రానున్న ఫాసిజం ముందస్తు
హెచ్చరిక: ‘రామ్ కే నామ్’

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డాక్యమెంటరీ ప్రదర్శన

గస్ట్ 20, 2019. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో ‘రామ్ కే నామ్’ (రాముని పేర) డాక్యుమెంటరీ ప్రదర్శన జరుగుతోంది. పోలీసులు దూసుకొచ్చారు. పర్మిషన్ లేకుండా వేస్తున్నారంటూ ఆరుగురిని అదుపులోకి(!) తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్నామని విద్యార్థులు చెప్పారు. వారం తిరక్కుండానే కోల్కతా ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో ఒకే పరిస్థితి. మొదట సినిమా స్క్రీనింగు కోసం హాలు కేటాయించారు అధికారులు. సినిమా పేరు వినగానే జడుసుకుని పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. ఎందుకింత భయం? ఇదేమన్నా నిషిద్ధ సినిమానా? కాదే! భారత సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ తీసుకున్నదీ, కోర్ట్ ఆదేశం మీద దూరదర్శన్ ప్రైమ్ టైంలో చూపబడ్డదీనూ. దూరదర్శన్ ప్రదర్శనకు అడ్డుచెప్పిన ప్రభుత్వమే ఈ సినిమాకు 1992లో ఉత్తమ పరిశోధనాత్మక డాక్యుమెంటరీగా జాతీయ బహుమతి అందించింది.  అదే సంవత్సరం ఫిలిం ఫేర్ వారు దీన్ని ‘బెస్ట్ డాక్యుమెంటరీ’ అన్నారు. జపాన్ యమగతా అంతర్జాతీయ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్లో సిటిజెన్ ప్రైజు, స్విట్జర్లాండ్ ఫ్రిబౌర్గ్ ఫెస్టివల్ ప్రైజు, న్యాన్ ఎకుమేనికాల్ ప్రైజు – ఇలా ఎన్నెన్నో అవార్డులు గెల్చుకున్న ప్రపంచ ప్రఖ్యాత సినిమా.

దర్శకుడు ఆనంద్ పట్వర్ధన్:

ఆనంద్ పట్వర్ధన్

భారత డాక్యుమెంటరీ చరిత్రలో పరిచయం అఖ్ఖర్లేని పేరు ఆనంద్ పట్వర్ధన్. ప్రభుత్వ న్యూస్ రీళ్ళు తప్ప ఇండిపెండెంట్ డాక్యుమెంటరీ అంటే ఏమిటో తెలీని మన దేశంలో ఎమర్జెన్సీ కాలంలో జరిగిన అన్యాయాలను రికార్డు చేసింది అతని డాక్యుమెంటరీ ‘ప్రిజనర్స్ ఆఫ్ కాన్సైన్స్’ (వివేకం వలన బంధీలు/వివేకానికి బంధీలు) (1978).  ఆ తర్వాత వచ్చిన వాటిలో ముఖ్యమైనవి ‘బొంబాయి: హమారీ షెహర్’ (1985) (బొంబాయి ఫుట్పాత్ బ్రతుకులపై), ‘ఇన్ మెమోరీ అఫ్ ఫ్రెండ్స్’ (1990) (పంజాబ్ లో భగత్ సింగ్ జన్మదిన వేడుకల ద్వారా మతసామరస్య నిర్మాణంపై). పోఖ్రాన్ అనంతరం భారత్-పాక్ ఇరుదేశాల్లో అణుయుద్ధ ఉన్మాదాన్ని ‘వార్ అండ్ పీస్’ (అమ్మో! జడ్జి గారు వినలేదు గదా?) విశ్లేషించింది.  ముంబై అల్లర్లను చిత్రిస్తుండగా మతకలహాలు పురుషకృత్యాలనీ, వీటి వెనుక ‘పుంసత్వ అభద్రత’ అన్న కోణం దాగి ఉందనీ కనుగొని, ఆ విషయంపై రెండు భాగాల సుదీర్ఘమైన ‘ఫాదర్, సన్ అండ్ హోలీవార్’ నిర్మించాడు. తాజాగా హేతువాదుల వరుసహత్యలపై, హిందూత్వ ఉగ్రవాదంపై పది భాగాల ‘రీజన్’ తీశాడు. అతడి సినిమాలు ఉద్గ్రంధం చదివినంత తృప్తినిస్తాయి. ఈ సినిమాల ప్రేరణతోనే ఎందరో యువకులు డాక్యుమెంటరీని పోరాట ఆయుధంగా ఎంచుకున్నారు. అతని సినిమాలకు అవార్డులు ఇచ్చిన ప్రభుత్వాలే డిడి లో ప్రదర్శించడానికి నిరాకరించాయి. ప్రతిసారీ కోర్టు యుద్ధమే శరణ్యమైంది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విమర్శిస్తే అద్వానీలకు భలే నచ్చింది కానీ, అద్వానీ రథయాత్రను విమర్శించడం మాత్రం హిందుత్వవాదులకు కంటగింపైంది. (మన్మోహన్ ప్రభుత్వాన్ని విమర్శించిన ఎన్ డి టి వి ఒకప్పుడు నచ్చి ఇప్పుడు నచ్చనట్టు!) ఆ రథయాత్ర కాలం నుంచే మన దేశంపై విరుచుకు పడుతున్న కాషాయోగ్రవాద పెనుముప్పును హెచ్చరిస్తూ వస్తున్నాడు ఆనంద్. అప్పట్నించే సంఘ పరివారం అతని సినిమాల ప్రదర్శనలకు అడ్డుపడుతున్నారు.

డాక్యుమెంటరీ నేపథ్యం:

మొఘలుల కాలంలో 1528 లో బాబర్ సేనానాయకుడు మీర్ బాకి అయోధ్యలో ఒక మసీదును నిర్మించి దానికి బాబర్ పేరు పెట్టారు. రామాయణం ప్రకారం అయోధ్య రాముడి జన్మస్థలం. బాబ్రీ మసీదు వున్న స్థలంలోనే రాముడు పుట్టాడనీ, అక్కడ ఒక రాముడి ఆలయం ఉండేదనీ, దాన్ని పడగొట్టించి మసీదు కట్టారనీ ఒక వివాదం బ్రిటీషు కాలం నుండే వుండేది. అయితే దానికొక సామరస్యమైన పరిష్కారం కూడా గతంలో వుండేది. హిందువులు రామ్ చబుత్రా దగ్గర పూజలు, ముస్లింలు మసీదులో నమాజులు చేసుకునేవారు.  కానీ 1949 లో మసీదు లోపల రాముడి విగ్రహాలను రహస్యంగా పెట్టారు. చాలా రకాల కోర్టు కేసుల తర్వాత మసీదు ద్వారాలు మూతపడ్డాయి.

జాదవ్ పూర్ యూనివర్సిటీ లో డాక్యుమెంటరీ ప్రదర్శన

1980 వ దశకంలో విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) రంగం మీదికి రావడంతో రామాలయ నిర్మాణ ప్రచారం ఊపందుకుంది. దీనికి భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాజకీయంగా మద్దతు ఇచ్చింది. 1990 సెప్టెంబరులో బిజెపి నాయకుడు ఎల్. కె. అద్వానీ ‘రామ జన్మభూమి’ సాధనకై సారనాథ్ నుండి అయోధ్య నగరానికి ఏ.సి. టొయోటా ‘రథయాత్ర’ ప్రారంభించాడు. ఈ యాత్ర పొడుగునా మత కలహాలు జరిగాయి. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అద్వానీని బీహారులో లాలూ ప్రభుత్వం అరెస్టు చేసింది. పెద్ద సంఖ్యలో విహెచ్‌పి వాలంటీర్లు అయోధ్యకు చేరుకుని మసీదుపై దాడి చేశారు. అక్టోబర్ ౩౦ నాటి దాడి సమయంలో ఆర్మీ కాల్పులు జరపలేదు. నవంబర్ 2 న రెండోసారి దాడి సమయంలో కరసేవకులకు ప్రభుత్వ పారామిలిటరీ దళాలతో పోరాటం జరిగింది. విహెచ్‌పి వాలంటీర్లు మరణించారు. (మృతుల సంఖ్యను ‘నవకాల్’, ‘సామ్నా’ పత్రికలూ పోటీలు పడుతూ పెంచి రాశాయి.) ఈ సినిమా బాబ్రీ మసీదు కూల్చివేతకు మునుపటి వరకు చరిత్రను నమోదుచేస్తుంది. 1992 డిసెంబర్ 6 న మిలిటెంట్లు మసీదును కూల్చివేసిన సంగతిని సినిమా ఆఖర్లో తెరపై వేస్తారు.

బాబ్రీ చరిత్రపై దర్శకుడు:

       రామజన్మభూమి వివాదం పొడుగునా ఇది హిందువుల నమ్మకానికి చెందిన విషయం అని అద్వాని తన ప్రసంగాలలో నొక్కి చెప్పడం మనం చూస్తాము. ‘కోర్టు తీర్పు ఎలా వున్నా మేము అక్కడ మందిరం నిర్మించి తీరుతాము’ అని విహెచ్‌పి ముందునుంచే చెబుతోంది. ‘అక్కడ రాముడు జన్మించాడా లేదా అన్నది కోర్టులా నిర్ణయించేది?’ అని ఒక సభలో అద్వాని సవాలు విసురుతాడు. దీన్నిబట్టి, వీరికి చరిత్రపైనే కాక న్యాయవ్యవస్థపై కూడా ఎంత గౌరవం వుందనేది మనకి తెలిసిపోతుంది. అయినా సరే సినిమా ఆరంభంలోనే చాలా ఓపికగా బాబ్రీ చరిత్రను వివరించే ప్రయత్నం చేస్తాడు దర్శకుడు. బాబ్రీ నిర్మితమైన 50 ఏళ్ళ తర్వాత తులసీదాసు తనదైన రామచరిత్రను (‘రామ్ చరిత మానస్’) రాశాడు. (కొద్ది సంవత్సరాల క్రితమే భవ్యమైన రామ మందిరాన్ని కూల్చివేస్తే, అంత పెద్ద రామభక్తుడు ఆ విషయాన్ని తన గ్రంథంలో వుల్లెఖించే వాడు కదా అన్నది చాలమంది విశ్లేషకుల అభిప్రాయం. తెలుగులో ఈ వివాదంపై వచ్చిన మంచి పుస్తకం దివికుమార్ గారి‘అయోధ్యలో రావణకాష్టం’.) 19 వ శతాబ్దం నాటికి అయోధ్య ఎన్నో రామమందిరాలతో నిండిపోయింది. ప్రతి మందిరమూ తనున్నచోటే రాముడు పుట్టాడని చెబుతుంది. ఒకే రాముడు ఎన్ని చోట్ల పుట్టాలి? లేక బలవంతుడు చెప్పినచోటే పుట్టాలా? స్వాతంత్ర్య ఉద్యమంలో బలపడుతున్న హిందూ ముస్లిం ఐక్యత బ్రిటీషు వారికి కంటగింపుగా వుంది. అందుకే మందిరం పడగొట్టి మసీదు కట్టారన్న అపవాదుకు ఆమోదముద్ర వేసి ప్రచారం చేశారని చెబుతాడు దర్శకుడు. మసీదులో రాముని విగ్రహం ప్రతిష్టించడంలో అప్పటి అయోధ్య జిల్లా మేజిస్ట్రేట్ నయ్యర్ పాత్రను కూడా విశ్లేషిస్తాడు దర్శకుడు. కలలో రాముడు చెప్పిన ప్రకారమే ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని మసీదులో పెట్టాననీ, తనతో ఇంకొంత మంది కూడా ఉన్నారనీ, నయ్యర్ గారు చెప్పిన మేరకు అలా చేశామనీ మహంత్ శాస్త్రి అనే ఆయన చెబుతాడు. ‘మా ప్లాను ప్రకారం చేశాం, నేను ఇంకా ఎక్కువ మాట్లాడితే అరెస్టు కాగలను’ అని కెమెరాకు ముఖం చూపడానికి నిరాకరించిన మరొక వ్యక్తి చెబుతాడు. విగ్రహాలను తొలగిస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందన్న సాకు చూపి విగ్రహాలను అక్కడే వుండనిచ్చాడు నయ్యర్. ఈయన గారు తర్వాతి కాలంలో జన సంఘ్ ఎం.పి. అయ్యారని చెబుతాడు దర్శకుడు.

వాతావరణాన్ని వేడేక్కించిన వైనం:

       ఉద్యోగ రీత్యా ఆ రోజుల్లో హిందీ బెల్టులో ఉన్నందువల్ల మతతత్వ వాతావరణాన్ని ఎలా తయారుచేశారో నేను ప్రత్యక్షంగా చూశాను. వీడియో కేసెట్ల ద్వారా ఎన్నో కట్టుకథలు అల్లారు. ప్రజల మతనమ్మకాన్ని కొల్లగొట్టారు. మసీదులో డిశెంబరు 23 నాటి రాత్రి ‘చిన్ని రాముడు’ ఎలా ప్రత్యక్షమయ్యాడో వీడియోలు చూపారు. ఆ దృశ్యం సినిమాలో కూడా వుంది. దొంగతనంగా మసీదులో విగ్రహాలు పెట్టిన సంగతిని చాలా తెలివిగా దాటవేశారు ఆ వీడియోల్లో. సాధారణ ప్రజలకు చిటికెలో ఆకట్టుకునేట్టు చాలా చవకబారు నినాదాలు తయారు చేశారు. ‘తేల్ లగావో డాబర్ కా; నామ్ మిటావో బాబర్ కా’ (డాబర్ నూనె రాసుకుని బాబర్ పేరు చేరిపేయి) రెచ్చగొట్టేవి మరికొన్ని – ‘జిస్ హిందూ కా ఖూన్ న ఖౌలే – ఖూన్ నహీ వో పానీ హై’ (ఏ హిందువు రక్తం కోపంతో ఉడుకెక్కదో, అది రక్తం కాదు నీరు అయ్యుంటుంది.); ‘మారెంగే మర జాయేంగే – మందిర్ వహీ బనాఎంగే’ (చంపుతాము లేదా చస్తాం – కానీ మందిరం అక్కడే కడతాం) ‘బాబర్ బిడ్డల్ని నాశనం చేయలేకపొతే, చేతులకు గాజులు తొడుక్కోండి’ అని ఒక సాధ్వి ప్రసంగాలు! అరెస్టుకు కొద్ది రోజుల క్రితం అద్వానీ చేసిన రెచ్చగొట్టుడు ప్రసంగం నేను స్వయంగా విన్నాను. త్రిశూళాలు, ఖడ్గాలు పట్టుకుని కరసేవకు వెళ్తున్న వారిని సినిమా పొడుగునా చూస్తాం. ‘స్వాతంత్ర్యం తరువాత ఇంతెత్తున జరిగిన మరో ఉద్యమం లేదు. కానీ, ఆ రోజుల్లో ఉద్యమాలు ఒక ఆదర్శం కోసం జరిగితే, ఈ రోజు చూస్తున్నది చారిత్రికాధారం లేని, నమ్మకాలను రెచ్చగొట్టే ఒక కృత్రిమ ఉద్యమం’ అని చెబుతాడు అచిన్ వనిక్ ఇటీవల విడుదలైన ఒక డాక్యుమెంటరీలో.  ఈ రక్తపిపాస రణగొణుల మధ్య కొన్ని వివేకవంతమైన స్వరాలు చెవిలో అమృతం పోసినట్టు కమ్మగా వినిపిస్తాయి.

  1.       మహంత్ లాల్ దాస్: రామ్ జన్మభూమి ఆలయం కోసం కోర్టు నియమించిన ప్రధాన పూజారి ఈయన. ‘విహెచ్‌పికి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే ముఖ్యం. అంతేతప్ప విహెచ్‌పి సభ్యులు ఏనాడూ ఒక్క సంతర్పణా చేయలేదు లేదా ఆలయంలో ప్రార్థించనూలేదు’ అని ఇంటర్వ్యూలో చెబుతాడు లాల్దాస్‌. బిజెపి-విహెచ్‌పి రాజకీయ ప్రయోజనాలకు సేవ చేయడానికి ధైర్యంగా నిరాకరించిన యితడు తరువాతి కాలంలో హత్యకు గురయ్యాడు. (దర్శకుడు ఈ సినిమాను అతనికి అంకితమిచ్చాడు.) ప్రస్తుత పరిస్థితికి విరుగుడు ఏమిటి అని ఒకచోట అతడిని ప్రశ్నిస్తే, రామాయణం నుండి ఒక దోహాను ఉటంకిస్తూ – “వర్షాలు భారీగా ఉన్నప్పుడు, గడ్డి చాలా ఎత్తుగా పెరుగుతుంది, సరైన మార్గాన్ని కనుగొనడం కష్టం; కాబట్టి తుచ్చులు మాట్లాడేటప్పుడు, నిజం దాచబడుతుంది; కానీ వర్షాకాలం స్వల్పకాలికం, అది గడిస్తే, ప్రజలు తమ తార్కిక సామర్థ్యాన్ని తిరిగి పొందుతారు ” అని చెబుతాడు. సాధువు అనే వాడు సర్వసంగ పరిత్యాగి కావాలి. కానీ, ఈ (విహెచ్‌పి) సాధువులు సుఖభోగాల కోసం అర్రులు చాస్తున్నారు అని లాల్దాస్ చెబుతున్నపుడు, ఏ.సి. గదుల్లో కునుకులు తీస్తున్న సాధువులను, సన్ గ్లాసెస్ ధరించిన సాధువులను, ఏ.సి. కార్ల నుండి దిగుతున్న సాధువులను జక్స్ట్పోజ్ చేసి చూపుతాడు దర్శకుడు. ‘శిలాన్యాస్’ పేర బోలెడు డబ్బు గల్లంతయిన సంగతినీ ఉల్లేఖిస్తాడు లాల్దాస్.
  2.       విశ్వ బంధు గుప్తా: ఇతనో ఇన్కమ్ టాక్స్ అధికారి. విహెచ్‌పి విదేశీ డొనేషన్లనూ, ఖాతలనూ తనిఖీ చేసినందుకు రాజకీయ బాధితుడయ్యాడు. ‘ఈ దేశానికి సేవ చేద్దామని అమెరికా నుండి వచ్చాను. నిజాయితీగా పనిచేసినందుకు ఇటువంటి వేదన ప్రతిఫలంగా దొరికితే ఈ దేశంలో మంచివాళ్ళు మిగలరు’ అని కళ్ళనీళ్ళ పర్యంతం అవుతాడు. సినిమాలో అత్యంత శక్తివంతమైన క్షణాలలో ఈ దృశ్యం ఒకటి.
  3.       సి.పి.ఐ. నాయకుడు ఏ.బి. బర్ధన్: కమ్యునిస్టు పార్టీ పాట్నా గాంధీ మైదాన్లో ఏర్పాటుచేసిన రథయాత్ర వ్యతిరేక ర్యాలీని సంభోదిస్తూ -“అయోధ్యలోని ఏ భాగం రాముని స్పర్శతో పవిత్రం కానిదో చెప్పండి. మందిరం కట్టండి, కానీ మసీదు కూల్చి మాత్రమే కడతామని మాత్రం పట్టుపట్టకండి’’ అని చెబుతాడు. “స్వాతంత్ర్యం పొందిన 43 సంవత్సరాల తరువాత, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, వేలాది మంది యువత నిరుద్యోగులు, జనాభాలో సగానికి పైగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు, అనారోగ్యం, నిరక్షరాస్యత ప్రబలంగా ఉన్నాయి, అయితే ఈ సమస్యలేవీ లేవనీ, కేవలం మందిరం – మసీదు సమస్య మాత్రమే ఉందన్నట్టు చూపుతున్నారు” అని చెపుతాడాయన. ‘నా కుర్చీ వున్నా, పోయినా పర్వాలేదు. కానీ రథయాత్ర మతకోట్లాటకు దారితీయనివ్వను’ అని చెబుతాడు బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్.
  4.       అయోధ్య వాసులు: అయోధ్య వాసులకే కాక, చుట్టుపక్కల గ్రామాల వారికి ఈ వివాదమేమిటో అర్ధం కాదు. హిందూ ముస్లింలు చిరకాలంగా సఖ్యంగా ఉండేవారనీ, ఇక్కడ మతకొట్లాటలు జరిగేవి కావనీ చెబుతారు దర్శకుడికి చాలామంది. ముస్లిం రాజులు హిందూ దేవాలయాల కోసం భూములు దానం చేసిన విషయాన్ని చెబుతాడు ఒకాయన. గ్రామాల్లో ‘జై రాంజీకీ’ అని పలకరించుకునే సంప్రదాయం వుంది. అలా ముస్లింలు కూడా పలకరిస్తారు. అలానే ముస్లింలకు ‘అస్సాలామాలేకుం’ చెబుతారు హిందువులు కూడా. ఉత్తర ప్రదేశ్ గ్రామాల్లో ఈ ‘గంగా-జమునీ తెహ్ జీబ్’ (గంగా-యమునా సంస్కృతి) సజీవంగా వుంది. దానికి విఘాతం కలిగిస్తూ, నేడు ‘మర్యాదా పురుషోత్తం’ రాముడి పేర ‘జై శ్రీరామ’ హత్యల స్థాయికి దిగజార్చారు. యుద్ధానికి సన్నద్ధుడైన రాముడి చిత్రపటంతో ‘జై శ్రీరామ్’ అనేది యుద్ధనినాదంలా మలిచారు. ఆ వొరవడి ఆనాటి నుంచే మొదలైందని ఈ సినిమా చెబుతుంది. నిరంతర అబద్ధాల ప్రచారాల పాత్ర ఆనాటి నుండీ సజావుగానే వుంది. చదువుకున్న మేధావులు కూడా నేడు అభినవ ‘నయ్యర్లు’గా తమ పాత్ర పోషిస్తున్నారు.
‘మనుషులు మరణిస్తే దేవాలయాల్లో గంటలెవరు కొడతారు’– అప్పటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ.

ఎల్ పి జి ప్రారంభం – బాబ్రీ విధ్వంసం:

రామజన్మభూమి అయినా, హిందూ రాష్ట్ర నిర్మాణమైనా అందులో అగ్రవర్ణ ఎజెండా వుందని విశ్లేషిస్తాడు దర్శకుడు. వి.పి.సింగ్ ‘మండల్ కమీషన్’ తీసుకురావడం అగ్ర వర్ణాలకు నచ్చలేదని, దాన్ని వ్యతిరేకించడం కోసం ‘మండల్ కి బదులు కమండల్’ గా ఈ కృత్రిమ ఉద్యమం లేవదీశారనీ చెబుతాడు పట్వర్ధన్. అగ్ర వర్ణాల మంత్రశక్తిలో కొట్టుకుపోయిన నిమ్నకులాల వారు చాలా మంది వున్నారు. వారి ఉత్సాహం సినిమా మొత్తం కన్పిస్తూనే వుంటుంది. ‘రాముడి పుట్టిన తేదీ చెప్పగలవా?” అని అడిగితే, ‘నేను ఫస్ట్ యర్లో వున్నాను. బహుశా సెకండ్ లేదా థర్డ్ యర్లో తెలియవచ్చు’ అని చెబుతాడొక లా విద్యార్ధి. ‘సర్దార్ పటేల్ ముస్లింలందర్నీ గెంటేయమన్నాడు’ అని తాగిన మైకంలో చెబుతున్న హర్యానా ఎం.ఎల్.ఏ. ఒకాయన తను సేవించినది సురాపానమనీ, దేవతలు కూడా సేవించేవారానీ సమర్ధించుకుంటాడు. ‘ములాయం నిజమైన యాదవుడు కాడు. బహుశా దిగువ కులాల యాదవుడు అయ్యుంటాడు. లేకపోతే, కరసేవను అడ్డుకుంటాడా?’ అని ఒక నాయకుడు తన ఉపన్యాసంలో చెబుతాడు. తమను అడ్డుకున్న పోలీసులను ఉద్దేశించి కరసేవకులు – ‘హిందూ హిందూ భాయి భాయి ; బీచ్ మే వర్దీ కహా సే ఆయీ?’ (హిందువులూ హిందువులూ అన్నదమ్ములే అయితే, మధ్యలో ఖాఖీ బట్టలు అడ్డు పడుతున్నాయెందుకు?) – అని నినాదం చేయడం ఆసక్తికరంగా వుంటుంది. నేడు పోలీసు వ్యవస్థతో సహా ఎన్నో రంగాల్లో కాషాయప్రవేశం జరిగిపోయిన సంగతి అనుదిన వార్తలు చూస్తే తెలుస్తుంది. మన దేశంలో ఉదారీకరణ- ప్రైవేటీకరణ-ప్రపంచీకరణ (ఎల్ పి జి) ప్రారంభమైన సమయంలోనే ఈ తరహా ఉద్యమాలు మొదలవడం యాదృచ్చికం కాదేమో! బాబ్రీ విధ్వంసం సమయంలో ఆనాటి ప్రధాని నరసింహారావు పాత్రపై కూడా సందేహాలు వున్నాయి.

నిమ్న కులాల తార్కికత:

అయితే పెట్టుబడికీ, మనువాదానికీ పుట్టిన ఈ ఉద్యమంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించే సాధారణ గ్రామీణులు, నగర పేదలు కూడా  చాలా మందే వున్నారు. వారే ఈ సినిమా చూసే వారికి కామన్ సెన్స్ సరఫరా చేస్తారు. ‘ఆ బ్రామ్మలకి పంటకోసి చేతికిచ్చేవరకే మేము కావాలి. ఆ పంట వారి చేతికి ముట్టగానే మేము అంటరాని వాళ్ళమైపోతాము’ అని చెబుతుంది ఒక మహిళ. ‘ఒక్క రాముడి జన్మస్థానం కోసం దేశమంతా గలాటా చేస్తున్నారు. కానీ ఈ గడ్డ మీదే పుట్టిన మమ్మల్నందరినీ ఈ నేల నుండి తరిమేస్తారట! 150 మందిని వెళ్ళగొట్టేస్తారట! ఈ నాయకుల వెనక పరిగెత్తేవాళ్ళు చాలా మంది ఉంటే ఉండొచ్చు. నిజమే! కానీ, నేనెందుకు ఈ నాయాళ్ళ వెంబడి పరుగెత్తాలి?’ అన్న  ఆ గ్రామీణ మహిళ ప్రశ్నతో సినిమా ముగుస్తుంది.  ‘ఏక్ ధక్కా ఔర్ లగావో ; బాబ్రీ మసీద్ తోడ్ గిరావో’ అన్న నినాదానికి విరుగుడుగా ‘శ్రమజీవులారా కదలిరండి, అగ్ర వర్ణాల, ఆధిపత్య వర్గాల ఎజెండాలు కూల్చివేయండి’ అన్న నినాదమే ఈ సమస్యకు సమాధానం ఇవ్వగలదు.

ఉపసంహరణ:

       హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చివరికి ఈ సినిమా ప్రదర్శన జరిగింది. అదే సమయానికి పెద్ద హాలును ఎబివిపికి కేటాయించారు. ‘రాముడి పేర’ చిన్న హాలే! అయినా సరే కిక్కిరిసిన చిన్న హాలులో 400 మంది నిల్చుని కూడా సినిమా చూశారు. 150 మంది స్థలం దొరక్క వెనుదిరిగారు. వారంతా యూట్యూబ్ లో చూసుకుంటారు. ప్రెసిడెన్సీలో కూడా ఆగస్టు ౩౦ న కిక్కిరిసిన హాలులో ప్రదర్శన జరిగింది. కోల్ కతా లో జాదవ్పూర్ యూనివర్సిటీలో కూడా హెచ్ సి యూ విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ ఈ సినిమాను ప్రదర్శించారు. ‘మందిర్ వహీ బనాయేంగే’ తరహాలో, ‘సినిమా వహీ దిఖాయేంగే’ అంటూ అధికారులు అడ్డుకున్న చోటనే ప్రదర్శనలు జరిపి ప్రతిఘటించారు వివిధ నగరాల విద్యార్ధులు. నేను కూడా ప్రేరణ పొంది నా డివిడిల అరలోంచి ‘రామ్ కే నామ్’ బయటికి తీశాను. 

ప్రెసిడెన్సీ యూనివర్సిటీ లో డాక్యుమెంటరీ ప్రదర్శన

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

1 comment

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.