నిందలోనూ చాతుర్యం తిక్కనార్యుని కవిత్వం

ఈ నాటి కాలంలో రాసేవాళ్ళమందరం ఏ చిన్నది రాసినా నా మాట, తన మాట అంటూ ముందుమాటగా తప్పక కొన్ని మంచి విషయాలు రాస్తాం, రాయించుకుంటాం తెలిసిన వాళ్ళ చేత. ముందు పేజీలలోనో లేక చివరి అట్టమీదో ఎక్కడో చోట మన బతుకుబాట క్రమాన్ని కూడా తప్పక చెబుతాం. మనం రాసేదానికి ఆదరణ ఎంతొస్తుందో  తరవాతి విషయం, కానీ చదివే వాళ్ళు మన గురించి, మనం పడ్డ శ్రమ గురించి కనీసం కొంత తెలుసుకుంటే చాలనుకుంటాం, సంతృప్తి చెందుతాం. కానీ అటువంటి తాపత్రయమేదీ ఆ నాటి కవులకున్నట్టుగా మనకగుపించదు. రాసినవి మహా కావ్యాలు, తమ గురించి చెప్పుకున్నది మాత్రం బహు స్వల్పం. తరువాత ఆ కవి శిష్యుడో లేక కొడుకో ఎవరో రాసినది చదివి కాని మనం తెలుసుకోం కృతికర్త వ్యక్తిగత వివరాలు. ఇక పోతే ఆ నాటి సమాజంలో రీతులు, అలవాట్లు, కట్టు, బొట్టు తెలియదెప్పింది కూడా అత్యంత స్వల్పం. సురవరం గారు అనేవారు యాభై ప్రాచీన గ్రంథాలు తిరగేస్తే ఐదారు విషయాలు లభిస్తాయేమో సాంఘిక చరిత్ర కోసం అని. 

కానీ వేరొక విషయంలో మాత్రం ప్రాచీన కవులు ఇప్పటి వారిని మించిపోయారు. నేటి కవులలో లేనిదీ, ఆ నాటివారిలో ఉన్నదీ ఒకటుంది -“కుకవి నింద” అంటే తనకు నచ్చని కవులగురించీ, వాళ్ళు రాసే విధానాన్ని గురించీ పద్యాలలో తిట్టడం, వాటిని  ముచ్చటగా గ్రంధస్థం కూడా చేయడం. కావ్యంలోని అవతారిక విభాగంలో షష్ట్యాంతాలలో ఒక విభాగాన్ని సెపరేటు గా కేటాయించి మరీ ఎత్తి పొడిచారు. పరవాలేదు, చింత మనకవసరం లేదు. ఎందుకంటే, అంతా మన మంచికే అన్నట్టు, ఆనిందల మద్యలో చదివే వాళ్ళకి మాత్రం అప్పటి కవి సమాజంలో ఉన్న కొన్ని పోకడలు బోధపడతాయి. మరి ఎవరో ఒకరు ఎత్తి చూపినప్పుడే కదా వాటి గురించి తెలిసేది. కేవలం మంచి మాత్రమే  కాదు గతంలోని చెడు గురించి కూడా తెలుసుకోవాలి, తెలియజెప్పాలి. లేక పోతే జాత్యాభిమానం వరకే ఉండాల్సిన సెంటిమెంటు అహంకారం కూడా దాటి ఉన్మాదం కూడా కాగలదు. సరిగా గమనిస్తే సాగుతున్న నేటి చరిత్రలో ఎన్నో దృష్టాంతాలకు మూలాలు కూడా అక్కడినుండే అని ఇట్టే తెలుసుకోవచ్చు. ఒక్క రాజకీయ రంగమే కాదు, ఏ విషయం గురించైనా పాఠ సారం ఇదే. 

సమకాలీన కవులపై చేసిన ఈ ఎత్తి పొడుపులు నన్నెచోడుడి కుమార సంభవంతో మొదలై ప్రబంధ కవుల వరకూ సాగింది. చివరకు ప్రాచీన కాలపు మహాకవి గా పేర్కొనబడే “తెలుగు పలుకుల తేనెలొలికిన” తిక్కనార్యుడు కూడా దీన్ని వదలలేదు. ఆ రోజుల్లో కవిగా చెప్పుకునే వాడు తప్పక ఛందస్సు లోనే రాసేవాడు కనుక, వాటి కోసం యతి ప్రాసలు వాడక తప్పదు కనుక, ఆ నియమం పాటించడానికి అర్థంలేని వ్యర్థ పదాలను ఆ స్థానాలలో వాడి ఎలాగో కిట్టించి సరిపెట్టే వారేమో, దాన్ని గురించి ఎత్తి పొడుస్తూ నిర్వచనోత్తర రామాయణంలో తిక్కన గారు  చక్కని పద్యం చెప్పారు.

“తెలుగు కవిత్వము చెప్పం
దలచిన కవి యర్థమునకు దగియుండెడు మా
టలుగొని వళులుం బ్రాసం
బులు నిలుపక యొగినిబులిమి పుచ్చుట చదురే “

>తాత్పర్యం:

వళులు = యతులు; ఒగిని = వరుసగా;
బులిమి = పులిమి; పుచ్చుట = చెత్తై పోవు; చదురు = బాగుండుట, నేర్పు గా ఉండుట

భావము ==>

తెలుగు కవిత్వం చెప్పదలచిన కవి అర్థానికి సరపడే యతులు ప్రాసలు పెట్టకుండా పులుమి చెత్త వేయడం బాగుంటుందా !!

అలా వేరే కవులను పద్యాలలో నిందించినా, తిరిగి మళ్ళీ ఆ ప్రక్కనే మరొక విషయం కూడా చెప్పారు.    ఎట్లాగ రాస్తే అది కవిత్వమనిపించుకుంటుందో కూడా వెను వెంటనే చెప్పారు. విజృభించి తమ ప్రతిభాపాటవాలను ఉదహరిస్తూ ఒప్పుగా అనిపించేది ఏ కవిత్వమో దాన్ని చక్కగా నిర్వచించారు. తిక్కయ్య మహాకవి చూడండి ఏం చెప్పారో .

“భూరివివేక చిత్తులకు బోలుననం దలపున్ దళంబులన్
సౌరభమిచ్చు గంధవహు చందమునం బ్రకటంబుచేసి యిం
పారెడు పల్కులంబడయ నప్పలుకుల్ సరి గ్రుచ్చునట్లుగా
జేరపనేరగా వలయు జేసెద నే గృతి యన్నవారికిన్ “

తాత్పర్యము==>

భూరి  వివేక చిత్తులకు బోలుననన్= గొప్ప వివేక వంతులైనట్టివారు; తలపున్ దళంబులన్ = ఊహలనబడే పూలరేకులు; సౌరభమిచ్చు గంధవహు చందమునన్ = సువాసనలు వెదజల్లే గాలివలె; ప్రకటంబు చేసి = వ్యక్త పరచి; ఇంపారిడి పల్కులన్ బడయ = ఇంపైన పలుకులు వెలువరిస్తూ ; అప్పలుకుల్ సరిగ్రుచ్చునట్లుగా జేరుపనేరగా వలయు = ఆ పలుకులను సరైనరీతిలో గుచ్చినట్లుగా చేర్చ వలయున; జేసెద నే కృతి యన్నవారికిన్ = అలా జేస్తాను కృతి అనిపించేందుకు.

భావము==>

గొప్ప వివేకవంతులైన వారి ఊహలనబడే పూలరేకుల సుగంధ పరిమళాలను మోసుకొచ్చే గాలివలే భావాలు వ్యక్తపరచి, ఇంపైన పలుకులు వెలువరిస్తూ, ఆ పలుకులను సరైనవరుసలో గుచ్చి పేర్చవలయను. అలా సృజిస్తాను కృతి అని పిలవబడేందుకు.

పరంపరాగతమైన ఈ అద్భుతమైన పద్య చాతుర్యాన్ని చూస్తే ఒక విషయం మనసులో మెదలక మానదు. నాటి సాహిత్యంలో తప్పొప్పులనెంచుట  ఈ కాలంలో మనకు సాధ్యమేనా. అందాన్ని కేవలం ఆరాధిస్తే చాలదా? రసపట్టులో తర్కం దేనికన్నట్లు అలా అడ్మైర్ చేస్తూ పోతే పోలా !!!

లెనిన్ వేముల

లెనిన్ బాబు వేముల: వృత్తికి సాఫ్ట్ వేర్ ఇంజనీరు, ఎమ్మే లో చదువుకున్న తెలుగు భాషా సాహిత్యాల సౌందర్యం మత్తు వదలని పాఠకుడూ వ్యాఖ్యాత. ప్రస్తుతం అమెరికా, టెక్సాస్ రాష్ట్రం, డాలస్ నగరంలో నివసిస్తున్నారు. అక్కడి టాంటెక్స్ (తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్)  నెల నెలా తెలుగు వెన్నెల క్రియాశీలురలో ఒకరు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.