డి హెచ్ లారెన్స్, ఐమే సిజేర్
కవితలు

డి హెచ్ లారెన్స్

సీతాకోక చిలుక

  • డి. హెచ్. లారెన్స్

సీతాకోకచిలుకా! గాలి తోట గోడలు దాటి, సముద్రం వైపు వీస్తోంది.
నువ్వెందుకు నా బూటు మీద దుమ్మును తాగుతూ వుండిపోయావు,
ఈనెలుఈనెల రెక్కలు పైకెత్తుతూ, రెక్కలు పైకెత్తుతూ, ఇంత పెద్ద తెల్లని సీతాకోకచిలుకా!

అక్టోబర్ నెల వచ్చేసింది, గాలి సముద్రం వైపు బలంగా వీస్తోంది
మంచు కురిసిన కొండల్లోంచి వచ్చిన గాలి మంచుతో నునుపు దేరింది.
ఇక్కడ ఈ ఎర్రెర్రని జెరేనియమ్ పూల తోట వెచ్చగా వుంది, వెచ్చగా వుంది.
నా బూటు మీద తృప్తిగా కూర్చున్న సీతాకోకచిలుకా! సముద్రం దిశగా గాలి బలంగా వీస్తోంది.

నువ్వు వెళ్లిపోతావా, వెళ్లిపోతావా నా వెచ్చని ఇంటి నుంచి?
నీ నల్ల మచ్చల పెద్ద పెద్ద రెక్కలతో పైపైకి ఎగిరిపోతావా
ఒక అదృశ్య హరివిల్లుపైకి ఎగిరినట్లు, ఒక కమాను పైకి
గాలి నిన్ను కమాను మూపురం మీంచి మెత్తగా జార్చుతుందా
నువ్వు చిత్రంగా రెక్కలల్లార్చుతూ సముద్రం వైపు వెళ్లిపోతావా, ఓ తెల తెల్లని ధూళికణమా!

వీడ్కోలు, వీడ్కోలు, నిన్ను నువ్వు పోగొట్టుకున్న ఆత్మవు!
నువ్వలా స్ఫటిక దూరాల్లోకి కరిగి పోయావు,
ఇక చాలు! నువ్వు గాలిలో కలిసిపోవడం నేను చూశాను.

ఈ పద్యానికి జెస్లా మిలోస్జ్ పరిచయం:

డి హెచ్ లారెన్స్… తన తాత్వికత అంతటా… మనిషి తన మనసు మాట వినకుండా అతడిని బంధించి వుంచడానికి నాగరికత తయారించిన మొహమాటాల(ఇన్హిబిషన్స్)పై తిరుగబడ్డాడు. అందుకే లారెన్స్ రచనల్లో సెక్సు కి అంత ప్రాధాన్యం. ప్రధానంగా సెక్సు విషయంలో మొహమాటాల్ని వదిలించుకున్నప్పుడు, అన్ని తొడుగులను వొదులుకున్న ‘సహజ మానవుడు’ నగ్నంగా దర్శనమిస్తాడు. 1960లలో అమెరికాలో ‘మిస్టర్ న్యాచురల్’ అనే కేంద్ర పాత్రతో వెలువడిన కార్టూన్ సిరీస్ నేపధ్యం కూడా ఇదే. ఇంతాచేసి, ‘సీతాకోకచిలుక’ అనే ఈ చిన్న కవితలో మనిషి ప్రకృతితో మమేకం కావడం చాల కష్టమన్నదే లారెన్స్ చెప్పాడు. ఇందులో వెచ్చని తోట ఈడెన్ గార్డెనే, కాని, ఆడమ్ సీతాకోక చిలుకను చూస్తూ దానితో తను సంబంధం కలుపుకోలేనని, ఆత్మను కాపాడుకోవాలని దాన్ని హెచ్చరించలేనని తెలుసుకుంటాడు. సీతాకోకచిలుకతో పోలిస్తే తాను దాదాపు ‘సర్వజ్ణు’డే.

ఐమే సెజేర్

 

తుపాకి హెచ్చరిక
(గన్నెరీ వార్నింగ్)

  • ఐమే సెజేర్

ప్రపంచం అంచు వద్ద నుంచుని ఎప్పటికీ-రాని-బాటసారులకై ఎదురుచూస్తున్నాన్నేను
నాకు ఇవ్వు
శైశవత్వపు పాలగ్లాసు కొన్ని వానరొట్టెలు కాస్త అర్ధరాత్రీ మరి బవోబా చెట్టూ కలిసిన బువ్వ
నా చేతులు నక్షత్రాల పొదల్లో గుచ్చుకుపోయాయి అయినా త్వర త్వరగా విప్పుతున్నాయి
ఆ నురగ నుంచి సంపాదించిన పిడుగుల కవచాన్ని
పసిరిక పాములా మెరిసే రేఖా గణీతాన్ని
మందగమన గడియారం కాళ్ళ నా స్వప్నం కోసం
సముద్రంలో మునిగిన సామగ్రి వంటి నా ద్వేషం కోసం
నా 6 టాస్మానియన్ మహావృక్షాల కోసం
నా ‘పపువన్’ తలలు వేలాడే రాజగృహం కోసం
నా ఉత్తరధృవ కాంతుల కోసం నా అక్క చెల్లెళ్ళ కోసం నా ఆడస్నేహితుల కోసం
నా స్నేహితుడి కోసం నా భార్య కోసం నా ‘సీ లయన్ ’ కోసం
ఓహ్ అద్భుతమైన మీ స్నేహాలు, నా స్నేహితుడు, నా ప్రేయసి
నా మరణం, నా స్తబ్దత, నా కలరారోగాలు
నా వేటకుక్కలు
నా శప్త మానవ మందిరాలు
నా అమాయకత్వాల అగాధంలో పూడుకుపోయిన రేడియం గనులు
పిట్టమేతగూడులోనికి
గింజల్లా దూకుతాయి
(ఇక, ఒక నక్షత్ర బంధం
రాత్రి గాయక రక్తనాళాల అడుగున పూడికమట్టి లోంచి
సేకరించిన పొయ్యికట్టెల సామూహిక నామం అవుతుంది)
ఆఖరి గంట లోని 61వ నిమిషాన
ఒక అదృశ్య నాట్యకత్తె గుండెల్లోనికి గురిచూసి నటిస్తుంది
నరకం నుంచి, మొదటి సారిగా పువ్వుల నుంచి ఎర్రని శతఘ్నిగోళాల్ని
కుడి దిక్కున కండ లేని, కళ్లు లేని, అపనమ్మకం లేని, సరస్సులు లేని దినాలుగా
ఎడమ దిక్కున ఆ దినాల నౌకలను నడిపించే దీపాల్ని -ఆగాలిక్కడ- హిమపాతాల్ని
‘వొమిటో నీగ్రో’* తెల్ల దంతపు నల్లజెండా ఎగురుతుంది
అడివిమంటల సహోదరత్వపు అపరిమిత సమయం వరకు

***

*’వొమిటో నీగ్రో’ పేరుతో ఒక గాయక బృందం (బ్యాండ్) వుండేది. అసలా మాటకు అర్థం ‘నల్లని వాంతి’ (బ్లాక్ వామిట్) అని. ఎల్లో ఫీవర్ అనే జబ్బు చివరి దశలో రోగి అలా నల్లగా వాంతి చేసుకుని మరణిస్తాడు.

క్లేటన్ ఎష్లెమాన్, అన్నెట్టీ స్మిత్ ఇంగీషు లోనికి అనువదించిన… ఫ్రెంచి కవి ఐమే సేజేర్ కవిత్వ వాల్యూం లోని ‘అద్భుత ఆయుధాలు’ (మిరాక్యులస్ వెపన్స్) విభాగంలోని మొదటి పద్యం ‘గన్నెరీ వార్నింగ్’ కు ఇది దాదాపు  ముక్కస్య ముక్కానునువాదం.

కవితలోని  బబోవా, టాస్మానియన్ చెట్లు ఆఫ్రికాలో బాగా పెద్ద ప్రాచీన వృక్షాలు. పపువన్ తలలు: పాత యోధులు నిర్జితుల తలలను ట్రోఫీలుగా ధరించేవారట. జెరేనియం పూలు: ఆ పూల బొమ్మను శీర్షిక మొదట్లో చూడొచ్చు. 

హెచ్చార్కె

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.