మలుపు

 

ఒక మలుపు తిరుగుతున్నాం.

సందేహం లేదు. పెద్ద మలుపు.

ఎంత పెద్ద మలుపంటే. తిరిగాక ఏముందో ఇప్పుడు ఇసుమంతైనా కనిపించదు.

అన్నీ వూహలు. వుపన్యాసాలు. కాగితం మీది లెక్కలు. విభిన్న సమీకరణాలు. కాగితానికి అంటిన మట్టి విదిలిస్తే, వ్రాత మరో అర్థమిస్తుంది.

తిరగబోయే మలుపు ఎడమకా, కుడికా?

లెఫ్ట్ రైట్! కదం తొక్కుదాం సరే, మలుపు లెఫ్టుకా రైటుకా?

కుడి ఎడమ అనే పదాల అర్థం… మునుపూ ఇపుడూ ఒకటేనా? కాదేమో? గుర్తుపట్టరానంతగా పదార్థాల సాంకర్యం జరిగి పోయిందేమో.

మొన్న భారత పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలప్పుడు కాస్త సందేహం సందేహంగానే ఒక ప్రశ్న వినిపించింది. చాల మంది దాన్ని పట్టించుకోలేదు, లేదా పట్టించుకోనట్టు నటించారు.

ఎన్నికల్లో… బహుజన కులస్థుడు నరేంద్ర మోదీ ఓడిపోవాలని, బ్రాహ్మణుడు రాహుల్ గాంధీ గెలవాలని కోరుకుందామా… అని ప్రశ్న.

మోదీ ఓటమిని, రాహుల్ గెలుపును మనం కోరుకోవాలి, కాని… దళితబహుజన రాజ్యాధికారమ’నే నినాదం ప్రకారం మోదీ గెలుపే మన కోరిక కావాలి కదా, ఇప్పుడెలా అనేది ప్రశ్న లోని విచికిత్స.

మన వైఖరి ఎప్పుడూ ఇస్యూ బేస్డ్ గా వుండాలని కుల, మతాలూ, ఇతర ప్రకటిత నిబద్ధతల ప్రాతిపదికన కాదని ఆ ప్రశ్నలోని కవిహృదయం.

దళిత బహుజన అస్తిత్వానికి కూడా తల్లివేరు మతమే. దాని బలహీనత ఇప్పుడు స్పష్టం.

మతవాదం కత్తి ఆపిల్ బుగ్గల కశ్మీరాన్ని కోసి పంపకాలేసుకుంటూ వుంటే, ఒక పట్టపగటి హత్యను హత్య అని కూడా అనలేక, వీర చర్య అని పోటీలు పడి సమర్థిస్తున్న దళిత, దళితేతర రాజకీయాలలోని బలహీనతను మనమిప్పుడు ప్రాక్టికల్ గా చూస్తున్నాం.

ఇంతా చేసి, పార్లమెంటులో మాట్లాడని మల్లెమొగ్గ రాహుల్ నుంచి మాట్లాడిన విజయసాయి రెడ్డి వరకు… వీళ్లెవరినీ రాజకీయంగా తప్పు పట్టడం కుదరదు. బాబ్బాబు జర ఆత్మహత్య చేసుకోండి అని వాళ్లెవరినీ అడగలేం. తాము రాజకీయంగా నిలబడ్డానికి ఏం చేయాలో అదే వాళ్లు చేశారు?  

***

చెదరంగానికి మన రాష్ట్ర రాజకీయం మంచి ఉదాహరణ.

ఆంధ్రప్రదేశ్ లో వయ్యెస్సార్సీపీ, టీడీపీ ల వైరమే ప్రధాన రాజకీయం.

వీళ్లిద్దరూ పార్లమెంటులో కశ్మీర్ మీద కేంద్రం వుక్కుపాదాన్ని పోటీలు పడి పొగిడారు.

ఎందుకలా? అది వాళ్ల విశ్వాసమా? మోస్ట్ ప్రాబబ్లీ, కాదు.

ఇది తప్పుడు పని అని, తమ ప్రయోజనాలకు విరుద్ధమని వాళ్లకు తెలుసు.

అది ఎందుకు తప్పుడు పని? వాళ్ల ప్రయోజనాలకు ఎందుకు విరుద్ధం?

మోదీ మాతృసంస్థ ఆరెసెస్’. ఆ సంస్థ ప్రాథమికంగా యూనిటరీ రాజ్యాంగానికి నిబద్ధం. ఫెడరలిజానికి విరుద్ధం. రాష్ట్రాల హక్కులను హరించేంతగా కేంద్రం బలంగా వుండాలనేది యూనిటరీ రాజ్యాంగం. వైవిధ్యాన్ని బలి చేసేంత ఏకత అరెసెస్ ధ్యేయం.

చిన్న రాష్ట్రాలు… వీలైతే జిల్లాల మొయిని చిన్ని చిన్ని రాష్ట్రాలు వారి ప్రణాళిక.

దాని ప్రకారం… రాష్ట్రాలనేవి జిల్లాలూ తాలూకాల్లా పరిపాలనా విభాగాలు మాత్రమే. సొంత వ్యక్తిత్వం కలిగిన సాంస్కృతిక, రాజకీయార్థిక శరీరాలుకాదు.

తెలుగు వాళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోడానికి బిజేపీ ఇచ్చిన మద్దతు తెలంగాణ జనం మీద మక్కువ వల్ల కాదు, ఫెడరిలిజానికి గోరీ కట్టే చిన్నరాష్ట్రాల సిద్దాంతమే దానికి కారణం.

దేశం ఆ కొసన ఇపుడది వాస్తవమయ్యింది. ఇప్పుడు కశ్మీర్. రేపెవరి వొంతో… ఎవరి వూహల్లో వారు తేలిపోవచ్చు.

ఇంత ఆలోచన మన రాష్ట్రం లోని రెండు పార్టీలకు వుండకపోవచ్చు గాని, బిజేపీ రాజకీయం ఇద్దరికీ తెలుసు.

రాష్ట్రంలో… వయ్యెస్సార్సీపీకి టీడీపీ ఒక సవాలు కాదు. జగన్ సారు భయపడాల్సిందేమీ లేదు. చంద్రబాబు ఇప్పడిప్పుడే కోలుకోలేనంతగా జనం నుంచి జెల్లకాయ తినేశాడు. బాబు పాత భాగోతాల్ని తవ్వి తలకెత్తడంలో, పేదలూ మధ్యతరగతి ప్రజల మన్నన పొందే పనులు చేపట్టడంలో జగన్ ప్రభుత్వం సాహసికంగా, సమర్థంగా దూసుకు పోతున్నది. దీన్ని ఎదుర్కొనడం అబద్దాలు వినా ఆయుధాల్లేని బాబుతో అయ్యే పని కాదు.

కాని… కాని…

ఎట్టాగైనా పూర్వవైభవం సాధించాలనుకుంటున్న బాబుకు దొంగచేయూత ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో తన చోటును విస్తరించుకోవాలని, వీలైతే తానే అధికారం చేపట్టాలని బీజేపీ పొంచి చూస్తున్నది. మీడియాలో, సోషల్ మీడియాలో బీజేపీ బాకాలు ఆ దిశగా పని చేస్తున్నాయి కూడా.

కేంద్రం వయ్యెస్సార్సీపీ కి ఇబ్బందులు కల్పిస్తే, అది తనపై ప్రేమతో కాదనీ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, జగన్ ను దెబ్బ తీయడానికేననీ బాబుకు తెలుసు. అది ఆయన అనుభవసారం కూడా.

ఇంత తెలిసియుండియు, బహుశా తెలియడం వల్లనే… రెండు పార్టీలలో ఏదీ కేంద్రాన్ని కాదని స్వతంత్రించలేదు.

బలంవంతులం మాకేమని జగన్ పార్టీ స్వతంత్రించబోతే, కేంద్రం అలకను వుపయోగించుకుని జగన్ ను బద్నాం చేయడానికి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి బాబు సదా సిద్ధం. బాబు నుంచి ఈ గుణపాఠం ఎన్నడో నేర్చుకున్న జగనేయులు కేంద్రంతో దొరికిన దోస్తీని తమకు అనుకూలంగా, బాబుకు వ్యతిరేకంగా వుపయోగించడానికీ వెనుదీయరు.

విన్నారుగా… దొరికిన రొట్టెముక్క పంచుకోలేక పేచీపడి, కోతికి న్యాయాధికారమిస్తే, సమతూకం పేరిట కోతి కొంచెం కొంచెం రొట్టె తినేస్తుంటే చూస్తూ వుండిపోయిన రెండు పిల్లుల కథ.   

ఆంధ్ర రాష్ట్రంలో జనబలం వున్న ఇద్దరిలో ఎవరూ… ఇక్కడ చిరునామా కూడా లేని కేంద్ర పార్టీ మాటకు ఎదురుచెప్పే రిస్క్ తీసుకోరు.

ఫలితం: రెండు పార్టీలలో ఏదీ కశ్మీర్ మీద దమననీతిని ఎదిరించే సాహసం చేయ(లే)దు.

***

భౌగోళికంగా సామ్రాజ్యవాదుల పని పద్ధతి కూడా ఇదే.

సామ్రాజ్యవాదులు స్వతంత్ర దేశంలోని పెట్టుబడిదారుల మధ్య వైరాన్ని వుపయోగించుకుంటారు. సామ్రాజ్యవాదులకు ఎవరు ఎక్కువ లొంగితే ఆ దేశీ పెట్టుబడిదారుడికే ఎక్కువ లాభాలుంటాయి. దేశీ పెట్టుబడిదారులు బయటి సామ్రాజ్యవాదులకు సేవ చేయడంలో పోటీ పడతారు.

సామ్రాజ్యవాదులు అంతర్గత వైరుధ్యాలతో బలహీనపడే క్రమంలో, లేదా దేశంలో ప్రజాపోరాటాలు వుప్పొంగే క్రమంలో, యాపారం లాభాలకు బదులు నష్టాలు తెచ్చిపెట్టడం మొదలయ్యాకే… దేశీయ పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదాన్ని ‘ఎదిరించే’ నిజమైన దేశీ గుణం సంతరించుకుంటారు.

ప్రస్తుతం ఢిల్లీ పెత్తందారులది… బలంగా వున్నప్పుడు సామ్రాజ్యవాదులు అనుసరించే వ్యూహం. దరిమిలా: ఒక దేశంలోని వైరి కేపిటలిస్టుల వలె, రాష్ట్రం(ల)లోని వైరి పార్టీలు ఢిల్లీ పెత్తనానికి తలొంచడానికి పోటీ పడతున్నాయి. 

మునుపు ఢిల్లీలో పెత్తందారు కాంగ్రెస్. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా రాష్ట్రాలను నియంత్రించేది.

కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీలు ముందుకొచ్చి ప్రజల మన్ననలందడంతో ముందుగా రాష్ట్రాలలో దరిమిలా కేంద్రంలో కాంగ్రెస్ పట్టు సడలింది.

రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు శక్తినిచ్చిన ఇంధనం స్థానికత.

(స్థానికత అనే సోషల్ క్యాపిటల్ కు మొదట కొత్తగా పుట్టిన ఏకైక ప్రాంతీయ పార్టీ హోల్సేల్ హక్కు దారు.

మొదట్లో ఒక్కో రాష్ట్రంలో ఒకటే ప్రాంతీయ పార్టీ కావడం వల్ల దానికి పోటీ లేదు).

స్థానికత్వంతో అనివార్యంగా కలిసి వుండే మరో అంశం… ప్రాంతీయ వాదం, కులవాదం, మైనారిటీ వాదం.

ఇప్పుడు బీజేపీ నేతలు దీన్ని అధిగమించడానికి కొత్త సులువు కనిపెట్టారు.

ఇది రోగనిదానంలో సరూప పద్ధతి.

ప్రాంతీయ పార్టీలకు బలం స్థానిక కులాలు, చిన్న మతాలు. ఏ కులమూ, ఏ చిన్న మతమూ దేశవ్యాప్తం కాదు. ఇండియాలో చప్పన్నారు కులాలు కలిస్తే ఒక మతం, దాని పేరు… గతంలో వున్నా లేకున్నా, నేడు హైందవం. ఇది దేశవ్యాప్తం. అన్ని కులాల వాళ్ల దేవుడు రాముడు. వెరైటీ కావలిస్తే కృష్ణుడు, శివుడు కూడా ఓకే.

ప్రతిపక్ష చక్రధారులు కులాల్ని, చిన్నమతవాదాల్ని వొదలనంత కాలం… దేవుడిని కాదనలేరు. హిందూ కులపోళ్లెవరూ రాముడిని, కృష్ణుడిని, శివుడిని…. ఒక్క మాటలో హైందవాన్ని కాదనలేరు. కాదనేట్టయితే కులపోళ్లుగా మనలేరు.

నేను దళిత కులస్ఠుడిని, ‘బహుజన కులస్థు’డిని, ముస్లిమును అనుకునే వాళ్లైనా; నేను ఝాట్, రెడ్డి, కమ్మ, వెలమ అని రొమ్ములు విరుచుకునే వాళ్లైనా … ఎవరికి వాళ్లు చిన్న చిన్న స్ఠానిక సమూహాలే. మేము హిందువులం అనుకునే వారే దేశంలో చాల చాల ఎక్కువని ప్రత్యేకించి గణాంకాలు ఆరబోసి నిరూపించ నక్కర్లేదు. అదొక నిజం.

చాల మంది చూడడానికి నిరాకరిస్తున్న వాస్తవం .

మనుషుల వాంఛలు వాస్తవాల్ని మార్చగలిగితే లోకం మరోలా వుండేది. వాస్తవాల్ని వాస్తవాలుగా గుర్తించడం… మార్పు దిశగా తప్పనిసరి మొదటి చర్య.   

భారతదేశంలో కులవాదాలన్నీ కలిసినా… కులాల మూలమైన మతవాదాన్ని ఎదుర్కొనలేవు.

ఎన్నికలకు, రాజ్యాధికార సాధనకు కులాలు, కులాల సమూహాలు ప్రాతిపదిక అయినంత కాలం… రాష్ట్రాల్లో, జిల్లా పరిషత్తులలో, గ్రామ పంచాయతీలలో ఎక్కడ బలంగా వున్న కులాలది అక్కడ పెత్తనం కావొచ్చు. ఢిల్లీ పీఠమెక్కి దేశవ్యాప్తంగా పెత్తనం చేయగలిగేది మాత్రం… సో కాల్డ్ హిందూమతస్థులే.

కుల, మతాల ప్రాతిపదిక వున్నంత కాలం…. ఈ దేశంలో బీజీపీదే పైచేయి.

అంతవరకు…

కశ్మీర్లో తుపాకుల, బాయ్నెట్ల స్వైర విహారాన్ని చూస్తూ కూడా…

జగన్మోహన రెడ్డి వంటి స్థానిక నేత…

మాయావతి వంటి దళిత నాయకురాలు…

ఎన్టీవోడి పాలన తొలిరోజుల్లో ఫెడరిలిజానికి మద్దతుగా వ్యాసాల మీద వ్యాసాలు అచ్చోసిన ఛీఫ్ ఎడిటర్ రామోజీరావు…

ఎవరూ ఈ హీనచర్యను హీనచర్యగా ఖండించరు, ఘనకార్యమని కీర్తిస్తూనే వుంటారు.

ఇంపీరియలిజాన్ని తిరస్కరించకుండా దేశీయ బూర్జువా అనేది ఎలా ఒక మహా అబద్ధమో…

రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనాన్నీ, మొత్తంగా కుల, మతవాదాన్నీ ఎదిరించకుండా స్థానిక ప్రజల గురించి, అట్టడుగు కులాల్లోని శ్రమైక జీవుల గురించి మాట్లాడడం అంతే ‍పుక్కటి పురాణం.

మరి

ఇంపీరియలిజాన్ని, కేంద్రం పెత్తనాన్ని, కుల, మతవాదాన్ని ఎదిరించే మొనగాడెవరు?

ఆ మొనగాడు ఇవాల్టి ఏ ప్రాతీయ, కులవాద పార్టీ కాదని రుజువయ్యింది.

మరెవరు?

మార్క్సు నుంచి వర్గపోరు సిద్ధాంతాలు నేర్చుకున్న జనహృదయ నేతల కోసం దేశం ఎదురు చూస్తోంది.

దేశం ఒక్కటే కాదేమో, ప్రపంచమే అలాంటి నాయకుల కోసం ఎదురు చూస్తున్నదేమో.

అదిగో ఆ మలుపు తరువాత మనకు కనిపించేది ఒక కొత్త ఇంటర్నేషనల్ కావొచ్చు.

కల గందాం, సామ్రాజ్యవాదం నుంచి దేశాలకు స్వతంత్రం కోసం, కేంద్ర ప్రభుత్వాల నుంచి రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కోసం, పెట్టుబడిదారీ పాలకుల నుంచి ప్రజలకు విముక్తి కోసం,

నిజమైన ‘జనతా ప్రజాతంత్ర’ సమాజం కోసం…

12-8-2019 

హెచ్చార్కె

6 comments

 • నిజమైనజనత ప్రజాతంత్ర సమాజం కోసం, రాసిన, ఈ, సంపాదకీయం, బాగుంది, సర్!నిజమే, పెద్ద మలుపు కోసమే, ఎదురుచుస్తూ ఉన్నాము మనము అందరం!

 • బాగుంది. సామ్రాజ్యవాదుల నీడలో బతుకుతున్న ఎరుక కలిగించారు. పెట్టుబడిదారుల గొప్పదనాన్ని కూడా మా బాగా చెప్పారు. వాళ్ళని తయారుచేసిన ఎడమచేతి బొటనవేలిగాళ్ళ గురించి రాయాల్సింది సర్. మతవాదం చాలా గొప్ప పాత్ర పోషిస్తోంది కనుకనే ప్రజాస్వామ్యం ఆటబొమ్మైంది. పెట్టుబడి సంబంధాల్లోనే మోసపోతున్న వర్గ సమాజాన్ని పోరాటానికి సిద్దంచేయగల వాతావరణమే లేదు. బహుశా మీరు సూత్రీకరించిన దాని బట్టి రాదు కూడా. ఈ సూత్రీకరణ చట్రం లోకి మార్క్స్ ని చదువుకున్న నమ్ముకున్న పార్టీల్ని కలపాల్సింది మర్చిపోయారు మీరు. అందరూ అందరే !

  ప్రజలు కదూ పిచ్చోళ్ళు. ఇంకో విప్లవం రాసిపెట్టుంది. ఆ నమ్మకమే నడిపిస్తోంది. ఇప్పుడున్న పార్టీలవల్లనైతే కాదు, ఇంకో కొత్త రక్తం కావాలి.

  రాత బాగుంది ఎప్పటిలానే. భావంలో అసహనం కలిగింది. కోపం కూడా వచ్చింది.
  థ్యాంక్యూ

 • కశ్మీర్ విషయంలో ప్రాంతీయ, కులవాద పార్టీలు నిస్సహాయంగా మతవాద కేంద్రం దమన నీతిని శ్లాఘించాయి. ఫెడరలిజం అనే ప్రజాతంత్ర భావన అపహాస్యం పాలయ్యింది. కులవాదాలు మతవాదానికి సమాధానం కాకపోగా పోషకాలు అని రుజువయ్యింది. ఈ వైపరీత్యం మూల కారణాల్ని వివరించిన సంపాదకీయంలో ఒకరిద్దరు స్నేహితులు కుల,మతవాదాల అంశాన్నే చూడకపోవడం నాకు విచిత్రమనిపించింది.

  సామ్రాజ్యవాదులు ఒక దేశంలోని వైరి పెట్టుబడిదారులను ఎలా మ్యానిప్యులేట్ చేస్తారో అలాగే ఇప్పటి బీజేపీ కేంద్రం రాష్ట్రం(ల) లోని వైరి వర్గాల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నది. ఇదొక ప్రమాదకరమైన జారుడుబండ. నిలదొక్కుకుని, కులవాద, మతవాద రాజకీయాల వైఫల్యాన్ని గుర్తించి ప్రజలు తిరిగి వర్గపోరు రాజకీయాలను చేపట్టాల్సి వుంది.

 • “నిజం నిజం
  నీవన్నది నిజం నిజం”

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.