మరోసారి ముద్దుపళని

సాహిత్య విమర్శ అప్పుడప్పుడూ పక్కదారులు పడుతూఉంది. విషయనిష్ఠ కంటే వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ప్రయోజనాలు ప్రాధాన్యం పొందుతూ ఉన్నాయి. ఇవి ఒక్కొక్కసారి వర్గ ఆసక్తులుగా భాసిస్తూ ఉన్నాయి.

ఇటీవలికాలంలో ముద్దుపళని ‘రాధికా సాంత్వనం’ పై ఒకరకమైన చర్చ జరిగింది. ముద్దుపళని స్త్రీ కావడం వల్ల, వేశ్య కావడం వల్ల నిరాదరణకు అగౌరవానికీ గురయిందనీ, ఆమెను సమర్థించడం వల్లా, తాను కూడా వేశ్యాకులానికీ చెందింది కావడం వల్లా బెంగుళూరు నాగరత్నమ్మపై కందుకూరి వీరేశలింగం కక్ష కట్టాడనీ ఒక వర్గం వాదిస్తే, మరో వర్గం కందుకూరిని సమర్థించింది. 

ఈ విమర్శలు, సమర్థనల్లో ఒక ప్రధానాంశం కులం. కులం కారణంగానే కందుకూరి, ముద్దుపళని, బెంగళూరు నాగరత్నమ్మలకు ఖండనమండనలు లభించాయి.

బెంగుళూరు నాగరత్నమ్మ ముద్దుపళనిని పైకెత్తడానికీ, కందుకూరి వంటివారిని విమర్శించడానికీ కారణం ఆమె కులం కూడా. అయితే ఇటీవల కొంతమంది ప్రతిపాదిస్తున్నట్లుగా నాగరత్నమ్మ అభిప్రాయాలలో అభ్యుదయ భావాలుగాని, ఆధునిక స్త్రీవాద ధోరణులు గానీ ఉన్నాయనడానికి ఆధారాలు లేవు. ఆమెకు వీటిని ఆరోపిస్తున్నారే తప్ప అవి ఆమె లక్షణాలు కాదు. ఎందరో కవయిత్రులుండగా ఆమెకు ముద్దపళని మీదే అభిమానమెందుకు? అని ప్రశ్నించుకున్నప్పుడు కవయిత్రిగా ముద్దుపళని విశిష్టతతో పాటు కులం కూడా ఒక కారణమేనన్నది ఆమె ఏమాత్రమూ దాచుకోని బహిరంగ విషయం.

వీరేశలింగం ముద్దుపళనిని విమర్శించడానికి రాధికా సాంత్వనం లోని శృంగారఘట్టాలే ప్రధాన కారణం. కులం కూడా కారణం కావడానికి అవకాశం పూర్తిగా ఉంది. వేశ్యావృత్తి ప్రబలంగా ఉండి వేశ్యావ్యతిరేక ఉద్యమం సాగుతున్న కాలంలో ఆ ఉద్యమాన్ని సమర్థించే వ్యక్తిగా వీరేశలింగానికి ముద్దుపళని పట్లగాని, నాగరత్నమ్మ పట్లగాని వ్యతిరేకత అసహజమేమీ కాదు.

అసలు ఈ కులాల విషయం పక్కన పెడితే చర్చనీయాంశం రాధికాసాంత్వనం – అందులోని శృంగార వర్ణనలు.

వీరేశలింగం ఒక్కడే ఇది అసభ్యశృంగారం, సమాజాన్ని చెడగొడుతుంది అన్న అభిప్రాయం కలిగి ఉంటే ఆయన్ని వేరుగా చూడవచ్చు. కాని సమాజంలో ఇటువంటి అభిప్రాయం ఎంతమందికో ఉంది. ప్రబంధాల్లోని శృంగార వర్ణనల విషయంలోనూ ముఖ్యంగా దక్షిణాంధ్రయుగం నాటి మోహశృంగార ప్రబంధాల విషయంలోనూ చాలామందికి ఈ అభిప్రాయం ఉంది. అంతెందుకు ఆధునికకాలంలోనే చలం రచనల విషయంపట్ల ఎందరికో ఈ అభిప్రాయం ఉందన్న విషయం తెలియంది కాదు. రచయితలైనా, రచయిత్రులైనా చేసిన శృంగార రచనల పట్ల చాలామందికి దురభిప్రాయం, అభ్యంతరం ఉండవచ్చు.

ఈ శృంగారం భార్యాభర్తల మధ్య అయితే ఒకటి, వివాహ వ్యవస్థ వెలుపల అయితే మరొకటి.

కావ్యంలో ఉండవలసిన అష్టాదశ వర్ణనల్లో రతి వర్ణన ఒకటయినప్పుడు అలా కావ్య లక్షణం చెప్పిన వారినే తప్పుపట్ట వలసి ఉంటుంది కదా.

ఇక్కడ వివాదాన్ని సృష్టించేది మన నైతిక దృష్టి. శృంగారం రసరాజమంటారు. ప్రపంచవ్యాప్తంగా సర్వ సమాజాల్లోనూ, సర్వకళా రూపాల్లోనూ అది అసంఖ్యాక రూపాలుగా వ్యక్తమవుతూనే ఉంది. మనిషి కళాత్మక అభివ్యక్తిలో ఇది సింహభాగాన్ని ఆక్రమిస్తూ ఉంది.

నైతిక దృష్టి ఆయా సమాజాలకు విశిష్టమైంది. దాని స్వరూపం దేశకాల పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. మనం పుట్టి పెరిగిన సమాజపు విలువల చట్రంలో నుంచి ప్రపంచాన్ని చూస్తాం.  అది కూడా ఒకేరీతిలో ఉండదు. అంచెలంచెల్లో తేడాలుంటాయి. వ్యక్తి రూపుదిద్దుకున్న తీరులో, కుటుంబస్థాయిలో, స్థానిక సమాజస్థాయిలో అలా అలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిల దాకా తేడాలుంటాయి.

ఒక చిత్రాన్ని చూడగానే ఛీ అని కళ్లు మూసుకొనే వాడి నుండి ఆహా ఎంత రమణీయం అని పారవశ్యం చెందే వాడి వరకు ఎన్నో అంతరువులుంటాయి. ఒకరిలో అది ఎటువంటి భావాలూ కలిగించక పోవచ్చు కూడా.

నిజానికి ఈ నైతికతను నిర్ద్వంద్వంగా ఇది అని నిర్వచించడం అసాధ్యం. ఇది కాదు, ఇది కాదు, ఇది అవును, ఇది అవును అని ప్రతి అంశం గురించీ మన మానసిక ధోరణిలో నిర్ణయానికి వచ్చినప్పటికీ, నిర్ణయానికి రాలేని సందర్భాలు అసంఖ్యాకంగా ఉంటాయి.

ప్రాచీన గ్రీకు, రోమన్ ఉన్నత వర్గాలలో స్వలింగ సంపర్కం సాధారణం. అనేక ప్రాంతాల్లో, జాతుల్లో మొన్నమొన్నటి వరకు అక్రమంగా భావించే ఈ వ్యవహారం ఇప్పుడు అనేక దేశాల్లో అంగీకారం పొంది స్వలింగ వివాహాలు చట్టబద్ధమవుతున్న సందర్భం మనముందుంది.

అట్లాగే ప్రపంచమంతటా లెక్కలేనన్ని కామశాస్త్ర గ్రంథాలున్నాయి. మనం ఋషిగా చెప్పుకుంటున్న వాత్స్యాయనుడి కామసూత్రాలలో వేశ్యా సంబంధమైన శృంగార చర్చ కూడా ఉంది.

అందువల్ల రాధికాసాంత్వనంలోని శృంగారం గురించిన నైతిక చర్చ వ్యక్తిగత అభిరుచులకు వదిలిపెట్టి కావ్యసౌందర్యాన్ని ఆస్వాదించడానికి పూనుకోవడం మంచిది. నైతికమైన తీర్పుతో పనిలేకుండానే దాదాపుగా తెలుగు సాహిత్య చరిత్రలన్నిటిలోనూ ముద్దుపళనికీ, ఆమె ప్రబంధానికి తగిన స్థానమే లభించింది.

దాదాపు ముప్ఫయ్యేళ్ల కిందట ‘ముద్దుపళని కావ్యం మరుగున పడిందెందుకు?’ అన్న శీర్షికతో ఇటువంటి కారణాలనే వెలిబుచ్చారు కె. లలిత (ఉదయం, 1990, జూన్ 17, 24 తేదీలు). ఆమె రాసిన వ్యాసానికి డా. ఎ. ఉషాదేవిగారితో కలిసి నేను రాసిన స్పందన (ఉదయం 1990, జులై 29) మరికొంత వెలుగును ప్రసరిస్తుంది. ఈ ప్రశ్నలు అప్పుడప్పుడు మళ్లీ మళ్లీ తలెత్తుతూనే ఉంటాయి.

శ్రమ నిష్ఫలమైన ‘అన్వేష’ణ

‘ముద్దుపళని కావ్యం మరుగున పడిందెందుకు?’ అన్న శీర్షికన జూన్ 17, 24 తేదీల్లో ‘ఉదయం’ లో ప్రచురితమైన వ్యాసం, అన్వేషి గురించిన వివరాలు చూశాం. స్త్రీవాద దృక్పథంలో భారతీయ సాహిత్యాన్ని అధ్యయనం చేసే ప్రయత్నాన్నీ, వాటిని ప్రపంచానికి పరిచయంచేసే ప్రయత్నాన్నీ హర్షిస్తున్నాం. ఈ వ్యాసంలో కె. లలితగారు ముద్దుపళని గురించి తెలుసుకోవడానికి తామెంత కష్టపడిందీ వివరించారు. వారు రాసిన విషయాలను బట్టి ముద్దుపళని కావ్యాన్ని సంపాదించడంలో, కావ్యంగురించి, కవయిత్రి గురించి వివరాలు సేకరించడానికి విశేషంగా కాలాన్ని, డబ్బునీ వెచ్చించినట్లు తోస్తుంది. వివిధ ప్రాంతాలలో పర్యటించడమూ, సమాచారాన్ని సేకరించడమూ, శ్రమతో కూడిన పనే. ఈ పనిలో మూడు సంవత్సరాలకాలాన్ని వినియోగించినట్లు వారు చెప్పుకున్నారు. తెలుగులో స్త్రీల రచనల్ని గురించి చాలా మందితో చర్చించినట్టూ, అందువల్ల లభించిన సమాచారం చాలా తక్కువేనని కూడా చెప్పారు. అయితే వీరుచేసిన కృషి సరైన పద్ధతిలో సాగలేదేమోనని వారు రాసిన విషయాలను బట్టి అనుమానం కలుగుతుంది.

‘రాధికా సాంత్వనము’ ప్రతి దొరకడమే అసాధ్యంగా కనిపించిందన్నారు. కాని ఈ విషయంలో వారి ప్రయత్నాన్నైనా శంకించవలసి వస్తుంది. లేకపోతే తెలుగుసాహిత్యంలోగాని, సాహిత్య గ్రంథాల సంపాదనలోగాని వారికి అనుభవంలేదని అయినా అనుకోవాలి. మేం ఒక్కరోజులో మూడు విభిన్న ప్రచురణలను సంపాదించగలిగాం. బెంగుళూరి నాగరత్నము పీఠికతో వెలువడ్డ వావిళ్ళవారి ప్రతి, ఎమెస్కో ప్రచురణ ప్రతులు హైదరాబాద్ నగరంలో సులువుగా లభిస్తాయి. గ్రంథాలయాలనుగాని, సాహిత్యాభిమానుల వ్యక్తిగత గ్రంథాలయాలను గాని శోధిస్తే ఒక్క హైదరాబాద్ నగరంలోనే వంద ప్రతులు సంపాదించడం కష్టంకాదు.

ఇన్ని శ్రమలకోర్చి వారు చేసిందేమిటి? వావిళ్ళ ప్రచురణలో బెంగుళూరు నాగరత్నము పీఠిక, గ్రంథంచివర గ్రంథం మీద నిషేధాన్ని తొలిగించడానికి వావిళ్ళ వేంకటేశ్వర శాస్త్రిగారు చేసిన కృషిని గురించి త్రిలింగ నుండి ఉద్ధరించిన వ్యాసం, శ్రీ వాత్సవ (యండమూరి సత్యనారాయణరావు) గారి ‘శారదాధ్వజము’ ల నుండి ఎత్తి రాయడం. పై మూడు రచనలలో చెప్పిన విషయాలకంటే అధికంగా లలితగారు చెప్పిన విషయాలేవీ లేకపోగా వాటినికూడా సమగ్రంగా వినియోగించుకోలేకపోయారు. ‘రాధికాసాంత్వనము’ ఆరోజుల్లో చాలా ప్రచారం ఉన్న గ్రంథం. అందుకే 1911లోనే నిషేధానికి గురి అయినా 1927 దాకా కూడా దాని ప్రచారాన్ని బ్రిటీషు ప్రభుత్వం అరికట్టలేకపోయిందని వావిళ్ళవారి ప్రచురణ గ్రంథాంత అవతారికలోనే ఉంది. వీరేశలింగం పంతులుగారి వంటి విద్వాంసులు నిరసించడంవల్ల దీని ప్రాచుర్యానికేమీ భంగం వాటిల్లలేదు. Secondary sources ను కూడా క్షుణ్ణంగా పరిశీలించలేదనడానికీ ఈ వ్యాసంలో బోలెడన్ని నిదర్శనాలు కనిపిస్తాయి. అటువంటి పరిశీలన చేయకపోగా “ఇంత చరిత్ర నడిచిన పుస్తకం గురించి 80 లలో సాహిత్యాభిలాషులైన వారెవరితో మాట్లాడినా, ఏ సాహిత్య చరిత్రల్ని తిరగేసినా సమాచారం దొరక్కపోవడం అన్నింటికంటే విచిత్రమైన విషయం’’ అనడం విడ్డూరం. ఎందుకంటే తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథాలన్నింటిలోనూ, ముఖ్యంగా దక్షిణాంధ్ర వాఙ్మయ చరిత్రల్లోనూ ముద్దుపళని గురించి, రాధికా సాంత్వనం గురించి సమాచారం లేకపోవడమన్న ప్రశ్న తలెత్తదు. ఆరుద్ర ‘సమగ్రాంధ్ర సాహిత్యం 12’లో (pp168-176), ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ‘ఆంధ్ర కవయిత్రులు’ లో (pp67-74), కొక్కొండ సత్యవతి ‘తంజాపురాంధ్ర సాహిత్య చరిత్ర’లో (pp228-265), శ్రీవాత్సవ ‘శారదాధ్వజము’ లో (pp227-257), శిష్టా లక్ష్మీకాంతశాస్త్రి ‘తంజావూరు తెలుగుకవులు’లో (pp 289-332; 398-413), నిడుదవోలు వేంకటరావు ‘దక్షిణ దేశీయాంధ్ర వాఙ్మయము’ లో (pp261-272) ముద్దుపళని గురించి తగినంత సమాచారం దొరుకుతుంది. అన్ని సాహిత్య చరిత్ర గ్రంథాలలోనూ వాటి వాటి పరిమాణాన్ని ఆయా కవులకు ఇవ్వగలిగిన ప్రాధాన్యంలో ముద్దుపళనికెవ్వరూ అన్యాయం చేయలేదు. పైన పేర్కొన్న రచనలు కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ముద్దుపళని గురించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత రాశారో అదే ఒక పెద్ద వ్యాసమవుతుంది. దీన్నిబట్టి లలితగారు చెప్పిన ‘సాహిత్యాభిలాషుల’ సాహిత్యాభిలాషను ఊహించుకోవచ్చు.

లలితగారు తమకు దొరికిన ప్రతులను గానీ వాటి పీఠికల్నిగానీ శ్రీవాత్సవగారి శారదా ధ్వజాన్ని గానీ సరిగా చదివినట్లు లేరు. చదివి వుంటే ఈ వ్యాసంలో “ఇళాదేవి రాధకు మేనకోడలు” అనిగాని, “ఆ ఇళాదేవికి శ్రీ కృష్ణుడికి వివాహం జరిపిస్తుంది రాధ” అనిగాని, తిరుపతి వేంకటకవుల రచన ‘పాణిగ్రహీత’ అనిగాని రాసి ఉండేవారు కారు. 

ఇళ కృష్ణునికి మేనమరదలు, యశోద సోదరుడు కుంభకుని కూతురు. రాధ నందుడి చెల్లెలు. “నందునికన్న జిన్న వారిధరవేణి రాధికా కీరవాణి” (1-51); కృష్ణుడికి మేనత్త. రాధకు కృష్ణుడు మేనల్లుడు, ఇళ మేనకోడలు ఎట్లా అవుతారు? ఇళ కూతురవుతుంది. రాధ పెంచింది కాబట్టి, బ్రౌన్ “adopted daughter of Radha” అన్నాడు. పైగా ముద్దుపళనీ, ప్రతాపసింహులకు సంబంధించి తంజావూరులో ఇటువంటి కథే ప్రచారంలో ఉందనికూడా చెప్పాడు.

రాధ ఇళకీ కృష్ణుడికీ పెళ్ళిచేసిందనడానికి ఈ కావ్యంలో ఎక్కడా ఆధారంలేదు. కథ మొదలయ్యేటప్పటికి ఇళ కృష్ణుడి ఇల్లాలే. ఇంకా ఈడేరలేదు.

“రమణ బాల్గారు చెక్కుటద్దముల తోడ
మేల్మి గనుపట్టు చిన్నారి మేనితోడ 
దేజరిల్లును బేరిళాదేవి యనగ
రాజగోపాలు పట్టంపు రాణి యగుచు”

తిరుపతి వేంకటకవుల రచన ‘పాణిగృహీత’ పాణిగ్రహీత కాదు. అర్థం పూర్తిగా మారిపోయింది, పాణిగృహీత అంటే వేశ్య. ఈ పేరు విషయంలోనే పెద్ద విమర్శ వచ్చింది. తిరుపతి వేంకట కవులు సమాధానం చెప్పుకున్నారు (ఆంధ్రభారతి, మార్చి, ఏప్రిల్ 1913) అట్లాగే మూల రచన చదవకుండా వాళ్ళూ వీళ్ళూ ఉదాహరించిన వాక్యాల మీద ఆధారపడితే చాలా ప్రమాదాలు దొర్లుతాయి. వీరేశలింగం పంతులుగారు ముద్దుపళని స్త్రీకావడంచేతగాని, వేశ్యకావటంచేతగాని విమర్శించలేదు. ఇటువంటి రచన ఎవరుచేసినా ఆయన దృష్టిలో తప్పే. శేషము వేంకటపతి తారాశశాంకాన్ని గురించి “చక్కెర మెత్తని విషమువలె నీతిమాలిన ఈ కథ మనోహరములయిన తేటమాటలతో నింపుగా చెప్పబడినందున, అనేకులయిన యౌవన పురుషుల నాకర్షించి పాడుచేయుచున్నది” (ఆంధ్రకవుల చరిత్ర 3 భా. పు 23) అన్నారు. లోపం ఉంటే ఆయన నైతిక దృష్టిలోనే తప్ప స్త్రీ పురుష పక్షపాతం వల్లకాదు.

నిడుదవోలు వేంకటరావుగారి పుస్తకాన్ని, ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యాన్నీ ఎమెస్కో ప్రతి పీఠికనూ చదివి వుంటే లలితగారికి రాధికా సాంత్వనం ముద్రితాముద్రిత ప్రతుల వివరాలన్నీ తెలిసి ఉండేవి.

ఇక ‘ముద్దుపళని కావ్యం ఎందుకు మరుగున పడింది?’ అని ప్రశ్నించుకొని లలితగారు సమాధానం చెప్పబోయారు. కాని తమ వ్యాసంలో ఈ ప్రశ్నకు ఎక్కడా సమాధానం చెప్పలేక పోయారు. అందుక్కారణం ముద్దుపళని కావ్యం ఎప్పుడూ మరుగున పడకపోవడమే. వీరేశలింగం పంతులుగారు వంటి సంస్కర్తల నిరాకరణంగాని, ప్రభుత్వ నిషేధంగాని రాధికా సాంత్వను, శశాంక విజయం, అహల్యా సంక్రందనం వంటి గ్రంథాల ప్రచారాన్ని కుంటుపరచలేదు. ఆ విషయాన్ని నిషేధకాలంలోనే ప్రతులు ప్రచారంలో ఉండడమూ, అనేకసార్లు ముద్రితమవడమూ నిరూపిస్తుంది. ముద్దుపళని కవితాశక్తికి వీరేశలింగం పంతులుగారినుండి నేటిదాకా విమర్శకులెందరో నివాళులర్పించారు. ఆంధ్ర వాఙ్మయ చరిత్రలో ముద్దుపళని స్థానానికి “తెనుగు కవితా వాహిని నన్నయ భారత కథాకాశమున మందాకినియై ప్రవహించినది. అది బుధవగాహన యోగ్యము. తిక్కన భారతంపు హిమాచలాగ్రములందు చేరి కవిసిద్ధులకు సంసేవన యోగ్యమయినది. తంజావూరు కవుల కావ్యకలాపములలో మలుపుతిరిగి, పళని రాధికా సాంత్వనమునందు మైదాన ప్రదేశమున ముర్మురారావములతో మురుపులు కురిపించినది. సకల మానవులకు గమ్యమాన మయినది. రసానుభూతికి ప్రథమ ఘట్టమయినది.” (తంజావూరు కవులు, పు.312) అన్న లక్ష్మీకాంత శాస్త్రిగారి వాక్యాలు అద్దంపడతాయి.

ఇక స్త్రీవాదానికి సంబంధించి. రాధికాసాంత్వనం ఒకమంచి శృంగార కావ్యం అనడంలో విప్రతిపత్తిలేదు. స్త్రీ రాయడంవల్ల మాత్రమే వచ్చే ప్రత్యేకత ఏదైనా ఉంటే అది రాధికాసాంత్వనంలో ఏమాత్రం ఉందో చెప్పే ప్రయత్నం లలితగారు చేయలేదు. “ఈ గ్రంథం అప్పటి కాలానికి అయినా కాకపోయినా, ఇప్పటి కాలానికి విప్లవకరమైనది అని చెప్పుకోవచ్చు. అప్పటి కాలంలో స్త్రీలైంగిక అనుభవంలో ఎలా చొరవతీసుకోవాలో, సుకుమారురాలైన స్త్రీ పట్ల పరుషుడు ఏవిధంగా సున్నితంగా ప్రవర్తించాలో, ఇళకు, కృష్ణుడికి చేసిన బోధల్లో కనిపిస్తుంది. లైంగిక, శృంగార విషయాల్లో స్త్రీల అనుభూతి, సంతృప్తి గురించి రాసిన కవులు, కవయిత్రులూ మనకు కనిపించరు” అన్నారు లలితగారు. ఆమెకు తెలుగు సాహిత్యంతో సరిగా పరిచయం లేకపోవటంవల్ల అన్నమాటలు. తారాశశాంక, అహల్యా సంక్రందనాదుల్లో స్త్రీ చొరవనూ, సంతృప్తినీ వర్ణించే ఘట్టాలున్నాయి. పైగా అవి ఆ అనుభవంకోసం వివాహబంధాన్ని వెనక్కునెట్టిన సందర్భాలు. అట్లాగే నాయికను పడకగదిలోకి పంపించే సందర్భాలలో నాయికకూ, నాయకుడికీ కూడా మొదటిరాత్రి శృంగారం విషయంలో చెలుల బోధనలు ప్రబంధాలలో కనిపిస్తాయి. రాధికా సాంత్వనంలో ప్రియుని మొత్తంగా స్వంతం చేసుకోవడం (Possessiveness) ప్రధాన లక్షణం. మరొకరితో పంచుకోవడం ఎంత దుర్భరమో పళని వర్ణించింది. అంతే తప్ప పితృసామ్య వ్యవస్థను ధిక్కరించే, నిరసించే గొప్ప స్త్రీవాద భావాలేవీ ఇందులో లేవు. 

కూచిమంచి తిమ్మకవి ‘ నీలాసుందరీ పరిణయం’ లోని

“పుడమిలోపల మగవాడు పూని తనకు
గోర్కియగు కల్వకంటి గైకొనుచు నుండు
హహ! తమమది కిచ్చయౌ నట్లు మెలగ
గన్నియలకేమిటికి బల్మి గలుగదయ్యె”?

సముఖం వెంకటకృష్ణప్ప ‘ అహల్యా సంక్రందనం’ లోని

“ప్రమదారత్న మహల్యయింద్రుని మదిన్ భావించు, దోడ్తోన ధ
ర్మము గాదంచు దలంచు, నెంచిన గతిన్ రానిచ్చునాదైవ! మం
చు మదిన్ వేసరు, నిచ్చవచ్చు విభుతో సాంపొందు టిల్లాండ్రకే
లమరుంబొమ్మను, నాడు పుట్టువున నాహా! పుట్టనౌనా? యనున్” 2-109. 

వంటి పురుషులు రాసిన పద్యాలే స్త్రీవాద భావాలకు దగ్గరగా ఉన్నాయి. ఆనాడు ముద్దుపళనికి పురుషాధిక్యవ్యవస్థ మీద కాని, సమకాలీన సమాజంమీదకాని ఫిర్యాదుల్లేవు. నాటి సమాజంలో వేశ్యగా పుట్టినా బాగుండేది అనుకున్న కవిపుంగవులెందరో ఉన్నారు. నాటి దక్షిణాంధ్ర యుగ సమాజాన్ని గురించి ‘తెలుగు సాహిత్యం మరోచూపు’లో నాయని కోటీశ్వరి గారి వ్యాసాన్ని చూడవచ్చు.

“తెలుగు సాహిత్యంలోని కొన్ని గ్రంథాలని అశ్లీల అసభ్య విషయాలుగా చిత్రీకరించి బ్రిటీషు ప్రభుత్వం నిషేధించటానికి ఆ గ్రంథాలలో వస్తువుమాత్రమే కారణం కాదని నిరూపించటానికి ‘రాధికా సాంత్వనం’ కన్న గొప్ప నిదర్శనమేముంటుంది? అందుకే ఇటువంటి గ్రంథం చరిత్రపుటల అందులకు నెట్టివేయబడింది. బెంగుళూరు నాగరత్నమ్మ భగీరథ ప్రయత్నం కూడా ఇంతవరకు చరిత్రకందని స్త్రీవాద దృక్పథ విమర్శకుదాహరణ అనటంలో సందేహంలేదు” అన్నారు లలితగారు. రాధికా సాంత్వనంతో పాటు హంసవింశతి, తారాశశాంక విజయము, బిల్హణీయం, వైజయంతీ విలాసము, క్రీడాభిరామము మొదలైన పుస్తకాలను కూడా బ్రిటీషు ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధానికి ఈ పుస్తకాలలో కనిపించే సమాన ధర్మమైన వస్తువుతప్ప మరో కారణాన్ని ఊహించడం కష్టం. గోటేటి కనకరాజు వంటి వ్యక్తుల కారణం ఉండనే ఉంది. రాధికా సాంత్వనం కేవలం స్త్రీరచన, వేశ్యారచన కావడంవల్ల నిషేధించారనడానికి ఆధారాలేవీ లేవు. పైగా మన పుస్తకాలనే కాదు ఇంగ్లాండులో కూడా డి.హెచ్. లారెన్స్ వంటి రచయితల గ్రంథాలను కూడా నిషేధించారు. అయినా అవగాహనరహితంగా కొద్దిమంది మోరలిస్టిక్ వ్యూస్ దృష్ట్యా సాహిత్య రచనల్ని నిషేధించడంవల్ల సాహిత్య ప్రపంచానికి గొప్ప హాని జరుగుతుందనడంలో సందేహం లేదు. సాహిత్యేతర కారణాలవల్ల సాహిత్యం నిషేధాలకు లోనుకావడం నేడుకూడా చూస్తున్నాం. అయితే రాధికా సాంత్వనం విషయంలో బెంగుళూరి నాగరత్నము కృషి మంచి ప్రతిని అందించడమూ, నైతిక దృష్టిని తిరస్కరించడమూలో ఉంది. అంతే తప్ప మొదటిసారిగా గ్రంథాన్ని పరిచయం చేయడంగాని, అలభ్యమైన గ్రంథాన్ని లభ్యం చేయడంగాని ఆమె చేయలేదు. ఈ గ్రంథ నిషేధానికి వ్యతిరేకంగా ఆమె పోరాడినట్లు ఎక్కడా లేదు. అందువల్ల ఆమెది భగీరథ ప్రయత్నమూ కాదు. ఇంతవరకు చరిత్రకందని స్త్రీవాద దృక్పథ విమర్శకుదాహరణమూ కాదు.

స్త్రీవాద దృక్పథంతో సాహిత్య విమర్శ ఇటీవలిది. భాషా ప్రయోగం దగ్గరనుండి భావాల దాకా స్త్రీ ప్రత్యేకతలను గుర్తించడానికి ప్రయత్నం జరుగుతున్నది. మొల్ల, రంగాజమ్మ, ముద్దుపళని, తాళ్ళపాక తిమ్మక్క, తరిగొండ వెంగమాంబ మొదలైన కవయిత్రులందరి రచనల్నీ ఈ దృక్పథంతో పరిశీలిస్తే విలువయిన విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేసి ఉంటే లలితగారు తమ వ్యాసం చివర వేసుకున్న ప్రశ్నలకు కొంతైనా సమాధానాలు చెప్పగలిగి ఉండేవారు. అందరికీ తెలిసిన విషయాలనే చర్విత చర్వణ చేసి ఉండేవారుకాదు. ఏ సాహిత్య చరిత్రల్ని తిరగేసినా సమాచారం దొరకలేదనే వారుకాదు. నిజంగా తిరగేసి ఉండేవారు. స్త్రీవాదాన్ని చివరికి కేవలం నినాదంగా మారిస్తే అదీ తక్కిన నినాదాల మాదిరే విలువను పోగొట్టుకుంటుంది. అట్లా జరగకుండా ఉండాలంటే తాముచేసే కృషిలో సీరియస్‌నెస్ అవసరం. ఒక మంచి ఆదర్శంతో పనిచేస్తున్నారు కాబట్టే లలితగారి వ్యాసం గురించి ఇంతగా రాయవలసి వచ్చింది.

డి చంద్ర శేఖర రెడ్డి

ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో చదువుకున్నారు. అదే కళాశాలలో లెక్చరర్ గా, ప్రిన్సిపాల్‌గా పనిచేసారు. తెలుగు కావ్య పీఠికలపై పరిశోధన చేసారు. ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించి పలు గ్రంథాల అనువాదాలలో పాలుపంచుకున్నారు. ప్రస్తుతం ఎమెస్కో ప్రచురణ సంస్థ సంపాదకులుగా ఉన్నారు.

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.