(సామాజిక చైతన్య ధోరణులు – కవిత్వం 3)
సమాజ చైతన్యం అంటే, తొలుత మత, కుల, ఛందస్సుకు సంబంధంగా మార్పులను తీసుకువచ్చే క్రమం కూడా సామాజిక చైతన్యమని భావించాలి. నన్నయ్య తర్వాత 11 వ శతాబ్దం లోనే శివ కవులు సమాజ చైతన్య దిశగా కవిత్వం రాసిన వారిలో ప్రధములు. మతాల వారిగా కాకుండా, కులాల వారిగా ఉన్న వర్ణాశ్రమ బేధాలు ను కులాల ఆదిపత్యాన్ని వ్యతిరేకిస్తూ రాసారు . శివకవుల యుగం 1100 నుండి 1225 వరకు సాగింది. నన్నయ్య తిక్కన కవుల మధ్య సంధికాలం. తెలుగు నేల మీద కాకతీయుల పాలన సుస్థిరమౌతున్నకాలం. నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు, మల్లికార్జున పండితారాధ్యుడు ఈ యుగంలో శివకవిత్రయం. అప్పటివరకు తెలుగు లో సంస్కృత పదాల వాడుక ఎక్కువగా ఉన్న నేపధ్యం లో మొదట తిరుగుబాటుగా శంఖారావం పూరించినవాడు నన్నెచోడుడు. ఆ తర్వాత ఉద్యమం లాగా తీసుకు వచ్చి “జాను తెలుగు “ అని “ వస్తు కవిత” అని కొత్త సంవిధానాలను తీసుకు వచ్చాడు.
తెలుగు లో సంస్కృత పదాలను వాడే సాహిత్యాన్ని సంకర సాహిత్యమని, అది సృష్టించే వారిని దుర్మార్గ కవులని అంటారు.
“కులజుండు నతడే యకులజుండు నతడె/కులము లేకయు నన్ని కులములు నతడే” అని గట్టిగా చెప్పినవాడు పాల్కురికి సోమనాథుడు.
శివుని కొలవడం అంటే కులమతాలు తేడా లేకుండా ఉండటమే అని, వర్ణవైషమ్యాలు వదిలేసుకోవటమే అని, వైదిక క్రతువులను అంగీక రించకపోవడమే, అని ఆయన ప్రచారం చేశాడు.
“వేద బరాక్రంతులనగబడిన ..
బ్రాహ్మణ గార్ధబంబులతోడ ప్రతిసేసి యాడిన పాపంబు వచ్చు’నంటాడు.
బలుపోడతోలు సీరమును బాపసరుల్ గిలుపారు కన్ను వె న్నెలతల సేదుకుత్తుకయు నిండిన వేలుపుటేరు వల్గుపూసల గల రేని లెంకనని జానుదెనుంగున విన్నవించెదన్
వలపు మదిం దలిప్ప బసవా బసవా బసవా వృషాధిపా” అంటూ,
వృషాధిపశతకంలో సోమనాథుడు స్వదేశీ జాను తెనుగు స్వరూపం ఎలా ఉంటుందో రుచిచూపించాడు.
ఇలా వీరు… అటు కులమతాల ఆధిపత్యాన్ని నిరసిస్తూ, తెలుగు భాష లో సంస్కృత సంకరం తప్పించే దిశగా చాల పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేసారు.
బసవ పురాణం లో జాను తెనుగు గురించి, వివరణ ఇస్తూ,
ఉరుతర గద్య పద్యోక్తులకంటే సరసమై బరగిన జాను తెనుంగు
చర్చంచగా సర్వ సామాన్యమగుట కూర్చెద దిపదలు కోర్కి దైవార
రాస్తానన్నాడు.
అలాగే పండితారాధ్య చరిత్ర లో…
అరూఢ గద్య పద్యాది ప్రబంధ పూరిత సంస్కృత భూయిష్ట రచన,
మానుగా సర్వసామన్యంబుగామి జాను తెనుంగు విశేషము ప్రసన్నతకు ….అని వివరణ ను మనం చూడవచ్చు.
ఆ తర్వాత వీళ్ళను వ్యతిరేకిస్తూ, వైదిక మత పునరుద్ధరణ అనే దిశగా కవులు కదులుతూ మహాభారతాన్ని తెలుగు లోకి మళ్ళీ అనువదించేందుకు తిక్కన పూనుకొన్నారు.
ఆ తర్వాత ప్రబంధ కవుల కాలం లో, కృష్ణ దేవరాయలు కాలం నాటికి ధూర్జటి సమాజ చైతన్య దిశగా రాజరికాన్ని, రాజరిక విభాగాలను వ్యతిరేకిస్తూ, రాజ పాలన ను కూడా ఆయన తన సాహిత్యం లో తీవ్రంగా విమర్శిస్తూ రాశారు. అప్పటి రాజరిక వ్యవస్థను, ప్రపంచ ధోరణులను వ్యతిరేకిస్తూ కాళహస్తీశ్వర శతకంలో వు విశేషాకను నోరి నరసింహ శాస్త్రి గారు ధూర్జటి పైన రాసిన నవల లో చర్చిస్తారు. ఇదే పుస్తకం లో ధూర్జటి రాసిన ఒక శతకం లో….ఒక భక్తుడు శివుడిని స్త్రీ స్తనాల్లో చూసి ఆరాధించిన సందర్భాన్ని ప్రస్తావిస్తాడు. పశ్చిమ గోదావరి లోని ‘ఆచంట” అనే పల్లెకు ఈ సంఘటన ద్వారానే ఆ పేరు వచ్చిందంటారు.
రాజులు స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రజల్ని బాధించారు. సంఘం మొత్తానికి కాకుండా , కేవలం కొద్ది మంది ప్రయోజనాల కోసమే పనిచేసిన రాజుల గురించి… ధూర్జటి రాసిన “శ్రీ కాళ హస్తీశ్వర శతకం”లో…
“రాజుల్మత్తులు వారిసేవ నరక ప్రాయంబు , వారిచ్చు సంబోజాక్షీ చతురంగ యాన తురగీ భూషాదులాత్మ వ్యధా బీజముల్ “ అంటాడు.
“రాజు శబ్దంబు ఛీ ఛీ జన్మాంతరమందు నొల్లను జుమీ “
“నృపాలాధమున్ బాత్రంబంచు భజింప బోడుర్ “
సాదారణంగా కవులు రాజులను స్తుతిస్తారు. ఒక కవి ఇలా నరాధములని అనడం అచ్చమైన తిరుగుబాటే.
అలాగే, శ్రీ కృష్ణ దేవరాయలు రాసిన ఆముక్త మాల్యద లో కూడా సామాజిక చైతన్య దిశగా కవిత్వాన్ని అందించారు. రాజు దృష్టి పెదాలపై ఉండేలా, రాజు కు ఆర్ధిక వెసలుబాటు కలగడం కేవలం పేదలకు ఉపయోగ పడేందుకే అని, రాజు రాజ్య బ్రష్టుడయ్యే పని చేయకూడదని చెప్తారు..
దేశ వైశాల్య మర్ధ సిద్ధికిని మూల,
మిల యెకింతైన, గుంట కాల్వలు రచించి
నయము పెదకు నరిన్ గోరునను నొసంగి
ప్రబల జేసిన నర్ద ధర్మములు వెరుగు !
అని స్పష్టంగా చైతన్య దిశగా కవిత్వం చెప్పడానికి అనేక పద్యాలు మనకు కనిపిస్తాయి.
శ్రీకృష్ణ దేవరాయలు రాసిన ఆముక్త మాల్యద కావ్యం లో కూడా, కృష్ణ దేవరాయలు, పేదల కుటుంబాల్లో చేపల పులుసు ఎలా వండుతారు? వంటలు ఎలా ఉంటాయి? వారి జీవన స్థితి గతులు ఏమిటి? అనే కోణం లో ప్రజల పక్షాన నిలబడి, ఒక సాహిత్య స్పృహ ఉన్నవాడు.
సమాజాన్ని వీడి, ఎప్పుడూ కవి బయట విహరించలేడు. అలా విహరిస్తే కాల పరీక్షకు నిలువలేడు.
పింగళి సూరన వంటి కవులు కూడా వస్తువు విషయం లో కూడా విప్లవాత్మకంగా మార్పులు తెచ్చారు. కళా పూర్ణోదయం పూర్తిగా షేక్ స్పియర్ రాసిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ను పోలి ఉండటం చాల విశేషం. ఎలా రాసారో అర్థం కాదు. ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా సాధ్య పడిందో తెలియదు . సముద్రానికి ఆవల విరాజిల్లే ఆ ఆంగ్ల సాహిత్యం లో ఉన్న ఆ కామెడీ అఫ్ ఎర్రర్స్ తెలుగు లో కళా పూర్ణోదయం లాగే ఉంటుంది. ఒకే రకంగ ఉన్న ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళిద్దరూ ఒకే లాగ ఉండటం లో జరిగే తప్పులు కనిపిస్తాయి. ఇదికూడా ఒకరకంగా చెప్పాలంటే చైతన్య దిశగా సాగిన సాహిత్యమే.
పోతన కూడా ఒక విప్లవాత్మక మైన ఆలోచనలతో ఉన్న వాడే. తన భాగవతాన్ని రాజు కు అంకితం ఇవ్వమని వరుసకు బావ అయిన శ్రీనాధుడు వచ్చి అడిగితే, అది వినిన అతడి కూతురు శ్రీనాధుడికి అన్నం వడ్డిస్తూ, ఏడుస్తుంది. అప్పుడు పోతన
“కాటుకకంటినీరు చనుకట్టుపయింబడ నేల యేడ్చెదో,కైటభరాజుమర్దనుని గాదిలికోడల యోమదంబ యో, హాటక గర్భురాణి నిను నాఁకటికిం గొనిపోయి యల్ల కర్ణాట కిరాత కీచకుల కమ్మఁ ద్రిశుద్ధిగ నమ్ము భారతీ”
తన కూతురిని సరస్వతి పుత్రిక గా భావించేవాడు. ఆ కర్నాటక కీచక రాజులకు నిన్ను అమ్మను. అని ఉటంకిస్తూ వ్రాసిన ఈ కవిత.
రాజరిక వ్యవస్థను, వారి కోరికలను వ్యతిరేకిస్తూ, వాళ్లకు ఆ కావ్యాన్ని అంకితం ఇచ్చేందుకు వ్యతిరేకిస్తాడు. ఒక పక్క శ్రీనాధుడు తాను రాసిన ప్రతి కావ్యాన్ని అంకితమిస్తుంటే, కడుపేదరికాన్ని అనుభవిస్తూ కూడా, పోతన రాజు పంపిన ప్రలోభాన్ని వ్యతిరేకిస్తాడు.
కృష్ణ దేవరాయలు కాలం ముగిసిన తర్వాత, రఘునాధ నాయకుడు కుమారుడు విజయ రాఘవ నాయకుడు.
తంజావూరు సంస్థానాధీశులు. వీరి కాలానికి చెందిన వారిలో రంగాజమ్మ, ఆ తర్వాత ముద్దు పళిని ల పేర్లు చెప్పుకోవచ్చు. విజయ రాఘవ నాయకుడు కు ఆస్థానం లో రంగాజమ్మ ఉండేది. రాజు భార్య రంగాజమ్మ ను తిట్టి , తన భర్త ను వొదిలి పెట్టి వెళ్లి పొమ్మని చెపితే, అందుకు తిరుగు సమాధానంగా , ఒక పద్యాన్ని రాసి పంపుతుంది. అప్పట్లో ఆడవాళ్ళు చదువుకోవడం ఒక గగనం అయితే, ఆమె ఏకంగా కావ్యాలు చదివి, పద్యం రాసి పంపుతుంది. ఈమె 17 శతాబ్దం నాటికి చెందినది. . పూర్తి పేరు పసుపులేటి రంగాజమ్మ. , ఆయన ఆస్థానం లో కవియత్రి.” మున్నారు” దాసవిలాసము అనే కావ్యం తో పాటు, చాల యక్ష గానాలు కూడా రాసారు. విజయ రాఘన నాయకుడు భార్యకు తిరుగుగా రంగాజమ్మ ఈమె రాసిన పద్యం…
“ఏ వనితల్ మముందలుపనేమిపనో తమరాడువారుగారో, వలపించునేర్పెరుగరో,తమకౌగిలిలోననుండగా,
రావదియేమిరా విజయరాఘవ యంచిలుదూరి
బలిమి మై, తీవరకత్తెనై, తీసుకవచ్చితినాతలోదరీ”
చివరి దశ లో విజయరాఘవనాయకుడు తనకు సోదర సమానుడు అని భావించి, ఆత్మహత్య కు పాల్పడిందన్న కథ కూడా వాడుక లో ఉంది. అంత స్థాయిలో కవిత్వ రూపం లో, ఆ కవయిత్రి అలా ధైర్యంగా, నీ భర్త ను నీవు నా దగ్గరకు రాకుండా చూసుకో, అది నీ బాధ్యతే అని స్వయంగా రాణి కి ధిక్కారంగా రాసి పంపడం అప్పట్లో గొప్ప సామాజిక చైతన్య కోణం లోనే మనం చూడవచ్చు..
కేవలం భక్తి తత్వంగా కనపడినప్పటికీ సమాజ అసమానతలను తన సంకీర్తనల్లో ప్రజల నోళ్ళల్లో నానేలా రచించిన 15 వ శతాబ్దపు అన్నమయ్య, సమాజ హితం కోరుతూ అనేక పద్యాలు రాసిన వేమన (1652 – 1730), అంతకుముందు 7 లేదా 9 వ శతాబ్దానికి చెందిన వారైన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రచనల్లోని చైతన్య ధోరణులతో పాటు మరింత సమాచారంతో రాబోయే భాగంలో కలుద్దాం…
అద్భుతః
Thank you neelima
ఆధునికత లో కొట్టుకు పోతూ మాతృ భాషను మర్చి, కాదు తుడుచుకుని పోతున్న తరుణంలో ఈ కవుల గురించి ,వాళ్ల గొప్ప తనం గురించీ అలనాటి సామాజిక స్ప్రుహ, ఈ వ్యాసం ఓ కనువిప్పు, మరియు ఓ మైలు రాయి .ఏ సాహిత్యమయిన దానికి ఊపిరి సమాజమే,వాటి పోకడలే, సురేష్ గారి కృషి, ఆయన కున్న సాహిత్య అభిమానం ,వల్ల మట్టిలో మణిక్యాలు లా ఇలా ఏన్నో విషయాలు అనువాదం రూపంలో మన ముంగిట ,రంగ వల్లులు లా ఉంచుతున్నారు.ఆయన చేస్తున్న ఈ ఎనలేని కృషి అభినందనీయం. నా హృదయపూర్వక ధన్యవాదాలు.
చాలా స0తోషం..మీ స్పందనకు…
పువ్వులు, మొగ్గలు,శీర్షిక కు,మీరు రాసిన ఈ కాలమ్.. 👌👌,CV సర్,MA తెలుగులో. చదువుకున్న పాఠాలను గురుతుకు తెచ్చిన మీకు అభివందనలు. ఇంకా కొంచంలోతుగా వెళితే, బాగుండేది.. మానసిక, ఆర్థికవిషయలును,వివరిస్తూ, ముద్దు పాళ్లవి కవిత్వం గురించి, రాయండి.. సర్,మాకోసం ప్లీజ్.. మరొక్కమారు, మీ సాహిత్య కృషి కి..పాదాభివందనం చేస్తూ…!💐👌CV సర్
ప్రాచీన సాహిత్యంపై ఎంతో అవగాహన,పట్టు ఉంటే తప్ప ఇటువంటి వ్యాసాలు రాయలేరు సార్ .అద్భుతంగ ఉంది.సామాజికచైతన్యంగ రాసిన పోతన,దూర్జటి,సోమన,రంగాజమ్మల గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగ ఉంది సార్
This is entirely different than your regular style in Kavisangamam. I found new CV Suresh here. It is totally surprising that you have written about all these veteran poets. Just wonderful. I appreciate your dedication and efforts.
మీరు ఇలాంటి సబ్జెక్టు ఎంచుకొని రాయడం చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. తెలుగువారి గొప్పతనం ఇక్కడ ఎంతగా చెప్పినా అంతర్జాతీయ ఖ్యాతి దారి వేరు. చాలా బాగుంది ఆర్టికల్. ధూర్జటి ని ఇంకా ఇతర కవుల పద్యాలు సరిగా కోట్ చేశారు. I appreciate 👏👏👏
You have chosen a unique subject. I really appreciate your effort’s. Good work sir!
ఎక్కడికి తీసుకెళ్ళారు? నన్నయ శివకవులు ధూర్జటి పోతన.. !! అసలు సామాజిక చైతన్య ధోరణులు అంటూ టాపిక్ తీసుకుని టోటల్ తెలుగు సాహిత్య సముద్రాన్ని మథిస్తున్నారల్లే ఉంది. ఇప్పటివరకూ మేం వినని విశేషాలు తెలుసుకుంటున్నాం. సంతోషంగా ఉంది. ఈ థీమ్ ద్వారా మీరు స్ఫూర్తివంతమైన మూడ్ ను క్రియేట్ చేస్తున్నారు. కవి కలంలో నిండాల్సిన చైతన్యం ఎలా ఉండాలో చర్చిస్తోంది ఈ వ్యాసపరంపర. ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతోంది. ఎప్పటికప్పుడు ఓ కొత్త దారితో ఆశ్చర్యపరుస్తోంది మీ సాహితీ గమనం. ఆల్వేస్ ద బెస్ట్ అవుట్ పుట్ ఇస్తుంటారు. రస్తాకు మీకూ ధన్యవాదాలు సర్.