కరిగిన నీలి వెన్నెల
జ్ఞాపకాలు: శ్రీకాంత శర్మ

మనక్కొన్ని కనిపించవు. వినిపించవు కూడా. ఇంకొందరికవే చాలా గొప్పగా వ్యక్తమవుతాయి. వాళ్ళకీ మనకీ ఇంద్రియ లోపం ఉండి అలా జరుగదు. కానీ అదంతే. వాళ్ళకీ మనకీ మధ్య ఏ వ్యత్యాసం వల్ల అలా జరుగుతుందనేదే ముఖ్యమైన విషయం. ఈ వ్యత్యాసం దృశ్యాన్నో, శబ్దాన్నో ఎందుకు పరస్పరం విభిన్నం చేస్తుందంటే, అది వాటిపట్ల మనం తీసుకునే పరిమితాపరిమిత స్వేచ్చ వలన. కవికి ఎంత స్వేచ్చ ఉంటుంది? అదెవరు కొలవగలిగారిప్పటిదాకా ? కనుక శ్రీకాంత శర్మ కి కనపడ్డవి, వినపడ్డవి మనకంత సులువుగా అవగాహనలోకి రావు. ఆయన అనుభవాల్ని మనం అనుభవించడంలోంచి మాట్లాడుకోవాలి. అనుభవానికి సంబంధించి ఎవరి అభిప్రాయం వారిది. కాదనను. శర్మ గారి ఈ పుస్తకం నిండా స్వానుభవాల చిత్ర రచనలుంటాయి. 

స్నేహం, ప్రాణం, స్త్రీత్వము, ఏకాంత నేలమాళిగలు, శూన్య దీర్ఘ రాత్రులూ, నీలి వెన్నెల స్వప్నకీలలూ, అంతరంగ జ్ఞాన స్నానాలు. ఇవీ మనకు అనుభవంలోకి తెచ్చే కవితాంశాలు. శర్మ గారి కవితలన్నీ వయక్తిక భావనలే. అనగా వ్యక్తి కేంద్రంగా ఉండేవి. వ్యక్తి గాక కవిత్వానికి ఇంకేం ముడిపదార్ధముంటుంది? కనుకనే

— ఈ వేసవి పొద్దుకి
ప్రభాత పవనాల్ని మోసే ఓపిక లేదు
చనువుగా పరిమళ స్మృతిపై
ఎందుకు ప్రసరిస్తావు ?-
ముడుచుకు పడుకున్న స్వప్నాన్ని
మనోవల్మీకంలో అంతర్ముఖంగా నిద్రపోనియ్యి (55)

లాంటివి చదివినపుడు ఆ పాదాల సంబోధన లో ఒకరెవరో ఇంకొకరెవరికో చెబుతున్నట్టుంది. కవి ప్రతీ కవితలోనూ తను అనుభవించిన, విస్తున్న గాఢతని ఇలా వ్యక్తిగతంగానే నింపుతాడు. పుస్తకాన్నో, పాత ఇంటినో, పడక్కుర్చీనో, దేన్నిచూసి కవిత్వీకరించినా అతనిమనస్సులో అవి చేస్తున్న అలజడిని, వాటికతని ప్రతిస్పందన్ని ఇంకో ప్రతీకతో పోల్చుకుంటూ చెప్పడం. అలా చెప్పినపుడు ఆ వ్యక్తీకరణ వాటి నిసర్గ సౌందర్యారాధన చేస్తుండటం. దేనికీ ఒకటికొకటి కలసి మాట్లాడదు. కవిత్వం ఒక వ్యవస్తీకృత అవసరాన్ని తీరుస్తున్నట్టుండదు. పాఠకుడిమీద అది ఏరకమైన ప్రభావాన్ని చూపుతోందన్నది తెలుసుకోవడం కష్టసాధ్యమైన విషయం.

శ్రీకాంత శర్మ తన అనుభూతి వాదంతో చాలా ప్రసిద్ది పొందిన సాహిత్యకారుడు. కవిత్వంలో ఘటనల్ని, ఉద్దేశాల్నీ, అభిప్రాయాల్నీ వ్యక్తపరచడాన్ని అతను వ్యతిరేకించాడు. కవితకు కావాల్సిన వస్తువును అతని అనుభవమే నిర్ణయిస్తుందని నిర్వచిస్తాడు. రూప ప్రక్రియల్ని కవిత్వం ఏలాగూ బంధించలేదని చెప్తాడు. అందుకే అతని అనుభూతి గీతాల్ని చూసినపుడు అవి ఒక నిర్దిష్ట రూపంలో ఉండవు. వచన కవితకు పద్యాల్లా యతిప్రాస గణ నియమాలుండవు కనుక అస్సలా కవితా పాదాల్ని వరుసగా పేర్చుకుటూ కూడా పోవచ్చు. ఈ కవితల్లో లినియేషన్ (లైన్ బ్రేక్ చేయడం) టెక్నిక్కి హద్దుండదు. భావప్రధానంగా విభజనకు గురవుతున్నాయా, లేక మరొక విధంగానా అన్నది తేలదు. అందుకే కవి ఫలానా రూప సమన్వయాన్ని సాధించాడని నిరూపించే పనికి వెళ్ళకూడదు. సంభాషణ్ణి కూడా కవిత్వంలోకి శ్రీకాంత శర్మ ఇమిడ్చే పద్దతి చూడండి.

ఆమె :
చెబుతూనే ఉన్నాను దారాలు జాగ్రత్తని
నేనన్నానా తెగిపొమ్మని
నేలనీ నన్నూ విడిచి పొమ్మని –
పోనీ పరకాయ ప్రవేశం చెయ్యి
మనస్సు చచ్చిపోయిన వాళ్ళెందరో ఉన్నారు

అతను:
వద్దులే –
దారాలు తెగిపోయిన వేళ
ఇంతబాగుంటుందని తెలియదు
ఇక్కడ వెన్నెల బాగుంది
తెరిపిలేని తెరల తెరల వానలు బాగున్నాయి
ఈ బయలు బాగుంది
వాదాలు వద్దు (51)
రూపాన్ని నియంత్రించకపోవడం, ఎలా కావాలనుకుంటే అలా వాడటం శర్మగారిలో కొత్తగా ఉంటుంది. తిలక్ అమృతం కురిసిన రాత్రి లో మంచు, అమ్మా నాన్నెక్కడికెళ్ళాడు, నీవు లాంటి కవితల్లో సంభాషణ ఉన్నప్పటికీ శిల్ప సమన్వయం చాలా చక్కగా బిగింపుతో ఉంటుంది. అనుభూతి గీతాల్లో అలా ఉండదు.

విషయాలన్నీ ఊహలే. అనిపించినది బలంగా చెప్పడమే పునాది. అయితే అలా చెప్పడంలో అతను వాడిన వ్యంగ్యాన్ని చూడండి –

విప్లవాల గురించి
ధన రక్త దాహాల గురించి
శుష్కోపన్యాసాల గురించి
ఇంకా అనేకానేక శవ పరీక్షల గురించి
మాట్లాడదలుచుకోలేదు
మిత్రమా !

ఇంత కధ నడుస్తున్నా నా దైనందిన సమస్యల గురించి పట్టించుకోకుండా పలాయనం చిత్తగిస్తున్నానని ఎంత ధైర్యం గా అనేస్తున్నావ్ ? (69)

అంటాడు. సమకాలీన సాంఘిక రాజకీయ ఉద్యమాల్లో కలిగే భావావేశాల్ని కవిత్వంలో ఉంచకూడదంటాడు కవి. వాటి మూలాల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలి గానీ వాటిని కవిత్వాంశాలుగా రాయకూడదన్న అనుభూతివాద లక్షణం ఈ పుస్తకమంతా ఉంటుంది. సమాజమన్న ప్రసక్తే ఉండదు. అసలు వ్యక్తి రాజకీయ కారణాలకి ప్రభావితం కాకుండా ఉంటాడా ? వాటి వలన కలిగే అనేకానేక పరిణామాలకి గురయ్యే జీవితం ఏ ప్రతిస్పందన లేకుండా ఉంటుందా ? మనిషి బతికే సమాజంలో ఉండే ఒత్తిళ్ళు, భావోద్వేగాలూ చాలా సున్నితమైన కారణాల వలన వ్యక్తీకరణకి ఒక మాధ్యమాన్ని ఎంచుకుంటాయి. అది సాహిత్యమయినపుడు కవి తన సాహిత్య రూపాల్లో ఆ చిత్రాల్నే సృష్టిస్తాడు. సమస్యనైనా, పరిష్కారమైనా ఏదైనా ఆ ప్రకటన ప్రజని కదిలిస్తుంది.

దగాపడిన తమ్ములారా
మీ బాధలు మీ గాధలు అవగాహన నాకవుతాయి
పతితులార, భష్టులారా, దగాపడిన తమ్ములారా
రధ చక్ర ప్రళయ ఘోష భూమార్గం పట్టిస్తాను భూఅంపం పుట్టిస్తాను (జగన్నాధుని రధ చక్రాలు – శ్రీ శ్రీ)

లాంటి కవితని అనుభూతికి దూరమైనదని, అభిప్రాయ ప్రకటన చేసినదనీ తీసిపారేయగలమా ?

అనుభూతి గీతాలన్నీ మానవ జీవితంలోని సున్నితమైన కోణాల్ని కవిత్వంలోకి తీసుకొస్తుంది. ఆశ్చర్యార్ధకాల్నీ, ఆనందాల్నీ, పదాల్లోకి వంపుతుంది. దుక్ఖాన్ని చిత్రించినపుడు మాత్రం దాని కారణాల్ని గాలికొదిలేస్తుంది. దుక్ఖాన్ని చిత్రించే సమయాల్లో కవి అనాసక్తత స్పష్టంగా ఉంటుంది. నిస్సత్తువగా ఉంటుంది. 

ఇవాళ –
విడచి వెళ్ళిన వాళ్ళు నిలిచి తిరుగుతున్న వాళ్ళు
ఉభయులూ అపరిచితులే –
మాయ లేదు, మర్మం లేదు
చూస్తున్నదీ, అనుభవిస్తున్నదే.
ఏడుపు రావడం లేదు
ఎంతో వింతగా మాత్రం ఉంది !! (79)
ఇలా వార్ధక్యంలోని నిరాశను చిత్రిస్తారు. అలాగే భార్యా భర్తల మధ్య సంబంధాన్ని గురించి —

ఊపిరిని బంధించి బెంగనురేపే స్నేహస్పర్శ కాదు మనది
అలవాటుగా పరిణమించిన దైహిక క్రియ మన వివాహం
మనకు విశ్రాంతి లేదు. స్వప్నాల రెక్కలు కత్తిరించడమే కర్తవ్యాల పరాకాష్ట (39) అంటారు.
అవాస్తవం కాదు గానీ ఇలా కవిత్వీకరించడం వల్ల ప్రయోజనం ఏమిటో అర్ధం కాదు.

అనుభూతి గీతాల్లో కళ్ళు మిరుమిట్లు గొలిపినట్లు మెరిసేవీ, గుండె ఝల్లుమనే వ్యక్తీకరణలు చాలా ఉంటాయి. నైరూప్యత కొట్టొచ్చినట్టుంటుంది. అవి భలే ఉన్నాయే అని మనకనిపిస్తాయి గానీ, చదువుకుంటూ పోతున్నప్పుడు మనకి ఏ విధమయిన సంతృప్తినీ ఇవ్వవు. ఎందుకంటే భిన్నంగా చెప్పడానికి ప్రయత్నించి సహజత్వానికి దూరమైపోతాయి. సామాజికంగా అనుసంధానం కాని కవి ఏం చెప్పినా ఏం ప్రయోజనముంటుంది ? సమాజం సమూహానికి ప్రతిరూపం. గుంపుకి సాక్ష్యం. శర్మ తన కవిత్వం గుంపులు కట్టి మనజాలదంటాడు. సమాజ ప్రయోజనాన్ని ఆశించకపోవడం వల్ల అది కవిత్వం కాకపోవడం జరుగదు కానీ, ఆ సాహిత్య రూపం ఎలాంటి ప్రతిస్పందనల్ని సంపాదించుకుంటుంది ? 

రుతువు మారితే వానపడుతుంది
ఎండిన పెదవిని చినుకు తాకితే
మూత పడే కన్ను తెరుచుకుంటుంది (80) అన్నపుడో
నేను పుట్టిన వేళ
గది మూగది; గోడలు కలది
తలుపుల వెనుక దాగునది

నలుచదరపు శూన్య రహస్య నిధి (4) అని రాసినపుడో ఆ వ్యక్తీకరణలోని ఆరోపణలకి పాఠకుడు థ్రిల్లు ఫీలైనా, చిరకాలం అవి మనస్సుపై ముద్రవేసుకోలేవు. అలంకారిక శైలి ని కవి ఎంచుకున్న దాఖలా ఉండదు కానీ, భాషలో సాంప్రదాయక ధోరణి ఉంటుంది. బాగా చదువుకున్న తనం కనిపిస్తుంది. పదాల్లో సమాసాలు క్లిస్టంగా ప్రయోగించిన వాక్యాలుంటాయి. అనుభూతివాద కవిత్వం లో ప్రత్యేక విషయం ఏమీ ఉండదు కనుక వ్యక్తీకరణలోని ప్రతిభనే కవితా లక్షణంగా చూడాలి. అలా చూసినపుడు కవి విస్తృతమైన మెటఫర్లనీ, పెర్సోనిఫికేషన్ పద్దతుల్ని బాగా వినియోగించాడనిపిస్తుంది. మూర్తామూర్త భావనల జమిలిగా ఉంటుంది. ఇమేజరీల పొందికమాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఎన్నెన్నో దృశ్యాల్ని కళ్ళకు కట్టినట్టు రాయడం శర్మ గారి నైపుణ్యం. మూడ్ ని, ఉద్రేకాన్ని ప్రేరేపించడంలో అనుభూతివాద కవిత్వం సఫలమవుతుంది. కవి అంతరంగంకూడా ఈ గీతాల శైలి వలన అంచనా కట్టడం సులువవుతుంది. అతను ఎంచుకునే భాష అతని అలంకారికతని నిరూపణచేసి అతని సాంప్రదాయికతని బహిరంగపరుస్తుంది.రాజమండ్రి గురించి రాసిన కవితలు బాగుంటాయి.

మా రాజమండ్రి సందుమొగ దీపం క్రీనీడలో
చుక్కల రవిక, మువ్వల పావడ
వెలిసిపోయిన వోణీ, వసివాడని నవ్వు (63) బాగుంటుంది. తిలక్ రాజమండ్రి పద్యాలు గుర్తొస్తాయి.

అనుభూతివాదం ఉద్యమాల్ని, ప్రజాపోరాటాల్ని నేపధ్యంగా తీసుకుని రాసిన కవిత్వాన్ని వ్యతిరేకించింది. ఉపన్యాస, నినాద కవిత్వమని వ్యాఖ్యానించింది. అందుకే ఈ అనుభూతివాదకవిత్వమంతా శుద్దంగా ఉంటుంది. సాంఘిక ప్రయోజనం లేకుండా వ్యక్తిగతం గా ఉండి ఏ లాభాన్నీ ఆశించదు. ఆలోచనని ఆక్రమించి నిన్నుర్రూతలూపని కవిత్వమిది. అభిప్రాయ ప్రకటన్ని వ్యతిరేకించిన ఈ కవిత్వంలో కవి అనుభవాలు మాత్రమే ఉండవు. చాలా సొంత అభిప్రాయాల వ్యక్తీకరణ ఉంటుంది. సమూహాలకోసం స్వప్నాల్ని పోగొట్టుకున్నామనడం, మనం సగం రసికులం సగం రాక్షసులం, రణానికీ మరణానికీ మధ్య జీవితాన్ని రమిస్తాం, కాదంటే విరమిస్తాం అని జీవితేచ్చను వ్యతిరేకించడం లాంటివి అనుభవ ప్రకటనల్లా మాత్రం ఉండవు.

ఏది ఏమైనప్పటికీ శ్రీకాంత శర్మ ఏటికెదురీదినవాడు. తను నమ్మినదాన్ని నమ్మినట్టు నినదించిన వాడు. అతని వాక్యాల్లో ఎక్కడా తొణకడం, బెణకడం ఉండదు. అతని అనుభూతి కవిత్వం చాలా ముఖ్యాంశాల్ని ప్రతిపాదించి చర్చనీయాంశమైంది. అతని వయక్తికతలో ఎంత వెతికినా సామాజికతని కనపడనివ్వని సాహిత్యకత సాధించినవాడు శ్రీకాంత శర్మ. అయితే పురాతన సాహిత్యంపట్ల అమిత ప్రేమ, పట్టు గలవ్యక్తి. అతని సమగ్ర సాహిత్యమంతా సృజన, సమాలోచన పేర రెండు సంపుటాల్లో అచ్చయ్యింది. చదవదగిన కవి. కొత్త తరానికి ఎన్నో ఆలోచనలు రేకెత్తించగల సత్తా ఉన్న కవి. అంత చదువుకున్నతనాన్ని అతని రచనల్లో ప్రతిఫలింపజేస్తాడు. 

అనుభూతి గీతాల్ని ఒకసారన్నా చదవాల్సిన పుస్తకం. అందులో ఏం ప్రత్యేకత ఉందో వెతకాల్సిన పుస్తకం. ఎన్నెన్నో రకాల సమస్యలతో సతమతమవుతున్న ఆధునిక మనిషికి ఈ కవిత్వం దగ్గరవుతుందా లేదా అన్న ప్రశ్న వేసే కవిత్వం. కవిత్వం జీవితాల్ని తనలోకి ఆహ్వానించి విశాల ప్రపంచంవైపు రెక్కలు సాచే లక్షణం గలది. వ్యక్తిలో నిలబడిపోవడమో, సమూహంలో పరివ్యాప్తిచెందడమో కవిత్వానికి ఎవ్వరూ

చెప్పక్కర్లేదు. దానికేం కావాలో కాలంతో అదే రాయించుకుంటుంది.

శ్రీరామ్

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో కవితా ఓ కవితా శీర్షిక నిర్వహిస్తున్నారు. అద్వంద్వం తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

1 comment

  • నిజంగానే కవి ఊహాస్వేచ్చకు హద్దెక్కడుంది.అలాంటప్పుడు
    ఆ కవి అనుభూతివాదం లోంచి పుట్టిన కవిత్వానికి అపరిమిత స్వేచ్ఛ ఉండటం సహజమే కదా..అందుకేనేమో ఆతని అనుభవాల్ని మనం అనుభవించగలిగితేనే మీరన్నట్టు కవి మనకు పట్టుబడతాడు సందేహమే లేదు.మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే కేవలం కవి తన స్వానుభవానల్ని,అనుభూతుల్ని కవిత్వీకరించడానికి తెలిసిపోతుంది.అయితే సమాజానికి అవి ఎంతవరకు ఉపయుక్తం అనేదే కాస్త ఆలోచించాల్సిన విషయమే.కాని ఒక్కోసారి కవి తనకోసం తనలోకి తాను తొంగిచూసుకోవడం కూడా అవసరమే కదా..ఆవిధంగా చూస్తే ఈ కవిని ఖచ్చితంగా చదివి తీరాల్సిందే..
    చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా ఉంది మీ రివ్వూ వెల్డన్ సర్….

  • ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి గురించి తెలుసుకోవడం చాలా బాగుంది. ‘ముడుచుకు పడుకున్న స్వప్నాన్ని, మనో వల్మీకంలో అంతర్ముఖంగా నిద్రపోనియ్యి’ అన్న మాటలు చాలా నచ్చాయి. ‘తెరిపిలేని తెరల తెరల వానలు బాగున్నాయి’. స్వప్నాల రెక్కలు కత్తిరించడం, ఎండిన పెదవిని చినుకు తాకడం, ఇంకా నాకు నచ్చినవి చాలా ఉన్నాయి ఈయన కవిత్వంలోనూ-మీ రైటప్‌ లోనూ. అనుభూతి గీతాలు నిజంగా అనుభూతించవలసినవే!

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.