మన దుఃఖాలూ దుఃఖాలేనా
అనిపించే దుఃఖాలు

అలా పడి పోతానని ఆవిడ చెయ్యూపిందన్నమాట! కృతజ్ఞతలు చెప్పేదాకా ఆగకుండా, నావైపు చూడకుండా గబగబా అడుగులేస్తూ నా ముందరే  నడుస్తోందావిడ. వ్రతభంగమెందుకని నేనూ ఆవిడ వెనకే నడుస్తూ ధ్యానమందిరానికి చేరుకున్నా. 

ఆ రాత్రి నిదురలో నా పిల్లలకి ఏదో కీడు జరిగినట్టు కల! గబుక్కున మెలకువ వచ్చేసరికి ఆ కల తాలూకు ఎఫెక్టుకి ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయిపోయింది.  

ఇంక ఒక్క క్షణం గడిస్తే ఒట్టు. గడియ కూడా గడవడానికి జడిసే రాత్రుల్లో  ఇదొకటి!

ఎలా తెలుసుకోవటం. నిజంగా ఏమైనా అయిందా. మన ఫ్యామిలీ ఆఫీసుకి ఫోన్ చెయ్యచ్చు.  ఫోన్ వచ్చిందేమో! వస్తే చెప్పరా ఏంటి? పోనీ ఫోన్ చెయ్యచ్చేమో అడగనా? అటు నించి వస్తే తప్ప ఇటునించి చెయ్యలేము. వెళ్ళి పోవలసి వచ్చేంత అర్జంటు అయితే తప్ప ఫోన్ చేసినా మన దాకా రాదు. అది మంచిదే. వచ్చిన వంద మందిలో కనీసం అయిదుగురి ఇంటినించి ఫోన్లు వస్తాయిట.  ఫోన్ వచ్చిందేమోనని ఆరాటం , పిల్లలెలా ఉన్నారో అని మనసు పోరాటం మధ్య చాలా ఆందోళనగా సగం రోజు కష్టంగా గడిచింది.  

మధ్యాహ్నం  నేర్పిన “మెత్త భావన” మెదడుని మనసుని కడిగి పారేసింది. విపశ్యన తరువాత వచ్చే సంతోషం ప్రపంచానికి పంచే మహత్తరమైన విషయమది .  మా తెలిసిన వారొకరు ఎపుడూ అంటుంటారు “ఏదైనా సమస్య వచ్చినపుడు ఎవరికైనా చెప్పాలి. మర్నాడు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం , మన సమస్య గుర్తొచ్చి అనుకోకుండా దేవుడికి విన్నవిస్తారు. సమస్య మనకి తెలియకుండానే సమసిపోతుంది”అని. ఎంత గొప్ప మాట కదా! 

ఈ మొత్తం భావన అదే. మనకి కలిగిన ఆనందాన్ని మనకి గుర్తొచ్చినవాళ్ళకి…మన ఇంటికి ,మన వాడకి, మన ఊరికి, మన దేశానికి , ప్రపంచానికి….భూమిపై జీవించే అన్ని జీవులకి జలచరాలకి అలా పంచడమే..!

సబ్ కా మంగళ్ సబ్ కా మంగళ్ 
సబ్ కా మంగళ్ హోయెరే
తెరా మంగళ్ తెరా మంగళ్
తేర మంగళ్ హోయెరే

 
దృశ్య ఔర్ అదృశ్య సభీ
జీవోంకా మంగళ్ హోయెరే

 
జల్ కే థల్ కే ఔర్  గగన్ కే
ప్రాణీ సుఖియా హోయెరే

 
దశాదిశాఓంకే సబ్ ప్రాణీ
మంగళ్ లాభక్ హోయెరే

 
జన జన మంగళ్ జనజన మంగళ్
జనజన సుఖియా హోయెరే
తెరా  మంగళ్ తెరా మంగళ్
తేర మంగళ్ హోయెరే.

అంటూ గోయంకా గారి గొంతులో కరుణ ఉప్పొంగి పోతుంది గోదారిలా…</span

మళ్లీ 8, 9 రోజులు మొదటి రెండు రోజులిగే చాలా కష్టం గా  గడిచాయి.

పదవ రోజు మద్యాహ్నము నించి మౌనవ్రతానికి స్వస్తి. మందిరం నించి బయటికి రాగానే నమస్తే అంటూ మొదట పలకరించిన వ్యక్తి  హలీనా. ప్రశాంత వదనం. అందమైన నవ్వు. ఓం నమశ్శివాయ ముద్రించిన శాలువా చేతికి లక్ష్మి వినాయకుడి ఉంగరాలు. తులసి పూసలు రుద్రాక్షమాలలు.  నమశ్శివాయ అన్నాన్నేను. కనులు చిన్నవి చేసి ఆనందంగా నవ్వుతూ బోలెడు కబుర్లు చెప్పారు. అన్ని రకాల యోగా సాధనలకు వెళతారుట. కౌన్సిలింగ్ ఇస్తారుట ఆవిడ. ధ్యానాన్ని దానిలో భాగం చేయాలనే సంకల్పం ట. అప్పటికే చాలా తెలుసు ఆవిడకి. కొన్ని పుస్తకాలు కూడా వ్రాసారుట.

ఒక నైజీరియన్ అమ్మాయి, ఒక ఇరానీ, ఒక ఇటాలియన్ ,ఇద్దరు కొరియన్స్ , ఒక చైనీస్, ఒక జమైకన్, నలుగురు భారతీయులు అలా ఒక్కొక్కరే వచ్చి కలుస్తూ మీటింగులు పెట్టేసారు. ఒకరి గురించి ఒకరు ఏమనుకున్నదీ, కూర్చోడానికి ఎన్నెన్ని కష్టాలు పడ్డదీ చెప్పుకుని నవ్విన నవ్వులకి సంతసించి ఆకాశం సన్నగా జల్లు కురిపించింది. ధ్యానమందిరం దగ్గర అల్లరి, గోల తగదని హెచ్చరిస్తూ నిర్వాహకులు మా అందరినీ కొత్తగా కడుతున్న భోజనశాల వైపుకి తీసుకెళ్ళి, పెద్దదిగా ఉండడం వల్ల వంట భోజనం ఒకే చోట చెయ్యడం వంటి ఉపయోగాలు, ఆధునిక పరికరాలు, ప్లాను చూపించారు

సాయంత్రం డిస్కోర్స్  వరకూ ఆట విడుపు. అందరూ నలుగురైదుగురు గుంపులుగా విడిపోయి అందరినీ పలకరిస్తూ “అబజబదబ”  కబుర్లు.  

ఎవరెవరు ఏ కారణం చేత వచ్చారనే ప్రశ్నకు మొదట అందరూ అదేదో చూసిపోదామనో, ఎవరో చెబితే పచ్చామనో చెప్పేసాక .. కాసేపటికి… హవ్వ కోర్సు ముగియనే లేదు అప్పుడే అబద్ధమా అనుకుంటూ నిజాలు చెప్పసాగారు.  

తట్టుకోలేని తలనెప్పి తగ్గుతుందని వచ్చానని నేను, ప్రసవమంటే భయం పోగొట్టుకోడానికి ఒక లేత నెలల గర్భిణీ. బాయ్ ఫ్రెండ్ తో గొడవయ్యి డిప్రెషన్ లో చదువు గిదువు వదిలేసి మనశ్శాంతి కోసం ప్రయత్నిస్తున్న కాలేజీ పిల్ల, అంత పనీ తన మీదే పడేస్తున్నారని అందరి మీదా వస్తువులిసిరేసి డాక్టర్ మొఖాన రాజీనామా విసిరి.. అంత కోపం మంచిది కాదని గ్రహించిన నర్సమ్మ.. భర్త నించి విడిపోయి పిల్లల  భారం మోయలేక ఆందోళన పడుతున్న చిరుద్యోగి తల్లి ఇలా సవాలక్ష చెప్పుకున్నాం అడవిలోకి నడుస్తూ. అందమైన పాతికేళ్ళ యువతి మాత్రం చిరునవ్వు తప్ప నోరిప్పలేదు. అందరూ ఆమెని చూశారు చెప్పమంటూ. ఊరికే వచ్చానంది.. కానీ కన్నుల్లో కాల్వలైన నీరు కథలనెలా దాస్తుందసలూ!!

ఆ అమ్మాయి ఇరానీ. రెండున్నరేళ్ల వయసులో  కుటుంబం అందరినీ ఆ చిన్నారి కనుల ముందే కాల్చి పంపారుట ఇరాక్ సైన్యం. అలా అనాథలైన పిల్లలని రోజుకొకరు తీసుకెళ్ళి ఆశ్రయమిచ్చేవారుట. ఏ రోజు ఎక్కడ నిద్రో ఎక్కడ మెలకువో తెలియక భయంతో గుండెలవిసేలా ఏడ్చి యజమానులు గద్దించినపుడు భయంతో బిగుసుకుపోయేదట. ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా అన్నట్టుగా కొన్ని నెలలు గడిచిపోయాయిట. ఒక్కోపూటా కొత్త వారితో ఉంటూ అది అదృష్టమో దురదృష్టమో తెలియక బెంబేలు పడిన పసిమనసులని తలచుకొని వింటున్న అందరి కనులూ నీటి చెలమలయ్యాయి.    

ఈ లోపు యుధ్ధం వలన జరిగిన రాజకీయ అశాంతి గుర్తించి, కెనడియన్ ప్రభుత్వం యుధ్ధప్రాతిపదికన తలుపులు తెరవడంతో, అవకాశమున్న చాలామంది అదృష్టాన్ని అందిపుచ్చుకుని విమానమెక్కారు.  

కుటుంబం మొత్తానికి పాస్పోర్టులు ఉండి, ఇంట్లో ఒక్కరికైనా చుట్టుపక్కల ఏంజరుగుతోందనే అవగాహన ఉండి, ఇక్కడ ఆస్తిపాస్తులకన్నా ఎక్కడో ఒకచోట కలోగంజో తాగి ప్రశాంతంగా ఉందామని తెగింపు, దానికి కుటుంబసభ్యుల అంగీకారం, ఇవన్నిటికీ దరఖాస్తు చేయడానికి సహాయం చేస్తున్న వారిమీద భరోసాతో ఉన్న ఆస్తులని ఎంతకో అంతకి తెగనమ్మి వారి చేతుల్లో పోయడం లాంటి రిస్క్ తీసుకోగలిగిన వాళ్ళు మాత్రమే రాగలిగారు.

కెనడాలో కుదురుకున్న మంచిమనసుల సువాసన ప్రపంచమంతటా తేల్చుకోవలసిందే. వారు ప్రశాంతమైన చోటికి వచ్చాము చాలని వదిలెయ్యలేదు.  పూర్తిగా కుదురుకోకముందే అందరూ సమావేశమయ్యి ఇరాన్ లో కుటుంబాలని పోగొట్టుకున్న పిల్లలని గుర్తు తెచ్చుకోవడమన్నది మానవ సంస్కారానికి మచ్చుతునక కదూ….??!!!

కుటుంబాలని  పోగొట్టుకున్న పిల్లలని గుర్తించి ఒక్కో కుటుంబం ఒక్కొక్కరిని దత్తత తీసుకోవడంతో    ఈ పాపతోపాటు ఇంకొంతమందికి అమ్మా, నాన్నా, అక్కా, చెల్లీ, అన్నా , తమ్ముడూ దొరికేశారు. ఇవన్నీ చెయ్యడానికి వారు ఎవరిని సంప్రదించారో, ఎలా నమ్మించారో,  ఎంత శ్రమ పడ్డారో ఊహకి కూడా అందదు. వారి మంచితనానికి ఎల్లలు లేనట్లే కదా?

ఇక్కడితో కథ సుఖాంతమయిందని అనుకున్నారు కదా మీరు కూడా! కాదు అసలిక్కడే మొదలు! 

ఆ పిల్లని పెంచుకున్న  కుటుంబం ఇక్కడికి రాకముందు “చల్లని సంసారం -చక్కని సంతానం” లాంటి కుటుంబం. పెద్ద పిల్లోడు చేతికొచ్చాడు. ఒక రోజు కర్ఫ్యూ సడలించిన సమయంలో ఉప్పో పప్పో తేవడానికి తల్లి దుకాణానికి  వెళుతుండగా పెద్దోడు సంచీ లాక్కుని నేతెస్తా పదమని తల్లిని లోపలకి పంపినవాడు మరి రాలేదుట. ఆ పిల్లాడిని బయటకు పంపినందుకు తల్లి మీద కుటుంబం మొత్తం ద్వేషాన్ని పెంచుకున్నారు. అసలే కొడుకుని పోగొట్టుకున్న తల్లి మనసు ఈ చర్యతో అతలాకుతలం అయి పిచ్చి దానిలా అయిపోయింది. తన వంతుగా పిల్లల ఆలనా పాలనా చూస్తుంది కానీ గట్టిగా అరవడమో ఏడవడమో చేస్తుంది. పిల్లలెవరూ ఒకరితో ఒకరు మాట్లాడరు. వారి గుండెలు యుధ్ధ వాతావరణానికి చెందిన దుఃఖం తో గడ్డకట్టేసాయి. అవి కరగవు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ అశాంతిగా బ్రతుకుతుంటారు. ఈ రోజు వరకూ ఆ ఇంట్లో ఎవరి ముఖానా నవ్వు ఉండదు. అందరికీ ఇష్టుడయిన కాబోయే కుటుంబ పెద్దని చావు కి అప్పచెప్పిందని తల్లి మీద కోపం పోదు. అది కావాలని చేసిన పని కాదని వివరించే మాటలేవీ తల్లికి మిగల్లేదు. తండ్రి నెమ్మదిగా మౌనముద్ర పట్టాడు. ఆస్తులమ్మిన డబ్బేమైనా తెచ్చుకున్నారేమో పనీ గినీ పెట్టుకోకుండా లేవగానే పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటాడంతే. ఇంట్లో ఎవరైనా తిట్టుకున్నా కొట్టుకున్నా ఆయన యోగిలా పుస్తకాలు చదువుకుంటూ ఉంటాడు.  

పిల్లలు చదువులు పూర్తి చేసుకుని నెమ్మదిగా ఉద్యోగాల కోసం వేరే ఊర్లలో సెటిల్ అయ్యారు.  బాధాకరమైన విషయమేంటంటే, ఇన్ని సంవత్సరాలుగా కుటుంబం లో జరిగిన రోజువారీ గొడవల వల్ల అందరూ గాయపడ్డారు.  అందువలన ఎవరూ ఎవరినీ కలవడానికి ఇష్టపడరు. అలా అని ఎవరికి వారు సుఖంగానూ లేరు. “ఏ తోడూలేరు నాకెవ్వరులేర”ని  ఏడుగురు పిల్లలని తలచుకుని కుమిలిపోతున్న తల్లిని, కాస్త మతి స్థిమితం కోల్పోయిన ఒక అక్కనీ ఎలాగైనా ప్రజల్లో పడేయాలని తొమ్మిదో సంతానంగా వచ్చిన ఈ పిల్ల తాపత్రయం. తను చేసిన చాలా ప్రయత్నాలు వమ్ము కాగా ఆఖరి ప్రయత్నంగా ఎవరో చెపితే ఇక్కడకి వచ్చిందిట. రిలిజియస్ కాదు కాబట్టి.. అమ్మని ఎలాగైనా ఒప్పించి ఇక్కడకి తీసుకురావాలని, తన తల్లికి ఈ విపశ్యన మేలు చేస్తుందనే నమ్మకం తళుక్కున మెరుస్తుండగా. కన్నులు తుడుచుకు కలకల నవ్వింది పుత్తడిబొమ్మ పూర్ణమ్మ. 

మనకేదో పెద్దకష్టముందనుకున్న వారందరి మనసులూ బరువెక్కాయి. “మావి పూచిక పుల్ల కస్టాలు అమ్మలూ.. ఇకనించీ మా ధ్యానం లో నువ్వూ నీ కుటుంబం ఉంటార’ని చెబుతుండగానే ధ్యానమందిరానికి  రమ్మంటూ గంటలు మోగాయి.

ఎన్నెల

రచయిత స్వీయ పరిచయం
కలం పేరు: ఎన్నెల. అసలు పేరు: లక్ష్మి రాయవరపు(గన్నవరపు). వృత్తి: చిత్రగుప్తుల వారి పని (చిట్టాపద్దులు వ్రాయడం). నిర్వహిస్తున్న బ్లాగ్: www.ennela-ennela.blogspot.com . అడ్రస్: 8 Skranda hill, Brampton, Ontario, Canada . ఈ మెయిల్ : ennela67@yahoo.ca

సికందరాబాద్ ఆల్వాల్ లో పుట్టి పెరిగి,  ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి , హిందూ మహా సముద్రం మధ్య ఎక్కడో (మాల్దీవుల్లో) ఉద్యోగాలున్నాయని వెళ్ళి అక్కడ మునిగి ఈదుకుంటూ కెనడా లో తేలాను. హాస్య కథలు వ్రాయడం, హాస్య నాటికలు వ్రాసి తెలుగు అసోసియేషన్ జనాల్ని భయపెట్టడం నా హాబీస్. జ్యోతిర్మయిగారి పరిచయంతో గజల్స్ మీద ఆసక్తి కలిగింది. ప్రస్తుతం గజల్స్ వ్రాసేసి, పాడేసి దొరికిన వాళ్ళందరినీ భయపెట్టే బృహత్ప్రణాలిక వేసుకున్నా మరి! ఆగండాగండి.. అయ్యో అలా పారిపోతున్నారేంటీ!!!!!!!!

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.