మాటలు… వొట్టి మాటలు
గల్లరగల్లరమనే చిల్లర పైసల్లా కొన్ని
పచ్చనాకు మట్టిని ముద్దాడినట్టు కొన్ని
జబ్బమీద మోసుకు తిరిగెటోడొకడు
గుండెల్లో దాసుకు తిరిగెటోడొకడు
కొన్ని బరువుగా
కొన్ని బాధ్యతగా
చెల్లాచెదురుగా పడిపోయిన మాటల్ని ఏరుకొత్తవు
నిట్టాడులా నిలబెట్టాలనుకుంటవు
పునాది లేని గోడల్లా నిలువునా కూలిపోతయో
నీటిపై రాతల్లా చెరిగిపోతయో
ఉశికెలో వాననీటి సుక్కల్లా ఇంకిపోతయో
జానపదుల పాటల్లా ఎల్లకాలం నిలిచిపోతయో
నాని నాని పచ్చిబుర్రలైతయో
తడికి మొలకలొచ్చి చిగురులైతయో
మాటలే … వొట్టి మాటలే
మాటిచ్చుడంటే మాటలుగాదని ఎరుకైతది
మాటకోసం నిలబడ్డప్పుడు
మాట మీదనే పొర్లుదండంబెడుతూ ఏడ్సినప్పుడు
మాటను నిలబెట్టడం కోసం
చిటికెనవేలి బంధాల్ని వదిలెల్లినప్పుడు
మాటే ఊపిరిగ బతికినప్పుడు
సూటిపోటి మాటల్ని పెడచెవిన పెట్టి
మొండిగ నిలబడి మోరుదోపుగ తిరిగినప్పుడు
కటికనేలే కన్నతల్లయినప్పుడు
నీ నీడే నిన్ను దగ్గరికి తీస్కొని కన్నీళ్లు తుడ్సినప్పుడు
ఒక మీమాంస
ఒట్టి మాటే కదా… మనిషిని ఒంటరి చేసేంత దమ్ముందా..ని ?
మాటను బతికించలేకపోతే
బొందిల పానం పోయినట్టే అనుకుంటవు
మాటకోసం మానసికంగా యుద్ధం చేయాల్సొత్తది
యుద్ధమన్నంక గాయపడుడు నెత్తురోడుడైతే తప్పదు
యుద్ధానంతర గాయాలకు సిద్ధపడ్డంకనే
బతుకుపోరాటం సురువైతది
ఎట్టయితేనేం… మాటైతే నెగ్గుతది
బతుకు పచ్చని చెట్టయితది
విజయం వరించిన వీరజవానులా నువ్వు
మాట… వొట్టిమాటే
మూతిమీది మీసాన్ని మెలిదిప్పుతది.
Super మాట…