపంచంలో ఎటువంటి మంచి పనులు చేయలేము.’ 

                                                                                                                                             -హెలెన్ కెల్లర్ 

విశ్వ విఖ్యాత తెలుగు శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు పాఠశాల రోజుల్లో ఎన్నో సార్లు పరీక్షలు తప్పారు. ఎన్నో అపజయాలు చూశారు. బాల్యంలో ఆల్బర్ట్ ఐన్స్-టీన్ కు మాటలు రాలేదు. అబ్రహాం లింకన్ జీవితం అపజయాలకు, వైఫల్యాలకు అసలు సిసలైన చిరునామాగా నిలుస్తుంది. ఈ రోజు మనం స్ఫూర్తిప్రదాతలుగా తలచుకుంటున్న వీళ్ళంతా ఆత్మన్యూనతను అధిగమించి స్వీయ స్ఫూర్తితో విజయాలు సాధించినవారే. వీరి విజయ రహస్యం స్వీయ స్ఫూర్తి. అపజయాల ఊబిలో పడి కొట్టుకుపోకుండా తమను తాము ఎప్పటికప్పుడు అభినందించుకుంటూ, పట్టుదలతో విజయ శిఖరాలు అధిరోహించినవారే.  

మిమ్మల్ని మీరు అభినందించుకుంటూ, నీరసాన్ని నింపే  ఆత్మన్యూనతను పాతేసి ముందుకు సాగాలంటే ఏం చేయాలి?  ఆత్మన్యూనత, అపజయాలను ఆకర్షించే మీ చుట్టూ ఉన్న వాతావరణం నుంచి తక్షణం బయటపడాలి. ఒకసారి పరీక్షలో ఫెయిల్ అయితే, అది తప్పు కావచ్చు. రెండోసారి కూడా ఫెయిల్ అయితే నీవు చదువుకునే వాతావరణం, పరిసరాలు, నీ ప్రయత్నలోపం కావచ్చు. ఆత్మన్యూనత మీ అంతర్గత ప్రతిభను, సామర్ధ్యాన్ని మసకబారేలా చేస్తుంది. దాన్ని తక్షణం అధిగమించే ప్రయత్నాలు ప్రారంభించకపోతే విజయం మీకు శాశ్వతంగా దూరమై, అపజయాలు అంటురోగాల్లా మీ జీవితాన్ని అల్లుకుంటాయి. అపజయాల ఆత్మన్యూనతను అధిగమించి మళ్ళీ మళ్ళీ  ప్రయత్నించినవారే  విజయశిఖరాలవైపు దూసుకుపోతారు. ఆత్మన్యూనతపై యుద్ధం ప్రకటించి, పట్టుదలతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.  

చాల మంది తమ అపజయాలకు ఇతరులను నిందిస్తారు. నా కుటుంబ ఆర్ధిక పరిస్థితులు బాగా లేవు. అందుకే చదువుకోలేకపోయాను. నా ఆరోగ్యం బాగాలేదు. నా చదువుపై దృష్టిపెట్టలేకపోయాను. దేవుడు కూడా నా మీద కోపంగా ఉన్నాడు; అందుకే విజయం సాధించలేకపోయాను. ఇటువంటి పలాయనవాదం బాధ్యతారాహిత్యం. ఏదైనా చేసి సమాజంలో ఉన్నతంగా బతకాలనే పట్టుదలలేని నిర్వీర్యతకు నిదర్శనం. ప్రముఖ గాయని ఎస్.జానకి ఊహ తెలిసినప్పటినుంచి ఉబ్బసంతో పడేవారు. ఆమె ప్రపంచ ప్రఖ్యాత గాయని కావడానికి అనారోగ్యం ఎటువంటి అవరోధం కాలేదు. అన్నమయ్య పదకోకిలగా అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికి జీవితాన్ని అంకితం చేసిన శ్రీమతి శోభారాజు తమ  ఆశయాల వలన, ఆదర్శాల వలన, నిబద్ధత వలన నిరంతరం ఆర్ధిక బాధలతో పరితపిస్తూ ఉండేవారు. ఇవేవీ ఆవిడ పట్టుదలను సడలించలేకపోయాయి. ఈ రోజు ఆమె హైదరాబాదులో నిర్మించిన అన్నమయ్య సహిత స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం, అన్నమయ్య పురమై ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను ఆకర్షిస్తోంది. ఆమె కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మశ్రీపురస్కారంతో సత్కరించింది. ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ మాట భౌతిక శాస్త్ర జగత్తులో వేదం. ఆయన వ్యాధి ఈ ప్రపంచంలో మరెవ్వరికీ లేదు. నరాల బలహీనత వలన భుజాల మీద తల నిలబడదు. నడవలేరు. ఊహ తెలిసినప్పటినుంచి చక్రాల కుర్చీలోనే జీవితాన్ని గడుపుతున్నారు. అయినా అది ఆయన జ్ఞానతృష్ణకు, పరిశోధనలకు ఏ మాత్రం అవరోధం కాలేదు. ఆయన ఒక్క పరిశోధనా పత్రం విడుదల చేస్తేఒక్క ఆలోచన పంచుకుంటే, ఇప్పటికీ శాస్త్రజ్ఞులు మహాప్రసాదంఅంటూ చదువుకుంటారు. వీరంతా నిలువెత్తు పట్టుదలకు, ధైర్యానికి, ఆత్మశక్తికి మన ముందే జీవిస్తున్న నిదర్శనాలు.     

ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం విజయ శిఖరాలకు చేర్చే నిచ్చెనలో గట్టి మెట్లు. నిన్ను నీవు అభినందించుకుంటూ నిరంతరం ముదుకు సాగాలి. ఈ ప్రపంచంలో నిన్నెవ్వరూ ప్రోత్సహించరు. నిన్ను నీవే ఉత్సాహపరచుకుంటూ, నీ ఆలోచనలను నిర్వీర్యం చేసే గతాన్ని పాతిపెట్టి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. చిత్తశుద్ధితో చేసే ఇటువంటి ప్రయత్నాలు నీ ఆత్మవిశ్వాసానికి బలవర్ధక ఔషధంలా పని చేస్తాయి. అటువంటి ఆత్మవిశ్వాసాన్ని సాధించడానికి ఈ చిట్కాలు తోడ్పడతాయి. 

  1. మీరెలా జీవించాలనుకుంటున్నారో దృఢంగా నిర్ణయించుకోండి. 
  2. మీ అభిరుచులు, ప్రతిభ, నైపుణ్యాలకు అనుగుణంగా లక్ష్యాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోండి. ఇవి మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి మార్గదర్శకాలుగా నిత్యస్ఫూర్తినిస్తాయి. 
  3. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ మీ జీవిత భవనాన్ని మీరు ఏకాగ్రతతో నిర్మించుకునే వేళ, ఇతరులను జోక్యం చేసుకోనీయవద్దు. ఇదే ఆత్మవిశ్వాసం. మీ ఆశలను, ఆదర్శాలను, ఆశయాలను మీరు గౌరవించుకుంటూ ముందుకు సాగుతుంటే ఈ ప్రపంచం మిమ్మల్ని అనివార్యంగా గౌరవిస్తుంది. మీ నిబద్ధతతో మిమ్మల్ని మీరు గౌరవించుకుంటే ఈ ప్రపంచం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది.
  4. ఎదుటివారిలో మన పట్ల జాలిని రేకెత్తించేలా ప్రవర్తించేకంటే, అసూయ కలిగేలా ప్రవర్తించడం మేలు. 
  5. ఎదుటివారితో మిమ్మల్ని ఎప్పుడూ పోల్చుకోవద్దు. ప్రతి ఒక్కరిలోనూ తమవైన విశిష్ట లక్షణాలుంటాయి. వాళ్ళు చక్కగా  చదువుకుంటూ ఉండవచ్చు; కానీ మీలా పాడలేకపోవచ్చు. మీలో ఉన్న ఎన్నో నైపుణ్యాలు వారిలో లేకపోవచ్చు. మరొకరితో పోల్చుకోవడమంటే మనల్ని మనం అవమానించుకోవడమే అంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్.
  6. గతంలో నీవు సాధంచిన చిన్న చిన్న విజయాలే నీకు నిరంతర స్ఫూర్తినిస్తాయి. వాటినెప్పుడూ మరచిపోవద్దు. నీ ఆత్మశక్తి ఏమిటో అవి ఎల్లప్పుడూ నీకు గుర్తు చేస్తుంటాయి. ఇది మరిన్ని విజయాలకు పునాదివేస్తుంది.
  7. బాల్యం నుంచి నీవు సాధించిన విజయాల జాబితా తయారు చేసుకోవాలి. నీ తరగతిలో మొదటి స్థానాన్ని సాధించినప్పటి నుంచి, ఇప్పటి వరకు నీవు సాధించిన విజాయాలను జాబితాగా తయారు చేసుకోవాలి. ఇదే స్వీయ ప్రోత్సాహ స్ఫూర్తిగా, నీ విజయాలకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. విజయ శిఖరాలను అధిరోహించడంలో నీ వేగాన్ని ద్విగుణీకృతం చేస్తుంది.
  8. నీవు సాధించిన బహుమతులు, పురస్కారాలు, ఇష్టపడి కొనుక్కున్న పుస్తకాలు అన్నీ నీకు నిద్ర లేవగానే కనపడేలా ఒక బీరువాలో అలంకరించుకోవాలి. అతిగా ఆత్మవిశ్వాసానికి గురి కాకుండా, వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకుంటూ, నీ ఉన్నతాశయాల సాధనలో, ఒక్కో అడుగు వేస్తూ విజయ శిఖరాలను అధిరోహించాలి.  

            Keep Going. Keep Growing!  

 

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.