టొమాటో కంపెనీ వారి
కాంపెటీటివ్ మతవాదం

నా ఫేసుబుక్కు మితృడు ఒకాయన, ప్రస్తుతం భారతదేశంలో సెక్యులరిజం పేరుతో పోటాపోటీ మతవాదం (కాంపిటీటీవ్ కమ్యూనలిజం) రాజ్యమేలుతోంది అని చెప్పారు. 

ఆహారాన్ని డోర్ డెలివెరీ చేసే టొమాటో కంపెనీలో ప్రస్తుతం, హిందు ముస్లిం ఇరు వర్గాల డెలివరీ బోయ్ లూ ఒకేసారి నిరశన వ్యక్తం చేస్తున్నారు. కారణం, ముస్లిములు పందిమాంసపదార్ధాలు డెలివరీ ఇవ్వం అనీ, హిందువులు ఆవుమాంసం పదార్ధాలు డెలివెరీ ఇవ్వం అనీ, ఇరువురూ ఐకమత్యంతో నిరశన వ్యక్తం చేస్తున్నారు.

ఐకమత్యం శుభపరిణామం అని సంతోషించాలా? దానివెనుక కారణాలు చూసి ఏడవాలా? 

నేపద్యం ఏమిటి కావచ్చు? 

కాసేపు మా విజయనగరపు ఉదాహరణకి వద్దాం. 

అక్కడ ప్రతీ ఏటా పైడీతల్లమ్మ అనే దేవతకి తీర్హం జరుగుతుంది. ఆ పరిసరాల్లో కొబ్బరికాయలూ, పూజాద్రవ్యాలూ అమ్ముకొనేవాళ్ళలో ముస్లిములూ ఉంటారు. దశబ్దాలపాటు వేలమంది భక్తులు తమకు కొబ్బరికాయలూ, పువ్వులూ అమ్మేవారి కులమతాలు పట్టీంచుకోకుండా ఉన్నారు. 

ఒకానొక భక్తుడు చాదస్తం ఎక్కువ వల్లనో, బుద్ధి తక్కువ వల్లనో, “నేను ముస్లిం వ్యాపారి వద్ద కొనను” అనుకుంటూ వెళ్ళిపోవటం వ్యాపారికి వినిపించిందనుకుందాం. నాకు తెలిసినంతవరకూ ఆవ్యాపారి, “వచ్చే వందలమంది భక్తుల్లో ఈఒక్కడూ కొనకపోయినా కొంపలు మునగవు” అనుకుంటాడు. 

కానీ, అప్పటికప్పుడు, భారతరాజ్యాంగం, ముస్లిములపట్ల వివక్ష అనే అంశాలతో అక్కడ పంచాయితీ పెట్టడు. ఇందుకు అతడికి ఉన్న ఏకైక కారణం,  గొడవ చేస్తే, ఒక భక్తుడు చూపే వివక్షతో అందరు భక్తులకీ ఇదే జాడ్యం ఉన్నట్లు మాట్లాడితే ఇంతవరకూ అతడి దగ్గర కొంటున్న భక్తులకూ “లేనిపోని” ఆలోచనలు వచ్చి వ్యాపారం దెబ్బతినవచ్చు.

ఈపాటి బుద్ధి టొమాటో వారికుందా?

చాదస్తం ఎక్కువ అవటం వల్లో, బుద్ధి తక్కువ అవటం వల్లనో మద్యప్రదేశ్ లో ఒక కస్టమరు, తాను శ్రావణ మాసం పట్టింపు మూలంగా ఆవుమాంసం తినే అవకాశమున్న ముస్లిం డెలివరీ బోయ్ ద్వారా డెలివరీ వద్దు అని అన్నాడు ( ముస్లిం ద్వేషం ఉన్నట్టైతే శ్రావణ మాసం క్లాజు ప్రస్తావించేవాడా?). 

అలాంటి కోరికను టొమాటోవారు తీర్చదలుచుకోలేనప్పుడు, “మీకోసం ముస్లిమేతర డెలివరీ బోయ్ ని వెతకలేము” అని, తెలియజేసి అక్కడితో వదిలెయ్యకుండా, వ్యాపారంతో పాటు భారత సెక్యులరిజాన్ని భుజానికెత్తుకున్నట్టుగా, సదరు కష్టమరుని దేశంలో లక్షలాదిమందిచేత తిట్టించి, స్తానిక పోలీసులచేత కూడా హెచ్చరిక నోటీసులు ఇప్పించేవరకూ తీసుకెళ్ళేరు. 

ఐతే, సోషల్ మీడియాలో చాలా క్రియాశీలంగా ఉంటూ (ఎన్నికల్లో ఒక సైన్యంలా పనిచేసి అధికారం సాధించగలిగిన) సంఘ్ పరివార్ లు ఊరుకుంటారా? వారు, ఇంకో కష్టమర్ చేసిన అటువంటి వినతిని, దానిని టొమాటోవారు మన్నించిన తీరుని తవ్వితీసారు.

దాని సారాంశం. ఒక కష్టమర్, తాను హలాల్ చేసిన మాంసం మాత్రమే తింటాను అనీ, అలాగే పందిమాంసం అమ్మని రెస్టారెంటునుంచి మాత్రమే ఆహారం తెప్పించుకోవా లనుకుంటున్నాననీ, అందుచేత, రెస్టారెంట్లను హలాల్ ఆధారంగా, అలాగే పందిమాంస వంటకాలు అమ్మని జాబితా కూడాకావాలని అడిగేడు. 

దానికి టొమాటొవారు అత్యంత సానుకూలంగా, “మీ మనోభావాలు మాకు చాలాముఖ్యం” అని జవాబు చెప్పారు.

శ్రావణమాసం, హలాల్ ఈరెండింటిలో రెండోది మాత్రమే సమంజసం అని ఎవరైనా భావిస్తే, అది వారిష్టం.

కానీ, ఒక వ్యాపార సంస్థగా, కష్టమర్లు ఏమి నమ్ముతారో అదే వారి వ్యాపార విజయాన్ని నిర్దేశిస్తుంది. 

శ్రావణమాసం, హలాల్ పోలిక చదివిన లక్షలాది మందిలో కనీసం పదిశాతం మందికి ఆకంపెనీ మీద వళ్ళుమండి ఆ కంపెనీ సేవలు ఆపేస్తే, అలా ఆపేసిన వారిని భారత రాజ్యాంగప్రకారం, ఏచట్టం ప్రకారమూ కూడా ప్రశ్నించటం వీలుకాదు.  ఎందుకంటే కారణం చూపకుండా కూడా ఒక కంపెనీ సేవలిని తిరస్కరించటం కష్టమర్ల హక్కు. గుజరాత్ రైతులిని వేధించినందుకు ఒక కంపెనీ పొటాటో చిప్సుని నేను ఇప్పటీకీ తిరస్కరిస్తూనే ఉన్నాను. మాపిల్లలు అడీగితే, దగరలో బేకరీకి వెళ్ళి మా ఎదురుగా నూనెలో వేయించిన చిప్సు కొంటాను కానీ, ఆ కంపెనీవి కొనను. అది నా ఇష్టం.  

చిత్రంగా, శ్రావణమాసం మొదలైన పదిరోజుల్లోనే రోజులలోపలే అదే కంపెనీకి చెందిన హిందూ ముస్లిం డెలివరీ బోయ్స్ ఒకేసారి నిరశన మొదలెట్టారు. 

ఇది యాదృచ్చికమా? కాదనే నానమ్మకం. అలాగైతే ఇదే వ్యాపారం చేసే ఇతర కంపెనీల్లో ఎందుకు మొదలవలేదు? (మొదలవకుండ ఆపలేరు కూడా. ఎందుకంటే నిప్పురగిలిస్తే ఒక ఇంటితో ఆగేది కాదు). 

ఒకవేళ దీనిని సంఘ్ పరివార్ వారు ఆ కంపెనీ మీద పన్నిన కుట్ర అంటే, శ్రావణమాసపు కష్టమర్ని దేశమంతటా తిట్టించటం ద్వారా, తమకు “వ్యాపారంతో పాటు భారత లౌకికతత్వాన్ని నిలబెట్టటంలో కూడా బాధ్యత ఉంది” అనుకుంటే, మతతత్వ శక్తులతో పోరాడుతూ వ్యాపారం పెంచుకొనే వ్యూహం కూడ ఉండాలి మరి.

నా మొదటి అనుమానం. ప్రస్తుతం నిరశన వ్యక్తం చేస్తున్నవారికి తాము పందిమాంసాన్నీ, ఆవుమాంసాన్నీ ముట్టుకుంటున్నాం అని ఈరోజే తెలిసిందా? 

ఆ అవకాశం లేదు. ఎందుకంటే తాము ఏమి తెస్తున్నామో డెలివరీ బోయ్స్ కి ఖచ్చితంగా తెలుసు.

ఇన్నాళ్ళూ ముస్లిం డెలివరీ బోయ్ పోర్క్ బిర్యానీని వృత్తిలో భాగంగా డెలివరీ చేసేసి, ఇంటీకెళ్ళి తన నమాజేదో తాను చదువుకుంటున్నాడు. 

అలాగే శుద్ధ శాఖాహారి కూడా, బీఫ్ బిర్యానీ డెలివరీ చేసి ఇంటికెళ్ళి, ఉల్లిపాయ కూడా కలవని ఆహారం తింటున్నాడు. 

అంటే ఆహారాన్నీ మతాన్నీ, వృత్తినీ వేరు చేసి, ఆ స్పృహ కూడా లేని వందలమందిలో ఆస్పృహ కలుగజేసిన తొలి అడుగు ఇప్పుడు బూమరాంగ్ అయింది.

1857 నాటి సిపాయిల తిరుగుబాటుకి కారణమంటున్న ఆవుకొవ్వు, పందికొవ్వు తూటాలు…

డాక్టర్ మూలా రవికుమార్

మూలా రవికుమార్ పశువైద్య పట్టభద్రుడు. పశుపోషణలో పీజీ, గ్రామీణాభివృద్ధిలో పీహెచ్ డీ.
పశువైద్య విశ్వ విద్యాలయంలో శాస్త్రవేత్త. పద్దెనిమిదేళ్ళగా కథా రచన. 2012 లో చింతలవలస కథలు సంకలనం విడుదల. కథాంశాలు: ఉత్తరాంధ్రా గ్రామీణం. వ్యవసాయ గ్రామీణాభివృద్ధి. సంస్థలలో ఉద్యోగుల మనస్తత్వాలు.

1 comment

  • ఇది ఒక పార్శ్వం. నిజమే. కానీ, సర్ఫ్ ఎక్సెల్ వారి మతసామరస్యం యాడ్ని కూడా భరించలేని స్థితిలో వుంది సింగ్ పరివారం.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.