హాయండి…
అస్సలండి… వద్దండి…
చెప్పకూడదనుకున్నానండి…
ఎప్పటికప్పుడు వెళ్ళే ఫారిన్ ట్రిప్పుల గురించి ఏం చెపుతామండీ?
బాగోదండీ…
అంత గొప్పగా ఉండదండీ…
కంప్లైంట్ బాక్సులో కంప్లైంట్ వెయ్యకపోతే మరీ అస్సలు బాగోదన్నారండీ… గొడవలు వొచ్చెస్తాయి అన్నారండీ…
గొడవలు పడడం నాకు ఇష్టం లేదండి… ఉన్న గొడవలు చాలవా అండీ?
అదికాదురా మేమందరం కంప్లైంట్ రాశాం… వేశాం… నువ్వూ వెయ్యాల్రా అన్నారండి…
‘నేనే?’ అన్నానండి!
‘నువ్వే’ అన్నారండి!
సరే అన్నానండి… అయితే నాకు అక్షరాలే పూర్తిగా రావండి…
నాకు ఈ అండీ ముందునుంచి అలవాటు లేదండీ… కానండి ‘ఒరే మేం మీ క్లాసుమీట్లం కాదురా… నువ్వూ నువ్వూ అని నీతో సమానంగా చేసి మాట్లాడకురా… మమ్మల్ని సారూ పులుసూ అనకపోయినా కనీసం అండీ అనరా’ అని మాస్టార్లు నా గెడ్డం పట్టుకు బతిమలాడితే- ‘అలాగేరా’ అనేసానా- నాకు నెత్తిమీద మొట్టికాయలు వేసేశారా- అప్పటి నుండి అలవాటు చేశారండీ… ఈ అండీ.. అదండీ!
అందుకేనండి నేను చెపుతున్నానండి… ఈ ఎదవలు సారీ మంచివాళ్ళు… వీళ్ళు రాస్తున్నారండి…
ఔనండీ మీరెప్పుడైనా ఫారిన్ వెళ్ళారాండీ?
విమానంలో కాదండి…
వీసా అక్కర్లేదండి…
పాస్ పోర్ట్ అంతకన్నా అక్కర్లేదండి…
టికెట్ కూడా అక్కర్లేదండి… నిజమండి…
స్కూల్లోనండి!
ఔనండి స్కూల్లోనేనండి!
నేను రెండు చేతివేళ్లూ యిలా యిలా ఊపుతాను కదండీ… ‘చంద్రబాబులాగా… వయ్యెస్ జగన్ లాగ అలా ఊపకురా’ అని అంటారండీ…
‘విజయ యాత్రకు బాబు బయల్దేరాడండీ’ అంటారండి… ‘ఆయా’ అని ఆయమ్మని మాస్టారు పిలుస్తారండి… తొందరగా తీసుకెళ్ళు అంటారండి…
నేను బయల్దేరుతానా… నా వెనుక నా ఫ్రెండ్స్ కూడా బయల్దేరుతారండీ…
వాళ్ళనలా వుంచండి! కాని వాళ్ళు వుండరండి!
ఆయమ్మ మొదట నవ్వుతూ చూస్తుందండి… కాని తరువాత నమిలి తినేసేలా కూడా చూస్తుందండీ… ఆయా చేతిలో బెత్తము లేకగానండి ఉంటే నా వీపు మీద విరగగొట్టేసునండి!
అయ్యో చెయ్యి పట్టి బరబరా లాక్కెలిపోతుందండీ… విసిరేసినట్టే… నిజంగా ఫారిన్ కు విమానం మీద తీసికెళ్ళినట్టే యమ స్పీడుగా ఆగమేఘాల మీద తీసుకువెళుతుందండి…
‘ఇంటిదగ్గర వెళ్ళి చావచ్చుగా?’ అని వొక రోజు కాదండి రోజూ తిడుతుందండి!
అప్పటికీ ‘రోజూ నన్నెందుకు తిడుతున్నావ్?’ అని అడిగానండి…
అడగనా అండి?
‘రోజూ నువ్వు ఇక్కడ వెళ్తే తప్పు లేదు, నే అంటేనా తప్పొచ్చింది? అంత సిగ్గూ శరం ఉన్నోడివి అయితే రేపు యింటి దగ్గర వెళ్ళి రా…’ అన్నాదండీ… ఇంకా ఏమన్నాదంటే, ‘నీకు కాదు, మీ అమ్మా బాబుకు బుద్దిలేదు, కడుపుకి అన్నమే తింటున్నారో ఇంకేమి తింటున్నారో’ అని అన్నాదండి! అప్పటికీ చెప్పానండి ‘అన్నం కాదు, పుల్కాలు చపాతీలు తింటున్నారు’ అని కూడా చెప్పానండి… తిట్లు ఆపదే?! ఒకటే సొద! ఒకటే రొద!
ఈ టీచర్ల బాధ టీచర్లది! ‘స్కూలు టైమంతా టాయిలెట్లలోనే కూచుంటావా?’ అని వచ్చీపోతూ సిగ్గుపడకుండా అడుగుతుంటారండి! మాట్లాడిస్తే మధ్యలో ఆగిపోతుంది కదండీ?
ఇటు ఆయా తిట్లకీ టూ రాదు!
‘నీకు అది రాదు, మీ అమ్మా అయ్యకి బుద్ది రాదు’ ఆయమ్మ దండకం అందుకుంటుంది!
తిట్టాలే! మా మమ్మీ డాడీని తిట్టాలే! మంచిదే! లేకపోతే అర్థరాత్రి వరకూ ఆ సీరియళ్ళూ ఈ సీరియళ్ళూ చూస్తారు! సీరియళ్ళన్నీ తెలుగువీ హిందీవీ మధ్యలో తమిళంవి… తరువాత కథ ఏమి జరిగిందో తెలుసుకోవడానికి! అన్నీ మిస్ కాకుండా చూస్తూ బ్రేక్ టైంలో అమ్మ వంట కొద్దికొద్దిగా చేస్తుంటుంది! నాన్న బుద్దిగా అమ్మ ఏది పెట్టినా చూస్తారు! ఏది పెట్టినా తింటారు! మమ్మల్ని తినమంటారు! నానమ్మ గొణుగుతూ వుంటుంది! రాత్రి పదకుండుకి తింటాము!
సాయంత్రం స్నాక్స్ తింటాము కదా… ఆ టైం అయితే కాని నాక్కూడా ఆకలి వెయ్యదు! స్కూలు నుంచి వచ్చి సాయంత్రం దాకా అమ్మతో కలిసి నిద్రపోతాను, నాన్న ఆఫీసునుండి వచ్చేదాక! రాత్రి తొందరగా నిద్రపట్టదు! తెల్లవారి ఆలస్యంగా లేస్తాం! లేస్తూనే నోట్లో బ్రెస్సు పెడుతుంది అమ్మ! టూ కి వెళ్ళమంటుంది! కాని వెళ్తూ బ్రష్ చేసుకోమంటుంది! నాన్న అలానే టైం సేవ్ చేస్తారు! నాన్నయితే టూ కి వెళ్తూనే బ్రెస్సూ పేపర్ చదవడమూ ఆఫీసు విషయాలు ఫోన్లో మాట్లాడడమూ అబ్బో అన్నీ చేసేస్తారు! గ్రేట్! నేనూ హోం వర్క్ అక్కడే చేస్తానంటే మాత్రం అమ్మ వొప్పుకోదు!
‘అయిందా?, వెళ్ళింది చాల్లే, టైం అయిపోతోంది’ అని అమ్మ డైరెక్ట్ గా సబ్బు రాసేస్తుంది! నీళ్ళు పోసేస్తుంది! టవల్ వేసి తుడిచేస్తుంది! సబ్బు వుండిపోయిందమ్మా అంటే కూడా తుడిచేస్తుంది! బట్టలు తొడిగేస్తుంది! తలదువ్వేస్తుంది! వీపుకి బ్యాగు తగిలించేస్తుంది! షూస్ వేసేస్తుంది! టై కట్టేస్తుంది! డైరీలో సంతకం పెట్టేస్తుంది! అమ్మ పౌడర్ రాస్తుంటే నానమ్మ టిఫిన్ తినిపించేస్తుంది! ఎక్కువయింది అన్నా వదలదు! తిండి కలిగితే కండ కలదు అంటాది!
అప్పుడు నేను స్కూలుకు కదులుతుండగా టూ కి కదులుతుంది!
‘లోడింగ్ అయితే కాని నీకు అన్ లోడింగ్ అవదురా’ అని నానమ్మ తిడుతుంది! అమ్మ అప్పుడు నా ముఖం చూస్తుంది! అర్థం చేసుకుంటుంది! ‘వెళ్తావా?’ అని అడుగుతుంది! కడుపులో నొప్పి మొదలవుతుంది! నాకు మాట రాక తలూపుతాను! అప్పుడు అమ్మ వాల్ క్లాక్ చూస్తుంది! ఆలోచిస్తుంది! కొన్ని సార్లు వెళ్ళమంటుంది! మరికొన్ని సార్లు ‘స్కూలుకు వెళ్ళాక వెళ్ళులే’ అంటుంది! ‘ఆపుకో’ అంటుంది! వచ్చేస్తుంది అంటానా, అమ్మకూడా వచ్చేస్తుంది అంటుంది… బస్సు గురించి! ప్చ్!
అప్పటికే స్కూల్ బస్సు స్కూల్ బెల్ లా ఆగకుండా హారన్ కొడుతూనే ఉంటాడు! కొన్ని సార్లు బస్సు వెళ్ళిపోతుంది! వెంట నాన్నో అమ్మో అన్నయ్యో పరిగెడతారు!
అప్పటికీ అమ్మకి చెపుతాను! ‘అమ్మా వచ్చేస్తోంది’ అని! ‘స్కూలుకు వెళ్ళాక వెళ్ళు’ అంటుంది! ‘అది కాదు మమ్మీ..’ చెప్పబోతానా ‘ఫరవాలేదు’ అంటుంది! ‘రోజూ వెళ్తే స్కూల్లో తిడతారు’ అని చెప్తానా- ‘ఎవరు?’ అంటుంది! ‘పిల్లన్నాక పియ్యరాదా?’ నానమ్మ మధ్యలో వంత పలుకుతుంది! అమ్మేమో ‘మనతో తక్కువ డబ్బులేం కట్టించుకోవడం లేదు, వేలకొద్దీ లక్షల కొద్దీ కడుతున్నాం ఫీజులు… వొత్తి పుణ్యానికి కాదు… వాళ్ళు చదువు చెప్పింది ఎలాగూ లేదు, ఆమాత్రం వెళ్తే కూడా తియ్యరా? ఆ?’ అని నన్ను అడుగుతుంది! నేనేం చెప్పను? నేను సైలెంటుగా వుంటే రేపు ‘నేనూ మీ నాన్నా స్కూలుకు వస్తాం, నిన్ను ఎవరు తిట్టారో చెప్పు…’ అమ్మ గొడవకు వస్తానన్నట్టే మాట్లాడుతుంది!
నాకు వచ్చింది ఆగిపోతుంది!
అలా ఆగింది ఇదిగో ఇలా స్కూల్లో మళ్ళీ వస్తుంది!
నాలాంటి వాళ్ళు క్లాసుకు నలుగురమైనా వుంటాం కదా… క్లాసులో మాట్లాడడం అవదు కదా… అందుకని అక్కడ మాట్లాడుకుంటాం…
‘మీరిలా ముగ్గులేస్తూ వుండండి’ అని ఆయా టీ తేవడానికో తాగడానికో వెళ్ళిపోతుంది! ఎవరో ఒకరు పిలుస్తారు! ఆయమ్మ వెళ్ళిపోతుంది! మరో ఆయమ్మని పిలిస్తే ‘నాక్లాసు కాదు’ అంటుంది!
ఆయమ్మ ఎప్పుడు వస్తే అప్పుడు కడుగుతుంది! ఎండిపోతుంది! ‘ఛీ’ అంటుంది! ‘పీటమీద కూర్చుండి పోయినట్టు కూర్చుండి పోయినావా?’ అని తిరిగి తిడుతుంది! ‘సారీ’ చెపుతానా, ‘మీ అమ్మకు శారీ అడుగు’ అంటుంది!
ఈ బాధలన్నీ ఎందుకని ఆపుకుంటానా? మటం దిద్ది కూర్చుంటానా? బిగబడతానా? ఆపినందుకు ఒక్కసారి వచ్చేస్తుంది! ‘రోజూ డ్రామాలు చెయ్యొద్దు’ అని మాస్టారు ఒక్కోసారి వదలరు! ‘ఇలా క్లాసు మొదలెట్టగానే అలా నీకు వస్తుందేంరా నీకు?’ అని తిడతారు! లేదంటే ఆయమ్మ రావడం లేటవుతుంది! ఇలా ఏదో ఒకటి అవుతుంది! ఏముంది ఒక్కోసారి నిక్కర్లో అవుతుంది!
అప్పుడు చూడాలి… ఆయమ్మ వుతుకుతుంది… నా డ్రాయర్ని కాదు, నన్ను! కెమెరా కంట పడకుండా ఓ పక్కకు తెచ్చి నాకు మొట్ల మీద మొట్లు పెడుతుంది! ‘ఎవరికయినా చెప్పావంటే చంపేస్తాను చీరేస్తాను’ అంటుంది! ‘కడగను’ అని కూడా వార్నింగు ఇస్తుంది! పాపం ఆయమ్మదీ తప్పుకాదు! అమ్మ కూడా విసుక్కుంటుంది కదా?
అయితే అలా డ్రాయర్ ఉతికిన రోజు అందరూ బోడి మొలతో వున్న నన్ను చూసి నవ్వుతూ ఉంటారు! ‘నువ్వు స్కూలుకి ఇందుకే వస్తున్నావురా’ అని టీచర్లు ఆటపట్టిస్తూ వుంటారు! నా బాధ అమ్మకి చెప్పాను! అమ్మ స్పేర్ డ్రాయర్ బ్యాగులో పెట్టింది!
మొదట్లో షేమ్ ఫీలయ్యా! తరువాత అలవాటయ్యా!
ఇదిగో… వీళ్ళడిగితే చెప్పా…
అరే… సారీ… అండీ మర్చిపోయా!
ఏమండీ… నాలా ఎవ్వరూ బాధ పడొద్దండి… అందరికీ అన్నీ చెప్పుకోలేమండి… చెప్పకుండానే అమ్మానాన్నా తెలుసుకోవాలండీ… లేకపోతే అమ్మా నాన్నలే కాదండి!
తప్పయితే క్షమించండి!
ఇంక చెప్పలేనండి… నిజంగానే నాకు ఏడుపు వచ్చేస్తోందండి….
-ఎక్స్
(నా పేరు వొద్దులెండి)
ఎల్కేజీ,
(నా స్కూలు పేరు వొద్దులెండి)
అయ్యో!! అంత చిన్న పిల్లాడికి ఎంత కష్టం :’( వాళ్లమ్మో, నాన్నో ఇది చదివితే బాగుండు.