స్వతంత్ర భారతికి వెండి అద్దం ‘మదర్ ఇండియా’

‘మదర్ ఇండియా’ సినిమా 1957 అక్టోబర్ 25 న రిలీజ్ అయింది. ఇప్పటిదాకా భారతదేశంలో అతి ఎక్కువ రెవెన్యూ వసూలు చేసిన సినిమా ఇదేనని సినిమా పండితులు అంటున్నారు. ద్రవ్ద్యోల్బణంతో సరిచేసి నికరంగా చూస్తే, గా చూస్తే‌2017 లో వరకు 1.2 బిలియన్ రూపాయలుగా లెక్క కట్టి చెబుతున్నారు. సినిమా రిలీజ్ ఐనప్పడే మాత్రమే కాక ఇప్పటికీ ఈ సినిమా విషయంలో రివ్యూ లూ చర్చలూ కొనసాగుతునే ఉన్నాయి. సినీ విమర్శకులు రకరకాలుగా ఈ సినిమా గురింక్షి వ్యాఖ్యానాలు చేయడం నేటికీ సాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా విమర్శకులను ఇంతగా ఆకర్షించిన భారతీయ సినిమా మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో.‌ ఈ సినిమా 1958 సంవత్సరంలో బెస్ట్ ఫారీన్ సినిమాగా ఆస్కార్ బరిలో నామినేట్ కాబడడం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. ఆస్కార్ బరిలో నిలబడిన మొట్టమొదటి భారతీయ సినిమా కూడా ఇదే. ఆస్కార్ అవార్డును ఒక ఓటు తేడాతో కోల్పోయినా, ప్రపంచ సినిమాకు భారతీయ సినిమా సత్తా చాటిన సినిమాగా చెప్పవచ్చు. ఇందులోని మెలో డ్రామా గానీ, కథ గానీ, దానిని చెప్పిన విధానంగానీ అమెరికన్ యూరోప్ సినిమా ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు కానీ, ఇండియన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ లో దీని స్థానం అత్యున్నతమని చెప్పవచ్చు. ఇపుడు వస్తున్న బాలీవుడ్ సినిమాలన్నీ మదర్ ఇండియా సినిమాకు కొనసాగింపు మాత్రమేనంటారు రచయిత జావేద్ అఖ్తర్. భారతీయ క్లాసికల్ సినిమాకు ఒక కల్ట్ స్థాయిని తీసుకువచ్చిన సినిమా మదర్ ఇండియా.

స్వాతంత్ర్యం వచ్చిన పది సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా ఇది. వ్యవసాయాన్ని పంచవర్ష ప్రణాళికలో ప్రధానంగా చేర్చిన రోజులవి. సినిమా కథ స్వాతంత్ర్యానికి ముందు ఆ తరువాత వ్యవసాయ విధానాల్లో వచ్చిన మార్పును రికార్డు చేస్తుంది. సినిమా మొదటిలోనే మిషన్లతో నడిచే వ్యవసాయ  పనిముట్లు, ట్రాక్టర్ల వంటివి కనిపిస్తాయి. కథ అక్కడినుంచి యాభై సంవత్సరాలు వెనక్కి వెళుతుంది. ఒక బీద రైతు కుటుంబానికి సంబంధించిన కథనే ‘మదర్ ఇండియా’. కథ అన్ని భారతీయ సినిమాలలాగానే ఒక కుటుంబం అందులోని ఘర్షణలను సెంటిమెంట్లనూ చెప్పేదిగా ఉన్నా ఆ నేపథ్యం, వ్యవసాయంతో ముడిపడి ఉన్న ఆ గ్రామీణ జీవితాలు చాలా ఆసక్తి కలిగిస్తాయి. ప్రధాన పాత్రధారి రాధ గా నర్గిస్ నటన అనన్య సామాన్యం. ఈ పాత్రను మలిచిన తీరు ఎన్నో విమర్శలకు కారణం అయింది. రాధ పాత్రలో భారతీయ పౌరాణిక పాత్రలైన రాధ, సీత, సావిత్రి, ద్రౌపది, దుర్గా, కాళీ మాత ల ప్రభావం ఉందని, రాధ భర్త శ్యామూ మహా భారతంలోని శ్రీకృష్ణుడి పాత్రవంటిదనీ ఊహించిన వాళ్ళూ ఉన్నారు. ఐతే రాధ పాత్ర భారతీయ హిందూ మహిళ జీవన శైలికీ, ఆమెలోని విలువలకూ, ఆమెలోని త్యాగానికీ, నీతి వర్తనకూ పోతపోసిన పర్సోనిఫికేషన్ అనీ సినీ పండితుల భావన.

భారతీయ పితృస్వామ్య వ్యవస్థ లో అబలగా భర్తచాటు భార్యగా ఉండే స్త్రీ, ఆమెలోని విలువలను కాపాడుకుంటూ తల్లిగా ఏ విధంగా శక్తివంతమైన రూపాన్ని దాల్చుతుందో, మారుతున్న సాంఘిక పరిస్థుతుల్లో భారతీయ మహిళ కుటుంబంలో సమాజంలో ఎటువంటి వొత్తిడులను అధిగమిస్తూ సాగుతుందో ఈ సినిమా చూపుతుంది. స్త్రీ పాత్ర వరుస త్యాగాలు చేస్తూ సాగటం వలన 1937 లో వచ్చిన “స్టెల్లా డల్లాస్”తోనూ, సినిమాలోని సాంఘిక మార్పుల దృష్ట్యా 1939 లో వచ్చిన “గాన్ విత్ ది విండ్” తోనూ పోల్చదగినది అంటారు ఫిల్మ్ క్రిటిక్ డేవ్ కెర్. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, బ్రిటీష్ వారి ఆధారం లేకుండా స్వతంత్ర్య భారతం ఎలా ఉండిందో ఈ సినిమాలో చూస్తాం. ముఖ్యంగా ఫ్యూడల్ వ్యవస్థనూ వలస విధానాన్నీ మదర్ ఇండియా ఏ విధంగా అధిగమించి తన విలువలను కాపాడుకుంటూ, ఎలా త్యాగాల చాళ్లు పోస్తూ తన అస్తిత్వాన్నీ నిలుపుకుందో ప్రతీకాత్మకంగా గా చెప్పిన సినిమాగా మదర్ ఇండియాను పేర్కొనవచ్చు. ఇందులోని స్త్రీ పాత్ర ద్వారా ఐతేనేమి, భారత దేశాన్ని ‘తల్లి’ అనడం ద్వారా చాలా బలమైన సాంస్కృతిక, జాతీయ భావనలను ఈ సినిమా ప్రేక్షకుల్లో పొందు పరచగలిగింది. రాధ పాత్రధారి కథ చివరిలో సొంత కొడుకైన బిర్జు ను తుపాకీతో కాల్చి చంపడం అన్నది ఒక అసాధారణ దృశ్యం. ఇటువంటి దృశ్యం సాధారణంగా భారతీయ సినిమాలలో ఊహించనిది. సొంత తల్లే ఐనా, కొడుకు నీతి బాహ్యతను సహించలేనిదిగా చిత్రించటం జరిగింది. ఇద్దరు కొడుకులలో పెద్దవాడు రాము తల్లి వలె ఫ్యూడల్ విలువలను నిలుపుకుంటూ సాగడం చేస్తే రెండవ కొడుకు బిర్జూ మాత్రం ఫ్యూడల్ వ్యవస్థ కు ఎదురు తిరిగే రెబెల్ గా ఉంటాడు. ఐతే బిర్జూను చంపటం ద్వారా తల్లి రాధ యథాతథ వాదనను ఫ్యూడల్ విలువలను గౌరవించినట్టేనా అనే సందేహం సందిగ్ధం ఈ సినిమా కలిగిస్తుంది. అంతే కాకుండా తల్లి తన కొడుకులిద్దరికే తల్లి కాకుండా ఊరంతటకి తల్లిలా ఎదిగిన క్రమంలో తన కొడుకు వలన మరొక అమ్మాయి జీవితం పాడవటం చూసి తట్టుకోలేని స్థితి కనిపిస్తుంది. ఫ్యూడల్ సంస్కృతి ని బద్దలు కొట్టడంలో తప్పుదారులు తొక్కిన కొడుకు గా బిర్జూని నిలువరించడం చివరిలో అతడిని చంపేయడం వలన ఈ సినిమా చర్చనీయాంశం అయింది. పోస్ట్ కొలోనియల్ ఇండియాలో రైతాంగ విప్లవాలకు స్థానం ఉన్న సమయంలో బిర్జూ వంటి  రెబెల్ ను తల్లి సంహరించడం ఏమిటి అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్యూడల్ వ్యవస్థను ఎదిరించడంలోనైనా అందులో నీతి బాహ్యత పొటమరిస్తే మదర్ ఇండియా సహించదనుకోవాలి. సల్మాన్ రష్దీ ఏమంటారంటే – అటువంటి భయంకరమైన కోపోద్రిక్తమమైన, వినాశకరమైన తల్లి స్వరూపాన్ని ప్రతీ భారతీయ పురుషుడి ఊహలను వెంటాడుతుంది- అని.

ఇంత గొప్ప క్లాసిక్ ఇలా రూపుదిద్దుకోవటానికి కారణం లెజెండరీ డైరెక్టర్ మహబూబ్ ఖాన్. సోషలిస్ట్ ముస్లింగా పేరున్న మహబూబ్ ఖాన్ భారతీయ హిందూ మహిళ జీవిత ఆత్మను ఈ సినిమాలో పట్టి బంధించాడని చెప్పాలి. ఒక్కో సీన్ ను తెరకెక్కించిన విధానం న భూతో న భవిష్యతి అన్నట్టుగా ఉంటాయి. మొదలైనప్పటి నుంచి పకడ్బందీ స్క్రీన్ ప్లే తో తల పక్కకు తిప్పుకోనీయనంత ఉత్కంఠ తో సినిమాను నడపటం ఒక్క మహబూబ్ ఖాన్ కే చెల్లింది. హాలీవుడ్ సినీ పండితులు సైతం ఒక సీన్ ని పండించాలంటే పాత్రల మధ్యన డ్రామాను రక్తికట్టించాలంటే ఎంత టెక్నిక్ ను ఈ దర్శకుడు ఊహిస్తాడోనని ప్రశంశలు కురిపిస్తారు. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవలసినది ఇమేజరీ. నాగలితో భూమి దున్నే సీన్ కానీ, వరద సీన్ గానీ, రాధ పిల్లల కోసం తనను తాను విలన్ కు అర్పించుకునే సీన్ కానీ ఎప్పటికీ మరిచిపోలేనివిగా ఉంటాయి. ప్రేక్షకుడీ మీద అంతటి బలమైన ముద్ర వేస్తాయి. నర్గీస్ నటన విశ్వరూపం కనిపిస్తుంది. అలాగే చిన్న వయసులో బిర్జూగా చేసిన బాల నటుడు సాజిద్ ఖాన్ ను మెచ్చుకోకుండా ఉండలేం. అద్భుతం అనేది చిన్నమాట ఔతుంది. ఏదేమైనా ప్రపంచ సినిమాలో భారతీయ సినిమా ఔన్నత్యాన్ని కళనూ చాటి చెప్పిన సినిమా మదర్ ఇండియా. భారతీయుల సెంటిమెంటల్ కథన రీతిని ఉన్నత స్థానంలో నిలిపినందుకు ఏ భారతీయ దర్శకుడైనా మహబూబ్ ఖాన్ కి ఋణపడి ఉంటాడు

డాక్టర్ విరించి విరివింటి

డాక్టర్ విరించి విరివింటి: ఎంబీబీఎస్ చదివిన తరువాత ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో ఐదేళ్ళకు పైగా పనిచేశారు. ఆ తరువాత క్లినికల్ కార్డియాలజీ లో పీజీ డిప్లొమా చేసి స్వంతంగా ప్రాక్టీసు చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ భారతంలో గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక సాహిత్య కళా రంగాల్లో ఆసక్తి మీకు తెలియంది కాదు. కవిత్వం, కళలపై ఆయన ఆసక్తి అందరికీ తెలిసినదే. ‘రెండో ఆధ్యాయానికి ముందుమాట’ పేరుతో కవితా సంపుటి ప్రకటించారు.

‘పర్స్పెక్టివ్స్’ అనే షార్ట్ ఫిల్మ్ తో సినిమా దర్శకత్వం రంగంలో ప్రవేశించారు. తన 'ఇక్కడి చెట్ల గాలి'కి తెలంగాణ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డ్ లభించింది. 'షాడోస్', 'డర్టీ హ్యాండ్స్', "ఫ్యూచర్ షాక్' లఘు చిత్రాలు ఎడిటింగ్ దశలో వున్నాయి.

2 comments

  • విశ్లేషణ బాగుంది.
    హీరోయిన్ పాత్ర ను మదరిండియా కు ప్రతీకగా మలచి , భారతదేశంలో తల్లి తన సొంత కొడుకైనా సరే చేసిన తప్పుకు కఠిన దండన విధించటమే సరైనదని భావిస్తుందని చాటి చెప్పిన సినిమా.
    అలాగని ఆమెలో మాతృత్వం కొరవడిందని అనుకోవటానికి వీల్లేదు . మంచి సినిమా, మంచి రివ్యూ విరించి గారూ 👍
    ఆస్కార్ అవార్డ్ రానంత మాత్రాన సినిమాలో ఓ మహిళ తన కుటుంబాన్ని ఒక్క చేత్తో పోషించటానికి పడే తపన ముందు ఏ అవార్డూ దిగదుడుపే 👏👏👏

    • ఆస్కార్ రావటానికి అర్హతలున్న సినిమా..కానీ మన సినిమాల్లోని అన్ రియలిస్టిక్ పాటలు వాళ్ళకు ఎప్పటికీ అర్థం కాని విషయమే!

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.