మార్పును ఆహ్వానిస్తే
విజయం వరిస్తుంది

వ్యక్తిగతంగా నిరంతరం మార్పును ఆహ్వానించడమే విజయవంతమైన నాయకుల లక్షణం. వ్యక్తిగతమైన మార్పు మన మానసిక పరిణతికి, సాధికారికతకు అద్దం పడుతుంది. 

          –రాబర్ట్ ఇ. క్విన్     

విజయం వరిస్తుందంటే నువ్వు మారతావా? సమాధానం చెప్పడానికి కొంచెం ఆలోచిస్తావు. ‘ముందు నాకు విజయాన్ని చూపించండి. తర్వాత మారతాను’.  చాలా మంది ఇలాగే ఆలోచిస్తారు. విజయాన్ని పువ్వుల్లో పెట్టి ఇస్తామని ఎవ్వరూ హామీ ఇవ్వలేరు. ఎందుకంటే నీ విజయానికి కర్త, కర్మ, క్రియ నువ్వే. వ్యక్తిగతంగా మారితేనే విజయలక్ష్మి దర్శనమిస్తుంది.

ఒకసారి సోక్రటీస్ ని ఒక యువకుడు కలిసి, విజయం సాధించే రహస్యం చెప్పమని అర్ధించాడు. సోక్రటీస్ అతనికి వెంటనే జవాబు చెప్పకుండా నది ఒడ్డుకు రమ్మన్నాడు. నదిలో పీకదాకా మునగమని ఆ యువకుడికి చెప్పాడు సోక్రటీస్. అతని తలమీద చెయ్యి పెట్టి సోక్రటీస్ నీళ్ళలోకి నొక్కుతున్నాడు.  అలా మళ్ళీ మళ్ళీ చేయడం వలన అతడు ఊపిరి తీసుకోవడానికి, సోక్రటీస్ బలమైన చేతుల నుంచి తప్పించుకోవడానికి గిలగిల్లాడాడు. అతణ్ణి వదిలిపెట్టాక ‘నీళ్ళల్లో ఎలా ఉందని అడిగాడు సోక్రటీస్.  ఆ యువకుడు ఆశ్చర్యకరమైన జవాబు చెప్పాడు. ‘ఊపిరాడనప్పుడు ఎవరైనా ఏం కోరుకుంటారో నేను కూడా అదే అనుకున్నాను.’ నీళ్ళలో ఊపిరాడకుండా గిలగిలా కొట్టుకుంటున్నప్పుడు బయటపడాలని, శ్వాస కోసం ఎలా తపించావో, అంతటి తపనతో విజయం కోసం అల్లాడిపోవాలి. విజయం కోసం నువ్వు ఎంతగా తపిస్తావో, అంతగా అది నిన్ను వరించడానికి నీ దగ్గరికొస్తుంది.  ఆ యువకుడు విజయం సాధించే రహస్యాన్ని అర్ధం చేసుకున్నాడు. విజయం సాధించడానికి ఏం చెయ్యాలో నేర్చుకున్నాడు. విజయం సాధించాలనే తీవ్రమైన కోరిక, విజయం సాధించడానికి కావలసిన తొలి అర్హత. విజయం సాధించాలన్న నీ కోరిక ఎంత తీవ్రంగా ఉంటే, అంత వేగంగా నువ్వు విజయాన్ని ఆకర్షిస్తావు. ఎందరో గొప్పవాళ్ళు కూడా నమ్మశక్యం కాని వ్యతిరేక పరిస్థితులనుండి బయటపడి, విజయాన్ని సాధించి ప్రపంచ ప్రసిద్ధి చెందారు.  

అబ్రహాం లింకన్, ఐన్స్ టీన్ తాము సాధించిన ఘన విజయాలకు ముందు ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఎన్నో అవమానాలనెదుర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడైన లింకన్ తండ్రి చెప్పులు కుట్టేవాడు. ఆ విషయాన్ని ప్రస్తావించి పార్లమెంటులో, నిండు సభలో ఆయన్ని అవమానించినపుడు లింకన్ మాట్లాడుతూ ‘అవును! మా నాన్న చెప్పులు కుట్టేవాడు. మీలో చాలామంది చెప్పులు మా  నాన్న కుట్టి ఉంటాడు. మీ కోసం, మీ కాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీ కాళ్ళకు సరిగ్గా సరిపోయే విధంగా బూట్లు కూడా మా నాన్న కుట్టే ఉంటాడు. మా నాన్న కుట్టిన చెప్పుల వల్ల మీకేమైనా ఇబ్బందులు కలిగితే, నాకివ్వండి. నేను కుట్టిస్తాను. మా నాన్నను చూసి నేనెంతగానో గర్వపడుతున్నాను.’ అన్నాడెంతో వినయంగా. ఎంత ఎత్తుకు ఎదిగితే, అంత వినయంగా ఉండాలని, ఎదుటివారిని హేళన చేయడం తగదని తన సమాధానం ద్వారా అబ్రహాం లింకన్ నిండు సభలో చెప్పకనే చెప్పాడు. 

‘నీ పిల్లాడికి చదువు చెప్పలేము. వాడి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేము ‘ అని ఐన్స్ టీన్ ను స్కూల్ నుంచి పంపించేస్తే అతని తల్లి అతడేమవుతాడోనని తెగ బాధపడిపోయింది.  

67 ఏళ్ళ వయసులో థామస్ ఆల్వా ఎడిసన్  ప్రయోగశాల అంతా అగ్నికి ఆహుతైపోయింది. ‘విధ్వంసంలో ఎంతో విలువుంది. మళ్ళీ ఇప్పుడు మొదటి నుంచి మొదలుపెడతాను’ అన్నాడు. సానుకూల వైఖరికి ఇంతకన్నా అద్భుతమైన ఉదాహరణ ఇంకేం కావాలి? మరో మూడు రోజుల తర్వాత ఎడిసన్ మరో కొత్త పరికరాన్ని కనిపెట్టాడు. సానుకూల దృక్పథం శక్తి అంటే అది! 

మరి విజయాన్ని ఆకర్షించడానికి వీలుగా మారడం ఎలా? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న! రేపు చేయాలనుకున్న పని ఈ రోజు  చేయాలి. ఈరోజు చేయాలనుకున్న పని ఇప్పుడే చేయాలి. ఇప్పుడు చేయాలనుకున్న పని ఈ క్షణమే ప్రారంభించాలి. అంటే అలసత్వం అర క్షణం కూడా పనికి రాదు. అది విజయానికి విషం లాంటింది. దానికి ఆచరణ తప్ప మరో విరుగుడు లేదు. ఒక చిన్న కార్డు, పోస్టు కార్డు సైజులో ఉన్నది తీసుకోండి. దానిమీద ‘నేను పనులు వాయిదా వేయను. ఇప్పుడే చెయ్యి ‘ అని  రాసుకోండి. ఈ కార్డు మీ దగ్గర పెట్టుకుని 21 రోజులపాటు ప్రతి రోజు చూడండి. మారాలి అన్న బలమైన కోరిక మీ హృదయంలో నాటుకుపోతుంది. ఇంట్లో గానీ, ఆఫీసులో గానీ, బంధువుల మధ్యలో ఉన్నా గానీ ఎటువంటి పనైనా వాయిదా వెయ్యకూడదని మీరు గట్టిగా గ్రహించాలి. విజయం సాధించడానికి మీ దృఢ నిశ్చయం అప్పుడు మరింత బలపడుతుంది. మీరు పనులు వాయిదా వేయకుండా చక చకా చేస్తున్నప్పుడు జరిగే మార్పులు మీకు ఆశ్చర్యం కలిగిస్తాయి. మీరు చేయాల్సిన పనులకు డెడ్ లైన్ పెట్టుకుంటే, చేరాల్సిన విజయ తీరాలు మరింత వేగంగా దగ్గరవుతాయి.   

పరిస్థితులు చేయి దాటిపోకుండా మీరు కష్టపడటానికి సిద్ధపడాలి. మీరు మీకిష్టమైన రంగంలో విజయం సాధించడానికి పరిస్థితులు అనుకూలంగా లేకుంటే, తక్షణం మరో రంగంలో ప్రయత్నించడం, అటువైపు మీ కృషి,  ఆలోచనలు మళ్ళించడం తప్పేమీ కాదు. సానుకూల వాతావరణంలో విజయాలు సాధించడం ఎవరికైనా చాలా తేలికగా ఉంటుంది. చిన్న వయసులోనే పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కని, పని మనిషిగా పది మంది ఇళ్ళలో పని చేస్తూ, రైళ్ళలో  చీరలు అమ్ముకుంటూ, చిట్టీలు వేస్తూ, అను నిత్యం బతుకుతో సంఘర్షిస్తూ కూడా, తన కలలను వాడిపోనివ్వకుండా, నిరంతర ప్రయత్నంతో అమెరికా చేరి, ఒక కంపెనీ అధిపతి అయి, ఎందరికో ఉపాధి కల్పిస్తున్న విదుషీమణి జ్యోతిరెడ్డి కన్నా వ్యతిరేక పరిస్థితులు ఎవ్వరెదుర్కొని ఉంటారు? ఇప్పుడామె జీవితాన్ని సినిమాగా తీయాలని టాలీవుడ్ ఆలోచిస్తున్నదంటే ఆమె సాధించిన విజయం విశిష్టత ఎంతటిదో తెలుస్తుంది. 

విజయం అనేది అప్పుడప్పుడూ ఒళ్ళంతా నూనె రాసుకున్న  దొంగలా జారిపోతుంది. దాన్ని పట్టుకోవడం ఒక జీవితకాలపు కష్టమైపోతుంది కొంతమందికి! విజయ లక్ష్యాన్ని పక్కదోవ పట్టించకుండా, విజయ శిఖరాలపైనే దృష్టి నిలిపి, పరిస్థితులు అనుకూలించనప్పుడు మరో రంగంపై దృష్టి సారించడం తప్పేమీ కాదంటాడు చాణక్యుడు తన ‘అర్ధశాస్త్రం’ అనే గ్రంధంలో!

మీ విజయం పట్ల మీకే సందేహాస్పదంగా ఉన్నప్పుడు ఈ క్రింది సూత్రాలు పాటించమని బోధిస్తాడు చాణక్యుడు. 

 1. మీదైన విజయాన్ని సాధించాలనుకున్నప్పుడు, ఎప్పుడూ  తప్పులు సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీ దారిలో  విజయం తారసపడదని మీకు స్పష్టంగా తెలిసినప్పుడు మరింత మంచి మార్గాన్ని ఎన్నుకోవడంలో తప్పేమీ లేదు. విజయాన్నివ్వలేని మార్గాన్ని తక్షణం విడిచిపెట్టాలి.  
 2. మీ సామర్ధ్యాల పట్ల ఆత్మ విశ్వాసం కాకుండా, అతి విశ్వాసం ఉంటే, తక్షణం వాటిని మొహమాటం లేకుండా, ఆత్మ విమర్శతో విశ్లేషణ చేసుకోవాలి. నీ ఆలోచనలకంటే విభిన్నంగా నీ లక్ష్యాలు ఎందుకున్నాయో అవగాహన చేసుకుని, సాధించగలిగిన లక్ష్యాలను ఏర్పరచుకోవాలి.
 3. జయాపజయాలు పగలు, రాత్రి లాంటివి. ఒక దానినొకటి వెంబడిస్తాయి. ఒక అంశంలో నీకు అపజయం ఎదురైతే, మరో లక్ష్యంతో విజయం సాధించవచ్చు.  
 4. నువ్వు ఎన్నుకున్న మార్గంలో విజయం లభించనప్పుడు, దగ్గర దారులు ఎంతమాత్రం వెదకకూడదు. 
 5. నీ ప్రయత్నాలు, కృషి మధ్యలో ఆపేస్తే జనం హేళన చేస్తారని భావించకూడదు. ‘రస విద్య’ అంటే బంగారం తయారు చేసే విద్య పట్టుబడినా, ధన వ్యామోహం తగదని, అది ప్రజలకు అపకారం చేస్తుందని వేమన తన కృషిని వదలిపెట్టి ఆదర్శప్రాయుడయ్యాడు. పొరపాటున రాజకీయ  రంగంలోకొచ్చిన ఎందరో సినీ నటులు, అది తమ విజయ వేదిక కాదని, మళ్ళీ సినిమా వినోదాల వేడుకలకు తిరిగొచ్చిన వైనం మనందరికీ తెలుసు. అనవసరమైన ఆత్మాభిమానాలతో నలిగిపోయి, జీవితాన్ని కష్టపడి అపజయాల బాట పట్టించేది మధ్య తరగతి మానవులే!    
 6. విజయం సాధించడానికి నీ వంతు కృషి లోపం లేకుండా చేశావు. అయినా అనూహ్య కారణాల వల్ల సాధ్యపడలేదు. అటువంటప్పుడు నీ విజయ మార్గాన్ని మార్చుకునే హక్కు నీకుంది. ఇటువంటి సందర్భంలో మార్గదర్శకుల  (Mentors) సహాయం తీసుకుంటే వారు విజయాల బాట చూపిస్తారు. 
 7. ఓర్పు ఎప్పటికీ బలమే. బలహీనత ఎంత మాత్రం కాదు. నీ ప్రయత్నాలన్నీ విఫలమైనపుడు, మరింత ఓర్పుతో ప్రయత్నిస్తే అనితర సాధ్యమైన విజయాలు సాధించవచ్చు. ‘ఓరిచితే తన పంతం ఊరకే వచ్చు’ అంటారు అన్నమాచార్యులు.  ఓర్పు వహిస్తే మన పట్టుదలలన్నీ తప్పక నెరవేరతాయని భావం. 
 8. నీ లక్ష్యాలు సాధిస్తే గొప్పవాడని అంతా ఆకాశానికెత్తేస్తారు. లక్ష్యాలు సిద్ధించకపోయినా నిరాశ పడకూడదు. 
 9. వైఫల్యాల వలన మన బలాలేమిటో, వాటితో మనం ఏం సాధించగలమో మరింత అవగాహనకొస్తుంది.

మనం నివసిస్తున్న భవనం కూలిపోతే, ఆ శిధిలాల మధ్య జీవించలేం కదా! కష్టపడి మరో చిన్న ఇల్లు కట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాము. మనం నియంత్రించలేని, మన చేతుల్లో లేని పరిస్థితుల ప్రభావం వలన విజయం దూరమైతే, సరికొత్త ఆలోచనలకు అంకురార్పణ చేయాలి. అసాధరణంగా, రొటీన్ కి భిన్నంగా ఆలోచించాలి. తమ బలాల్లో ఉన్న బలహీనతల బలమేమిటో తెలుసుకున్నవాళ్ళు నిజంగా విజయం సాధించినవాళ్ళు. సింపుల్ గా చెప్పాలంటే తన బలహీనతల పట్ల అద్భుతమైన అవగాహన కలవాడే నిజమైన విజయుడు.   చివరిగా టాల్స్టాయ్ మాటతో ముగిద్దాం. “Everyone thinks of changing the world, but no one thinks of changing himself.”   ప్రతి ఒక్కడు ప్రపంచాన్ని మార్చాలని ఆలోచిస్తాడు. తాను మారాలని ఆలోచించడు.’  విజయోస్తు

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

1 comment

 • బాగుంది.
  ఇది మార్చాలేమో?!
  ఆలోచించండి.

  “యాపిల్ చూసినపుడల్లా మనకిప్పుడు ఐన్స్ టీన్ గుర్తుకొస్తాడు. అతడు కనిపెట్టిన గురుత్వాకర్షణ శక్తి గుర్తొస్తుంది.”

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.