ఆధునిక మహిళ
వ్యక్తిత్వ వికాసం

సార్! చల్లా రామ ఫణిగారేనా మాట్లాడేది?’ ‘అవునండీ చెప్పండి.’ ‘నా పేరు స్వప్నజ. (పేరు మార్చాను). కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. మీ ఆర్టికల్స్ చదువుతుంటాను సార్. చాలా బాగుంటాయి. చిన్న సందేహం సార్! వ్యక్తిత్వ వికాస రచనలు కూడా మగవారికేనా? ఆడవాళ్ళకు ఉండవా?’ ప్రశ్నతో నాకు జీవిత కాలపు షాక్! వ్యక్తిత్వ వికాస పాఠాల్లో లింగ వివక్ష? నేటి యువతులకు నీతులు చెబితే అణగదొక్కేస్తున్నారని యాగీ చేస్తారు. వారిని ఉద్దేశించి మంచి మాట్లాడినా లింగ వివక్ష అని గగ్గోలు పెట్టేస్తారు. పురుషులకు వ్యక్తిత్వ వికాసం ఎంత అవసరమో, మహిళలకు కూడా అంతే అవసరం. కుటుంబాన్ని, సమాజాన్ని తీర్చిదిద్దడంలో జీవితాలు ధారపోసే మహిళామణులకు ఇంకా ఎక్కువ అవసరం. మనుస్మృతి, కుమారీ శతకం వంటి ప్రాచీన గ్రంధాలు, సమస్త పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, మగ జాతి ప్రేమే ప్రేరణగా రాసిన కవిత్వాలు,  – అన్నీ స్త్రీ జాతిని నియంత్రించడానికే, అణగదొక్కడానికే  అన్న భావన కూడా ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ నేపధ్యంలో భారతీయ సంస్కృతి,  సంప్రదాయాల ఆధారంగా మహిళల వ్యక్తిత్వ వికాస ప్రమాణాలను నిర్వచించడం సాహసమే అవుతుంది.    

ప్రపంచీకరణ నేపధ్యంలో, అన్ని రంగాల్లోను  విలువలు, ప్రమాణాలు  మృగ్యమైపోతున్న నేటి రోజుల్లో, కుటుంబాన్ని, సమాజాన్ని తీర్చిదిద్దడానికి ఆధునిక మహిళ పడే మానసిక ఒత్తిడిని అంచనా వేయడం అక్షరాలకు సాధ్యం కాదు. భారతీయ మహిళ వ్యక్తిత్వంలోని  దృఢత్వం అత్యున్నత శిఖరాలు చేరుకున్న ఈ కాలంలో ఎందరో ప్రతిభా మూర్తులను అన్ని రంగాల్లో అందించిన ఘనత భారతీయ మాతృ మూర్తికే దక్కుతుంది. క్రీడా రంగంలో సానియా మీర్జా, సాక్షి మాలిక్, సైనా నెహ్వాల్పి.వి.సింధు, మిథాలి రాజ్, మేనేజ్మెంట్ రంగంలో కిరణ్ మజుందార్ షా, ఇంద్రా నూయి, జ్యోతి రెడ్డి వంటి మహిళా మణులు నేటి తరంలో మనకు స్ఫూర్తినిస్తున్నారంటే వారి కృషి, పట్టుదల వెనుక వారి తల్లిదండ్రుల ముఖ్యంగా మాతృమూర్తుల కఠోర శ్రమ, పరిస్థితులను ఎదుర్కొనే మొండి ధైర్యం దాగున్నాయన్న సత్యం ఎవ్వరూ కాదనలేరు. 

మహిళల వ్యక్తిత్వ వికాసం అనగానే వారి వేషభాషలు, అలంకరణల మీదకు దృష్టి పోతుంది. దుస్తులలో వ్యక్తిత్వ వికాసం ప్రతిఫలించదు కానీ, వారి వ్యక్తిత్వం, హుందాతనం, ఆయా దేశ కాల పరిస్థితులు, ఆయా దేశాల వాతావరణం ఇవన్నీ కూడా మహిళల దుస్తుల్లోనే కాదు; మగవారి దుస్తుల్లోనూ ప్రతిఫలించాలి.   ప్రపంచీకరణ నేపధ్యంలో వ్యక్తిత్వం, వ్యక్తిత్వ వికాసం, ముఖ్యంగా మహిళలకు  సంబంధించినంతవరకు వాటి నిర్వచనాలు మారిపోయాయి. మహిళలు అసాధారణ రీతిలో పురుషులతో పోటీ పడుతూ, అత్యున్నత పదవులను అలంకరిస్తూ, అత్యుత్తమ  స్థాయిలో ఆదర్శవంతంగా జీవిస్తున్నారు. అటువంటి వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుంటే నేటి మహిళల వ్యక్తిత్వం, వ్యక్తిత్వ వికాసం,  వస్త్ర ధారణ దగ్గరనుంచి, ఉద్యోగ వ్యాపార కార్య నిర్వహణల దాకా అన్ని అంశాలు సంపూర్ణంగా అవగాహనకొస్తాయి. నేటి ఆధునిక మహిళల వ్యక్తిత్వానికి   వారు ప్రతిరూపాలు. ఆదర్శ స్వరూపాలు. నిలువెత్తు ఆచరణకుస్త్రీ జాతి సామర్ధ్యాలకు ఆనవాళ్ళు. అటువంటి మహిళామణుల గూర్చి తెలుసుకుంటే మహిళలకు కూడా జీవితంలో ఏదైనా సాధించడానికిలక్ష్యాలను అలవోకగా సిద్ధింపచేసుకోవడానికి  వ్యక్తిత్వ వికాసం, వ్యక్తిత్వ వికాస దృక్పథం  ఎంత అవసరమో తెలుస్తుంది. 

1969లోనే చెన్నైలోని నైన్ జెంస్’ (Nice Gems) అనే నైట్ క్లబ్ లో తన కెరీర్ ను ప్రారంభించిన విశ్వ విఖ్యాత భారతీయ పాప్ సింగర్ ఉషా ఉతుప్ ఇప్పటికీ ప్రపంచంలోని అభిమానులందరినీ అలరిస్తూ తన అనితర సాధ్యమైన స్వర జీవన యాత్రను కొనసాగిస్తున్నారు. ఆమె నాటి నుండి నేటి వరకు నిండైన చీర కట్టు, రూపాయి కాసంత బొట్టుతోనే వేదికనెక్కి శ్రోతలను ఉర్రూతలూగిస్తారు. క్లబ్బులోనైనా, ఐక్య రాజ్య సమితిలోనైనా ఆమెది అదే ఆహార్యం, అదే గాంభీర్యం, హాస్య చతురత, నిలువెత్తు భారతీయతకు ప్రతీక. 

  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్ధిక సంస్థను నడుపుతున్న కార్యనిర్వహణాధికారి. ఎల్లప్పుడూ  భారతీయ మహిళల్లో పొదుపు చేసే తెలివితేటలను, పొదుపుగా సంసారం చేసుకునే కౌశల్యాన్ని ప్రస్తావిస్తూ, చిరునవ్వే ఆభరణంగా చీరకట్టుతోనే తన కార్యకలాపాలు కొనసాగిస్తారు. భారతీయ మహిళల ఆర్ధిక కార్య నిర్వహణా సామర్ధ్యానికి, పురుషాధిక్య సమాజంలో నెగ్గుకు రాగల ధైర్య సాహసాలకు నిదర్శనంగా నిలుస్తారు.  

ఆమె  బెంగళూరులోని ఒక కారు షెడ్డులో తన ఔషధ పరిశ్రమను, పరిశోధనలను ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాత ఔషధాల తయారీ కంపెనీ బయోకాన్వ్యవస్థాపక చైర్మన్ పద్మవిభూషణ్కిరణ్ మజుందార్ షా. ఆస్ట్రేలియాలోను, బెంగళూరులోను చదువుకున్నారు. ఐఐఎం, బెంగళూరు చైర్ పర్సన్ గా విద్యారంగంలో కూడా తనదైన ముద్రను ప్రతిఫలిస్తున్నారు. సౌకర్యంగా ఉండే వస్త్రధారణతో ఎంతో హుందాగా, చిరునవ్వుతో  విధులను నిర్వహించడంలో, మానవ వనరులను ప్రతిభావంతంగా వినియోగించుకోవడంలో ఆమెకు ఆమే సాటి. ఫోర్బ్స్ పత్రిక ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా ఆమెను గుర్తించింది. 

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఇష్టంగా పార్టీ అంటే చాలు పెప్సీ తెగ తాగేస్తారు. ప్రపంచంలోని మారుమూల ద్వీపాల్లో సైతం లభించే పెప్సీ తయారు చేసే కంపెనీని ఎన్నో ఏళ్ళుగా సమర్ధంగా నడుపుతోంది ఒక భారతీయ మహిళ. ఆమె ఇంద్రా నూయి. మద్రాసులో ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆమె  ఐఐఎం, కోల్-కతాలో మేనేజ్ మెంట్ చదివారు.పద్మభూషణ్ పురస్కార గ్రహీత. అమెరికన్ కంపెనీకి చైర్మన్ గా ఎదిగిన తొలి భారతీయ మహిళగా పేరుపొందారు. తాను పని చేసే దేశ సంస్కృతికి అనుగుణంగా, తన వృత్తికి వన్నె తెచ్చే విధంగా దుస్తులు ధరిస్తూ, దార్శనికత కలిగిన వ్యాపారవేత్తగా, పెప్సీ కంపెనీని సరైన మార్గంలో నడిపించి, పోటీ కంపెనీలను మట్టి కరిపించిన ధైర్యశాలిగా ఆమె అమెరికన్ కార్పొరేట్ ప్రపంచంలో సుప్రసిద్ధులు. భారత దేశాన్ని సందర్శించినప్పుడు, అమెరికాలో భారతీయ పండుగలు జరుపుకునేటప్పుడు  చీరకట్టుతోనే కనిపిస్తారు. వ్యక్తిగత, వృత్తిగత జీవితాన్ని సమతుల్యతతో  నిర్వహించడంలో నిపుణురాలిగా పేరు   పొందారామె.  

ఇటీవల మన దేశాన్ని సందర్శించిన బ్రిటిష్ ప్రధానమంత్రి తెరెసా మే నిండైన చీరకట్టుతో, బొట్టుతో బెంగళూరులో వివిధ కార్యకలాపాలలో పాల్గొనడం భారతీయులనే కాకుండా, ప్రపంచాన్ని కూడా ఎంతగానో ఆకర్షించింది. భారత దేశం మీద, మన సంస్కృతీ సంప్రదాయాల మీద ఆమెకు కల గౌరవం, పైగా చీరకట్టులో ఆమె తనను తాను సమర్ధంగా నలుగురిలోను నిర్వహించుకోవడం భారతీయులందరి ప్రశంసాపాత్రమైంది.

భారతీయ మహిళల నాయకత్వ లక్షణాలకు, హుందాతనానికి, గౌరవానికి, వ్యక్తిత్వానికి, వ్యక్తి తత్వానికి, వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తిత్వ వికాస దృక్పథానికి  ఈ స్త్రీమూర్తులంతా నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు. భారతీయ ఆధునిక యువతికి వీరే ఆదర్శమూర్తులు, వ్యక్తిత్వ వికాసదీప్తులు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇటువంటి మహోన్నత మహిళల అడుగుజాడల్లో తమ జీవితాలను నేటి భారతీయ యువతులు తీర్చిదిద్దుకుంటే వారి వ్యక్తిగత జీవితం, వృత్తిగత జీవితం కూడా భావి తరాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. భారతీయ మహిళ గౌరవానికి అది మరింత వన్నె తెస్తుంది. అటువంటి ఆధునిక మహిళను పూజించిన చోట నిజంగా దేవతలు తాండవించడానికి ఏ మాత్రం సంకోచించరు, సందేహించరుప్రముఖ రచయిత్రి,  ప్రపంచ ప్రఖ్యాత మానవతావాది, విద్యావేత్త హెలెన్ కెల్లర్ ఇలా అంటారుCharacter cannot be developed in ease and quiet. Only through experience of trial and suffering can the soul be strengthened, vision cleared, ambition inspired, and success achieved.

Let their tribe increase! 

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.