మా బాలమామ బలేవోడు. ఎంత మంచోడో అంత కోపిస్టోడు. చిన్నప్పుడే, వాళ్ల నాయిన కొట్టినాడని అలిగి వేరే ఊరికి పొయ్యేసినాడు. ఆరేడేండ్లు ఊరితట్టు అడుగే పెట్లేదు. ఎంతైనా అబ్బాకొడుకులు కదా, ఎన్నేండ్లని కలుసుకోకుండా ఉంటారు! తాత మనమరాలిది, అంటే మామవాళ్ల అక్క బిడ్డకి పెండ్లి కుదిరింది. తాత పొయి, పెండ్లికి రానే రావల్లని మామని పిలిచేసి వచ్చినాడు.
మామ, పెండ్లికి ముందునాడు బయిలుదేరి వస్తా ఉండాడు. ఆడనే పొద్దు పొయింది. మామ అలిగి పొయినప్పుడు మావూరికి బస్సులేదు, ఆనెంక ఊరికి తారుబాట ఏసి బస్సును వదిలిండారు. ఆ బస్సులో ఎక్కి కుచ్చున్నాడు. అట్లనే నిదరపొయినాడు. బస్సు మావూరిని దాటేసి కడా ఊరికి ఎలిపొయింది . బస్సులో ఉండే అందురూ దిగేసిరి. ఈయప్ప నిదరపోతానే ఉండాడు. చీట్లాయన వచ్చి తట్టి లేపతా “ఏమయ్యా బస్సు దిగవా” అన్నాడు. మామ దిగ్గున లేసి, కండ్లు పులుముకుంటా బస్సు దిగినాడు. నిదరమత్తులో ఏ తట్టుకు పోతుండాడో తెలవక, ఇంకొక తట్టుకు రెండూర్లు దాటుకొని పొయ్యేసినాడు.
అక్కడొక ఊరు కనపడింది , అవూర్లో వాళ్లని “ఇది ఏ ఊరన్నా” అని అడిగినాడు మామ. వాళ్లు “ఇది కొండకిందపల్లి” అని చెప్పి “నువ్వు ఏ వూరికి పోవల్లప్పా” అన్నారు. “నేను నాగప్పనాయుని బురుజుకు పోవల్లన్నా” అని చెప్పినాడు మామ.
“అయ్యోచానా దూరం వచ్చేస్తివే. వచ్చిన దావంటే పో. మొదట్లో ఈన్నాయని చెరువు వస్తాది. ఆ చెరువుని దాటుకుంటానే ఒక బస్సునిలుకు ఉండాది. ఆడ మూడు దావలు కలస్తాయి. దచ్చిన పక్క దావలో దిగబడి పోతే మీవూరు వస్తాది” అని చెప్పిరి.
మామ బయిలుదేరి ఆ ఊరిని దాటి, ఈన్నాయని చెరువుకట్టని ఎక్కబోతా ఉండాడు. కట్టమింద పెద్ద చింతమాను ఉంటే, ఆడ పదిమంది ఆడోళ్లూ మగోళ్లూ కుచ్చోని ఉండారు. వాళ్లను చూసేతలికి మా మామకి కొండంత దైర్నం వచ్చింది. ఇంకేమీ బయం లేదులే, ఈడ ఇంతమంది ఉండారు కదా అనుకుంటా బింకంగా వాళ్ల దగ్గరికి పొయినాడు.
“ఏమప్పా మీరు ఇంతమంది ఈడ ఉండారే, మీరూ పెండ్లికేనా?” అని అడిగినాడు. వాళ్లేమీ మాట్లాడలేదు. తిరగా ఈయప్పే “నేనూ పెండ్లికే, బస్సులో నిదరపొయి ఈడ దిగితి. రాండప్పా పోదాము” అన్నాడు. దానికి బదులు పలకలేదు వాళ్లు.
“ఏలమ్మా, మీరంతా ఏడనిండి వస్తా ఉండారు, మిమ్మల్నెప్పుడూ చూడలేదే. మీరు పెండ్లికొడుకు చుట్టాలా, పెండ్లికూతురి చుట్టాలా” అని అడిగినాడు మల్లీ .
దానికి ఒకామి నోరిప్పి “మాది కొత్తకోట” అనింది. బుర్రమీసాలాయన “మాది మేడిపల్లి” అన్నాడు. మిగిలినోళ్లు వరసగా ‘చింతమాకులపల్లి, మాలేపాడు, గుర్రంకొండ అంటా చెప్పిరి. కడాన ఒకామి “మాది ఈవూరేనన్నో” అనింది.
“ఈవూరా, ఈ పాయకట్టులో ఎప్పుడూ నిన్ను చూడలేదే” అని అడిగినాడు మామ. “నేను ఈ నడాన్నే ఈవూరికి కొండప్ప కోడాలుగా వస్తిని” అనింది.
వీళ్లిట్ల మాట్లాడుకుంటా ఉండగానే, గొల్లపల్లి దిబ్బలోళ్ల ఎంకటప్ప ఏలు ఏలుకీ ఉంగరాలు ఏసుకుని,కాళ్లకు కిర్రిమెట్లు ఏసుకోని ,వైదిగము సంచి భుజానికి తగిలించుకుని,చేతిలో దొన్నికట్టి పెట్టుకోని ,నోటి నిండా వక్కాకు ,బుర్రమీసాలు ,చెవులకి ఎర్రాళ్ళపోగులతో, నోస్న తిరవని పెట్టుకోని కిర్రుకిర్రుమని నడుచుకుంటా ఆ తట్టుకి వస్తా ఉండాడు. ఆయప్పని చూసి కిందుండే వాల్లందరూ చింతమానుపైకి అదరాబదరా ఎక్కతా ఉండారు. కళ్లు మూసి తెరిసేటప్పుటికి మాయమైపొయిరి వాళ్లంతా. చింతమాను ఒక్కటే గుయ్యిమంటా నిలిచి ఉండాది ఆ తావున. మామకు ఏమి జరిగింది అనేదే తెలవలేదు. బెప్పరపొయి,నిర్జీవుడై నిలబడుకోనుండాడు.
వెంకటప్ప మామకాడకి వచ్చి “రేయ్ నాయాలా, ఇంతపొద్దులో ఈడకేల వస్తివిరా. నేను వచ్చేది జడిసేపు నిదానం అయ్యింటే నువ్వులేవు. నిన్ననే పదిమంది దెయ్యం పట్టినోళ్లు వస్తే ఈ చింతమానికిందే వాళ్లకి పట్టిన దెయ్యాల్ని వదిలించి మానుమిందకి ఎక్కి స్తి. ఆ దెయ్యాలే ఇప్పుడు నీకు కనిపించింది” అన్నాడు.
“దిబ్బలాయప్పా , ఇప్పుడు నువ్వు రాలేదంటే నాగతేమి. నా ఉసురు నిలిపితివప్పా” అంటా ఆయప్పని దబ్బుకున్నాడు మా మామ.
“సరే రారా, మీ ఇంటికాడ వదిలేసి పోతాను” అని మామను తోడుకుని వచ్చి, పెండ్లి ఇంటికాడ వదిలేసి పొయినాడు ఎంకటప్ప. ఆపొద్దు రెయ్యి అట్లుండి, మూర్తం అయిపోతానే మళ్లా మామ ఊరు తట్టు తిరిగి చూడకుండా పొయ్యేసినాడు.
అప్పుట్నించీ అప్పుడప్పుడూ వస్తాపోతా ఉంటాడు కానీ, వెలుగుపొద్దులో వచ్చి వెలుగుపొద్దులోనే పోతా ఉంటాడు, రెయ్యిపూట మటుకు రానేరాడు మా బాలమామ. చుట్టాలు కనబడి పలకరిస్తారని బయం
చిత్తూరు పల్లె బాషా చాలా బాగుంది