తాతా
ఏంటి
కంట్లో శుక్లం
తీసేసుకుని
వాలుకుర్చీలో కూర్చుని
సోడాబుడ్డి కళ్ళజోడు
సరిచేసుకుంటూ
అంగుళం వదలకుండా
తెగ చదివేస్తున్నావ్
అంతా
విశ్వసనీయత లేని
సమాచారం
గతకాలం కాదిది
ఎవ్వడికిష్టమొచ్చింది
వాడు పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తాడు
మోసపోకు నిజమనుకుని
లాభార్జనను పెనవేసుకున్న వార్త
సమాజశ్రేయస్సునెరుగదు
నువ్వు చత్వారం బారిన పడినా
కంటివైద్యుడి చలువతో చూపుకి నోచుకున్నవ్
>వార్త కు పట్టుకున్న
చత్వారం ఏ సర్జరీకి లొంగదు
అది
సంఘం వొంటిమీది
రాచపుండు
Add comment