ఎక్కడరా పాయసం బూరెలూ?

చాలా రోజుల తర్వాత కాదు, సంవత్సరాల తర్వాత వూరు వెళ్ళాను. నా చిన్న తనం లో తిరిగిన వూరు. మట్టి రోడ్లన్నీ ఇరుకు సిమెంటు రోడ్లయాయి. మందులమ్మిన బాలస్వామి కొట్టయితే అలాగే వుంది. పొడుగు చేతుల తెల్ల చొక్కా , గ్లాక్సో పంచె కట్టుకుని స్కూలు కెళ్ళే పిల్లల్ని పలకరించి బాగా మార్కులొస్తే పెప్పరమెంట్లు పెట్టేవాడు. అలా వీపు తట్టేవాళ్ళున్నారా అనిపిస్తుంది.

కొంచెం ముందుకెళితే గుడ్డల సాంబయ్య అంగడి. సంవత్సరం పొడుగునా వచ్చే బంధువులకి అప్పు చేసి మరీ కొనుక్కొచ్చిన మానాన్నంటే అతనికి భలే గౌరవం. ఇల్లు మారింది. అంగడి లేదు. అక్కడే దర్జీ లాలు దుకాణం వుండేది. సంవత్సరానికొకసారి కుట్టించే రెండు జతల బట్టల కోసం వారం తిరిగి పోయే వాళ్ళం. అక్కడే మెట్ల మీద తాంబాకు సున్నం కలిపి తింటూ కబుర్లాడే బండల బజారు ఎర్రపళ్ళ నక్షత్రమ్మ. వాళ్ళిద్దరి గురించీ మాట వచ్చినపుడల్లా సుందర్రావు మాష్టరు నవ్వేవాడు.ఇప్పుడెక్కడుందో వుందో లేదో తెలీదు. అడిగితే బాగోదేమో కూడా తెలీదు. కానీ మర్చిపోలేను.

రేకు డబ్బా షాపు మీద పదిరోజుల కొకసారి అతికించే సినిమా వాల్పోస్టర్ మా అందరికీ పెద్ద మోజు. ఎపుడు బొమ్మ మారుతుందా అని చూస్తూ మారినపుడల్లా అరగంట సినిమా అక్కడే గడిచేది. మా సుబ్బిగాడైతే అక్కడే రోడ్డు మీద రకరకాల భంగిమలు పెట్టి భలే నవ్వించేవాడు. పోస్టర్ లోవున్న బొమ్మలన్నీ రాత్రి కలలో కధలల్లేసేవి.

మూడ్నెల్లకోసారి అమ్మని కాకా పట్టి రాత్రి ఆట కెళ్లడం పెద్ద సాహస గాధ. నమో వెంకటేశా పాట వినగానే గోనెపట్టాలేసుకు తెరముందు తడికల హాల్లో కూచుని బీడీ చుట్టల వాసనలతో చూసొచ్చిన పెద్ద తలకాయల బొమ్మలు వారాలపాటు కళ్ళలో కదలాడేవి. గుర్రాలు, కత్తి యుద్ధాలు, తుపాకీ మోతలు, డీరిడిరిడిరిడీరిడీ అని పాడుతూ అనుకరిస్తూ మా సుబ్బి వేసే స్టెప్పులు, నెలపాటు కధాప్రవచనం ప్రదర్శన స్కూల్లో పరమానందం. ఎన్నిసార్లు హాలు బయట తొట్లో పడేసిన రీళ్ళ ముక్కలు నేను సుబ్బిగాడు సాహసంగా దొంగతనం చేయలేదు? ఇపుడా హాలుండే చోట పెద్ద ఏసి హాలుంది. ఆనందముందా? ఏమో? ‘రారా సినిమా కెళ్దాంఅని సుబ్బిగాడన్నాడు. ఇవాళ రాత్రికెళ్ళాల్సిందే.

వూరిమధ్యలో వున్న అంకమ్మ చెట్టైతే అలాగే వుంది. సాక్షి పెద్దమ్మలా నోరు మెదపకుండా. ఒకసారి వేసంగి లో బిందెలకి మాట్లు వేసేవాళ్ళు వచ్చి నెలరోజులుండి వూళ్ళో ఇద్దరు పిల్లల్నెత్తుకు పోయారు. వాళ్ళెలా వున్నారో అని వారంపాటు నేనూ సుబ్బిగాడు దిగులుపడ్డాం. ఏం వూరో ఏమో. ఎప్పుడు ఎవరొచ్చినా ఎవరింటికి ఎక్కడ్నించీ అని అప్పట్లా అడిగే వారెవరూ కనిపించట్లా. పిల్లలూ గోలీకాయలు గిల్లీదండాలు ఆడట్లేదు. అప్పయ్య గానుగ ఏమయిందో తెలీదు. సాయంత్రం ఐదవుతున్నా కళ్ళాపి చల్లి ముగ్గులెక్కడా లేవు. ఎవరూ బయట అరుగుల మీద కూచోట్లేదు. పెద్ద చక్రాల ఎద్దు బళ్ళూ టైరు బళ్ళూ లేవు. ఇవన్నీ నా పిల్లలకి చూపిద్దామనుకున్నా. సర్రున మొబైలు మెళ్ళో ఇరికించుకు పిల్లడెవడో ఎద్దంత బండిమీద దూసుకుపోయాడు

కష్టపడి బాపయ్యగారిల్లు గుర్తుపట్టి సందు లోకి తిరిగాను. సుబ్బిగాడిల్లు. కొద్దిగా ముందువైపు మారింది. సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వచ్చాను. ఎలా వున్నాడో అనుకుంటూ తలుపుతోశాను. బయట సావడిలో ఇద్దరాడాళ్ళు ఎండు మిరపకాయల తొడిమలు తీస్తున్నారు. నన్ను గుర్తుపట్టలేదు. ఎలా గుర్తుపడతారు సుబ్బిగాడే గుర్తు పట్టలేడు. ‘సుబ్బారావు?’ అడిగాను. ‘పెద్ద సుబ్బారావా చిన్న సుబ్బారావాఅడిగారు. కొంచెం సందిగ్ధంగాపెద్ద సుబ్బారావేఅన్నాను.

ఎగాదిగా చూసిఇంకెక్కడి సుబ్బన్న. రెండ్నెల్ల క్రితమే జ్వరం వచ్చి పోయాడు.’ చెప్పారు. ‘నువ్వు పెద్ద పొజిషన్లో మా యింటి కొస్తే నీకిష్టమైన పాయసం కొబ్బరి బూరెలొండించి పెడతాఅని పెద్దగా నవ్విన సుబ్బిగాడే కళ్ళలో మెదుల్తున్నాడు. ‘ఏరాఎక్కడరా పాయసం బూరెలూ’? వాడిమీద కోపంగా వుంది. ఇక ఇక్కడెవరున్నారని రావాలి?  నా వూరు చచ్చిపోయింది.

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

6 comments

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.