ఐక్యత!

ఆవేశంగా కాకుండా ఆలోచనగా, మత్తులో కాకుండా మెలకువగా అడుగులు వేద్దాం. అంతరార్థాల, నేయార్థాల కవిత్వం లా కాకుండా స్ఫష్టసరళ వచనంగానే నడుద్దాం. ఒక అవాంఛనీయాన్ని అవాంఛనీయమని అనడంలో ఏకమవుదాం. శరీరంలో పెరిగిన కంతిని తొలగించుకుందాం. శస్త్రచికిత్స బాధాకరం. చికిత్స మానేస్తే వేదన, మరణం. 

ఇవాళ మనల్ని పీడించే అతి పెద్ద జబ్బు అనైక్యత. ఇది పరాన్నభుక్కులకు మేలు చేసే జబ్బు. పరాన్నభుక్కుల పంచమాంగదళాలు జ్వరం గొప్పదనాన్ని కీర్తిస్తాయి. దొరల సేవకు వీలుగా మనుషులను కుల, మతాలుగా విడదీస్తాయి. కుల, మత విభజన ఆజన్మ సహజమని వాదిస్తాయి. 

కాదు. ఇది సహజం కాదు. కృత్రిమం. హానికరం. దీన్ని దీని అన్ని రూపాల్లో  వొదిలించుకోవాలి.  

కుల, మతాలు పుట్టిందీ బట్ట కట్టింది యథాతథ స్థితి పరిరక్షణ కోసమే. పురోగతి కోసం కాదు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. నిలువుగా కోసి చూసినా అడ్డంగా కోసి చూసినా మైక్రోస్కోపులో, టెలిస్కోపులో ఎలా చూసినా కుల, మతాలు తిరోగాములే. పుటకతో వొచ్చినవని అంటారు. కాదు. పుట్టాక వొచ్చినవే. అందరూ యోనిజులే. ఎవ్వరూ తలలకు, మొండాలకు, వక్షాలకు, కాల్జేతులకు, కాగితాలకు పుట్టలేదు. 

అందరం లోపలా బయటా సుబ్బరంగా స్నానం చేయాల్సి వుంది. శుభ్రపడితేనే మనుషులెవరో మనుషుల మీద బతికే క్రిములెవరో తెలుస్తుంది. అరమరికలు లేని విమర్శఆత్మవిమర్శ మన స్నానం.

‘కుల, మతాలు పుటకతో వొచ్చినవి, అవి పోవు’ అనే సిద్దాంతం చేసిన కీడు అంతా ఇంతా కాదు. ఎటేపు నుంచి చూసినా అది మనువాదమే. నిద్దరలేవాలి. ఇనుపగృహంలా కనిపించే ఈ భ్రమను పట్టుదలగా కూలదొయ్యాలి. ముందుకు పోవలసిందే గాని అటు పోతే మేలని కొందరు, కాదు ఇటు పోతే మేలని కొందరు… వుద్యమాల్ని చీల్చి కుప్పలేసిన వామపక్ష సమరశీలుర వల్ల జరిగింది కూడా కులమతాల వైనమే. మరిన్ని కోతలే. 

‘పోటీ కుంపటి మీద 
వుద్యమ మాంసం వుడుకుతున్న వాసన
ఎవరండీ ఇట భోక్తలు?’ 

అని ఆరా తీయాల్సిన దుస్థితి నేడు.

ప్రగతిశీల శక్తులు ఇవాల్టి ముక్కలు ముక్కల స్థితికి సంబరపడుతున్నాయి. చీలిక తరువాత చీలికకు వువ్విళ్లూరుతున్నాయి. ఫ్రాగ్మెంటేషన్ని పండుగ చేసుకుంటున్నాయి. విభజన దానికదే గొప్ప అన్నట్టు చిందులేస్తున్నాయి. చివరాఖరికి విభేదించే సోదరుడిని ఈసడించి శతృవు కొలువు చేరిన ‘వంది’తో సరసాలాడుతున్నాయి. కులవృత్తిలో గొప్ప సౌందర్యం వుందని, ఎవరి కులగీత వారు పాడుకునే దురవస్థను కళాత్మకం చేశాయి. ఒకరిది రెడ్డి రాజ్యం, మరొకరిది కమ్మ తేజం. బ్రాహ్మణ్యం ఎంచక్కా నవ్వుకుంటోంది. వారికి శిరో స్థానమిచ్చిన మనువు ఇండియాను పట్టి వదలని దయ్యమయ్యాడు. అంతే కాదు. ఒక దళితుడు మరో దళితుడిని త్రోసిరాజని గుంపులు కట్టడం ‘రియల్ పాలిటిక్స్’ అయిపోయింది.

ఎక్కువ ఉదాహరణలు అక్కర్లేదు. ఇది నిజమో కాదో తెలుసుకోడానికి పెద్ద పరిశోధనలూ అవసరం లేదు. ప్రతి ప్రగతిశీలి తన లోకి తాను చూసుకుంటే చాలు. తనవాళ్ల నుంచి తాను విడిపోవడమే కాదు, తన నుంచి తాను విడిపోతున్న దృశ్యం కనిపించి తీరుతుంది.

చీలికలు పేలికల క్రమంలో యెవరికి యెవరు వుపయోగపడ్డారు? పడుతున్నారు? పండుగ భక్ష్యాలు వుట్టి మీద పెట్టి తలుపులు మూయడం మరిచిపోయిన యింట్లో కుక్కలు పిల్లులు దూరినట్లు… విభజనోత్సాహం మన యిళ్ల తలుపులను ప్రతీప శక్తులకు బార్లా తెరిచింది. ప్రజా పోరాటాల ఫలితాలు కుక్కలు, పిల్లుల పాలవుతున్నాయి.

కళ్ల ముందు జరిగే అన్యాయాన్ని అన్యాయమని అనలేనంత దీనోచిత జీవితాలయ్యాయి నేడు మనవి. కశ్మీర్ దమనకాండను నోరారా ఖండించలేని సార్వత్రిక నిస్సహాయత ఒక తాజా రుజువు.     

ప్రగతి శక్తుల మధ్య ఐక్యతకై వొక వుద్యమమే జరగాలి. ఏది సత్తు యేది చిత్తు అనేది వుద్యమ గీటురాయి మీదనే నిగ్గు తేలాలి. పాలిటిక్స్ లో పాల్గొంటేనే పాడయిపోం. ఎన్నికల వల్లనే ఏదో అయిపోం. ఈ దేశాన్ని కుల, మతాల నుంచి విముక్తి చేయకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయులేం.       

అది జరగనంత వరకు…. ‘మేమింతే మేమిలాగే ప్రజల్ని పిండుకుంటాం, మేమిలాగే సనాతన అధర్మాల్ని నవీన ధర్మంగా ప్రచారం చేసి జనం మెదళ్లకు సంకెళ్లు బిగిస్తాం, మీరేమీ చేయలేర’ని ప్రతీప శక్తులు వికటహాసం చేస్తూనే వుంటాయి. 

పౌర సమాజంలో అస్తిత్వ వుద్యమాలు ముందుకు వచ్చినప్పుడు జనం ముక్కలు ముక్కలుగా (ఫ్రాగ్మెంటెడ్ గా) వ్యవహరించడం సహజమే. సహ శ్రామిక సమూహాల్ని విస్మరించి యెవరి సంగతి వారు చూసుకోడం సహజమే. అది అలాగే నిర్నిబంధంగా కొనసాగదు. ప్రగతి శక్తులా, ప్రతీప శక్తులా… దాన్ని యెవరు వాడుకుంటారనే దాన్ని బట్టి ఆపైన సమాజ చలనం వుంటుంది. సహజ పరిణామం (స్పాంటేనిటీ) అనే దాన్ని కూడా తోసిరాజనలేం. తోసిరాజనరాదు కూడా. పిసికి పండు చేయడం కన్న చెట్టు మీద పండాక కోసుకోడమే సరైనది. పండు అయిన దాన్ని కోసుకోడం లేదా పండు కావడానికి తగిన దినుసులు అందించడం… అనే రెండు పనులు కూడా మానవ యత్నాలే. ఆ ప్రయత్నాలు యెవరు చేస్తారు… ప్రగతి శక్తులా, ప్రతీప శక్తులా… అనే దాన్ని బట్టి  సమాజ చలనం వుంటుంది. 

నిస్సందేహంగా ఈ సారి ప్రగతి శక్తులు వెనుక బడ్డాయి. తమలో తాము కలహించుకుని మరింత ఫ్రాగ్మెంటేషన్ కి లోనయ్యాయి. విడిపోవడమే వుద్యమమైపోయింది. యెందుకు విడిపోతున్నామో చూసుకోలేనంత మైమరుపు. విడిపోవద్దని, కలిసుందామని, మాట్లాడుకుందామనే వాళ్ల మాటను పెడచెవిని పెట్టాయి. 

ప్రగతిశక్తులు సంఘటనల తోక పట్టుకుని గోదారి ఈదాలనుకుంటున్నాయి. సహజ గతిలో జరిగే పరిణామాలలో ప్రజానుకూలమైన వాటిని ఎంపిక చేసి, ఆ దిశగా సమాజాన్ని కదిలించాల్సిన పని చేయకపోవడం వల్ల ప్రతీప శక్తులది విజయమయ్యింది. జీవితం అన్న తరువాత మనుషులు…  రకరకాలుగా కలిసి, విడివడి సమాజ గతిని ప్రభావితం చేస్తుంటారు. సమీకరణాలూ కదలికలు పైకి కనిపించేంత తార్కికంగా జరగవు. సమాజం లోని నాయక శక్తులు వాటిలో కలుగజేసుకుంటూ వుంటాయి. దిశలను మార్చేస్తుంటాయి. 

కలుగజేసుకోడం యివాళ యే దిశగా జరుగుతోంది? ప్రగతిశీల చలనానికి యేయే శక్తులు కలవాలో వాళ్లు కలవడం లేదు. యెవరెవరు కలవకూడదో వాళ్లు కలుస్తున్నారు. 

ఈ దృశ్యాన్ని మార్చలేమా? ఇది ప్రగతివాదులందరి ఆత్మావలోకన సమయం. నేను ఆత్మ విమర్శ చేసుకునేదేమీ లేదు అనుకునే వారి రెక్కలు వారి అత్మలకు అంటుకుని విడవు. వాళ్లెప్పటికీ యెగరలేరు. జనం జెండాల్ని యెగరేయనూ లేరు. 

ముక్కలు ముక్కలైపోయాం. మనల్ని మనం కలిపి కట్టుకుందామా?

కలిపి కట్టుకోలేకపోతే కేవలం మన ఆభిజాత్యాల శిధిలాలే వుంటాయి, మన డొల్ల కిరీటాలే వుంటాయి. మనం వుండం!

మునుపు మనల్ని ముక్కలు చేసుకున్నది మనమే కావొచ్చు. గతంలో మనల్ని ముక్కలు చేసిన సిద్దాంతాల కర్తలం మనమే కావొచ్చు. 

మునుపటి మన కత్తుల పదును నిరూపించడానికి మన కుత్తుకలు మనం కోసుకునే వైఖరిని విడనాడితే…

ప్రజల కోసం చేయాల్సిన త్యాగాలలో మొట్ట మొదటిది భేషజాల త్యాగమేనని గుర్తించగలిగితే… 

విభజనలకు అతీతంగా అలోచించగలుగుతామేమో! 

మడమ తిప్పని యోధులం అనిపించుకోడం గొప్ప యేమీ కాదు. యేమి తిప్పినా యేమి తిప్పకపోయినా చివరికి ప్రజలు గెలవాలి. 

ప్రగతి శక్తలకు ప్రతీప శక్తులకు మధ్య యుద్దం యెన్నాళ్లు జరిగినా, యెన్ని మలుపులు తిరిగినా అడుగడుగునా ప్రజలే గెలవాలి. ప్రజలు గెలవడమంటే సమాజం ముందుకు పోవడమని అర్థం. కొన్ని వొడిదుడుకులున్నా, సమాజం చలించేది ముందుకే. ప్రజల కోసం అవసరమైతే… ప్రగతి శక్తులు మడమ తిప్పడానికీ వెనుదీయరాదు. సొంత భేషజాలకు జన ప్రయోజనాల్ని బలి పెట్టరాదు.   

ఇది అందరం కలవాల్సిన సమయం. లేకుంటే చస్తాం.

యెస్, ఛస్తాం. 

వుదాహరణకి ఇవాళ దళిత శ్రేణులు బియెస్పీతో మాత్రమే లేరు. భిన్న పక్షాల మధ్య చీలిపోయి వున్నారు. గత రెండు దశాబ్దాలలో సమాజంలో వచ్చిన క్వాంటిటివ్ మార్పులు దీనిక్కారణం. యివి క్వాలిటేటివ్ మార్పులు కావు గాని, రాజకీయ సమీకరణాల మీద నిర్ణాయక ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడు కావలసింది విభజన కాదు. ప్రగతి శక్తుల మధ్య ఐక్యత. అది ఒక సమస్య నుంచి మరో సమస్య వరకు వుండే ఐక్యతైనా ఫరవా లేదు.

దళితుల్లో పెట్టు బడిదారులు రావాలి, దళిత కవుల్లోంచి కృష్ణ శాస్త్రులు రావాలి అనుకున్నాం. అప్పుడు గాని సమాజంలో దళితులు సాధించుకుంటున్న ప్రజాతంత్ర స్థానం పదిలం కాదని అనుకున్నాం. సమాజం యింకా అంత ముందుకు పోలేదు. పేద కులాలలో కాస్త బాగు పడిన వాళ్లు ప్రతీప శక్తులతో కలిసి పోవాలని వువ్విళ్లూరుతున్నారు. చూడరాదూ కాస్త నోరుందనుకునే జూపూడి ని, మంద కృష్ణ ను. ఇది సహజం. తప్పు పట్టి ప్రయోజనం లేదు. బహిరంగ విమర్శ  ఆత్మవిమర్శ సూదీదారంగా ప్రగతి శక్తులు తమను తాము కలిపి కుట్టుకోడానికి దారులు వెదకాలి. 

ఉన్న మంచి సెబ్బరలు లేవని భ్రమించడం కన్న… వున్న పరిస్థితిలో గెలుపు దారులకై అన్వేషణ వుపయోగకరం.  

 

29-8-2019

హెచ్చార్కె

6 comments

  • ఇవాళ మనల్ని పీడించే అతి పెద్ద జబ్బు అనైక్యత. 100% వాస్తవం.

  • ఆత్మ విమర్శ స్నానం అవసరం!నిజం సర్!ఆర్టికల్ బాగుంది💐ధన్యవాదాలు బాగరాశారు..!

  • చాలా బాగుంది. ఆఖరి పేరా లో ‘సెబ్బరలు’ అంటే ఏమిటి?

  • మార్క్స్ చెప్పినట్లు ..విప్లవం కంటే ముందు విప్లవ సంస్కృతి నెలకొంటుంది. ఆ విప్లవ సంస్కృతి రావడానికి మీలాంటి మేధావులు రాసే ఇలాంటి ఆర్టికల్స్ గొప్ప ఉపయుక్తం.. మీ ఆలోచన చాలా గొప్పది..ప్రోగ్రెసీవ్ ఆలోచనలు ఉన్నవాళ్లు ..పీలికలు పీలికలుగా విడిబోతూ..రాజ్యపు వలలో పడుతున్న అన్ని సామాజిక శక్తులు ప్రస్తుతం చదవాల్సిన గొప్ప ఆర్టికల్ ను అందించారు..మీకు గొప్ప ధన్యవాదాలు సర్!

  • ప్రజల కోసం చేయాల్సిన త్యాగాలలో మొట్ట మొదటిది భేషజాల త్యాగమేనని గుర్తించగలిగితే… true true …

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.