ఒక పొడావు చదువు…

బాపురే!

అయ్య బాపురే!

ఇదేం చదువురా నాయనా?

ఇంత పొడావు చదువా… ‘వా… వా… వా…’

‘నోర్ముయ్’ అన్నారు నాన్న!

ఎందుకురా యేడుస్తున్నావ్ అని అడగలేదు!

మీకర్దం కాలేదా?

నాకే అర్దం కాలేదు?!

ప్చ్!

మొదటి నుండి చెప్పనా? మధ్య నుండి చెప్పనా? హు… యెక్కడి నుండో వొక అక్కడి నుండి చెప్తాను!

అప్పుడు నాకు స్కూలుకు వెళ్ళాలని చెప్పారా?

వెళ్ళానా?

అయిపోయింది!

సెలవులు కూడా యిచ్చేశారు!

ఊర్లన్నీ తిరిగొచ్చినాక, యేమిటో మళ్ళీ బడికి బయల్దేరమన్నారు నాన్న!

నాకర్దం కాలేదు?!

‘బడికేంటి?’ అన్నానా?

నాన్నకీ అమ్మకీ యెవరికీ యెందుకో అర్దం కాలేదు?!

‘అయిపోయింది కదా?’ అన్నాను!

నా మాట వినకుండా అమ్మ నా వీపుకి బ్యాగు తగిలించింది! తినడానికి లంచ్ బాక్స్! స్నాక్స్ బాక్స్! వాటర్ బాటిల్!

‘అన్ని బాక్సులూ యింట్లో వుండి తినేస్తానులే’ చెప్పాను!

అమ్మానాన్నా వొకరి ముఖాలు వొకరు చూసుకున్నారు! ఇద్దరూ నన్ను చూశారు!

‘వాటర్ బాటిల్ కూడా తాగేస్తానులే’ అన్నాను!

‘తినడమైనా తాగడమైనా అన్నీ స్కూల్లోనే’ అంది అమ్మ!

‘నిద్రపోవడమైనా…’ పుసుక్కున నవ్వింది పక్కింటి అత్త!

‘ఇంట్లో మమ్మీతో బజ్జుంటా’ అన్నాను!

‘మొత్తానికి బడికి వెళ్ళనంటావ్?’ అత్త కితకితలు పెట్టినట్టు నవ్వింది?!

‘అయిపోయింది కదా?’ అడిగాను!

‘ఏంట్రా అయిపోయింది?’ అమ్మకి కోపం వొచ్చింది!

‘చదువు’ అని చెప్పానా?

‘ఎమ్బీబియస్సు ఎఫ్ఫార్పీయస్సు…’ పక్కింటి అత్తకి పనిలేదు, వెక్కిరించింది!

‘ఏబీసీడీయఫ్ఫూ…’ నేనూ వెక్కిరించాను!

నాన్న బైక్ స్టార్ట్ చేశారు! అమ్మ నన్ను యెత్తుకొని బేబీ సీటు మీద కూర్చోబెట్టింది!

డుర్రు… ర్ర్… ర్!

గుడు… గుడక్… గుడ్!

బళ్ళో బైక్ ఆగింది!

‘డాడీ…’ పిలిచాను!

బైక్ మీంచి నన్ను దించారు!

బేగూ బాక్సులూ బాటిలూ సర్దారు!

ఆయా వొచ్చింది! నన్ను తీసుకు వెళ్ళడానికి నా భుజమ్మీద చెయ్యి వేసింది!

తలడ్డంగా వూపాను!

‘క్లాసుకు రావా?’ అడిగింది ఆయా!

‘అప్పుడు వచ్చాను కదా?’ అన్నాను!

ఆయా కూడా అర్దం కానట్టే చూసింది!

వీళ్ళందరికీ యేమయ్యిందో నాకర్దం కాలేదు!

‘పద డాడీ యింటికి పోదాం’ డాడీ చెయ్యిపట్టుకొని అన్నాను!

‘చదువుకోవా?’ డాడీ అడిగారు!

‘అయిపోయింది కదా డాడీ… యింక స్కూలెందుకు?’ డాడీ చెయ్యిలాగి ఆగి తలెత్తి డాడీని చూశాను!

నేను అడుగు బుల్లెట్ అయితే మా డాడీ ఆరడుగుల బుల్లెట్టు! పొడావుగా కనిపించారు! ఎత్తుకో- అందామంటే తిడతారని ఆగిపోయాను!

‘అయిపోయింది కదా డాడీ…’ అన్నాను!

‘ఏమయిపోయిందిరా నీ ముఖం?’ డాడీ అమ్మ మీద ఫైర్ అయినట్టు నా మీద!

‘చదువు’ అన్నాను!

అప్పుడు నాన్న ముఖం కోపంతో దుంపలా అయ్యింది! అంతలోనే యేడుపు ముఖం పెట్టారు!

‘ఏడవకు డాడీ… ప్లీజ్…’ అన్నానా?

అప్పుడు డాడీ పొడావుగా గాలి వొదిలి అంతకన్నా పొడావైన బుల్లెట్టుతో నన్ను షూట్ చేశారు!

‘షూట్ కాకపోతే యేంటిది? నా చదువు అయిపోలేదట! ఒకటో తరవతి అయిందట! ఒకటి తర్వాత రెండో తరవతి వుందట! రెండో తరవతి క్లాసు గది అది…’ అని డాడీ చూపించారు!

చూశాను! నేను చదివిన వొకటో తరవతి క్లాసు గది పక్కనే మరో తరవతి క్లాసు గది… 

‘అది మూడో తరవతి క్లాసు గది…’ డాడీ చెపుతుంటే చూశాను!

గది పక్కన గది! గది పక్కన గది!

‘అది నాల్గో తరవతి క్లాసు గది…’ డాడీ చెపుతుంటే చూస్తున్నాను!

గది పక్కన గది! గది పక్కన గది!

‘అది అయిదో తరవతి క్లాసు గది… ఆ పక్కన ఆరో తరవతి క్లాసు గది… ఆ పక్కన యేడో తరవతి క్లాసు గది…’ డాడీ చెపుతూనే వున్నారు!

ఎన్ని గదులు? ఎన్ని తరవతులు?

‘ఎనిమిది… తొమ్మిది… పది… పదకుండు… పన్నెండు… పదమూడు…’ యెన్ని క్లాసులకు అన్ని గదులు కదా నెంబర్లు చదువుతున్నాను!

‘పదమూడు లేదు, ప్లస్ టూ అంటే పన్నెండు వరకే…’ డాడీ చెప్పారు!

‘పన్నెండు చదవాలా?’ బాబోయ్ నాకు చాలా భయమేసింది!

‘ఆ తరువాత డిగ్రీ మరో మూడేళ్ళు వేరే కాలేజీలో చదివి…’ డాడీ చెపుతుంటే నాకు బాగా యేడుపు వచ్చింది!

నేను సైలెంటయిపోయానని ఆయా నన్ను చూసి నవ్వింది!

‘డిగ్రీ అయ్యాక పీజీ రెండేళ్ళు’ డాడీ యింకా చెపుతుంటే నాకు బాగా దిగులేసి బాధేసింది!

‘ఆ తరువాత యంఫీల్ యేడాది, డాక్టరేట్ మరో మూడేళ్ళు, తరువాత యింట్రెస్టు వుండి సీటు తెచ్చుకుంటే పోస్ట్ డాక్టరేట్ ఆరేళ్ళు…’

డాడీ చెప్పకముందే నాకు యేడుపు వచ్చింది!

ఏడ్చాను!

‘ఏమయ్యింది?’ అడిగారు డాడీ!

‘నేను అంత పొడావు చదువను…’ చెప్పాను!

‘చదవకుండా యేమి చేస్తావ్?’ డాడీ అడిగారు!

‘నీతో ఆఫీసుకు వొచ్చేస్తా!’

‘వొచ్చి?’

‘డ్యూటీ చేస్కుంటా!’

‘నేను డ్యూటీ చేస్తున్నా గదరా?’

‘ఇద్దరం చేద్దాం యెక్కువ డబ్బు వొస్తుంది’ అన్నాను!

డాడీ మాట్లాడలేదు! తొడపాశం తీసినట్టు అలా వుండిపోయారు!

అప్పుడు డాడీని చూస్తే బాధేసింది! అందుకే డాడీకి ఆఫరిచ్చాను!

‘పోనీ, డాడీ నువ్వు నా వంతు చదువుకో- నేను నీ వంతు ఆఫీసుకు పోతా’ అన్నాను!

డాడీ మూగాడిలా వుండిపోయారు!

ఆయా, ఆయా వెనకాల చేరిన టీచర్లు అంతా విన్నట్టున్నారు… నవ్వుతున్నారు!

చెప్పా కదా?, డాడీ ఫేసు అచ్చం తొడపాశం తీసినట్టుగా పెట్టారు!

నాకే నచ్చలేదు!

‘మా డాడీకి చాలా తెలుసు, బాగా చదువుకుంటారు, మంచి మార్కులు తెచ్చుకుంటారు, నేను వొకటో తరవతిలో చేరినప్పుడు మా డాడీయే యింటర్వ్యూలో మాంచి మార్కులు తెచ్చుకుంటేనే కదా- నాకు సీటిచ్చారు…’ గుర్తు చేసి చెప్పాను!

ప్చ్!

బెస్ట్ ఆఫరు డాడీ తీసుకొని వరెస్ట్ ఆఫరు నాకిచ్చారు!

డాడీ ఆఫీసుకి!

నేను బడికి!

అప్పటికీ చెప్పా! ఏడ్చా! ఏడ్చి చెప్పా! దొర్లి చెప్పా! దొర్లి దొర్లి చెప్పా! వింటేగా?!

మనం వినలేదు అంటారు గాని యీ పెద్దలు అస్సలు వినరు!

పైగా కొట్టారు! తిట్టారు!

పోన్లే… రేపు మనం పెద్దవాళ్ళం కామా యేమి?

అప్పుడు చూసుకుందాము!

-ఖుషీ

రెండో తరవతి,

వివేక వర్ధిని విద్యా సంస్థలు.

 

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.