అడివి దారులూ లోయ అంచులూ

మర్నాడు మధ్యాహనం విపశ్యన… ధమ్మా (ధర్మ) గురించి  ఇంకో సారి చెప్పాక విపశ్యన మొదలయింది.. ఆనా పానా అయ్యాక శరీరం లోని ప్రతి అణువు మీదా ధ్యాస పెట్టాలని గోయెంకా గారు చెప్తున్నారు. అప్పుడెప్పుడో ఆఫీస్ దగ్గర సహజ యోగా తరగతులున్నాయని తెలిసి కుదిరినప్పుడ ప్పుడప్పుడు వెళితే కుండలినీ శక్తి మూలాధారం నించీ సహస్రారానికి ఒక్కొక్క చక్రం దాటుకుంటూ వస్తుందని చెప్పారు కానీ నేను అంతకు మించి అటెండ్ అవలేదు. గోయెంకా గారి మార్దవమైన స్వరం లో మొట్టమొదట చిన్న పిల్లల తల మీద ముట్టుకుంటే మెత్తగా తగిలే మాడు మీద ధ్యాస ఉంచడంతో మొదలెట్టమనీ నెమ్మదిగా ఒక్క అణువు కూడా వదలకుండా ప్రతి భాగాన్నీ గమనిస్తూ వెళ్ళాలని చెప్పారు. ‘ఓహో ఇది సహస్రారం కదా ఇక్కడ నించి మొదలెట్టారేంటో మూలాధారం నించి కదా ‘అని తెలిసీ తెలియని ఆలోచనలేవో చుట్టుముట్టాయి. విపశ్యన ఏ మతానికి సంబందించినది కాదు వేటినీ వీటితో కలపద్దు అని   అని ఆయన చెప్తున్నా.. ‘సహస్రారాంభుజా రూఢా సుధా సారభి వర్షిణీ.. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థితా’ అని చిన్నప్పుడెప్పుడొ నేర్చుకున్నదేదో ఒక జ్ఞాపకం లాగా, ఒక అపురూపమైన స్మృతి లాగా మదిలో మెదులుతూనే ఉంది. ఇంట్లో దేవతార్చన పెద్దగా అలవాటు లేకపోయినా, కాలనీలో దసరా పది రోజులు రోజుకొకరింట్లో పారాయణలు, ప్రసాదాలు.. పెద్దవారు రోజూ చదువుతుంటే వినడం వల్ల వచ్చిన ఒకటో రెండో వరుసలు, ఆ పూజలు చేసే తాలూకు వ్యక్తులు, పరిసరాలు, ఆనవాళ్ళు ఏవేవో సినిమా రీలు లాగా తిరిగి అక్కడ నించి రానంటే రానని మనసు ఆరాము లేకుండా మారాము చేసింది… “మూలాధారైక నిలయా బ్రహ్మ గ్రంథి విభేదినీ” ..”అనాహతాబ్జ నిలయా శ్యామాభా వదన ద్వయా” ,..”మణి పూరాంత రుధితా విష్ణు గ్రంథి విభేదినీ “., . “ఆజ్ఞా చక్రాబ్జ నిలయా శుక్ల వర్ణా షడాననా”.. అభ్యాసం లేనివేవో ముక్కలు ముక్కలుగా గుర్తొస్తున్నాయి..  

గోయెంకా గారి గొంతు మళ్ళీ ఒంటి మీద సోయి తెప్పించింది. .. ధ్యాస తలకాయ మీద నించి మెడకాయ కి దింపమని చెప్తున్నారు..అక్కడక్కడే ఉన్న  డిప్పకాయ మీద ఒకటిచ్చుకుని… ఇహానికొచ్చేసరికి నెప్పులు… నెప్పులు…తలలో విపరీతమైన నెప్పి.. అసలు మెడ అటూ ఇటూ తిరగదేమో అన్నంత నెప్పి, నడుము విరిగిపోతుందేమో అన్నట్టు. ఏమైనా తప్పు చేసానా… తల బాదేస్తోంది. వార్నాయనో ఇదేందిరా బాబూ.. ” భలే మంచి నిర్ణయం తీసుకున్నావు. తప్పకుండా వెళ్ళు, అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను, నువ్వే చూస్తావుగా.. 10 జతల బట్టలు పెట్టుకో, శాఖాహారమైనా ఫుడ్డు బానే పెడతారు, సాయంత్రాలు పెట్టరు కానీ ఆకలేస్తే అడగచ్చు” అని మంచి సుద్దులు చెప్పిన చిట్టి వసంత గారి మీద పిచ్చి కోపమొచ్చింది.. అన్ని సాయంత్రాలు ఫోన్ లో మాట్లాడుకున్నాము కదా అన్నీ చెప్పి ఇదెందుకు చెప్పలేదు.. రాధ మండువ గారు వెళ్ళానని వ్రాసారు కానీ ఈ నెప్పుల విషయం ప్రస్తావించలేదు గా .. చాలా ప్రశాంతం గా ఉందని వ్రాసారేంటీ.. వీళ్ళందరికీ ధ్యానం బాగా వచ్చిన మూలాన నెప్పులు రాలేదేమో.. ఏమో.. అవునేమో.. అయినా  అందరి మీదా కోపమొచ్చింది. కోపం తెచ్చుకోవద్దన్నారు కదా అని గుర్తు తెచ్చుకుని హమ్మా, దమ్మా, అమ్మా అనుకుంటూ అటు ఇటు సర్దుకుంటూ అతి కష్టం మీద ముగించాను…కానీ.. వామ్మో ఇదేం ధ్యానం రా బాబూ..

రెండవ పూట కాస్త ఫర్వాలేదు.. నేను కెనడా కి కొత్తగా వచ్చినప్పుడు టిం హార్టన్స్ అని ఒక కాఫీ షాప్ లో పని చేసా. అక్కడ పద్ధతి ప్రకారం చేతికి గ్లవుస్ వేసుకోకుండా పదార్థాలు ముట్టుకోకూడదు. మంచి గ్లవ్స్ ఉండేవి. అవి వేసుకున్నా తెలియనంత బిగుతుగా చేతికి పట్టినట్టు ఉండేవి. కొందరికి ఎలర్జీలు ఉంటాయి. అలాంటి వాళ్ళు గ్లవ్స్ మార్చి వాళ్ళ ఫుడ్ ఆర్డర్ తయారు చెయ్యమని రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు తప్పకుండా గ్లవ్స్ మార్చాలి. యాజమాన్యం ఏదో ఖర్చు తగ్గిస్తూ ప్రతి పావుగంటకీ వాడి పడేసే గ్లవ్స్ మీద దృష్టి పెట్టి వాటి ఖర్చు తగ్గించే నిమిత్తం ప్రతి  ఒక ఆర్డరుకీ ఒక గ్లవ్స్ వాడి పడేసేలా నాణ్యత తక్కువ గల గ్లవ్స్ పెద్ద మొత్తం లో కొన్నారు. అవి సైజుల వారీగా ఉండవు. అందరికీ ఒకే సయిజు. నేను వేసుకుంటే జారిపోతుంటాయి. వాటితో ఏ పనీ చెయ్యలేకపోయేవాళ్ళం. సూపర్వయిజర్ కి రిపోర్ట్ చేస్తే “కాస్త ఓర్చుకోండి.. ఒకటి రెండు వారాలు అంతే” అంది. “అంటే ఈ కొన్నవి అయిపోతే రెండు వారాల తర్వాత ఆర్డరు ఇచ్చేటప్పుడు ముందు వాడే గ్లవ్స్ కొంటారన్నమాట” అన్నాను. “కాదు ఈ లోపు మీకు అలవాటయిపోతుంది గా ” అందావిడ మొహం లో ఎలాంటి ఎక్ష్ప్రెషనూ పెట్టకుండా..!! అలా ఈ నెప్పులు అలవాటయిపోవడమే కాకుండా శరీరం మొత్తం ధ్యానం లో కుదురుకున్న ఒక ఆనందకరమైన స్థితి. అయితే నెప్పి వచ్చినప్పుడు అయ్యో అని వేదన, ఆనందం వచ్చినప్పుడు అది సొంతం చేసుకోవాలనే ఆశ పెట్టుకోకూడదుట. అయితే నెప్పి వచ్చినప్పుడు అయ్యో అని వేదన, ఆనందం వచ్చినప్పుడు అది సొంతం చేసుకోవాలనే ఆశ   పెట్టుకోవడం వలన ఆనందం మీద ఎక్కువైన మక్కువ దిక్కు మొక్కు లేని ఇహం వైపు లాగుతుందని.నిర్వాణానికి అది తగదనీ, రెండిటినీ ఒకే లాగా చూసే సమ దృష్టి అలవరచుకోవాలనీ, ప్రతిదీ అనిత్యమనీ, నెప్పయినా సంతోషమైనా స్థిరంగా ఉండవనీ చాలా సున్నితం గా చెప్పారు మాస్టరు గారు.  

నా సంగతి మీకు తెలియదు కదూ. కష్టంగా ఉన్న పని చెప్తే కష్టం అని విసుక్కుంటా. అది అలవాటయ్యాక బోర్ కొడుతోందని విసుక్కుంటా. ఒకే పని పదే పదే చెయ్యడం నాకు విసుగు. రోజుకొక  కొత్త చాలెంజ్ ఉండాలి. ఇప్పటి వరకు వాకే… ఒకటి నేర్పాక అభ్యాసానికి 2 రోజులు పడుతోంది, అయ్యాక రెండోది నేర్పుతున్నారు. అది అలవాటయ్యాక మూడోది నేర్పుతున్నారు… బాగుంది.. అలా  6వ రోజు ఉదయానికల్లా శీల, సమాధి స్థితులు దాటి పణ్య కి చేరుకున్నాము.. “అనంత పణ్యమయీ అనంత గుణమయీ” అని గోయెంకా గారి వాయిస్ వినగానే ఏదో లోకం లో విహరిస్తున్నట్టుంది.. దేహం లో వేల కొలదీ శక్తి చక్రాలు తిరుగుతున్న ఒక మహదానంద స్థితి లో “మునుల తపములివె మూల భూతి ఇదె” అని తారాస్థాయి భావనతో  అశ్రువులు కారిపోతుంటాయి ఆనందంతో.

ఇలా ఆ రోజు 4 గంటలు ఏకబిగిన అశ్రువులు కారుస్తూ కూచుని  ఉన్నప్పుడు, ఆ ధాటికి ఇంద్రుడి కుర్చీ చిన్నగా కదిలింది. ఇంద్రుడు ఖంగారు పడ్డాడు. “రంభా.. ఊర్వశీ, మేనకా , తిలోత్తమా” అని పిలిచాడు. “వెళ్ళండి,  ఆ ధ్యానం భగ్నం చెయ్యండి” అన్నాడు. వాళ్ళు చిలిపిగా నవ్వి ‘ఫుల్లు డీలా క్యాండికేట్ అక్కడ.. మేము పోము ఫో” అనేసారు. ఇంద్రుడు ఆగ్రహోదగ్రుడయాడు. మెరుపులు మెరిసాయి. గాలులు వీచాయి. ఉరుములు ఉరిమాయి .”ఇది నా ఆజ్ఞ” అన్నాడు. “అక్కడంత సీన్ లేదయ్యా సామీ,  మేము పోము” అనేసారు.. పైగా.. “అతివలకి ఇంటి పనులనీ, పిల్లలనీ వదులుకుని అలాంటి చోటుకి వెళ్ళడమే అతి కష్టం. వెళ్ళినా అలా అన్నేసి గంటలు కుదురుగా కూచోడం ఇంకా కష్టం.. అలా కూచున్నోళ్ళని కదిలిస్తే బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుంది మేము పోమంటే పోము అంతే” అనేసారు.. దాంతో దిక్కు తోచని ఇంద్రుడికి ఒక అవుడియా వచ్చింది..

అన్నంబెల్లు కొట్టారు.. ధ్యాన మందిరం నించి బయటికొచ్చాము.  ఎండ మండిపోతోంది. రూముల్లోకెళ్ళి గొడుగులు తీసుకుని గబగబా భోజన శాల వైపు కి  పోతున్నారందరూ. అందరూ చెప్పిన లిస్ట్ ప్రకారం నేను గొడుగు తెచ్చా కానీ నాకు గొడుగు, నల్ల కళ్ళజోడు, రెయిన్ కోట్లు లాంటి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ సొక్కవు. నేను సరాసరి భోజన శాల వైపు వెళుతున్నంతలో భోజన శాల వెనక నుండి మా గదుల వైపు వచ్చే చిన్న కాలిబాట వైపు కనిపించిదొక స్టీల్ టిఫిన్ క్యారియర్.. 4 గిన్నెలది. అంతే ఆగిపోయా..! మా అన్నలు పట్టుకెళ్ళేవారు చిన్నప్పుడు..ఇక్కడెప్పుడూ చూడలేదు..! ఎన్ని రోజులయిందో అలాంటిది చూసి.. చిన్నప్పుడు లాల్ బజార్ బోనాల జాతరలో మా అశోకన్న ఏదైనా కొనుక్కో అంటే పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు ఉన్న 4 గిన్నెల ప్లాస్టీక్ స్టీల్ కారియర్ బొమ్మ కదూ ఎంచుకున్నది. తీరా కొనేటప్పటికి ఉన్న ఒక్కటీ విరిగి ఉంది.. ఇంకో బొమ్మ కొనుక్కున్నా  కానీ ఆ టిఫిన్ క్యారియర్ ఎంత లాగా గుర్తుందో మనసులో.. ఇప్పుడు ఇంత పెద్దది చూస్తే సరదాగా ఉంది.. అది పట్టుకున్న చేయి. ఆ చేతి మీదుగా గోధుమ వర్ణం ఉన్ని వస్త్రం..దాని చివర్ల వేలాడుతున్న ఉన్న ఊలు దారాలు మాత్రమే కనబడ్డాయి . ఎవరా అని చూసేంతలో చెట్లల్లోకి మాయమయింది.. కొద్ది గా లోపలికి వెళ్ళబోయా ! “సర్వర్స్ ఓన్లీ ” అని బోర్డ్ కనబడింది.. కానీ ఇక్కడ భోజనశాలలో తప్ప ఇంకెక్కడా ఎవరూ తినకూడదు కదా..! అసలు భోజనమెవరికి..? ఎవరు పట్టికెళుతున్నారు..? ఈ స్టీలు క్యారియరు ఎక్కడిది ..? అని ఆతృత పెరిగిపోయింది…నాలోని గొప్ప పరిశోధకురాలు ఆ చిక్కు ముడి విప్పడానికి ఆతృత పడింది. క్షణాల్లో అది బలపడిపోయింది కూడా.. ధ్యానం , ఆనా పానా, ధమ్మ, పణ్య, మాస్టరు గారు ఇవేవీ గుర్తు రావట్లేదసలు…

ఆ రాత్రి మాస్టారి అనుగ్రహ సంభాషణ సమయం  . ఇన్ని రోజులు గమనించ లేదు గానీ , ఆ వాతావరణం నన్ను నా   5/ 6 ఏళ్ళ వయసుకి లాక్కుపోయింది. మా ఆల్వాల్ లో పంచాయితీ ఆఫీసు పక్కన హనుమాన్ల గుడి గోడ మీద సినిమాలు వేసేవారు. అన్నిటిలోకి బాగా గుర్తున్నది లంబాడోల్ల రామదాసు సినేమా. అక్కడ దుప్పట్లు చాపలు, గొంగళ్ళు, రగ్గులు, గోనె సంచులు ఇవీ అవీ అని లేకుండా ఎవరి స్థోమత ప్రకారం వాళ్ళు పరుచుకుని కూచునే వాళ్ళము. ఎవరేం తెచ్చుకున్నా, నేల తల్లికి సమానమే అన్నట్టు అందరూ కిందే కూచోవడం. .. ఇక్కడ కూడా అంతే..  పీటలు, బీన్ బ్యాగ్ లు, చెక్క ముక్కలు.. దిండ్లు, బాలీసులు, శాలువాలు, దుప్పట్లు, ఉన్ని వస్త్రాలు అలా ఎవరికి వారు పరుచుకున్నారు. అచ్చు మా గుడి గోడ మీద లాగే ఇక్కడ గోడ మీద వేసారు వీడియో.. రోజూ నా జాగా లో కూచుని వినే నేను ఎందుకో నా జాగా వదిలేసి, మందిరం చివర గోడకి ఆనుకుని కూచున్నా.. వీడియో ఆన్ అవబోతోందన్నట్టు లయిట్లు ఆరిపోగానే సన్నని వెలుతురు వీడియో నించి వస్తొంది. సర్దుకుని కూచునే సరికి.. అదే ఉన్ని వస్త్రం నా ముందు..!!!  ఒహ్ దొరికేసింది . ఆ క్యారియర్ పట్టుకున్నది అమ్మాయన్నమాట..” అహో అప్సరా నీ మోము చూడ వేడుకా” అనుకున్నా కానీ చీకట్లో ఉన్ని వస్త్రము, నాగు పాము లాంటి నల్లని జడ. ఫ్రెంచ్ జడ వేసుకుని ఉంది.. డిస్కోర్స్ అయ్యి లయిటు వెలిగే లోపు మాయం.. ఈ పిల్లకేమైనా మాయలొచ్చా ఏంటి ! ఇలా కనబడి అలా మాయమవ్వడం ఇప్పటి వరకూ నేనెక్కడా చూడలేదసలు.. ఇదే మొదటి సారి..ఏమయితేనేమీ భలే సంతోషమేసింది.. అదేదో అద్భుతాన్ని చూసినట్టు!  

మరునాడు రూం దగ్గర  మళ్ళీ క్యారియర్.. పొడుగాటి ఆ పిల్ల బూట్లు విడుస్తూ వంగి ఉంది. తల మీద ముసుగు. అలా కిందకి వంగినప్పుడు నాసాగ్రం లో వెండి ఆభరణం ఒక్కటే తళుక్కుమని మెరిసింది అందంగా…. పర్సనాలిటీ ని బట్టి నల్ల పిల్ల అయ్యి ఉంటుంది డెఫినిట్ గా!  భలే ఉందసలు.. కానీ గబుక్కున ఆ పక్క రూం లోకి వెళ్ళి మళ్ళీ రాలేదు.. ఎవరుంటారు అందులో అనుకుంటూ ఆ గది వైపుగా నడుచుకుంటూ వెళ్ళా ఏదో పని ఉన్నట్టు. మ్యానేజర్ అని తలుపు మీద వ్రాసి ఉంది. ఓహో… ఎవరికైనా అవసరాలొస్తే అప్రోచ్ అవడానికి ఒకావిడని పరిచయం చేసారు. ఆవిడ కూడా ఎక్కడా ఎచ్చులు పోకుండా మాలో ఒకరిగా అన్ని సమయాల్లోనూ ధ్యానానికి వస్తారు. అయితే అందరూ వెళ్ళే ముందే మందిరం లో ఉండడం, అందరూ వెళ్ళే దాకా ఆగి, ఎవరైనా అసిస్టెంట్ టీచర్ తో మాట్లాడాలనుకుంటే వారిని వరుసగా లోపలికి పంపి వారు తిరిగి తమ గదులకో, భోజనానికో వెళ్ళే దాకా అక్కడే ఉంటారు. అలాగే సర్వర్స్ కూడా.. వాళ్ళకి ఒక ప్రత్యేక ద్వారం ఉంటుంది. ఎక్కువ లేట్ అవకుండా ఆ ద్వారం నించి ధ్యానానికి  వచ్చి అటు వెళ్ళిపోతారు మిగిలిన పనులు చూసుకోవడానికి. మ్యానేజర్ గారు మళ్ళీ తరువాత సెషన్ కి అక్కడ ఉండాలి కాబట్టి ఆవిడకి ఒక సర్వర్ క్యారేజీలో భోజనం తీసుకొస్తారన్నమాట.. తెలిసిందిలే తెలిసిందిలే అనుకుంటూ అన్నం లేకపోతే మానె ఆ అప్సరస ని ఇంకో సారి చూడాలని అక్కడక్కడే తచ్చాడా కానీ ఇంకో 24 గంటలు భోజనం దొరకదని గుర్తొచ్చి వడివడిగా భోజన శాల వయిపు దారి తీస్తూ ఈ అమ్మాయి పేరేంటో.. పోనీ అప్సరస అనుకుంటే సరిపోతుంది కదా. పెట్రీషియా అయి ఉంటుందా.. అందం గా ఉంది కదా., బెల్లా అయి ఉంటుంది… పోనీ జొ-ఆన్ అయి ఉంటుందా.. హోప్ .. హోప్ అని పెడదామా.. మా కొలీగ్ ఉండేది హోప్ అని.. తన పేరు మన భాషలో ఆశ అని చెప్పేదాన్ని. సరేలే ఏదో పేరు కానీ ఒక్క సారైనా చూడాలి తనెవరో.. నల్ల పిల్లలు వస్తారా ఇక్కడికి. ఒకటి రెండు సార్లు వస్తే కానీ సర్వర్స్ గా అనుమతించరు. చిన్న పిల్లలా ఉంది మరి ఆ వయసులో పదేసి రోజులు అడవిలో ఉండేంత వైరాగ్యమెందుకో..ఏంటో మరి చాలా ఆసక్తి గా ఉంది.. ఆనంత పణ్య మయి అడవి దారి పట్టింది.. ఇంద్రుడు నవ్వి వాన కురిపించాడు.. కుర్చీ తడుముకుని మురిపెంగా చూసుకుని నిద్రలోకి జారాడు…

7 వ రోజు ఇంకా క్లిష్టమైనది ఏదో చెప్తారని ఆశించాను..మధ్యాహ్నం ధ్యానం కూడా అయిపోయింది. కొత్తగా ఏమీ లేదు ఇంక బోర్ కొట్టేస్తోంది. ఆ పిల్ల ఈ రెండు రోజులూ కాస్త ఇంటరెస్ట్ తెచ్చింది  తప్ప ఇంకేమీ లేదు..విపశ్యన నేర్పేసారు. అనుకున్నది దొరికిపోయింది.. ఇంకెందుకు ఇక్కడ.. అక్కడ ఆఫీసు లో బోలెడు పని, ఇల్లు ఎలా ఉందో.. ఇంటికి పోతే ఇంట్లో పనులు, మంత్ ఎండ్ పనులూ బోలెడు చక్కబెట్టుకోవచ్చు.. పోదాం పద పద పద పద పద …రాముణ్ణైనా కృష్ణుడ్నైనా కీర్తిస్తూ కూచుంటామా వాళ్ళేం  చేసారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా.. సంఘం కూడా స్థంబించేలా మన సత్తా చూపిద్దామా.. పద పద పద పద అని ఇంటి దారి పట్టింది మనసు.. బోర్ బోర్ బోర్… కానీ ఇక్కడికి రాకపోకలు మన చేతిలో లేవుగా ఇంకో 3 రోజులు అబ్బా.. అని అనుకుంటూ సాయంత్రం చాయ్ బ్రేక్ లో చేతిలో కమడలం (వాటర్ బాటిళ్ళకీ మధ్య నీళ్ళు తాగడానికో కొమ్ము, పట్టుకోడానికి హ్యాండిల్ ఉంటున్నాయి లెండి…) పట్టుకుని ముని పత్ని లాగా… (ముని కన్య అంటే మీరు నవ్వుతారని)… అడవి బాట పట్టా. సరిగ్గా సగం దూరం పోగానే కొండవీటి సత్యవతి గారు గుర్తొచ్చారు.. ఆవిడ ఒకరోజు  నడుస్తున్నప్పుడు పామొకటి వెంట నడిచిందనీ .. ఆవిడ వెనక నడుస్తున్న వాళ్ళు మాట్లాడ కూడదు కాబట్టి అరచి గోల చెయ్యకుండా చూస్తూ నడిచామని చెప్పారనీ వ్రాసినట్టు గుర్తొచ్చింది.. గబుక్కున వెనక్కి తిరిగి చూసా.. పాములూ అవీ ఏమీ లేవు, కానీ ఏమో ఎందుకైనా మంచిదని వెనక్కి తిరిగి నడవడం మొదలెట్టా.. అప్పుడే అటుగా వస్తున్న ఇంకోకావిడ చెయ్యూపారు. ఇందాక ఇద్దరు గది దగ్గర గబ గబా మాట్లాడేసుకుంటున్నారు. ఇప్పుడీవిడెవరో చెయ్యూపుతోంది. ఏదన్నా ఉంటే మ్యానేజర్ కి చెప్పచ్చు అని తెలియదనుకుంటా పాపం.. అని దగ్గరికి రాబోతూ వెనక్కి చూసా.. (వెనక +వెనక= ముందు.. అప్పటి దాకా వెనక్కి నడుస్తున్నా గా..) అదొక పెద్ద లోయ….వామ్మో ఒక సెకన్ లో పడిపోయి ఉందును , నా అజా పజా కూడా తెలిసేది కాదు మీకు కూడా…!!!

ఎన్నెల

రచయిత స్వీయ పరిచయం
కలం పేరు: ఎన్నెల. అసలు పేరు: లక్ష్మి రాయవరపు(గన్నవరపు). వృత్తి: చిత్రగుప్తుల వారి పని (చిట్టాపద్దులు వ్రాయడం). నిర్వహిస్తున్న బ్లాగ్: www.ennela-ennela.blogspot.com . అడ్రస్: 8 Skranda hill, Brampton, Ontario, Canada . ఈ మెయిల్ : ennela67@yahoo.ca

సికందరాబాద్ ఆల్వాల్ లో పుట్టి పెరిగి,  ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి , హిందూ మహా సముద్రం మధ్య ఎక్కడో (మాల్దీవుల్లో) ఉద్యోగాలున్నాయని వెళ్ళి అక్కడ మునిగి ఈదుకుంటూ కెనడా లో తేలాను. హాస్య కథలు వ్రాయడం, హాస్య నాటికలు వ్రాసి తెలుగు అసోసియేషన్ జనాల్ని భయపెట్టడం నా హాబీస్. జ్యోతిర్మయిగారి పరిచయంతో గజల్స్ మీద ఆసక్తి కలిగింది. ప్రస్తుతం గజల్స్ వ్రాసేసి, పాడేసి దొరికిన వాళ్ళందరినీ భయపెట్టే బృహత్ప్రణాలిక వేసుకున్నా మరి! ఆగండాగండి.. అయ్యో అలా పారిపోతున్నారేంటీ!!!!!!!!

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.