తెన్నేటి సూరి చూపిన దారి

(3 వ భాగం)

“ హే! ఇక్కడికి దేవుడొచ్చాడు
ఇత్తడి విగ్రహంలో జీవం లేకుండా!
కొయ్య గుర్రం పై స్వారీ చేస్తూ..
వీధులెంబడి ఊరేగుతున్నాడు
ఇక్కడి వ్యక్తుల గురించి, వారి జీతాల గురించి
ఆ దేవుణ్ణి అడగండి..
మాకు తినడానికి తగినంత తిండి లేదని కూడా
అతడికి చెప్పండి.”

గత శతాబ్దానికి చెందిన తెన్నేటి సూరి ఎంత రెవల్యూషనరీ గా పై కవితను రాశారో గమనించాలి. ఫ్రెంచ్ విప్లవ నేపధ్యం లో, చార్లెస్ డికెన్స్ రాసిన “ఎ టేల్ ఆఫ్ టు సిటీస్” అనే నవలను “రెండు మహా నగరాలు “ పేరిట తెన్నేటి సూరి అనువాదించాడు. అక్కడ ఆయన తన రాజరిక వ్యతిరేక ధోరణి ఎలా చెప్తాడో చూడండి,,,

గవిడిగవదలరాజూ, గాజుకళ్ళ రాణి ఇంగ్లాండ్ లోనూ, గవిడి గవదల ఓ రాజూ, ఓ కలువ కన్నుల ఓ రాణి ఫ్రాన్స్ లో రాజ్యమేలుతున్నారు అని ఆ అనువాదాన్ని మొదలు పెడతారు.

తెన్నేటి సూరి అనేక కవితలు, కథ సంకలనాలు వేయించారు. ఆయన రాసిన “అరుణ రేఖలు” కవిత సంకలనం తెలుగు సాహిత్యం లో ఒక ప్రచండ వీచిక.

“విచ్చికలమూని, నే
వీర సేనానినై,
అరులపై దూకించి,
శిరసుల్లు కోసాను….
..
మానవ స్వాతంత్ర్య
‘మాగ్నా కార్టా’ పైన
రక్తాక్షరములతో
వ్రాలు చేసేశాను….”

అక్షరాల్లో అగ్ని కణాలు నింపి సమాజ చైతన్య దిశగా రాసిన ఆయన కవితలు ఇప్పుడు ఈ శీర్షిక లో ముందుగానే రాయాల్సి వచ్చింది.
“మహోదయం” అనే కవిత సంకలనం లో

జగత్ప్రబోధక విప్లవ గీతిక
చీకటి చీల్చుకు వచ్చింది
విమానతలమున, విభవోజ్వలయై
వీరమూర్తిగా నిలిచింది…!

బ్రతకండోయీ ప్రాణి కోటులూ
భయములు వాసి, బ్రతుకండి!!
వెతలను బాసీ, వీరగభీరత
గుండెల నింపుకు బ్రతకండి …..

ఆయన మాటల్లోని తీవ్రత ఆయన కవితల్లోనూ చూడొచ్చు..
కీలు గుఱ్ఱం అనే కవిత లో,

కోటి చేతులు చాచి
కోటి గొంతులు మెరిసి
కంచుగుండెలు పగల
గగ్గోలుగా లేచి,
ముక్కోటి దేవతలు,
మూర్తుల్లు కంపిల్ల
కూలిమాటడగండిరా !
అన్నాలు
చాలవని చెప్పండిరా….

ఇలా ఆ ఆయన కవిత సంకలనం నిండా, ఒక అద్భుత సమాజ చైతన్య ధోరణి కనిపిస్తుంది. కొన్ని కవితల్లో ని లైన్స్ కత్తులతో దుష్ట రాజ్యాన్ని ఖండ ఖండాలుగా నరకండి అని చెప్పే వాక్యాలు మెండుగా కనిపిస్తాయి.
*****
1739-90 కాలం నాటి, “ముద్దు పళని”, తెలుగు రచయిత్రి. ఆస్థాన దేవదాసి. “రాధికా సాంత్వనము” అనే కావ్యంలో అనేక రకాల శృంగార వర్ణనలు చేసారు. ఒక స్త్రీ తన రచనల్లో శృంగార వర్ణనలు చేయడం విప్లవాత్మకం. ఈ పుస్తకాన్ని చాలా మంది విమర్శించారు. సంఘ సంస్కర్త, వీరేశ లింగం గారు ఈ తరహా రాతల్ని వ్యతిరేకించారు. కొన్ని సంవత్సరాలు కనుమరుగై పోయింది ముద్దు పళని. తర్వాత బెంగళూరు నాగరత్నమ్మ ఈ పుస్తకాన్ని పునః ముద్రణ వేయించి, చాలా ప్రచారం లోకి తీసుకువచ్చారు. తర్వాత ఆమె త్యాగరాజ భక్తురాలుగా మారింది. ఇటీవల గుంటూరు లో ఆమె మీద పుస్తకాన్ని వేసారు. ఇప్పటికీ ఆ పుస్తకం వెలుగు లో ఉంది.

1652 నుండి 1730 వరకు జీవించిన కవి వేమన పద్యాలు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వెలుగు లోకి వచ్చాయి. కడప జిల్లా , వేంపల్లె సమీపంలో గండి దగ్గర నెలకొన్న రెండు రాతి కొండల మధ్య బంగారు తోరణాలు సర్ థామస్ మన్రో కు కనిపించడమూ, ఆ బంగారు తోరణాల కాంతి, వేమన పూజించి వదిలిన యంత్రం నుండి వచ్చాయని ఆయన అనుకోవడం – ఒక కథ.

అలాంటి వేమన సమాజ హితం కోరుతూ, సమాజాన్ని చైతన్య పరిచే విధంగా అనేక పద్యాలు రాశారు. ఆత్మ సంస్కారాన్ని, ఆర్థిక సంస్కారాన్ని, కుల రాహిత్యాన్ని ప్రభోదిస్తూ, సమాజ చైతన్యం కోసం ఊరూరా తిరిగారు.

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను…

మృగము మృగమనుచును మృగమును దూషింత్రు
మృగము కన్న చెడ్డ మూర్ఖుడగును
మృగముకున్న గుణము మూర్ఖునకేదయా?
విశ్వదాభిరామ వినుర వేమా …

అని చివరి పంక్తి లో తన పేరు వచ్చేలా ముగిస్తూ వచ్చాడు.

హీనుడెన్ని విద్య లిల నభ్యసించిన
ఘనుడు గాడు మొరకు జనుడె గానీ
పరిమళములు మోయు గార్ధభము ఘనమౌనే
విశ్వదాభిరామ వినుర వేమా..!!

వేమన పద్యాలు ప్రజల జ్ఞానంగా వారి నాలుకల మీద చిరంజీవులైనాయి.

కల్లలాడువాని గ్రామకర్త యెఱుగు
సత్యమాడువాని స్వామి యెఱుగు
బెద్ద తిండిపోతు బెండ్లామెఱుంగు
విశ్వదాభిరామ వినురవేమ

అబద్ధాలలాడే వాడిని గ్రామం లో కల పెద్దమనిషి ఎరుగును. సత్యం చెప్పే వాడిని భగవంతుడు ఎరుగును. భర్త తిండి విషయాలను భార్య ఒక్కతే గుర్తించును.

సమాజానికి ఎరుక పరిచి చైతన్య దిశగా సాగే వేమన పద్యాలు తెలుగు నాట పామరులు సైతం అవలీలగా సందర్భోచితంగా చెబుతుంటారు.

తామసించి చేయతగ్గ దెట్టి కార్యంబు
వేగిరింప నదియ విషమెయగును
పచ్చికాయ దెచ్చి బడవేయ ఫలమౌనే ?

పచ్చి కాయను తీసుకువచ్చి తినగా అది పండు కానట్టే సమయమునకు ముందుగా తొందరపడి ఆ పనిని చెయ్యకుండా, సరైన సమయంలోనే చేయాలంటాడు.

ఈనాటికీ ఈ వాక్యాలు మనిషి దిశదశ నిర్దేశించేటుగా ఉంటాయి.

ఇలాగే, ఇదే కడప జిల్లా కు చెందిన పోతులూరు వీరబ్రహ్మేంద్రుల వారు 7 లేదా 9 శతాబ్దం కు చెందినవారు. ఈయన కూడా సమాజం లో కుల పరమైన అసమానతలను తొలగించాలని, అనేక ప్రయత్నాలు చేశారు. సమాజ పరిస్థితులను ఎరుక జేస్తూ కాలజ్ఞానం రాశారు. నోస్టర్ డామస్ లాగా భవిష్యత్ దర్శిని లాగా రాశారు. కుల వ్యవస్థ ను, సామాజిక అసమానతలను, పేద ధనిక తారతమ్యాలపై, స్త్రీల పట్ల పీడన, కొన్ని మూఢ కట్టుబాట్ల పైన తిరుగుబాటు ధోరణి లో ఆయన అనేక తత్వాలు రాసారు.

“మూడు యుగములందు ముదితలు ముగ్ధలు
పురుష దౌష్ట్యమునకు పొగిలినారు.”

అంటూ స్త్రీలు పురుషుల ఆధిపత్యం కింద ఎలా నలిగినారో ఆయన గుర్తు చేస్తారు.
అదే విధంగా, స్త్రీలకు వేదాలు చదివే అర్హత లేదని అప్పట్లో అగ్ర వర్ణాల వాళ్ళు చేసిన ప్రకటన ల పట్ల ఆయన స్పందిస్తూ, వేదాలకు, చదువుకు మూలపుటమ్మ సరస్వతి అని భావించే వారు సరస్వతి దేవి కూడా ఒక స్త్రీ నే అన్న విషయం మరచినారా అని ప్రశ్నించి…

“వెలదులకును వేద విద్యాధి కారమ్ము
లేదటంచు బ్రహ్మ లిఖితమందు
నోరు తెరచి మరచినారు వాణిని నిన్న” అని ప్రకటిస్తారు.

బ్రాహ్మణు లు చెప్పినట్లు పాలిస్తూ, నిరంకుశులుగా మారి, శృంగారం లో పడి పరిపాలన ను మరిచి, ప్రజనలను పీడించిన రాజులను ఎండగడుతూ,

‘నాల్గు యుగములందు న్యాయమ్ముగా జూడ
నెన్నదగిన రాజులేవారు గలరు’ అని అంటారు.

అంతే గాక,

‘చచ్చు పుచ్చు కైత పచ్చి శృంగారాన
చెప్పి కవులు మున్ను మెప్పుగనిరి
నీతి నిష్టలెల్ల నిప్పులపాలాయ ….’

అని రాజరిక వ్యవస్థను ఎండగుడుతూ రాశారు. వీర బ్రహ్మం గారు ఒక పెద్ద సోషల్ రిఫార్మర్. సమాజాన్ని చైతన్య పరిచే దిశలో అనేక కోణాలను ఆయన స్పృశించారు.

గుళ్ళు గోపురాలు, మత వ్యవస్థ ని ఆయన సున్నితంగా వ్యతిరేకిస్తూ కూడా రాశారు.

‘మతము మత్తుగూర్చు మార్గము కారాదు
హితము గూర్చవలయు నెల్లరకును
హితము గూర్చలేని మతము మారగవలె’

అలాగే,

“సాటి మానవునకు సాయమ్ము పడబోక
నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు కట్టి
మ్రొక్కులిడిన బ్రతుకు చక్కబడగబోదు”

ఇలా చైతన్య దిశగా, విప్లవ ధోరణి లో సాగే ఆయన సాహిత్యం తెలుగు నేల నాలుగు చెరుగులా కీర్తింప బడుతోంది.
15 వ శతాబ్దం కు చెందిన అన్నమయ్య సంకీర్తనల్లో భక్తిప్రకటనే ఎక్కువైనప్పటికీ.. సామాజిక చైతన్య ధోరణుల్లోనూ అనేక కీర్తనలు రాసారు. ఒక దశలో అన్నమయ్య అట్టడుగు వర్గాల ప్రతినిధిగా మారి, ప్రజల్లోకి చైతన్యం తెప్పించే దిశగా రాశారు. సాళువ నరసింహ రాయలు కొలువులో రోజుకో కీర్తన పాడుతూ, రాజు యొక్క కొలువులో ఉండగా, ఒకరోజు నరసింహరాయలు తన పైన కీర్తన రాసి పాడమని అడిగితే, అప్పుడు అన్నమయ్య చెవులు మూసుకొని, “నరహరికీర్తన నానిన జిహ్వ బరుల నుతింపగ నోపదు“ అని దిగ్గున లేచి వెళ్ళిపోతాడు. అప్పుడు రాజు భటులను పురమాయించి, అన్నమయ్యను పట్టుకొని వచ్చి, గండసంకెల వేయించి, చెరలో పెట్టాడు. అప్పుడు కూడా అన్నమయ్య రాజును స్తుతింప లేదు. తర్వాత, అన్నమయ్య భక్తి ని, ఆయన మహత్యాన్ని చూసి, నరసింహరాయలు అన్నమయ్య శరణు కోరుతాడు.

ఈ అన్నమయ్య కంటే చాల ముందుగ యధావాక్కుల అన్నమయ్య అనే పేరు తెలుగు సాహిత్యం లో వినిపిస్తుంది. ఈయన తో పాటు మరికొందరు కవుల సాహిత్యంలో సామాజిక చైతన్య ధోరణులను తరువాత శీర్షిక లో…

సి వి సురేష్

సి.వి. సురేష్: కడప జిల్లా ప్రొద్దుటూరు స్వగ్రామం. పూర్తి పేరు చెన్నూరు వంకదార సురేష్, వృత్తి రీత్యా న్యాయవాది, కవిత్వం, అనువాదాలు, విశ్లేషణలు రాస్తున్నారు. సాహిత్యాన్ని ఎక్కువగా ప్రేమించే మనస్తత్వం ఉన్న ఈయన తెలుగు కవుల కవిత్వాన్ని ఆంగ్లం లోకి అనువాదం చేస్తున్నారు సురేష్ ఆంధ్ర భూమి, డెక్కన్ క్రానికల్ పత్రిక కు స్టాఫ్ రిపోర్టర్ గా కూడా పని చేసారు.

8 comments

 • చక్కని వ్యాసం…
  పోతులూరివారికీ, వేమన్నకూ దైవత్వాలను అంటగట్టడం వేరే సంగతి… కానీ వారిద్దరూ సమాజపు అవకరాలపైన తీవ్రంగా విరుచుకు పడిన గొప్ప కవులు.. బాధ్యత కలిగిన సంస్కరణాభిలాషులు.. కవిత్వాన్ని రాచరికపు మెప్పుకో.. శృంగార ఊహా వికార విహారాలకో వాడుకోని నిబద్ధతకల తెలుగు కవిత్వపు
  మార్గదర్శకులు…
  Cv Suresh గారు మీరుకూడా వారిద్దరిని నేను తెలియజేసిన కోణం నుండే పరిచయం చేయడం మీ విశ్లేషణాత్మక గ్రహీంపునూ, అవగాహనను తెలియజేస్తున్నది..
  ముద్దు పళనిని గర్హించడం పండిత దురహంకారం.. “కొందరబలుల్ సతులను తనియింపలేక తాటాకులలోన రాసిరి..” వంటి విప్లవాత్మకమైన ముద్దు పళని పద్యాలు కుమనస్కుల ఆగ్రహానికి గురైనా, ఆమె ఏ కవికీ తీసిపోని విద్వత్తుగల కవయిత్రి..
  యధావాక్కుల అన్నమయ్య ఎందరికి తెలుసోకానీ.. అటువంటి కాలం మరుగు చేసిన మరికొందరిని మీ ఈ శీర్షిక వెలుగులోకి తేగలదని నమ్ముతున్నాను. అభినందనలు మీకు 💐

 • గత శతాబ్ది లో వచ్చిన “”చైతన్య సాహిత్యం”” సమాజాన్ని జాగృతం చేసిన రచయితలను వారి రచనలను చక్కగా స్పృశించారు!! ఆ కాలంలోనే వేమన గారిలాగే సంఘం లో నీతిని భోధించేందుకు కవి చౌడప్ప గారు కొంచెం బూతులో రాసినప్పటికీ, మంచి వినూత్న విప్లవ ధోరణిలో వచ్చిన సాహిత్యం!! ముద్దుపలణి గారితో పాటుగా కవి చౌడప్ప గారిని కూడా స్పృశించి ఉంటే బాగుండేదేమో!!మంచి వ్యాసం అందించారు.అభినందనలు💐💐💐💐

 • తెన్నేటి సూరి గారు ఎ టేల్‌ ఆఫ్‌ టూ సిటీస్‌ అనువదించారని చదివి సంతోషం వేసింది. తెలుగులో చదవడం ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. అరుణ రేఖలు, మహోదయం కవితా సంకలనాలు చాలా భావతీవ్రతతో ఉంటాయనడంలో సందేహం లేదు. కీలుగుర్రం కవిత కూలిజనం కోసం అద్భుతంగా రాయబడింది. ముద్దు పళని గురించీ, వేమన పద్యాల గురించీ క్లుప్తంగానే రాసినా ఇంపార్టెంట్‌ మేటర్‌ రాశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి, అన్నమయ్యల గురించి కూడా రాశారు. యథావాక్కుల అన్నమయ్య గురించి వినలేదు.. తర్వాతి భాగం కోసం ఎదురుచూస్తాము.

  • తెన్నేటి సూరి చూపిన దారి
   …………………………….
   మీ పరిశోధన, చారిత్రక కవుల గురించి మీరు దారి చూపిస్తున్నారు.
   ఆద్యంతం చదివించింది.
   ధన్యవాదాలు సర్

 • కోటి చేతులు చాచి
  కోటి గొంతులు మెరిసి
  కంచుగుండెలు పగల
  గగ్గోలుగా లేచి,
  ముక్కోటి దేవతలు,
  మూర్తుల్లు కంపిల్ల
  కూలిమాటడగండిరా !
  అన్నాలు
  చాలవని చెప్పండిరా….
  తెన్నేటి సూరి చూపిన దారి.
  మీ విశ్లేషణ అద్భుతం సర్
  మహా మహా కవుల అందరి గురించి మీ విశ్లేషణ మహా అద్భుతం.
  ఎవరికి వారే సమాజం గురించి ప్రజల్లో మార్పు కోసం ఎంత తెగి పడ్డాయో అక్షరాలు వారి వారి రచనలలో
  చదువుతున్న సేపు మనం ఎక్కడ ఉన్నాం అనుకునే తిరుగుబాటు ప్రేరణ కలిగించే పదాలు
  పోతులూరూ వారి,వేమన వారి పద్యాలు మరొక్కసారి మాచేత చదివించిన తీరు మహ అద్భుతం సర్.
  సురేష్ సర్ మీకు అభినందనలు💐💐💐

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.