ప్రమాద ఘంటికలు మోగిస్తున్న
అమెజాన్ కార్చిచ్చు

ఇంటి ముందు ఓ పచ్చని చెట్టు ఉంటే స్వచ్చమైన చల్లని గాలి తగులుతుందని మనకందరికీ తెలుసు. చెట్టు లేని ఊరిని, అడవి లేని దేశాన్ని ఊహించుకోలేం. బొగ్గు, ఆయిల్  పరిశ్రమల నుంచి టన్నుల కొద్ది వెలువడే కార్బన్ ఉద్గారాల (ఎమిషన్స్) వేడెక్కుతున్న భూగోళాన్ని చల్లబరుస్తున్నవి అడవులే. కార్బన్ డై అక్సైడ్ తో కలుషితమయిన గాలిని శుభ్రం చేసి మానవులకు, సమస్త జంతుజాలానికి ప్రాణవాయువును అందిస్తున్నవి అడవులే. పచ్చని అడవులు ఉంటేనే వానలు కురిసేది, వంకలు పారేది. పంటలు పండేది. అడవి అంటే అమ్మ. ఇప్పుడు అమ్మ వంటి అడవి అంటుకుంది. 20% అక్సిజన్ ను అందించే భూగోళానికి ఊపిరి తిత్తుల్లాంటి అమెజాన్ వర్షారణ్యాలు ( రైన్ ఫారెస్ట్స్) తగులబడి బూడిద కుప్పలుగా మారుతున్నాయి.

లక్షలాది ఎకరాల్లో  వేలాది మైళ్లు విస్తరించి, పచ్చగా అలరారుతున్న  దట్టమైన అమెజాన్ వర్షారణ్యాలు బ్రెజిల్ దేశానికే సొంతం కాదు. అవి పెరూ, కొలంబియా, బొలివియా, వెనెజుయేలా, ఈక్వెడార్, గయానా, సురినామ్, ఫ్రెంచ్ గయానా వంటి అనేక లాటినమెరికా దేశాలకు విస్తరించి ఉన్నాయి. బ్రెజిల్ లోని అమెజాన్ అడవిలో రాజేస్తున్న మంటలు దేశాల సరిహద్దుల్ని దాటి పక్కదేశాలకు వ్యాపిస్తున్నాయి 

ఎండాకాలం ఏదో మూల అడవులు అంటుకోవడం సహజమే. కానీ ఈ సారి  అమెజాన్ వర్షారణ్యాల్లో చెలరేగిన మంటలు సహజమైనవి కావని వార్తా కథనాలు వెల్లడిస్తున్నాయి. లాభాపేక్షతో గనుల తవ్వకాల కోసం, వాణిజ్య పంటలు పండించే కంపెనీల కోసం, కలప కోసం  మంటలు రాజేస్తున్నారని తెలుస్తున్నది. దొంగచాటుగా ఎవరో అనామకులు చేస్తున్న దుశ్చర్యలు కాదు ఇవి. గత జనవరిలో బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన జైర్ బొల్సొనారో రైట్ వింగ్  ప్రభుత్వ కనుసన్నల్లో జరుగుతున్న దురాగతం ఇది అని అమెజాన్ లోని ఆదివాసీ తెగలు అంటున్నారు. గత రెండు వారాల్లోనే అమెజాన్ వర్షారణ్యాల్లో 73 వేలకు పైగా మంటలు రాజేశారని తెలుస్తున్నది.  గత ఏడాదిలో కాలిపోయిన అడవితో పోలిస్తే, ఈ ఏడాది 80% పైగా అడవి కాలి బూడిదయింది. నాసా పంపిన డ్రోన్ దక్షిణ అమెరికా దేశాలపై దట్టమైన పొగలు కమ్ముకున్న ఫొటోలను పంపిందని, అంతరిక్షంలోంచి పొగలు కనిపించడం అసాధారమైన సంఘటనగా నాసా పేర్కొంది. గత సోమవారం మిట్టమధ్యాహ్నం అమెజాన్ నుంచి పాకిన దట్టమైన పొగలతో 1500  మైళ్ళ దూరాన ఉన్న బ్రెజిల్ దేశ రాజధాని నగరం సవొ పౌలొ లో చిమ్మ చీకట్లు ముసురుకుని బూడిద నల్లని వానలాగా కురిసిందని ఫొటోలతో సహా వార్తలు ప్రచురించాయి వార్తా పత్రికలు. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో మంటలు ఆర్పే చర్యలు చేపట్టక పోగా, ఎన్. జి.ఓ.లు ఈ మంటలు రాజేస్తున్నాయని ప్రెస్ మీట్లు పట్టి మరీ విమర్శించాడు. ఇదే సమయంలో అమెజాన్ అడవుల్లో నివసించే అనేక  ఆదివాసీ తెగలకు చెందిన వేలాది మంది స్త్రీలు అడవుల్ని సంరక్షించాలని ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహిస్తున్న దృశ్యాలను టీవీ ఛానల్స్ ప్రసారం చేశాయి. 

అడవుల్ని కాపాడుకోవాలని, అడవులే మనుషుల ప్రాణాలను కాపాడేవని, భూమి, నీరు కలుషితం కాకుండా కాపాడుకోవాలని, అనేక సంవత్సరాలుగా, ఏ దేశంలో వున్నా- అడవి బిడ్డలైన ఆదివాసీలు పోరాడుతూనే వున్నారు. ఆదివాసీలు నివసిస్తున్న పరిసరాలు మాత్రమే పచ్చగా వున్నాయన్నది వాస్తవం. తాము పండించే పంట భూములపై తమకు హక్కులు కల్పించాలని, విద్యా, వైద్య సౌకర్యాలు కల్పించాలని ఎన్నో ఏళ్లుగా వారు కోరుతున్న కనీస కోర్కెలు. ఏ దేశంలో ఉన్నా ఆదివాసీలందరిదీ ఒకే నినాదం “అడవిని కాపాడుకుందాం”అని.  

కానీ, ప్రపంచ వ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన  రైట్ వింగ్ ప్రభుత్వాలన్నీ ఆదివాసీల హక్కులను గుర్తించకపోగా, వారిని అడవి నుంచి తరిమికొట్టాలని పథకాలు వేయడంలో ఐక్యతను సాధించాయి. ఇండియాలోని మోదీ ప్రభుత్వం భూమి పట్టాలు లేని గిరిజనులు అడవుల నుంచి వెళ్లిపోవాలని ఒక చట్టమే చేసింది.  బ్రెజిల్ లో అడవుల్లో మంటలు రాజేస్తూ, ఆదివాసీ నివాసాల్ని కూడా బూడిద చేస్తున్నారు . ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టే కుతంత్రాలు చేస్తున్న రైట్ వింగ్ ప్రభుత్వాలకు, తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కుంటున్నామని తెలుస్తుందా ఎప్పటికైనా? అడవుల్నుంచి ఆదివాసీలనే కాదు, అడవి నుంచి పచ్చని చెట్లను కూడా తొలగిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలకు అడవంటే చెట్లు కాదు గనులు. అందులో బొగ్గు  దొరకొచ్చు, యురేనియం దొరకొచ్చు, బంగారం దొరకొచ్చు. బాక్సైట్వ్, ఇనుము దొరకొచ్చు. భూమి గర్భంలో ఏదో ఒక ఖనిజం వుంటుంది. ఈ ప్రభుత్వాలకు లాభాపేక్షే పరమావధి. కానీ అడవులు లేకపోతే భూమి తాపం పెరిగి, పర్యావరణం దెబ్బతింటుందని ఈ ప్రభుత్వాలు గుర్తించనిరాకరిస్తాయి. వాతావరణ మార్పులు జరగవని మొండిగా వాదించే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన గొల్ఫ్ కోర్టు సముద్రంలో మునగకుండా గోడ కడతాడు. మరోవైపు అలస్కా వర్షారణ్యాల్లో 16.7 మిలియన్( కోటి 67 లక్షల) ఎకరాల్లో కలప నరికివేతను అడ్డుకునేందుకు 20 ఏళ్ల క్రితం క్లింటన్ అధికారంలో ఉండగా చేసిన చట్టాన్ని ఎత్తివేయాలని  అగ్రికల్చరల్ సెక్రటరీ సన్నీ పర్డ్యూ (Sonny Purdue) ని ఆదేశించాడు ట్రంప్.  

అమెజాన్ వర్షారణ్యాలు తగలబడడం అంటే అంతర్జాతీయ సంక్షోభం ఏర్పడిందని,  ‘’ మన ఇల్లు కాలుతోంది. సంక్షోభంలో పడింద’’ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రొన్ పేర్కొంటూ, ఫ్రాన్స్ లో జరుగుతున్న జి-7 దేశాల సదస్సులో  దీన్ని ప్రధాన అంశంగా చర్చించాలని సూచించాడు. అంతేకాదు అమెజాన్ అడవుల్లో రగులుతున్న మంటలను ఆర్పడానికి 20 మిలియన్ డాలర్లు సహాయాన్ని జి. 7 దేశాలు ప్రకటించాయి. కాని బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో మాత్రం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రొన్ “వలసవాది’’గా మాట్లాడుతున్నాడని. “ఇది మీ ఇంటి సమస్య కాదు, మా ఇంటి సమస్య ‘’ అని విమర్శిస్తూ ఫ్రాన్స్ ప్రథమ మహిళపై కించపరిచే వ్యాఖ్యలు చేసి ప్రపంచ ప్రజల ముందు తేలిక చేసుకున్నాడు. 

  పెరూ, బొలివియా ప్రభుత్వాలు తమ భూభాగంలో వున్న అమెజాన్ లోకి మంటలు వ్యాపించినప్పుడు వెంటనే సహాయక చర్యలు చేపట్టాయి. అమెజాన్ అడవుల్లో మంటలను నివారించే చర్యలు చేపట్టడం లేదని బొల్సొనారోను విమర్శిస్తూ బ్రెజిల్ లో, అమెరికాలో, ఐరోపా దేశాల్లో, లాటినమెరికా దేశాల్లో ఆదివాసీలు, పర్యావరణ యాక్టివిస్టులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పర్యావరణ సమస్యలను గుర్తించిన కొన్ని లాటినమెరికా దేశాలు, యూరోపియన్ దేశాలు బ్రెజిల్ నుంచి పంచదార, సోయ దిగుమతులపై ఆంక్షలు విధించడానికి కూడా సిద్ధపడ్డాయి.బొల్సొనారో విధానాలు నచ్చక బ్రెజిల్ కు అడవుల విధ్వంసాన్ని నివారించేందుకు అందిస్తున్న  ఫండ్స్ ను నార్వే, జర్మనీ దేశాలు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తున్న నిరసనలకు తలొగ్గి బ్రెజిల్ ప్రభుత్వం అమెజాన్ లో మంటలు ఆర్పడానికి సహయక చర్యలు గత రెండు రోజుల నుంచి చేపట్టింది.

ఈ ఏడాది వేసవిలో వేడి పెరిగి, మంచు పర్వతాల్లో అత్యధికంగా  మంచు కరిగి ఆ నీరు సముద్రాల్లో కలిసి సముద్ర మట్టాలు పెరిగినట్టు వాతావరణ శాస్త్ర వేత్తలు వెల్లడించిన విషయాల్ని ప్రముఖ వార్తాపత్రికలు సహితం ప్రచురించాయి. పర్యావరణ మార్పుల వల్ల గ్రీన్ లాండ్, డెన్మార్క్, స్విర్జలాండ్, కెనడాలలో మంచు కొండలు ( గ్లేసరీస్) కరిగి అత్యధికంగా నీరు సముద్రాల్లో కలుస్తున్నట్టు వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో ఇండోనేషియా దేశాధ్యక్షుడు ఆ దేశ రాజధానిని జకార్తా నుంచి మరోనగరానికి మార్చబోతున్నట్టు ప్రకటించాడు.  సముద్ర తీర ప్రాంతాలున్న అన్ని నగరాలు నీట మునిగే ప్రమాదం పొంచివుంది.

ప్రపంచంలో ఏదో మూల పర్యావరణం గురించి ఆదివాసీలతో కలిసి ప్రజలు పెద్ద సంఖ్యలోనే పోరాడుతున్నారు. పర్యావరణ సమస్య ఏ ఒక్క దేశానికో సంబంధించిన సమస్య కాదు. మనుషులం దేశాలకు సరిహద్దు గీసుకుని వుంటున్నాం కానీ, రగిలే మంటలకు, ఉప్పొంగే సముద్రాలకు, చెలరేగే తుపాన్లకు, కరిగే మంచు కొండలకు సరిహద్దులు లేవు.    పర్యావరణాన్ని కాపాడుకోడానికి, అంతిమంగా భూగోళం మీది జీవరాసుల్ని కాపాడుకోడానికి సరిహద్దులు చెరిపేసి ప్రపంచమంతా ఒక్కటై కలిసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రపంచంలో ప్రతి మూల సాగుతున్న ఆదివాసీ ప్రజల, పర్యావరణ సంఘాల పోరాటాలు ఏకం కావాలి. పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయ స్థాయిలో కొత్త చట్టాలు, విధి విధానాలు  రూపొందించడానికి ఈ పోరాటాలు దోహదం చేయాలి. 

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.