రెండు పోరాట కలాలు
ఒక మనసు పాట

సుంకర సత్యనారాయణ

ఇరవయ్యవ శతాబ్దపు తొలి దశాబ్దాలలో పద్య కవుల్లో అవధానులలో జంటగా కవిత్వం చెప్పడం ఉండేది.  తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు, వెంకట పార్వతీశ కవులు, మొదలైన జంటలు విఖ్యాతిగాంచిన వారు. 

ఖండ కవితలు ప్రధానంగా వ్రాసిన భావకవుల్లో, అభ్యుదయ కవులలో ఈ పద్ధతి పెద్దగా కనపడదు.  అలాగే నాటక రచయితల్లో కూడా జంట కృషి చాలా అరుదు. 

దీనికి భిన్నంగా అభ్యుదయ కవులుగా నాటకరచయితలుగా పేరుమోసిన అరుదైన జంట సుంకర-వాసిరెడ్డి. 

వాసిరెడ్డి భాస్కర రావు

కృష్ణాజిల్లా ఈడ్పుగల్లు లో 1909లో జన్మించిన సుంకర సత్యనారాయణ,  వీరులపాడులో 1914లో జన్మించిన వాసిరెడ్డి భాస్కరరావు ఇద్దరూ రైతు కుటుంబాల  నుంచి వచ్చిన వారే. స్వాతంత్ర్య పోరాటంలో, తర్వాత తెలంగాణ సాయుధ పోరాటంలో, కమ్యూనిస్టు ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర వహించి అరెస్టులను, పోలీసు నిర్బంధాన్ని అనుభవించినవారే. 

సంస్కృతాంధ్రాలే కాక హిందీ కూడా చదువుకున్న వాసిరెడ్డి భాస్కరరావు హిందీ విద్వాన్ గా ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసి 1942 లో క్విట్ ఇండియా సమయంలో ఉద్యోగానికి రాజీనామా చేశారు. 

ఆ సమయానికి ఆయన స్వగ్రామమైన వీరులపాడు కు ఐదు మైళ్ళ దూరంలో ఉన్న కొణతమాత్మమూరు గ్రామంలో సుంకర సత్యనారాయణ అప్పటికే కమ్యూనిస్టు పార్టీలో పని చేస్తూ గేయాలు, నాటికలు, బుర్రకథలు వ్రాసి ప్రదర్శిస్తూ ఉండేవారు.  అప్పుడు మొదలైనవారి సాహచర్యం ముందు కలిసి బుర్ర కథలు చెప్పడం, తర్వాత కలిసి నాటక రచన చేయడం, చివరికి సినిమాల్లో కలిసి పనిచేయడం ఇలా 12 సంవత్సరాల పాటు సాగింది. 

అన్నిటికంటే ఎక్కువగా ప్రసిద్ధి పొందినవి, వీరికి శాశ్వత కీర్తిని సంపాదించిపెట్టినవి ‘ముందడుగు’ , ‘అపనింద’, ‘మా భూమి’ నాటకాలు. 

కోస్తా జిల్లాల్లో రైతాంగ పోరాటానికి దన్నుగా వీరు 1945 ప్రాంతాల్లో వ్రాసిన మొదటి నాటిక ‘ముందడుగు’ జమీందారుల కన్నెర్రకు, పాలకుల నిషేధానికి గురైంది. 

తెలంగాణ ఉద్యమం సాయుధ పోరాటంగా మారుతున్న నేపథ్యంలో, ఆ ఉద్యమానికి సంఘీభావంగా, 1946 ప్రాంతాల్లో మొదటిసారి ప్రదర్శించబడ్డ ‘మా భూమి’ నాటకం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పైన చెప్పిన వీరులపాడు, కొణతమాత్మమూరు నైజాంకు సరిహద్దు గ్రామాలు. 

వందకు పైగా దళాలు రెండు సంవత్సరాల్లో 800కు పైగా ‘మా భూమి’ ప్రదర్శనలు ఇచ్చారని, లక్షలాదిమంది చూశారని అంచనా. తెలంగాణ జీవితం నేపథ్యంగా ఉన్న ఈ నాటకం వ్రాసిన వారే కాక, వేసిన వారు, చూసినవారు ప్రధానంగా కోస్తా జిల్లాల ప్రజలే. తెలంగాణ గడ్డమీద అనుమతులు లేక ప్రదర్శనలు వీలు కాక పోయినా ఒక సరిహద్దు గ్రామంలో సాయుధ దళాల పహారా మధ్య 50 వేల మంది ప్రేక్షకుల చూస్తుండగా ఒక్క ప్రదర్శన ఇవ్వగలిగారు అని చెప్తారు. 

తెలంగాణ పోరాటం ముగిసిన తర్వాత అనేకమంది ప్రజానాట్యమండలి కళాకారులలాగే సుంకర, వాసిరెడ్డి మద్రాసు చేరుకున్నారు. వీరు కలిసి వ్రాసిన సినిమాలు ‘పల్లెటూరు’, ‘కన్నతల్లి’, ‘పుట్టిల్లు’. 

1952లో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై వచ్చిన పల్లెటూరు సినిమాలో – శ్రీశ్రీ ‘పొలాలన్ని హలాల దున్ని’, వేములపల్లి శ్రీకృష్ణ ‘చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా’ కాక మిగిలిన – రచన అంతా సుంకర, వాసిరెడ్డి నిర్వహించి  రచయితలుగానే గాక కవులుగా తమ సత్తా చాటుకున్నారు. 

ఈ సినిమాకోసం మధురాతి మధురంగా – వారి నేపథ్యానికి పూర్తి భిన్నంగా – వ్రాసిన ‘ఆ మనసులోన ఆ చూపులోన’ సాహిత్యం చూద్దాం.

ఆ మనసులోన ఆ చూపులోన
పరుగులెత్తే మృదుల భావనా మాలికల
అర్థమేమిటొ తెల్పుమా
ఆశయేమిటొ చెప్పుమా
ఆ నడతలోన, ఆ నడకలోన
దొరలు ఆ నునుసిగ్గు దొంతరలపై మొగ్గు
అంతరార్థము తెల్పుమా,
ఆశయము వివరింపుమా
ఆ కులుకులోన, ఆ పలుకులోన
పెనవేసికొనియున్న, వెలికిరాలేకున్న
తలపులేమో తెల్పుమా
వలపులేవో చెప్పుమా
ఆ సొగసులోన, ఆ నగవులోన
తొగరువాతెరగప్పి చిగురించు కోరికల
మరుగదేమిటొ తెల్పుమా
తెరగదేమిటొ చెప్పుమా
ఆ… హృదిలో, ఈ… మదిలో
పొటమరించిన ప్రేమ దిటవుగా పాదుకొని
పరిమళించునె తెల్పుమా
ఫలితమిచ్చునె చెప్పుమా

ఆ…మనసులోనా

పల్లెటూరు సినిమా మీద అంతకు రెండేళ్ల క్రితం వచ్చిన ‘షావుకారు’ సినిమా ప్రభావం ఉందా అనిపిస్తుంది.   ముఖ్యంగా ఈ పాట మీద. ‘షావుకారు’ సినిమాలో కథానాయకుడు నాయికకు వినబడే విధంగా స్వగతం లో పాడుకునే పాట ‘ఏమనెనే చిన్నారి ఏమనెనే’. 

సన్నివేశం ఇక్కడకూడా అటువంటిదే. ఇద్దరికీ పరస్పరం అనురాగాలు కలుగుతూ ఉంటాయి కానీ, చెప్పడానికి పల్లెసీమల్లోనికట్టుబాట్లు, బెరుకు, సిగ్గు అడ్డు పడుతుంటాయి. ఆమె మనసు తెలుసుకుందామని అతను పాడే పాట ‘ఆ మనసులోన’. షావుకారు పాట రాసిన సినీమహాకవి సముద్రాలవారికి దీటుగా అంత రమణీయంగానూ సుంకర-వాసిరెడ్డి ‘ ఈ పాట వ్రాసారు. 

మృదుల భావనా మాలికలు అన్నమాట అత్యంత అపురూపమైనది. అలాగే తొగరువాతెర అన్న అద్భుతమైన పదం నాకు తెలిసి సినీమాల్లో మరెవరూ వాడగా వినలేదు. ఎర్రని పెదవి అని దానర్థం. తెలుగుతో పాటు సంస్కృతం, హిందీ భాషలు కూడా చదువుకున్న వాసిరెడ్డి ఈ మాటలు వ్రాసారా అని నా ఊహ. 

మరపురాని మాటలు మాత్రమే కాక అవి కూర్చే విధానం కూడా కొత్తగా, అత్యంత సుందరంగా ఉన్నపాట ఇది.  పరుగులెత్తే భావనామాలికలు నునుసిగ్గు దొంతరలపై మొగ్గు అంతరార్థాలు చెప్పమనడం, తొగరువాతెర కప్పిన చిగురు కోరికల మరుగు, తెరగు ఏమిటో చెప్పమనటం, పొటమరించిన ప్రేమ దిటవుగా పాదుకొని పరిమళిస్తుందో ఫలితమిస్తుందో చెప్పమనడం, ఇలా చూసినకొద్దీ అబ్బురపరిచే పాట ఇది.  పరిమళించునో ఫలితమిచ్చునో అని వ్రాయకుండా పరిమళించునే ఫలితమిచ్చునె అనటం వల్ల వచ్చిన సొగసు, ఒక ఆరాటం కూడా గమనించండి. 

రచనా శిల్పపరంగా పల్లవి ఎలా ఉందో చరణాలు కూడా అదే కూర్పుతో సుంకర వాసిరెడ్డి వ్రాసారు.  అన్నింటికీ ఫార్ములా ఒకటే. ఇది మరో విశేషం. ఒకే తీరుగా ఉన్న పల్లవి, చరణాలను వైవిధ్యంగా స్వరపరచి గానం చేసి తన సామర్ధ్యాన్ని చాటుకున్నవారు ఘంటసాల. అసలు ఈ పాటకే గాక మొత్తం సినిమాకు ఆయన చేసిన సంగీతం చాలా గొప్పది, పరిశీలించదగ్గది. 

పాతాళభైరవికి తర్వాత చంద్రహారంకు ముందు సమయంలోని రామారావుని, దేవదాసుకు ముందు అప్పుడప్పుడే నాయికగా కొత్తగా ఎదుగుతున్న సావిత్రిని చూడటానికి ఈ పాట మంచి అవకాశం. సావిత్రి హావభావాల్లో ఒకలేతదనం, అమాయకత్వం కనబడతాయి. 

ఇలా అనేక మంచి విశేషాలు ఉన్న ఈ అద్భుతమైన పాటను మనకు మిగిల్చిన సుంకర వాసిరెడ్డి సినీ లోకం లో కూడా స్మరణీయులే.

మద్దుకూరి విజయ్ చంద్రహాస్

మద్దుకూరి విజయ చంద్రహాస్: సాహిత్యం సంగీతం ప్రత్యేకంగా అభిమానిస్తారు. వినడం, చదవడం, ఎప్పుడైనా వ్రాయటం, నచ్చిన వాటి గురించి ఆసక్తి ఉన్నవారికి చెప్పటం, సహధర్ములతో సమయాన్ని గడపటం ఆయనకు ఇష్టమైన విషయాలలో కొన్ని. ప్రస్తుత నివాసమైన డాలస్ లో తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని తోచిన సహాయం చేయటం కూడా ఒక వ్యాపకం.

2 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.