నగరీకణమా నరకీకరణమా?

 ‘ఏమవుతుంది?’ ఇపుడు చాలామందిని తొలచివేస్తున్న ప్రశ్న. దేని గురించి అని మీ సంశయమా – అదేనండీ ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా కొందరు పేర్కొంటున్న అమరావతి గురించి, మునిగి మునగక చాలామందిని టెన్షన్ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అద్దె గృహం గురించీనూ. ఆంధ్రప్రదేశ్ లో తగిన స్థాయిలో వర్షాలు పడలేదు, కానీ వరదలొచ్చాయి. ఇక వర్షాలు పడితే ఎలా ఉంటుందన్నది బహుశా పెద్ద ప్రశ్న కాదేమో. ఒక్క భారీ వర్షం పడితే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాల పరిస్థితి ఏంటో పలుమార్లు చూశాం, ఆయా నగరాల్లో నివాసముండేవాడు అనుభవించారు. నగరమేదైతేనేం ప్రజల ఇబ్బందులు చెప్పనలవిగాని రీతిన ఉంటున్నాయి. వీటిలో ప్రతి నగరమూ ప్రపంచ స్థాయిగా కొనియాడబడేదే. మరి ప్రపంచస్థాయి నగరాలకు ఒక్క భారీ వర్షాన్ని కూడా తట్టుకోలేనంతటి పరిస్థితి ఎందుకు దాపురిస్తోంది? ఇటువంటి సంఘటనలు జరిగిన ప్రతిసారీ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం; భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని గొప్పలు చెప్పుకోవడం, ఏదో ఒక కమిటీని ఏర్పాటు చేయడం – ఇంతకుమించి వేరుగా జారుతుందని ఆశించడం కూడా తప్పేనేమో. కానీ, మూల కారణం అన్వేషణ చెయ్యటానికి లేదా చర్చించటానికి మాత్రం ఎవరూ ముందుకురారు. ఎందుకు?

ప్రజలు కూడా ఈ దిశగా పెద్దగా ఆలోచించినట్టు కనబడదు. వర్షాలు వచ్చినపుడు ఇబ్బంది పడటం, ప్రభుత్వాలను తిట్టుకోవటం, తరువాత యథారీతిన సాగటం. ఊరవతల పొలాల్లో ప్లాట్స్ వేశారు, తక్కువ రేట్ కు దొరుకుతున్నాయి అంటే పొలోమని వెళ్ళి కొనటం. ఇటువంటి నగరీకరణ లేదా పట్టణీకరణ, అభివృద్ధి కేంద్రీకరణ, నగర జీవితం పట్ల ఆకర్షణ వంటివి ఇటువంటి సంఘటనలకు మూలకారణమని ఒప్పుకోవటానికి మాత్రం ఎవరూ ముందుకు రారు. ముందుగా చర్చించుకోవలసినది మాత్రం అభివృద్ధి కేంద్రీకరణ. అభివృద్ధికి తార్కాణాలుగా చెప్పబడే ప్రతి ఒక్కటీ ఈ నగరాలకే పరిమితమవుతున్నాయి. విద్యాలయాలైనా, పరిశ్రమలైనా, విహారస్థలు లైనా – ఏవైనా సరే ఈ నగరాలలోనే ఏర్పాటు అవుతున్నాయి. దానికి తగ్గట్టుగా వలస కొనసాగుతూనే ఉంది. దానికి తోడు వేర్వేరు కారణాల వల్ల వ్యవసాయ రంగం నానాటికీ కుదేలవుతుండటంతో పట్టణాలకు వలస వెళ్ళే వలసదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దానితో ఆవాస సముదాయాల నిర్మాణం పెరుగుతూనే ఉంది. ఈ నిర్మాణాలకు తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు; సూచనలు పాటించటం లేదు. అంతే కాక, చిన్న చిన్నకుంటలతో పాటు చివరకు చెరువులను కూడా ఆక్రమించుకుని నిర్మాణాలు చేస్తున్నారు. భూమిలోపల ఉన్న నీటిని లాగివేస్తూనే ఉన్నారు; మరోవైపు వర్షపు నీరు నిల్వ చేసుకోవటానికి కానీ, భూగర్భ జలాలు పెంపొందించే చర్యలు కానీ చేపట్టటం లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ అన్నది ఆచరణలో పాటించగలిగినట్టయితే ఇటువంటి వైపరీత్యాలకు కొద్దిగా అయినా అడ్డుకట్ట వేయవచ్చు, కనీసం ఆస్థి, ప్రాణ నష్టస్థాయి ఇంతకు మించకుండా చూసుకోగలిగే అవకాశం ఉంటుంది. 

ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితిని గమనిస్తే – రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలలో పెద్ద వర్షాలేమీ పడలేదు. ఎగువ రాష్ట్రాలలో పడిన భారీ వర్షాలకు నదులకు వరదలొచ్చాయి. అదేసమయంలో ఇక్కడ కూడా భారీ వర్షాలు పడి ఉంటే పరిస్థితి ఏమిటి? ఇపుడు అమరావతి ప్రాంతంలో జరిగిన నష్టం, ప్రజల కష్టాల కంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు అద్దెకుంటున్న ఇల్లు ఏమవుతుందోనన్న ఆందోళనే తెదేపా వారిలో ఎక్కువగా కనబడింది. తెదేపా వారిని వదిలేద్దాం, కానీ మీడియా కూడా అదే తీరు. ప్రజల కష్టాలు, సహాయక చర్యల గురించిన కథనాల కంటే – చంద్రబాబు అద్దె ఇంటి వద్ద వరద నీటి స్థాయి గంటగంటకూ ఎంత పెరుగుతోంది అంటూ ప్రత్యేక కథనాలే తప్పించి – ప్రజల గురించి కాదు. ఇక్కడ వర్షాలు పడకుండానే ఈ స్థాయి నష్టం అంటే, ఇక్కడా భారీ వర్షాలు పడితే పరిస్థితి ఏంటనే విశ్లేషణలు లేవు. 

అభివృద్ధి కేంద్రీకరణ వలన మనం ఎదుర్కొంటున్న, ఎదుర్కోబోతున్న దుష్పరిణామాలలో ఇది కూడా ప్రధానమైంది. అంతే కాకుండా అమరావతి ప్రాంతం గతంలోనూ కొండవీటివాగు ఉప్పొంగినపుడు ముంపునకు పలుమార్లు గురైన ప్రాంతమే. శివరామకృష్ణన్ కమిటీతో పాటు కేంద్ర పర్యావరణ శాఖ తదితరులు ఇక్కడ రాజధాని నిర్మాణానికి అణువు కాదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ, పట్టుబట్టి రాజధానిని అక్కడే నిర్మించాలనుకోవడంలో ఆంతర్యం ఏమిటో మరి. ఇక్కడ రాజకీయ విమర్శలు పక్కనబెడితే, ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడమంటే ముందుగా అభివృద్ధి వికేంద్రీకరణజరగాలి. అది జరిగిన నాడు వలసలు ఆగగలవు. దానివలన ఈ నగరాల అతి విస్తరీకరణ తగ్గుతుంది, అభివృద్ధి ఫలాలు ఇతర ప్రాంతాలకు కూడా అందగలిగే వెసులుబాటు కలుగుతుంది, ఇతరత్రా అనేక లాభాలు ఉంటాయి. అభివృద్ధి వికేంద్రీకరణ వలన నగరీకరణ పేరున పల్లెల శిథిలీకరణ తగ్గే అవకాశం ఉంటుంది. దానివలన భవిష్యత్తు తరాలకు ఆహార కొరత ఏర్పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. (అభివృద్ధి వికేంద్రీకరణలో సారవంతమైన వ్యవసాయ భూముల ఆక్రమణ భాగం కాకూడదు.) వర్షపు నీటిని నిల్వ చేసే అవకాశాలు పరిశీలించాలి. ఊరికే ఊకదంపుడు రాజకీయ ఉపన్యాసాలు, హామీలు కాక నిపుణులు అందించిన పరిశీలనాత్మక సూచనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి వికేంద్రీకరణకు ముందడుగు వేయాలి.ఇటీవలి కాలంలో చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలతో పాటు కేరళలో వర్షాకాలంలో జరుగుతున్న ఆస్తి, ప్రాణ నష్టాలను గమనించి అయినా పాఠం నేర్చుకోవాలి. లేకపోతే భవిష్యత్ తరాలు తిట్టుకోవడానికి తప్ప మరెందుకూ కాకుండా చరిత్రలో ‘ఆ విధంగా నిలిచిపోతారు’

‘బాబో’య్ అమరావతి

 

వంశీ కలుగొట్ల

వృత్తి: సాఫ్ట్వేర్ ఇంజనీర్; వ్యావృత్తి: రచనలు, కవిత్వం; నివాసం: బెంగుళూరు; పుట్టిన ఊరు: గని, కర్నూలు జిల్లా; తల్లిదండ్రులు: కలుగోట్ల విజయాత్రేయ, విజయలక్ష్మి. రచయిత/కవిగా : బృందావన చరితం - విద్వత్ ఖని కథనం, భారతీయం, సుప్రసిద్ధ భారతీయ కళాకారులు, సుప్రసిద్ధ భారతీయ క్రీడాకారులు, భారతీయం, భారతరత్నాలు, ఆంధ్రప్రదేశ్ జనరల్ నాలెడ్జి తదితర పది పుస్తకాలు (మొదటిది మినహా మిగతావి ఆదెళ్ళ శివకుమార్ గారితో కలిసి). ఇవి కాక జాగృతి మాసపత్రికలో సంవత్సరం పాటు అసోసియేట్ సబ్ ఎడిటర్ గా, శ్రీ దత్త ఉపాసన మాసపత్రికకు ఆరు నెలలపాటు సబ్ ఎడిటర్ గా పని చేశాను. దాదాపు 500 కవితలు; 120 కు పైగా రాజకీయ, సినీ, సామాజిక అంశాలకు సంబంధించిన వ్యాసాలు; 20 కి పైగా కథలు; రెండు బుర్రకథలు రాశారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.