సూర్యుణ్నెవరు వురితీస్తారు?

రాజ్యం కవినెలా చంపేస్తుంది ? అసలు రాజ్యానికి కవిని చంపాల్సిన అవసరమేముంటుంది ? 64 కళల్లో ఒకటైన కవిత్వాన్ని రాజులు పెంచిపోషించారు గానీ ఆ కవిత్వ నిర్మాణకర్తల్ను చంపేసేంతటి అవుసరం రాజ్యానికెందుకు? అందుకే అడుగుతున్నాను. చెర ని ఎవరు చంపారు ? అనారోగ్యమా ? రాజ్యమా ? చెరని గురించిన ఎలిజీలను, ఎపిటాఫ్లను తిరగేస్తే అదే అనుమానం కలుగుతుంది. ఒక సామాన్యమైన బడి పంతులు జీవితాన్ని చదువుతున్నపుడు ఒక మహా చక్రవర్తి శత్రువుల్తో చేసిన యుద్దాలు, తన ప్రజలకిచ్చిన శాంతి ఊహకొస్తుంది. వీరలక్షణం ఎక్కడ ఎందుకుంటుందో అవగాహనకొస్తుంది. అవును మరి, తన వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి సామాన్యజనం కోసం నిద్రాహారాలు మానుకున్నవాణ్ణి మహరాజు గాక ఇంకేమన్నా కూడా చరిత్ర చరిత్రహీనమవుతుందేమో ! అంతగొప్పవాడు చెరబండరాజు. అసలు పేరు బద్దం భాస్కర్రెడ్డి. రంగారెడ్డి జిల్లా అంకుశాపురం లో పుట్టిన విప్లవ కవి. దిగంబర కవి.

1971 లో పీడీ చట్టం కింద, 1973 లో మీసా కింద, 1974 లో సికింద్రబాదు కుట్ర కేసు, 1975 జూన్ 26 న దేశాన్ని కమ్మేసిన ఎమర్జెసీ చీకట్లలో చెర జైలుపాలయ్యాడు. రెండుసార్లు ఆపరేషన్ చేయించుకున్నా నయం కాని బ్రైన్ ట్యూమర్ తో బాధ పడ్డాడు. చచ్చిపోయాడు. రాజ్యాంగంలోని అధికరణం ఉద్యోగాన్నీ వదల్లేదు.

“అమ్మమ్మా, ఇందిరమ్మా చేసింది చాలు పోమ్మా, నీ నకిలీ సోషలిజం మాకసలే వొద్దమ్మా”

“లేనోళ్ళకు గుగ్గిళ్ళూ, ఉన్నోళ్ళకు ధనరాశులు. ఆస్తి హక్కు తియ్యనని ఆనాడే సెప్పినావు, అదే గదా సోషలిజం” (అమ్మమ్మా ఇందిరమ్మా) అని పాట గట్టి ప్రజల్లోకి వెళ్ళాడంటే అతనికెంత ధైర్యముండాలి ? పోలీసోళ్ళని దుర్మార్గుల్లాగా ఈరోజుకీ చూసే సామాన్యుడికి –

మాలోని వాడివే
మా మనిషివే నీవు
పొట్టకూటికి నీవు పోలీసువైనావు
ప్రాణాలు బలిపెట్టి పోరాడ సోదరుల గుండెలకు తూటాలు గురిపెట్టినావేమి (మాలోని మనిషివే) — అని పోలీసు ఉద్యోగం చేసే వాడు కూడా మనవాడే అని గొంతెత్తి పాడేవాడు. చెర గొప్ప గాయకుడేం కాదని చెప్తారు. గొంతు పీలగా ఉండేదని చదువుతాం కూడా. అయినప్పటికీ గ్రామీణ అమాయక, చదువులేని మనుషుల్లోకి చొరబడ్డాడంటే గొంతుతో పని ఉంటుందా ? “కొలిమంటుకున్నాది, తిత్తినిండా గాలి పొత్తంగ ఉన్నాది . నిప్పారిపోనీకు రామన్నా, పొద్దెక్కిపోనీకు లేవన్నా” అని చెర పాడితే ఆ పాటలోని పిలుపునిండా “కంచాన గంజికీ గద్దలూ కాకులూ వడిసేల పేనుకో – రామన్నా, వడి వడిగ రాళ్ళేసి – కొట్టన్నా” అని పలికిన ఆర్ద్ర హృదయం విన్నవాళ్ళని కూచోనిచ్చేది కాదట. పీడీ చట్టం కింద అరెస్టై విచారణలో ఉండగా సదరు జడ్జీ చిన్నపురెడ్డి గారు చెర పాటల్నీ, సహ నిందితుల కవితల్నీ చదివించుకుని మరీ విడుదల చేశారని, నిషేధిత “ఇప్పుడు వీస్తున్న గాలి” కధా సంపుటాన్ని అసెంబ్లీలో చదివించుకుని మరీ విన్నారనీ చరిత్ర చదవడం రోమాల్ని నిక్కబొడుస్తుంది. చెర అక్షరాలు అంత ప్రాచుర్యం పొందాయి. దానిక్కారణం అతని మార్క్సిస్టు, లెనినిస్టు సంకల్పం మాత్రమే కాదు, అతని సామాన్య జీవితం, దానిపట్ల అతని ప్రేమ. ఇవే అతన్ని అతని ఆలోచన్ని గొప్పవాణ్ణి చేశాయి.

“కౌలికిచ్చీనోడు కన్నెర్రజేసేడు
అప్పులిచ్చీనోడు ఆలినే సూసేడు” అని రాసినా —

“ఇంటింట చీకటే ప్రతికంట కన్నీరే
రాజ్యమెవరికి వచ్చెనో, రాజన్నా
సుఖములెవరికి దక్కెనో” అని పాడినా —

చెర పాటలో ఏ లక్షణం అతనికంత పేరు తీసుకొచ్చిందో ఏ నిఘంటువు వెతుక్కుని తేల్చాలి. పాటలోని అతని స్పష్టమైన భావజాలం ఆకర్షక విషయం. రావిశాస్త్రైతే “ప్రతి గేయం నెత్తుటి దీపం” అన్నాడు. అంతటి చైతన్యవంతమైన సాహిత్యాన్ని సృష్టించాడు చెర.

ఈ “చెరబండరాజు కవితలూ పాటలూ” అన్న పుస్తకం 1982 లో వరవర్రావ్ సంపాదకత్వంలో వచ్చింది. పీపుల్స్ బుక్స్ వాళ్ళు వేశారు. దీంట్లో 23 కవితలు, 30 పాటలూ ఉన్నాయి. మేలైన పుస్తకం. చెర సెలెక్టెడ్ పోయెట్రీ దీంట్లో కనిపిస్తుంది. విప్లవాన్ని కుట్రన్న కాలాన్ని కత్తులు దూసిన కవితలు. అతని స్పృహ నిండా పాలకవర్గాలమీద కోపం కసి ఎక్కడా దాగలేదు. ఏ అవకాశం దొరికినా వదల్లేదు.

ఆకలి, కామం, కలలూ, కన్నీళ్ళూ
మనిషిలోని మర్మజ్ఞానమంతా ఒక్కటే
దేశమేదైతేనేం ? మట్టంతా ఒక్కటే
అమ్మ ఎవరైతేనేం ? చనుబాల తీపంతా ఒక్కటే
బిక్కమొహాలతో చూస్తారేం ?
పిచ్చివాణ్ణిగా కేసు పుటప్ చేయండి
నన్నెక్కనివ్వండి బోను (నన్నెక్కనివ్వండి బోను) అన్నాడు

మీ రాత్రి చొక్కాలు పగలు నిలవవు
పగటి చొక్కాలు రాత్రి ఉండవు
మీ పెళ్ళాలు పిచ్చివాళ్ళు
పాతిక చీరతో స్వర్గాన్ని కప్పుకొని
వంటగదిలో ఆలోచనలకు ఎసర్లు పెడుతున్న వాళ్ళు
………
నీ గుండెలు నా గుండెలు
మూతబడిన కొండ గుహలు
ఎక్కనివ్వండి నన్ను బోను — అన్నాడు.

చెర ఏమాటన్నా నిజాయితీగా అన్నాడు, నిఖార్సుగా అన్నాడు. అతను అనదలచిన ప్రతీ సందర్భంలో అతనుగా అన్నాడు. దుక్కి దున్ని పంట పండినా కూడా పెళ్ళాం పిల్లల్ని ఊరడించలేని నిరుపేద రైతుకుటుంబాల్లోని అశక్తత, చదువుకోలేని పేద తెలివిగల విద్యార్ధి బాధ, చెమటనెత్తురులు చేసుకున్న అలగా అనబడ్డ శ్రామికుల దుక్ఖాన్నీ, అతని కవిత్వాంశాలు చేసుకున్నాడు. అతని కవిత్వం చదివాక నాకు కాంక్రీట్ అంటే తెలిసివచ్చింది. నిర్దిష్టంగా రాయడమంటే ఏంటో తెలిసివచ్చింది. చెప్పదలుచుకున్న విషయాన్ని జనసామాన్యంలోంచే తీసుకోవడం, దానికి పదగాంభీర్యాన్ని అలంకార ఆడంబరాన్నీ జోడించకుండా నేరుగా మాట్లాడ్డం అతని కవిత్వంలో కనిపించే గొప్ప లక్షణం. కవిత మేధావుల్ని మెప్పించాల్సిన అవసరం లేదన్న పాఠాన్నీ, అది సామాన్యుణ్ణి గుండెలకు హత్తుకోవాల్సిన కనీస అవసరాన్నీ చెర కవిత్వం తెలియజెప్తుంది. శ్రీకాకుళ విప్లవోద్యమం, సుబ్బారావ్ పాణిగ్రాహి ప్రభావం అతనిలో ప్రస్పుటంగాఉంది. సాహిత్య కార్య నిర్వహణ పట్ల కమిట్మెంటు, రాజకీయ పంధా పట్ల అతని జీవనానుకూలత ఆశ్చర్యకరమైనవి. ఇతను మనలాగా సామాన్యుడు కాడా ? భార్యాపిల్లలపట్ల ప్రేమ, లౌల్యాలూ ఉండవా ? డబ్బూ, సౌకర్యాదులపట్ల మోహంలేదా అన్న అనుమానం వస్తుంది. అవేమీ లేవు కాబట్టే కటిక దరిద్రంతో పోరాడి పోరాడి అతను చచ్చిపోయాడు. చెర జీవన శైలే అతని కవిత్వాన్ని మనమింత ఇష్టపడేలా చేసిందనడం అతిశయోక్తి కాదు. అతని వందేమాతర గీతం దేశాన్ని అతనెలా చూస్తున్నాడో మన కళ్ళముందు చూపిస్తుంది.

దుండగులతో పక్క మీద కులుకుతున్న శీలం నీది
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది
సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యెవ్వనం నీది
ఊసినా దుమ్మెత్తిపోసినా చలనం లేని మైకం నీది
….
ఎండిన స్తనాల మీదికి ఎగబడ్డ బిడ్డల్ని
ఓదార్చలేని శోకం నీది (వందేమాతరం). అని రాస్తాడు.

అతని కవితల్లో మేనిఫెస్టోలు చదివిన తాత్విక జ్ఞానమూ, మేధోపరమైన విషయవస్తువూ ఏం కనిపించదు. అతనికి సామాన్యుడి బాధ ఒక్కటే తెలుసు. అది ఎందుకో కూడా తెలుసు. స్వేచ్చా స్వాతంత్ర్యాలు సిద్దించాక కూడా ప్రజాస్వ్యామ్య పరిస్తితుల్లో కూడా అట్టడుగున పడిఉన్న మనుషుల జీవితాల్లో రాని మార్పు కోసం అతను పడ్డ వేదన అతని అక్షరాల్లో కనిపిస్తుంది. ఆ వేదన వంద మేనిఫెస్టోల సారాంశంలా తోస్తుంది. మరోసారి ఈ దేశం మోసపోగూడదంటుంది.

సబర్మతీ ఆశ్రమవాసి
అటు సన్యాసీ కాదు, ఇటు సంసారీ కాదు
ఇటు విజ్ఞాన దాత కాదు, అటు విద్యావేత్త కాదు
రాజకీయ వేత్త కాదు, రాజూ కాదు
వేదాంతి కాదు వెర్రివాడూ కాదు
…..
బ్రమల సాలెగూళ్ళలోకి నినాదాల గాలిలోకి
పుక్కిటి పురాణాల ఆదిమ సంస్కృతిలోకి మనుషుల్నితోసి
నిజావగాహన లేని ప్రజాద్రోహిగా మోసం చేసి
దూదిపింజల్లాంటి సిద్దాంతాలు వల్లించి
నా తరానికి సున్నాలు చుట్టి వెళ్ళిపోయాడు
మరోసారి ఈ దేశం మోసపోగూడదు (మరోసారి ఈ దేశం మోసపోగూడదు) అని గాంధిని ఎన్నేసి మాటలంటాడో చూడండి. నేను చదివి ఊగిపోయిన “మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్” పుస్తకమ్మీది ప్రేమంతా ఎటు వెళ్ళిపోవాలి ? అంతటి సంఘర్షణ్ణి క్రియేట్ చేస్తాడు చెర.

చెర విరసం వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడు. నిబద్దమైన విప్లవ కార్యకర్త. “చీకటమ్మా చూడు తల్లీ, ఒక్క మిణుగురు మెరవకుండా శత్రుదాడికి జాడలివ్వక అడవి అన్నల గుహలజేర్చుము. బతుకు దోపిడి గాళ్ళనుండి పోరుసలుపుతు దారినున్నా కష్టజీవుల స్వర్గసీమను నేను భారత విప్లవాన్ని” అని తన మార్గాన్ని స్పష్టపరిచినవాడు. అతనికే గుర్తింపులూ లేవు. అకాడమీల్ని, అవార్డుల్నీ లెక్కజేయలేదు. శాలువాల్నీ, సంపన్నతనీ పక్కకు తోశాడు. “నాకు నోరుండటం నేరం. నేను ఆలోచించడం అరాచకం, ఉన్నా అవి నావైనవిగా ఉండకూడద” న్నాడు. చెర రాజ్యాన్ని ప్రశ్నించాడు. అందుకే రాజ్యానికి కోపమొచ్చింది.

పొలాల్లో, అడవుల్లో
ఫ్యాక్టరీల సమ్మెల్లో
చంపబడ్డ రాక్షసులం
రాజద్రోహులం, హంతకులం
ఉరికంబం ఎక్కేవాళ్ళం అంతా మనమే
అరో పరకో అటో ఇటో
మన నేరాలన్నీ ఒకే సెక్షనుకిందకొస్తాయి
అందుకే దారితప్పిన సోదరులందరిదీ ఒకే దారి (ప్రపంచం నిండా) అని మనం ఎలా బతుకుతున్నామో విప్పి చూపిస్తాడు.

ఎక్కడున్నా విప్లవాంకిత గీతాన్నే
సాగుతున్న కుట్రకేసులో నిందితుణ్ణి
నేడీ జైల్లో ఉన్న ఖైదీల హృదయాలే నా పొలాలు
నిరంతర కవితా వ్యవసాయం నా ధ్యేయం
ఈ దాహం నా మరణంతోనేఆగుతంది
నాకు దుక్ఖంలేదు
ఈ జైలు నా పాఠశాల (జూన్ 26) అని ఎమర్జన్సీ ని నిరసిస్తాడు.

ఆధునిక కవిత్వంలో ఇప్పుడు చెర ఎందుకు లేడని సరదాగా ఒక సీరియస్ ప్రశ్న వేసుకుంటే ఒక మిత్రుడంటాడూ —

ఎప్పుడో అర్ధశతాబ్దం నాటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా?

ఏరీ భూస్వాములు?
ఏరీ ఫాక్టరీ యజమానులు?
ఏదీ వెట్టి చాకిరీ?
ఏరీ మార్పు కోసమని చెప్పి ఊగిపోయిన యాంగ్రీ యంగ్ మాన్ లు?

సాటివానిపై సహానుభూతి ప్రకటించే ఉద్వేగాన్ని రాజ్యం తీసుకొంది. పించనులు, ఉచిత వెచ్చాలు, ఉచిత ఆరోగ్యం, విద్య, ఆఖరుకు ఇన్సూరెన్స్ కూడా.

మధ్య తరగతి జీవులకు సమాజం పట్ల సహానుభూతి/స్పృహను ప్రకటించటానికి సమయమెక్కడుంది… ఉరుకుల పరుగుల జీవనంలో.

సమకాలీన జీవనంలో ఇన్ని మార్పులొచ్చాక….. ఇంకా ఎప్పుడో పడవల్లోను, ఓడలమీద కట్టిన రాగాలు, పాటలు ఎలా పాడగలరనుకొంటున్నారు? 🙂 . With due respects to great people — అని రాశాడు. అతన్ని చెర కవిత్వం చదవమని గట్టిగా అరచి చెప్పాలని ఉంది. పడవలమీదా, ఓడలమీదా రాసినవాడైతే చెర అంత నికృష్ట మరణాన్ని పొందేవాడు కాదు. అన్ని సార్లు జైలు పాలయ్యేవాడు కాదు. అంత హింసకు గురై, జీవితాన్ని కష్టాల పాల్జేసుకునేవాడు కాదు. అతనిలా ఉండటం, అతనిలా రాయడం అసాధ్యమైన విషయం.

మా కష్టం సుకం ఇని
ధైర్యం చెప్పే కొమరయ్యను
నిన్నగాక మొన్ననే పంతులూ
….
ఇంట్లకెల్లె తోల్కపోయి
చితల్తోట గడ్డకింద
చితకబొడిసి సంపి కాకులకు గద్దలకు పడేసిండ్రు
ఆ యేల పసిపిల్లలు పాలు ముట్టలేదు
తల్లులు పొయిలు రాజెయ్యలేదు
ఊరంతా కుత కుత ఉడికింది (సరికొత్త రజాకార్లు) అని ప్రజల్ని పీడించేవాళ్ళ దాష్టీకాన్ని వివరంగా రాస్తాడు.

బొట్టు బొట్టుగా నా నెత్తుటిని ఈ నేల విముక్తికోసం విత్తనంగా చల్లుతాను అన్న చెర నిజంగానే తన రక్తాక్షరాల్ని మన గుండెల్లో విత్తిపోయాడు. మనలో ఆ తడి ఉంటే మొలకెత్తుతాం లేకుంటే బీళ్ళుగా మిగిలిపోతాం.

అమ్మా నాన్నేడని అడిగితే
ప్రజలపక్షాన నిలిచి ధర్మయుద్దంలో
వీరమరణం పొందాడని చెప్పు
అమరవీరులకర్పించే జోహార్లే జోలపాటలుగా పాడి చెప్పు.
చెల్లెమ్మా నాన్నని చంపిందెవరంటే వ్యక్తుల్ని కాదు వ్యవస్థని ఎత్తి చూపు
చెప్పు చెల్లెమ్మా చెప్పు
విప్లవం కోసమే మిమ్మల్ని కన్నాననీ చెప్పు.

(అగ్నిపుత్రులు) మంటాడు.

చెర నేను రచనా సైనికుణ్ణి. నా అయుధం కలం. నా రంగం ప్రజా సమస్యలు. నా గమ్యం విప్లవం అని చెప్పాడు. అందుకే రాజ్యానికి కోపమొచ్చింది. రాజ్యానికి తనకెదురుతిరిగేవాళ్ళమీద కోపమొస్తుంది. ఆ కోపానికి చట్టాలు రాస్తుంది. వాటికి ప్రజాస్వామ్యం పేరు పెడుతుంది.

ఈ మట్టినాకు పట్టెడన్నం పెట్టి పాలుతాపింది
రాక్షస భూస్వామ్య రంపపు కోతల్నుండి తనను విముక్తిచేసి రుణం తీర్చుకుంటాను (పల్లవి). అని ప్రకటించిన చెర దిగంబర కవిత్వ సిద్దాంతానికి అతకని వాడు. అతని చూపు, మాట, అభివ్యక్తి, భాష సర్వమూ దిగంబరకవిత్వంలో అతన్ని ప్రత్యేకమైనవాడిగా చూపెడ్తాయి. అతని ఆ దిగంబరవదం కన్నా మిన్నగా కనపడతాడు.

కలం గళం ప్రాణప్రదం
ప్రజకి నేను అంకితం
పోరాటం డైరెక్షన్ పాట నాకు ఆక్సిజన్ — అవును చెర కవితలూ, పాటలూ ఆక్సిజన్ అంటే చెప్తున్నాయి. ఆ అక్సిజన్నిండా ఇప్పుడు జైల్లో మగ్గుతున్న సాయిబాబా, వరవర్రావ్, ఇంకా అనేకానేక అర్బన్ తిరుగుబాట్దార్లు కనిపిస్తున్నారు. చెరా నీకు నేను ఎంత రుణపడి ఉన్నాను చెప్పవూ ?

శ్రీరామ్

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో కవితా ఓ కవితా శీర్షిక నిర్వహిస్తున్నారు. అద్వంద్వం తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

23 comments

 • Somehow I missed seeing this. Good to know all these things. When Sreeram is around “Rastha” people like me do not miss the “way” of knowing about all the legends. Thanks for good article Sreeram ji.

 • ముందుగా, మీకు, అభివందనలు శ్రీరాం సర్!ఆక్సిజన్ లాంటి, కవితలు,పాటలు రాసిన,చేరబండ గారి, గురించి,రాసినందుకు…నిజంగా,వారికి, రుణ పడే ఉన్నాము, మనము అందరం..!చేరబండ పుస్తకం కొనుకుందాం, అనుకుంటే, అది నక్స్లిజం సాహిత్యం, వద్దు, అని,తిట్టారు కూడా నన్ను ఒకప్పుడు.. ఇప్పుడు, మీవల్ల చదివే. అవకాశం కలిగింది, నాకు, ధన్యవాదాలు, సర్!💐మీకు

  • నేనిస్తాను పద్మ గారు. చదవాల్సిన కవి. థ్యాంక్యూ

 • పరిస్థితే ఈనాడు కూడా..
  ఆధునికత ఎంత అప్పుగా తెచ్చుకున్నా మారని రాతలే ఇప్పటికి.. చాలా చక్కని విశ్లేషణ… అభినందన మందారాలు శ్రీరాం గారు

 • శ్రీరాం గారు మంచి వ్యాసం

  వ్యాసంలో మీరు ఉటంకించిన మిత్రుడను నేనే. 🙂 Thank you for citing me in a wonderful essay.

  మీ పోస్టులో “ఈరోజు చెరబండరాజు లాంటి కవులెందుకు లేరు ?
  ఆ కవిత్వమేమై పోయింది ?” అని ప్రశ్నించారు.

  దానికి నేను ఇచ్చిన సమాధానం ఇది. పూర్తిగా ఇస్తున్నాను. I am committed to my comment.
  ****
  ఎప్పుడో అర్ధశతాబ్దం నాటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా?
  ఏరీ భూస్వాములు?
  ఏరీ ఫాక్టరీ యజమానులు?
  ఏదీ వెట్టి చాకిరీ?
  ఏరీ మార్పు కోసమని చెప్పి ఊగిపోయిన యాంగ్రీ యంగ్ మాన్ లు?

  సరళీకరణ ఆర్ధికవిధానాల తరువాత దోపిడీ దాని రూపం మార్చుకొంది. ప్రత్యక్ష దోపిడీకి బదులు పరోక్షదోపిడీ రాజ్యం ఏలుతుంది. (సెజ్ లు, మైనింగ్ లు, స్కాములు)

  సాటివానిపై సహానుభూతి ప్రకటించే ఉద్వేగాన్ని రాజ్యం తీసుకొంది. పించనులు, ఉచిత వెచ్చాలు, ఉచిత ఆరోగ్యం, విద్య, ఆఖరుకు ఇన్సూరెన్స్ కూడా.

  మధ్య తరగతి జీవులకు సమాజం పట్ల సహానుభూతి/స్పృహను ప్రకటించటానికి సమయమెక్కడుంది… ఉరుకుల పరుగుల జీవనంలో.

  సమకాలీన జీవనంలో ఇన్ని మార్పులొచ్చాక….. ఇంకా ఎప్పుడో పడవల్లోను, ఓడలమీద కట్టిన రాగాలు, పాటలు ఎలా పాడగలరనుకొంటున్నారు? 🙂 With due respects to great people.

  just for discussion sake… but I believe todays problems are different like
  intolerance,
  accumulation of wealth due to capitalism,
  increase of orthodox beliefs,
  environment,
  loss of human face to humans … and so on.
  Bolloju Baba – 2/7/2019

  ఇక మీ వ్యాసం బాగుంది విషయ విశ్లేషణ సమగ్రంగా అనిపించింది.

  నేను చెరబండరాజు కవిత్వాన్ని చదువుకొన్నాను. చెరబండరాజు కవిత్వంపై నాకేమీ అభియోగాలు లేవు. గొప్పకవి, శక్తివంతమైన కవిత్వం. ఆయన కవితావాక్యాలను కొన్ని వ్యాసాలలో నేను వాడుకొన్నాను కూడా. మీ వ్యాసం వల్ల మరింత అర్ధమయ్యాడు, ముఖ్యంగా గీతాలు. థాంక్యూ

  చెరబండరాజు చివరి రోజుల్లో శ్రీశ్రీ అతని కొరకు పడిన దిగులు, తానే అప్పుల్లో ఉంటూ చెరబండరాజు వైద్యానికి చేసిన సహాయమూ, విరసం సభ్యులతో అందుకు వచ్చిన విబేధాలు, ఆనాటి పరిస్థితులను చదివి కళ్ళు చమర్చాయి. (అప్రస్తుతమైనా చెప్పాలనిపిస్తోంది)

  థాంక్యూ మరో సారి

  బొల్లోజు బాబా

  • అన్నా, అన్నీ తెల్సినవాడవు.

   నీ కామెంటులో కన్ఫ్యూజన్ ఉంది. చెర కవిత్వం ఇప్పటికీ సమకాలికమైనదని నా అభిప్రాయం. భూస్వ్యామ్యులున్నారు, ఫ్యాక్టరీలున్నాయ్, దోపిడీ ఉంది.

   ప్రభుత్వం ఎన్ని చేసినా దానిది సామాన్యుడిపట్ల కపట ప్రేమ. కవిది అలాటిది కాదు.

   ఇక మధ్యతరగతి తీరిక గురించి నేను నీ కామెంట్ తో ఏకీభవించను. సామాన్యుడిపట్ల సమయం కేటాయుంచుకోవడం కోకపోవడం మన ఆలోచనా విధానం బట్టి ఉంటుంది.

   మన ఉరుకులుపరుగుల్లో సామాన్యుణ్ణి గురించి ఆలోచన కూడా చేయలేని మన స్పృహ ఎంతవరకు సమంజసమైనది ? మీరే చెప్పండి

   • మిత్రమా,

    My entire comment refers to changed scenario…. not at all about cherabandaraju. I have respects for him.

    one clarification

    పడవలమీదా, ఓడలమీదా రాసినవాడైతే చెర అంత నికృష్ట మరణాన్ని పొందేవాడు కాదు.

    I am referring there- How can the present generation sing old songs? It is not about cherabandaraju.

    మారుతున్న జాతీయ అంతర్జాతీయ పరిణామాలను బట్టి ఈ సమాజాన్ని అర్ధం చేసుకొనే విధానంలో మనం కూడా మారాలనుకొంటాను. మీ అంత నిర్ధ్వంధ్వం గా ఉండలేకపోవటం నా బలహీనత.

    బొల్లోజుబాబా

 • ఒక గొప్ప ఆర్టికల్ చెర మీద. ఆయన్ని నేను చూడలేదు. సగం ఆయన సాహిత్యం కారణంగానూ, సగం ఆయన వ్యక్తిత్వం కారణంగానూ ఆయన నా హీరో!

  • థ్యాంక్యూ సర్. నాకూ అదే అనిపించింది. హీరోఇజానికున్న లక్షణాలు నిజంగా వేరే.

 • చెర గారి లాంటి విప్లవకవి కవిత్వం ,పాటలలోని
  గొంతుకను మీ వ్యాసంలో వినిపించారు..
  చాలా బాగుంది సర్..

  • హరీష్, తప్పక చదవండి. అతని కవిత్వం మనకొక దృక్పధాన్నిస్తుంది.

   మీ స్పందనకి థ్యాంక్స్ మిత్రమా

  • థ్యాంక్యూ లావణ్య గారు. మీరెలా ఉన్నారు ?

 • అన్న…చెర గారి గురించి….ఆ కవి కవిత్వం గురించి, పాటలగురించి విపులంగా పరిచయం చేసిన వ్యాసం..ఇలా అప్పటి తరాన్ని ఇప్పటి (మా,మన)తరానికి పరిచయం చేస్తూ …ఆ స్ఫూర్తిని రగిలిస్తున్న మీ వ్యాసాలకు…థాంక్స్….
  అలాగే ఒక కవిని, అతని రచనల్ని..పరామర్శించడంలో మీదైన దృష్టి…నాకు చాలా ఇష్టం…శుభాకాంక్షలు అన్న…💐💐

 • బొట్టు బొట్టగా నా నెత్తుటిని నేల విముక్తికోసం నాటుతాను…గొప్ప ఎక్స్ప్రెషన్!
  మీ రైటప్ ఎప్పట్లాగే చాలా బావుంది.

 • నిజాయితి ఉన్న కవిని
  బాగా పరిచయం చేసారు.
  అభినందనలు

 • చెర అక్షరాలు అంత ప్రాచుర్యం పొందాయి. దానిక్కారణం అతని మార్క్సిస్టు, లెనినిస్టు సంకల్పం మాత్రమే కాదు, అతని సామాన్య జీవితం, దానిపట్ల అతని ప్రేమ. ఇవే అతన్ని అతని ఆలోచన్ని గొప్పవాణ్ణి చేశాయి. దీన్ని రివర్స్ లో రాయాల్సి ఉంది. చెర కవిత్వాన్ని పాటలను చక్కగా విశ్లేషించారు. ఆ విశ్లేషణ చదివాక ఆయన పీడితుల జీవనాన్నే కవిత్వంలో పాటల్లో ఒలికించాడని అర్థమవుతోంది.. మీకు మరోసారి అభినందనలు..

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.