“విముక్త” పుస్తకం విభిన్న కోణాలలో సాగిన ఆసక్తికరమైన కథల సంపుటి. ఈ పుస్తకానికి ‘ఓల్గా’ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. నేటి సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్టు చూపించడానికి రామాయణం లోని సీత పాత్రను ఎవరు ఊహించని విధంగా విభిన్న పాత్రలు… అహల్య, శూర్పణఖ, రేణుక, ఊర్మిళ లతో స్నేహం ఏర్పరచి, వారు చెప్పే వారి వారి అనుభవాలను సీత వినేలా చేసి కథలుగా సాగించారు.
వివాహానంతరం అతి సౌందర్యవతి అయిన అహల్య గురించి రాముడి నోట వింటుంది సీత. ఆ తరువాత అరణ్య వాసంలోనే అహల్య ను కలుసుకుంటుంది. అహల్య తన భర్త గౌతమ మహర్షి చేతిలో అనుమానానికి గురై శిలగా మారిన తన అనుభవాలను సీతకు తెలియజేసే కథ “మృణ్మయనాదం.”
భర్త తప్ప వేరే ప్రపంచం లేదనుకుంటారు స్త్రీలు, కానీ ఏదో ఒకరోజు భర్త తన ప్రపంచంలో నీకు చోటు లేదన్నప్పుడు ఆ స్త్రీ కి ఏ ఆధారం ఉంటుంది? పుత్రులకు జన్మనివ్వడమే జీవిత గమ్యమనుకుంటారు స్త్రీలు, కానీ పుత్రులు వంశాంకురాలై ఆ తల్లి చేయిని వదిలి, ఆ తల్లి జీవితాన్ని శాసించే శాసనకర్తలయితే అప్పుడు ఆ స్త్రీల జీవితం ఎలా ఉంటుందో రేణుక యొక్క అనుభవాలను సీత తెలుసుకునే కథ “సైకత కుంభం.”
అరణ్యవాసం నుండి తిరిగొచ్చిన సీత, లక్ష్మణుని భార్య ఊర్మిళ తనకు తానుగా 14 సంవత్సరాలు గదిలో బందీగా విధించుకున్న ఖైదు జీవితాన్ని విని సీత మనసు కల్లోలమవుతుంది. విలాసవంతురాలైన ఊర్మిళ తాను విధించుకున్న శిక్ష వల్ల, అనుభవాల వల్ల పొందిన జ్ఞానాన్ని, బలాన్ని, వివేకాన్ని సీతతో పంచుకునే కథ “విముక్త”.
సీత-శూర్పణఖ లు ఎందుకు స్నేహం చేయకూడదు అనే కోణంలో ఆలోచించి, పిల్లలను పెంచుతూ వాల్మీకి ఆశ్రమంలో ఉన్నప్పుడు సీత, కుశలవుల ద్వారా శూర్పణఖను కలుసుకున్నప్పుడు, రామలక్ష్మణుల వల్ల కురూపిగా మారిన శూర్పణఖ అవమానంతో ఎంత భయంకర జీవితాన్ని అనుభవించిందో… ప్రకృతి సౌందర్యం ఎంత అందంగా ఉంటుందో … శూర్పణఖ,సీతతో ముచ్చటించిన విధానమే “సమాగమం.”
నియంత్రిత మానసిక స్వేచ్ఛను కలిగియున్న భూపుత్రి సీత, కట్టడి లేని స్వేచ్ఛను కలిగియున్న శూర్పణఖ, అహల్య, రేణుక, ఊర్మిళ లను కలుసుకుని, వారి ఒక్కొక్కరి అనుభవాలను, ఒక్కొక్కరి త్రోవను అర్థం చేసుకొని, తన జీవితానికి అనువదించుకోవడం జరిగింది. ఏ స్త్రీ అయినా తన జీవిత అనుభవాల ద్వారా తనని తాను అర్థం చేసుకోవడంతో పాటు, ఇతర స్త్రీల అనుభవాలను తెలుసుకోవడం ద్వారా, తనకూ ఇతర స్త్రీలకు మధ్యగల సామ్యాలు, తేడాలు అర్థమవుతాయి.”అధికారాన్ని తీసుకో, అధికారాన్ని వదులుకో, అప్పుడు నీకు నీవు చెందుతావు, నీకు నువ్వు దక్కుతావు” అనే సత్యాన్ని గ్రహించిన సీత, తన కష్టాల సాగరంలో ఒక్కొక్క పోటును ధైర్యంగా ఎదుర్కొని, తనకు తాను విముక్తి కావడానికి భర్తను, పిల్లలను వదిలి వేయడమే మార్గమని భావించి, భూపుత్రిగా చివరకు భూమిలోనికి ప్రవేశించడం జరుగుతుంది.
ఒక స్త్రీ తన చుట్టూ పెనవేసుకున్న బంధాలను, అనుబంధాలను తెంచుకోవటానికి ఎంతటి ధైర్యాన్ని కూడగట్టుకోవాలో, ఎంతటి ఆవేదనను దిగమింగాలో, ఎంతటి మనోనిబ్బరాన్ని కల్గియుండాలో, తన మనసుకెన్ని పరీక్షలు విధించుకోవాలో సీత తను విముక్తం కావడానికి చేసే ప్రయత్నంలో ఎదుర్కొన్న అనుభవాలు తెలియజేస్తాయి.
అత్యంత సున్నితమయమైన ఇవాల్టి పితృస్వామిక సమాజంలో అనేక ఆంక్షలకూ,అవమానాలకు, హింసలకూ గురయ్యి, వాటిని అధిగమించి లేస్తున్న స్త్రీలు కొందరైతే,వాటిలోనే కూరుకుపోయి వాటిని దాటలేక, దాటాలని తెలియక, నానా యాతనలు పడుతున్న స్త్రీలెందరో… పురుషులు పగలు-ప్రతీకారాలు తీర్చుకోవడానికే స్త్రీలున్నారనీ ఆనాటి రాముని కాలం నుంచి నేటి గ్లోబల్ యుగం దాకా స్త్రీల చరిత్రలు తెలుపుతున్నాయి. తమను హింసించే భర్తల నుండి విముక్తం కావాలనే స్పృహ లేకుండా వారిని ద్వేషిస్తూనే,అసహ్యించుకుంటూనే వారిని గట్టిగా పట్టుకునే స్త్రీలు కొందరుంటే, ద్వేషంతో తమను తాము హింసించుకోవటం అలవాటైన స్త్రీలు మరికొందరున్నారు. అలాంటి స్త్రీలందరికీ మనో ధైర్యాన్ని అందించేదే “విముక్త” కథల సంపుటి.
Excellent GA రాశారు అక్క.