>జల జల పొంగే
నెత్తుటి ఉడుకుని
సన్నరాలు* తెగిపడేలా వొత్తిపట్టి
దాన్ని మాటలుగానో
అక్షరాలుగానో
కాలువగట్టించి
జనసేద్యం చేస్తున్నందుకేనా
ఈ గుళ్ళవాన
ఇంతకీ
మీరేమడిగారు గౌరీ
నువ్వేం చెప్పావ్ కల్బుర్గీ
మీరంతా ఏం చేశారని
ఈ నెత్తుటి ధార…
అయ్యా
సాయిబాబా
నీ పాఠానికి
పాదాలు పుడుతున్నాయా..!
నీ చక్రాలకుర్చీని చూసి
ఎర్రకోటకెందుకంత వణుకు
నాయనా వరవరా
మళ్ళొక్కసారి చెప్పవయ్యా
ఈ సాములోర్ల సొట్టబుగ్గల్లోకీ
బానపొట్టల్లోకీ
బాయ్ నెట్లు దిగబడతాయని భయపడొద్దనీ..
ప్రశ్నను చూచి
ఆయుధమనుకోవద్దనీ
కొన్ని ప్రశ్నల్ని కాల్చేసీ
కొన్ని ప్రశ్నల్ని ఖైదుచేసీ
కొన్ని ప్రశ్నల్ని కప్పెట్టేసీ
ఆయుధాల్ని మాయం చేశామనుకుంటే అబధ్ధమనీ
ప్రశ్నకు ఆయుధమే అవసరం లేదనీ….
నుదుటిమీదే కాల్చేకొద్దీ
చిందిన ప్రతినెత్తుటిచినుకూ
కనిపించకుండానే వేలవేల ప్రశ్నలుగా
అబధ్ధపు బతుకుల్ని
కూల్చేందుకు వడ్రంగిపిట్టై
వస్తానే ఉంటుందనీ..
బెరడుచాటునుంచి పురుగు బయటకు రాకా తప్పదు
విలవిల లాడక తప్పదని.
రాయవలసిన సందర్భం…. సానుభూతి ప్రకటన కోసం అందరం గొంతు కలపాల్సిన అవసరం… బావుంది అన్నా మీ కవిత.