ఒక బేబీ బ్లో అవుట్…

హాయండి…

నేనండి… అండీ గాడి చెల్లెల్నండి!

అదేనండి… ఇంతకు ముందు ‘ఒక ఫారిన్’ రాసిన ‘ఎక్స్’ గాడి చెల్లెలు ‘వై’నండి!

ఔనండి… నాకింకా మాటలు కూడా పూర్తిగా రావండి! కూర్చోవడం నిల్చోవడం కొద్దిగా నడవడం వచ్చండి! పరిగెత్తి పడిపోవడం వచ్చండి! ఆకలేస్తే ఏడవడం కూడా వచ్చండి! ఇంకేమీ రాదండి!

(అందుకే కదండీ… నా చెల్లెలి కంప్లైంట్ నేను రాసేది… సారీ నాదే నేను రాసుకోలేకపోతే- ఇదెలా రాసానని అనుకోకండి… నాకులాగే మా పెద్ద క్లాసుల వాళ్ళతో రాయించానన్నమాటండీ)

నేనింకా అమ్మ దగ్గర పాలు మానలేదండీ…

(పాలు తాగే పాపకు కూడా కంప్లైంట్ ఏం వుంటుందని అనుకోకండి… వుందండీ… అందుకే కదండీ చెల్లికి మాట్లాడడం వస్తే ఎలా మాట్లాడుతుందో ఎలా బాధపడుతుందో అలా రాసిందిదండీ… ఒక్కటి నిజమండి… మా చెల్లికి ఈ ‘అండీ’ అలవాటు లేదండి… నేను చెప్పడంవల్ల అలా అండీ వచ్చేసిందండీ… సారీ అండి.. అండీ తీయించి రాయిస్తానండీ)

నాకు మా అమ్మ గుండెల్లో వెచ్చగా బజ్జోవాలని వుంది! పాలు తాగుతూ మా అమ్మ కళ్ళలోకి చూడాలని వుంది! అమ్మ నవ్వితే నవ్వాలని వుంది!

‘ఆల నాన్నలిదీ… వోలి కన్నలిదీ… ఆల బంగారు కొండిదీ… వోలి వజ్రాల మూటిదీ…’ అని అమ్మ వూసులాడుతుంటే ‘ఊ ఊ’ అని ఉఊలు చదవాలని వుంది! అమ్మ ముద్దులాడితే చాలా బాగుంటుంది! 

అమ్మ నా బొజ్జమీద ముద్దులాడితే నాకు కితకితలవ్వాలని వుంది! పడిపడి నవ్వాలని వుంది! అమ్మ జోలపాట పాడితే వినాలని వుంది! వింటూ నిద్రపోవాలని వుంది! నాన్న చెపితే ఊ కొట్టాలని వుంది! అన్నయ్య(నా)తో ఆడుకోవాలని వుంది! అన్నయ్యతో గుర్రప్పండు వేయించుకుంటే బాగుంటుంది!

(చెల్లి దేనికి హేపీ ఫీలవుతుందో దేనికి ఏడుస్తుందో నాకు తెలుసండీ… ఎందుకంటే నేను దాని అన్నయ్యని కదండీ)

నాకు మా అమ్మ దగ్గర వుంటే ధైర్యంగా వుంటుంది! అమ్మ కనిపించక పోతే భయం వేస్తుంది! నాకెవ్వరూ లేరనిపిస్తుంది! నాన్న ఆఫీసుకు వెళ్తే ఏడుపొస్తుంది! అమ్మ వుంది కదా పర్లేదనిపిస్తుంది!

అలా ఎంతో ధైర్యంతో అమ్మని పట్టుకొని బాబ్బుంటానా? ఆడి ఆడి అలసి బాబ్బుంటానా? నేను మాంచి నిద్రలో ఉంటానా?

ఇంకా నాకు నిద్ర తీరదా? అంతలోనే అమ్మ నన్ను లేపేస్తుంది! నాన్నయినా లేపేస్తారు! అన్నయ్యకి (నాకు) ఇష్టం లేకపోయినా లేపెస్తాడు!?

అమ్మ బుడుంగున నీళ్ళు నా నెత్తిమీద కుమ్మరిస్తుంది! సబ్బురాస్తుంది! నేను ఎంత ఏడ్చినా అమ్మ వదలదు! లాల (స్నానం) చేయించే వదులుతుంది! అప్పుడు పక్కింటి అత్తకి పనిలేదు కదా… ‘అటుక్కోడిని నీళ్ళలో ముంచి తీసినట్టు మా కోడల్ని ముంచి తీసినావు, ఇకన అది అటుక్కోడి కంటే ఎక్కువ గోలెడుతుంది, వీధి వీధంతా నిద్ర లేపేస్తుంది! ఇకన అలారం అక్కర్లేదు’ అని ఇకటాలాడుతుంది! ఆవిణ్ణి ఎప్పుడైనా అవకాశం దొరికితే గట్టిగా కరిచెయ్యాలి!

అంత తెల్లవారే నేను ఏమి చెయ్యాలి అని అనుకోవద్దు! అమ్మ జాబుకి వెళ్ళాలి కదా? అందుకని! అమ్మ అటు జాబుకి వెళ్తుంది! నాన్న ఇటు జాబుకి వెళ్తారు! ఇద్దరూ పనిచేస్తే తప్ప ఇల్లు గడవని రోజులని ముసలి పెద్దవాళ్ళంతా బాధపడుతుంటారు! కాని నా గురించి ఎవరూ బాధ పడరు! ప్చ్..

నేను ఏడుస్తున్నా అమ్మ వదిలి వెళ్తుంది! నాన్న నన్ను తీసుకువెళ్ళి ‘క్రచ్’లో… అదే బేబీ డే కేర్ సెంటర్లో దించి వెళ్ళిపోతారు! అన్నయ్య కూడా నన్ను వదిలి స్కూలు వుంది కదా, అందుకని వదిలి వెళ్ళిపోతాడు!

నేను ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోతాను! మొదట్లో కేర్ ఆన్టీలూ ఆయాలూ ‘లేదు లేదు… అల్లా పిల్లి చూడు… ఇల్లీ కాకి చూడు’ అనేవాళ్ళు! ఇప్పుడు ‘బూచికి ఇవ్వాలా?, ఏడుపు ఆపుతావా?’ అని భయపెడతారు! నేను ఏడిస్తే నాలాంటి మిగతా పిల్లలు ఏడుస్తారు! అందుకని నన్ను కొడతారు! అదే జో! జో కొడతారు! ఆ కొట్టిన జో చరుపులకి నిద్ర వచ్చేస్తుంది! నిద్రపోతాను!

లేస్తే ఎక్కడున్నానో తెలీదు!

ఆకలేస్తే అమ్మ లేదు! పాలు లేవు! దుద్దు కావాలని ఏడుస్తాను! అప్పుడు ఉడకబెట్టిన కేరట్టూ అరటిపండు దానిమ్మ గింజలు కలిపిన పెరుగు బువ్వ తినిపిస్తారు! అదికూడా ‘చందమామ రావే… జాబిల్లి రావే’ పాడకుండానే!

ఒక్కోరోజు ఏమీ వద్దు అమ్మ కావాలని అనిపిస్తుంది! ఏమి చెయ్యాలో తెలీదు! ఎలా సాధించుకోవాలో తెలీదు! ఏమి చేస్తే అమ్మ వస్తుందో తెలీదు! ఎప్పటికి వస్తుందో తెలీదు! ఏడ్చి సాధించుకోవచ్చని ఏడుస్తాను! అప్పుడు కసురుకుంటారు! విసుక్కుంటారు! వీపుమీద దెబ్బలు వేస్తారు! ఏడిస్తే ఆడుకోవడానికి బొమ్మలు ఇస్తారు! కీ ఇస్తే పరిగెత్తే బొమ్మలు! డాన్సు వేసే బొమ్మలు! డప్పుకొట్టే బొమ్మలు! నవ్వే బొమ్మలు! బొమ్మల్లో బొమ్మయి నవ్వేస్తాను! మళ్ళీ అమ్మ బొమ్మ చూడగానే అమ్మ గుర్తొచ్చి ఏడుస్తాను!

(ఒకరోజు నాకు స్కూలు సెలవు వల్ల కేర్ సెంటరుకు వెళ్ళి చూశానండీ… పాపం చెల్లి లాంటి వాళ్ళ అవస్థలు చాలా వున్నాయండి… అమ్మకి చెపితే, ఈ అత్త వొకర్తి కదా?, మనమే వొక్క పిల్లతో పిల్లడితో పడలేకపోతున్నాం, అలాంటిది ఈ మందని కాయోద్దా?’- అని రీజనింగు తీస్తుంది! నాన్న కూడా చెల్లి గురించి అడగొద్దు అంటారు! ‘మన పిల్ల వాళ్ళ చేతుల్లో వుంది… వాళ్ళే తల్లీదండ్రీ’ అంటారు! అమ్మ భయపడి పోతుంది! అడక్కుండా వుంటుంది! మనసు వొప్పనప్పుడు మాత్రం మాపాప బాగా బెంగపెట్టుకుంటోంది, ఏమీ అనకండి అంటుంది! ‘అయ్యో… మీ పాప వొకటి మా పాప వొకటినా?’ అని, ‘పిల్లలు నోరులేని దేవుళ్ళు’ అని కేర్ సెంటరు వాళ్ళే ఎంతో బాగా మాట్లాడేస్తారు)

పాసుకొస్తే చిచ్చికొస్తే చెప్పలేను! డైపర్ వుంటుంది! అయినా మార్చాలంటే ఆయా వొక్కోసారి చిరాకు పడుతుంది! అలాగని వదిలెయ్యరు! ఆడిపిస్తారు! తినిపిస్తారు! బజ్జో పెడతారు! బొమ్మలిస్తారు! ఎన్ని చేసినా అమ్మకాదు కదా? అమ్మ సాటి రారు కదా?

ఎప్పటికి చీకటవుతుందా? అమ్మ వస్తుందా? అమ్మని చూడగానే ఆనందం వస్తుంది! నవ్వుతాను! నవ్వి పరిగేత్తుకు వెళ్ళి అమ్మని గట్టిగా పట్టుకొని వుండిపోతాను! అమ్మ అప్పుడప్పుడూ ఏడుస్తుంది! లీవు పెడుతుంది! లీవులు లేవురా కన్నా అంటుంది! ‘లాస్ ఆఫ్ పే అయితే కానిరా’ అంటుంది! వెళ్ళక తప్పదంటుంది! రోజూ ఉండలేనుగా అంటుంది! ‘కేర్ కి డబ్బులు కట్టి ఎందుకు?’ అంటుంది అత్త! అత్తని డే కేర్ కాదు, ఏకంగా నైట్ కేర్ లో పడెయ్యాలి! (చెల్లి ఖచ్చితంగా అలాగే అనుకుంటుంది)

ఆదివారం అన్నయ్యకే కాదు, నాకూ బాగుంటుంది! అమ్మకీ బాగుంటుంది! నాన్నకీ! ఎవరికైనా బాగుంటుంది! అన్ని వారాలూ ఆదివారాలు అయిపోతే ఎంత బాగుణ్ణు?!

పిల్లలకి ఈ బడులేమిటో? పెద్దవాళ్ళకి ఈ ఆఫీసులేమిటో? పసిపిల్లలమైన మాకు ఈ కేర్ సెంటరులేమిటో?

ప్చ్.. ప్చ్… ప్చ్…

ఆ… ఆ… ఆ…

(చెల్లి ఏడుస్తోంది)

 -వై 

(నా పేరూ వొద్దులెండి)

క్రష్

(నా క్రష్ పేరూ వొద్దులెండి)

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.