లౌక్యం

 

లౌక్యం వొద్దు, అమాయకత్వం ముద్దు అంటారు కొందరు. 

అబద్ధం.

అమలిన ప్రేమ వొకటుంది, దాని కోసం చావడం గొప్ప అని కూడా అంటారు. 

అన్నిటి కన్న పెద్ద అబద్ధం. 

భ్రమల వల లోంచి బయట పడాలి. నిజం నిప్పును గౌరవించాలి. 

నిజం, భ్రమ పరస్పర విరుద్ధాలు. ఒకటి వున్న చోట మరొకటి వుండదు.  

‘లౌక్యా’న్ని తక్కువ చేసి మాట్లాడుతుంది లోకం. 

మోసం తప్పు. లౌక్యం తప్పు కాదు. లౌక్యం వేరు మోసం వేరు. 

లోకంలో బతకడానికి పనికొచ్చేది లౌక్యం.

అమాయకత్వం ముద్దు అని భ్రమ కల్పించే వంచకులు ఇప్పటి, మునుపటి ప్రచార, ప్రసార సాధనాల సంచాలకులు. అవే మునుపటి ఇతిహాసాలు, ఇవాళ్టి సాహిత్యాలు. వీటిని నడిపించే వుద్యోగులు మన ‘శిష్టవర్గం’. వున్నోడి ఊడిగంలో తరించే మేధావులు. నిన్నటి సో కాల్డ్ పురోహితులు. నేటి రచయితలు. వేల నుంచి లక్షల జీతం తీసుకునే మేనేజర్లు. జాగర్త, వాళ్ళు నిన్నూ నన్నూ ‘మేనేజ్’ చేస్తున్నారు. మెనూవర్ చేస్తున్నారు. 

లెటజ్ స్టెప్ ఔటఫ్ ది నెట్.

అమాయకత్వం ముద్దు కాదు. హానికరం. 

లేదు నిరపేక్షిక ప్రేమ. అదొక అందమైన అబద్ధం. 

అవి వున్నాయని బల్లగుద్దే వాడు గుద్దుతున్నది బల్లను కాదు, నీ పొట్టను. నీ జీవనావకాశాన్ని. దానికి బదులుగా వాడు నీకిచ్చేది అందమైన నిష్ఫలశ్రమ, అమరత్వమని పేరు పెట్టుకున్న మృత్యువు. దాని పేరు స్వర్గం కావొచ్చు, జన్నత్ కావొచ్చు. మోక్షం లేదా దైవసాన్నిధ్యం కావొచ్చు. నిజానికది పరలోక భాషలో దాగిన ఇహలోక నరకం. రొమాంటిక్ పదాల్లో దాగిన మురికి దుఃఖం. 

అది నీ దుఃఖం, నీ వాళ్ళ దుఃఖం. 

వొదిలేయ్ దాన్ని.

కపాల పేటిక లోంచి మురిక్కాలువ లోనికి వొంపెయ్ దాన్ని. 

నీ నెత్తి మీద తరతరాల దెయ్యపు భారమది. ఉచ్చాటన చేసెయ్ దాన్ని.

***   

సంస్కారం అని ఒక మాట వుంది. చాల పాజిటివ్ గా వుపయోగించే మాట. మంచి మాటే. ఔను, ‘మనిషికి సంస్కారం వుండాలి’. అది జన్మతః వుండదు. పుట్టుకతో రాదు. పుట్టాక నేర్చుకుంటాం సంస్కారాన్ని.  

నేర్చుకునేవన్నీ గొప్పవి అని కాదు. దొంగతనం కూడా నేర్చుకునేదే. దానికి ఒక కళగా మన్నన కూడా వుంది. రాబిన్ హుడ్ వంటి వాళ్ల రూపంలో మనం దొంగల్ని ప్రేమిస్తాం, గౌరవిస్తాం. 

అయినా ‘దొంగతనం’ మంచిది కాదనే జనాభిప్రాయాన్ని మనం మన్నిస్తాం. 

కనుక, నేర్చుకునేవన్నీ మంచివి కావు. 

కాని, నేర్చుకునేవి అన్నీ ‘సంస్కారమే’. 

సంస్కారం అంటే ఏమిటి? ఈ పదం అర్థాన్ని కాస్త తరచి చూద్దాం.

ఉదాహరణకి… సంస్కృతం అనే భాష వుంది. ప్రాకృతానికి భిన్నమైన భాష. పుట్టి పెరిగే వాళ్ళందరికీ అబ్బే భాష ‘ప్రాకృతం’. దాన్ని సంస్కరిస్తే ఏర్పడేది ‘సంస్కృతం’. అంటారు గాని, సంస్కతంలో సాధారణ మానవులెప్పుడూ మాట్లాడుకోలేదు. పండితులు మాత్రమే మాట్లాడుకున్నారు. ఎందుకంటే అది కృత్రిమం. అంటే, సహజంగా అబ్బేది కాదు. ప్రత్యేకించి నేర్చుకునేది. ఇవాళ్టి మాటల్లో చెప్పాలంటే ‘గ్రాంధికం’; పూర్వకాలంలో అన్నీ నోటిమాటలే తప్ప, ‘గ్రంధాలు’ లేనప్పటికీ.

సంస్కృత భాష లాగే… సంస్కరించ బడినది ఏదీ సహజమైనది కాదు. సహజసిద్ధమైనది కాదు. పనిగట్టుకుని తయారు చేసుకున్నది. తరం నుంచి తరానికి ‘నేర్చుకోడం’ ద్వారా మాత్రమే సంక్రమించేది. 

దేర్ఫోర్, సంస్కారం అంటేనే నేర్చుకోబడినది అని అర్థం. 

నేర్చుకోడం అనేది లేకుంటే మనిషికి ఎదుగుదల లేదు. అడుగడుగున నేర్చకుంటూ వుండడమే ఎదుగుదల. పుట్టిన వాళ్ళం పుట్టినట్టుగా వుండం. నేర్చుకుంటాం, నిరంతరం.

ఉపనయనాలు, బాప్తిజాలు తదితరాలు ఈ మనిషి ‘నేర్చుకున్నాడు’, ఇక జీవించడానికి తయారుగా వున్నాడని ప్రకటించే పండుగలే. ఆ నేర్చుకోడాలు, సంస్కారాలు ఇండియాలో చాల మందికి ‘లేకపోవడం’, నిషిద్ధం కావడం ఒక మహా కుట్ర. 

చాలమందికి  ‘సంస్కారా’న్ని నిరాకరించడం మానవ ద్రోహమే, దేశద్రోహమే, కుట్రే గాని… సంస్కారం చెడ్డది కాదు, అవాంఛనీయం కాదు. (ఎవరికీ) నిషిద్ధం కాగూడదు. 

అందరం నేర్చుకోవాలి, అందరూ సంస్కారం పొందాలి. అందరం అమాయకత్వం వొదులుకోవాలి. అందరం ‘లౌక్యు’లమై ఈ లోకాన్ని మరింత వున్నతం చేయాలి.

***

ఇప్పటికే అనుకున్నట్టు… సహజత్వానికి పర్యాయపదం అమాయకత్వం. 

అమాయకత్వం అంటే మాయ లేకపోవడం. మాయ అంటే ట్రిక్. మనుషులం చేసే చాల పనులు ట్రిక్సే. 

చెట్టు మీది పండు రాలిపడినప్పుడు తీసుకుని తింటే ఆ పని సహజం. ఆ పని జంతువులు కూడా చేస్తాయి. నేలమీంచి ఓ రాయి చేతిలోకి తీసుకుని, విసిరి, పండును రాలగొట్టి తింటే అది సహజం కాదు. ఒక ట్రిక్. 

పనిముట్లు జంతువు నుంచి మనిషిని వేరు చేస్తాయంటారు. 

ట్రిక్స్ జంతువు నుంచి మనిషిని వేరు చేస్తాయంటాను. 

ట్రిక్స్ అన్నీ చెడ్డవి కావు. ‘ట్రిక్కు’లందు మంచి ట్రిక్కులు వేరయా.

ట్రిక్స్ యొక్క సమాహారమే సంస్కారం. సహజంగా జరిగేవి కాదు. మనం జరింగింపించేవి ట్రిక్స్. వాటిని తరం నుంచి తరం నేర్చుకోడమే  సంస్కారం.

పెద్దలను చూస్తే నమస్కరించడం సంస్కారం. 

ప్రాథమికంగానే, అది మంచి సంస్కారం. 

అది ఎందుకు మంచి సంస్కారం? 

పెద్దాళ్లు మన కన్న ముందు పుట్టి మనం చూసిన దాని కన్న ఎక్కువ బతుకును చూసి వున్నారని, దేర్ఫోర్ వాళ్లకు మనకన్న ఎక్కువ సంగతులు తెలిసి వుంటాయని. మనం తెలుసుకోడానికి పెద్దాళ్లు మంచి వనరు అనిన్నీ.

అది నిజమే గాని, నిజం అంతేనా? 

అంతే కాదు. అంత కన్న ముఖ్యం మరొకటుంది. 

‘ఇప్పటికి’ మనం ఇంకా సంపాదించు కోవలసివున్న డబ్బు కూడా వాళ్ల వద్దనే వుంటుంది. మన ఐస్ క్రీం కోసం తెరుచుకోవాల్సిన పర్సు, మన కాలేజీ ఫీజు కోసం లేదా పబ్బులో పార్టీ కోసం తెరుచుకోవాల్సిన పర్సు కూడా…  వాళ్ల దగ్గరే వుంటుంది. పర్సు మన దగ్గరుండే రోజొకటి వొస్తుందప్పుడు మనం పెద్దాళ్లం అయిపోతాం. మన కన్న చిన్నాళ్లకు మనం వనరులం అయిపోతాం. 

ఇపుడు మాత్రం మనం పెద్దవాళ్ళకు నమస్కరిస్తాం. రేపు చిన్నవాళ్లు మన పెద్దరికానికి నమస్కరిస్తారు. 

చిన్నవాళ్ళు పెద్దలకు నమస్కరించడం అనేది సంస్కారం. పవిత్ర ధర్మంలా కనిపించే ఈ పని నిజానికి కేవలం లౌక్యం. 

లౌక్యాన్ని నేర్చుకోడమే సంస్కారం. తరచి చూస్తే ప్రతి సంస్కారంలో వున్నది లౌక్యమే. దాన్ని మనం పని గట్టుకుని నేర్చుకోడం, అలవర్చుకోడం తప్పు కాదు. పోగా, అదే ఒప్పు. చేయాల్సిన పని.

నేర్చుకోని మనిషిలోని ఇగ్నొరెన్స్ ని ‘అమాయకత్వ’మని ఆకాశానికెత్తే వాడు… తెలిసి చేసినా తెలియక చేసినా చిన్నవాళ్ళకు… పేదవాళ్లకు… మేలు చేయడం లేదు. కష్టాల్ని ఆస్వాదయోగ్యం చేయడం ద్వారా వాడు పేదలకు ఎనలేని కీడు చేస్తున్నాడు. అదే సమయంలో ధనికులకు మేలు చేస్తున్నాడు. ఈ కీడూ మేలూ.. ఒకే నాణానికి రెండు ముఖాలు. ఇక్కడ నాణెం నేటి వ్యవస్థ. 

ఆదర్శవాదం వలలో పడి లౌక్యం నేర్చుకోకపోవడం వల్ల లేదా దాన్ని వదులుకోవడం వల్ల… అమాయకులు యిప్పటికి బలైంది చాలు. 

అమాయకత్వంలో శాంతి వుంది. అది కష్టాలకు, మరణానికి రంగులు పూసి వాటిని ఆస్వాదయోగ్యం చేస్తుంది.  

లౌక్యంలో అశాంతి వుంది. అది కష్టాల్ని, మృత్యువును ఎదిరించడంలో మనిషిని నిమగ్నం చేస్తుంది. 

నిజానికి, ‘శాంతి’ ఒక భ్రమ. శవానికి తప్ప యెవరికీ శాంతి లేదు. 

జీవించి వున్నంత కాలం జీవించాలి. నెవర్ సే డై. 

కాని; అడుగడుగు మోసాల లోకంలో జీవించడం ఏమంత సులభం కాదు. 

జీవించడాన్ని నేర్చుకోవాలి. పనిగట్టుకుని శిక్షణ పొందాలి దానికి. 

మోసాన్ని ఎదిరించే లౌక్యం కూడా నేర్చుకోవాలి. బండగా ఎదిరించడం కాదు, యుక్తిగా ఎదిరించడం నేర్చుకోవాలి. (కమ్యూనిస్టు పరిభాషలో  దీన్నే ‘ఎత్తుగడలు’ అంటారు. ఆ పేరుతో జరిగే రాజకీయ మోసాలది మరో కథ). 

లౌక్యం నేర్చుకోక పోవడం అంటే, మన కళ్ళకు మనం గంతలు కట్టుకుని, మన నోళ్ళకు మనం కళ్లెం వేసుకుని, ఆ కళ్లాల్ని రకరకాల  మోసగాళ్ళకు ఇచ్చి వాళ్లు పరిగెత్తించినట్లు పరిగెత్తడమే, ఆడించినట్లు అడడమే.  

మోసం హత్య వంటిది. చంప వచ్చిన వాడిని చంపడం ద్వారానే మనం బతుకుతాం.  

భౌతికంగా గాయపర్చడంలో, చంపడంలో వున్న హింస… అదే హింస మోసంలో కూడా వుంది. హింసకు ప్రతిహింస తప్పు కాదు. మోసాన్ని యుక్తితో జయించాలి. అది సెల్ఫ్ డిఫెన్స్. దాడి జరుగుతున్నప్పుడు ‘అహింస’ ఆత్మహత్య వంటిది. 

మోసానికి వ్యతిరేకంగా ‘సెల్ఫ్ డిఫెన్స్’ యేమీ తప్పు కాదు 

ఇండివిజులిజంపునాది మీద వర్ధిల్లే క్యాపిటలిజం తన బరువు కింద తాను కుప్ప కూలే వరకు 

అది మనిషి లోని ఆశను (స్వార్థాన్ని) తృప్తిపరిచి వర్ధిల్లినంత కాలం

మనుషులు… ముఖ్యంగా పేదలు… లౌక్యం… అనే సంస్కారాన్ని అలవర్చుకోవలసిందే. 

అమాయకత్వం వల్ల మోక్షం, శాల్వేషన్, అమరత్వం ఏమీ రావు. నొప్పి, చావు తప్ప. చావు అంటే చావే, మోక్షం ఎట్సెట్రా ఏదీ కాదు.

***

అమాయకంగా చేసినా మాయకంగా చేసినా మనిషి చేసే శ్రమ అదనపు విలువను తయారు చేస్తుంది. దాన్నుంచి దోపిడిదారుడు పుడుతూనే వుంటాడు. 

దోపిడికి రకరకాల రంగులు పూసి మతాలు, ఇతిహాసాలు, కొన్ని సాహిత్యాలు దాన్ని అస్వాదయోగ్యం చేస్తాయి.

దోపిడిని ఎదిరించాలంటూనే, ఎదిరించే మనుషులను కాల్పనిక (రొమాంటిక్) పదజాలంతో… వ్యర్థ క్రియల్లోకి, వ్యర్థ మరణాల్లోకి మళ్లించే మోడర్న్ రాజకీయాలు… మునుపటి మతాల ఆధునిక రూపాలే. 

నీ కన్ను నీతోనే పొడిపించే మోసాలే. 

సంగతి గ్రహించి క్షణం క్షణం అప్రమత్తమై నిన్ను నువ్వు కాపడుకుంటూ మరింత చక్కని బతుకు కోసం పోరాడాలి.

పోరాటం అంటే ఎక్కడికో వెళ్లిపోవడం కాదు. 

ఎక్కడున్నావో అక్కడే వుండి ‘యుక్తి’గా ఎదిరించడంలోనే ఆత్మజ్ఞానం వుంది. మిగిలింది, ఎవరెన్ని చెప్పినా వొట్టి అమాయకత్వం (ఇగ్నొరెన్స్) మాత్రమే. 

మన అమాయకత్వానికి మనం బలి కావొద్దు. ఆ విధంగా మోసగాళ్ళ పనిని సులభతరం చెయ్యొద్దు. 

లౌక్యం కూడా ఆయుధమే, అత్వవసరమైన పనిముట్టే. 

సమూహాలుగా, వ్యక్తులుగా. దారిద్ర్య వ్యతిరేక పోరాటాలలో, దైనందిన జీవితంలో… లౌక్యం మీద మనం పట్టు సాధించాలి.

హెచ్చార్కె

3 comments

 • చాలా బావుంది.
  ఈవ్యాసంలోని అంశాల ఆధారంగా,
  గాంధీగారు ముప్పైఏళ్ళకాలంలో (1918-48) తీసుకున్న అనేక నిర్ణయాలు, మధ్యలో ఆపేసిన ఉద్యమాలు, వహించిన మౌనాలు, పాటించిన సంయమనాలు, నివారించిన హింస,
  అన్నింటినీ మీరు విశ్లేషిస్తే చదవాలి అని ఉంది సార్.

 • సంపాదకీయం, బాగుంది సర్,నిజం, నిప్పు ని గౌరవించాలి.. లౌక్యం కూడఆయుధమే.. లౌక్యం మీద పట్టు సాధించాలి,.. ఇవన్ని అక్షర సత్యాలే, మేలి ముత్యాలే మాకు. సర్!👌💐ధన్యవాదాలు మీకు

 • ‌అమాయకత్వం అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నేరమే దాన్నే అసులుగా మన జీవితంపై ఎవరెవరో పెత్తనం చెలాయించాలని చూస్తారు పడగొట్టి పరామనందపడతారు…
  లౌక్యం తెలీయకుంటే నేర్చుకోవాల్సిందే లేదంటే ఎప్పటికీ మనిషిగా సంస్కరించపడలేము..ఎంత చక్కటి ఆర్టికల్ ని అందించారు సర్..ఇది ప్రతీ ఒక్కరు చదివితీరాల్సిన అంశం..అభినందనలు మీకు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.