ట్రాన్స్ ఫర్

తెగని ఆలోచనలు. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా వుంది. మెల్లగా బాలన్స్ చేస్తూ బండి నడుపుకొస్తోంది కల్పన. సంవత్సరమైంది రోజుకి. ఎక్కువ సంపాదన అంటూ వెళ్ళాడు ఢిల్లీకి. వెళ్ళింది మొదలు మాటా మంతీ ఏదీ లేదు. ఎపుడు కాల్ చేసినాబిజీ మళ్ళా మాట్లాడతాఅనే సమాధానం. ‘మీ హజ్బండ్ ఎపుడొస్తాడు?’ అంటూ ఇరుగు పొరుగుల వ్యంగ్య పరామర్శ. ‘ఏం చేసిందో వెళ్ళి పోయాడుబంధువుల రాగాలు. ‘అమ్మా నాన్న ఎపుడొస్తాడూఅంటున్న ఐదేళ్ళ రేణుకను సముదాయిస్తూ బతుకు వెళ్ళదీస్తూంది కల్పన.

ఏం ఆడది ఒక్కతే బతక్కూడదా? ఆధారపడుతూనే వుండాలా? ఆధారపడ్డన్నాళ్ళూ అవమానాలేనా?’ రోడ్డు మీద రణగొణధ్వనులు ఆలోచనలు పక్కకు నెట్టాయి. ఇంకో వూరికి మళ్ళీ ట్రాన్స్ఫర్. రేపే వెళ్ళి ఆవూరి స్కూల్లో రిపోర్ట్ చేయాలి. అక్కడెలా వుంటుందో? ఇల్లు సామాను మై గాడ్! అయినా అనుకుని ప్రయోజనం ఏముంది? ఎప్పుడైనా పక్కనుండి మాట సాయమైనా చేశాడా? అన్నిటికీ ఎగతాళేగా? సొంత బావ అనుకుని ప్రేమించి పెళ్ళిచేసుకున్నదిందుకేనా?’

ఆలోచిస్తూనే ఇల్లు చేరింది. బండి స్టాండ్ వేస్తుండగానే రేణూ పరిగెత్తుకొచ్చింది కప్ కేక్ తింటూ. ‘ఎక్కడిది?’ ఆశ్చర్యంగా చూసింది. అతను మాట్లాడుతూ గేటు తోసుకు లోపలకొస్తున్నాడు. చూసి కూడా మాట్లాడకుండా తలుపు తీసుకు బెడ్ రూం లోపలకెళ్ళిపోయింది. అతను మాట్లాడుతూనే నవ్వుతూనే వున్నాడు ఫోన్ లోవచ్చేస్తా ఒక్కవారంఅంటూ

కల్పన వంటింట్లోకి పోయి స్టవ్ వెలిగించి కాఫీ గిన్నె పెట్టింది. రేణుక ఫోన్ తెచ్చి ఫొటోలు చూస్తోంది. అతను ఎప్పటిలాగే టివీ లో దూరిపోయాడు. ‘అమ్మా ఆంటీ ఎవరు నాన్న పక్క?’ అడుగుతోంది. తదేకంగా ఫొటోని చూస్తున్న కల్పన కాఫీ మరిగి పొంగి పోవడాన్ని చూడలేదు. ‘ఈమె ఢిల్లీ కూడా చేరిపోయిందాఅనుకుంటూ  ‘ ఆంటీ ఆఫీస్ లో ఫ్రెండ్ లేఅంటూనేమనం రేపు ఇంకో వూరెళ్ళి పోతున్నాంఅంది. ‘ఎవరెవరూ?’ అడుగుతోంది రేణుక

నువ్వూ నేనూనే’ – ‘మరి నాన్నో?’ ‘నాన్న ఢిల్లీ లోనేఇలాటి చాలా ఫొటోలు చూసిన కల్పన కళ్ళల్లో తడి ఎపుడో ఆరి పోయిందని పాపం రేణుకకు తెలీదు.

 

డా.విజయ్ కోగంటి

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.