కదలిక

‘మనిషి మరణిస్తాడు, మానవుడికి మరణం లేదు’ అంటాడు శ్రీశ్రీ. మానవుడు (హోమో సెపియన్స్) అనే స్పిసీస్ కు చావు లేదని కవి హృదయం. నిజానికి, ఈ స్పిసీస్ కూడా పెర్ఫెక్ట్ కాదు. ఇదీ అంతరించదగినదే. మరింత ఉన్నత జీవులకు చోటిచ్చి పోవలసినదే. గర్వం అక్కర్లేదు. అలాగని, వైరాగ్యంతో, ఎక్కడి వాళ్లం అక్కడ ఆగిపోవడం కుదరదు. మనం వుంటాం, ఒక ‘అనంత’ సమయం వుంటాం. శ్రీశ్రీ అన్నట్లు మానవుడు ‘చిరంజీవే’. కాని, వాడికి పదే పదే జబ్బు చేస్తుంది. సంఘానికి చేసే జబ్బు పేరు సంక్షోభం. పురోగామి శక్తులు ముందుకు నడవకుండా నేటి స్థితి అడ్డుపడడమే సంక్షోభం. దీన్నే వుత్పత్తి శక్తులకు వుత్పత్తి సంబంధాలు అడ్డుపడడం అంటాడు మార్క్స్. ఇక, ఉత్పత్తి సంబంధాలు మారితే తప్ప పురోగమనం వుండదు. అలాంటి సంక్షోభం వొకటి ఇవాళ మన ముందున్నది. దిద్దుబాటు కోసం కదలిక అవసరం.

భారతదేశం ఆర్థికంగా (కూడా) జబ్బు పడింది. కంపెనీల వద్ద కార్లున్నాయి, ట్రాక్టర్లున్నాయి. వాటిని కొనే వాళ్ళు లేరు. కారణం అతి వుత్పత్తి కాదు. జనాల వద్ద వాటిని కొనుక్కునే శక్తి లేదు. ఇది కేవలం ఆటోమొబైల్స్ సంగతి కాదు. ఏవో కొన్ని ‘భోగ వస్తువుల’ సంగతి కాదు. జెనెరల్గా వినిమయ వస్తువుల అమ్మకాలన్నీ పడిపోయాయి. వినిమయ వస్తువుల అమ్మకాలపై ప్రభుత్వాలకు వొచ్చే పన్నులు పడిపోయాయి. నిరుద్యోగం పెరిగింది. పెరుగుతోంది. దానివల్ల కొనుగోలు శక్తీ, అద్దానివల్ల కొనుగోళ్లూ అమ్మకాల తగ్గుదల… ఓహ్, ఇదొక వలయం, దీనికి గండి కొట్టే వరకు. ఒక కొత్త ‘దరిద్రావస్థ’ ఇండియా నెత్తి మీద కత్తిలా వేలాడుతోంది. దీన్నుంచి జనం  కన్ను మరల్చడానికే హటాత్తుగా కశ్మీర్ పైన వుక్కు పాదం, దేశభక్తి పేరుతో పొరుగులపై ద్వేషాలు, ప్రజల మధ్య కుల, మతాల చిచ్చు, ప్రాంతాల మధ్య అసమానతలను పెంచే చదరంగాలు, నిరంకుశానికి వీలుగా అధికార కేంద్రీకరణలు…

ప్రజలకు బాధ్యత వహించాల్సిన ప్రతిపక్షాలు… ఒకదాని ముడ్ది కింద మరొకటి మంట పెడుతూ వుండిపోయాయి. కేంద్రం ఏం చేసినా పన్నెత్తి మాట్లాడలేని దుస్థితి. నిరంకుశాన్ని ఎదిరించలేని నిస్సహాయత లోనికి అందరం… ప్రోగ్రామ్ చేయబడిన మరమనుషుల్లా నడిచి పోతున్నాం. ఒక సుజనా చౌదరి మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తితే, ఆరోపణల్ని విచారించాల్సిన ప్రభుత్వ పార్టీలోనే అతడు చేరిపోతాడు. చేరే వాడికి సరే, చేర్చుకునే వాళ్ళకు సిగ్గు ఎగ్గు వుండదు. మళ్లీ ఆయనే సరికొత్తగా కొత్త పార్టీ వాడిగా రాష్ట్రానికి వొస్తాడు. అమరావతి-రాజధాని అనే అప్రజాస్వామిక నిర్ణయాన్ని మారిస్తే ఖబడ్దార్ అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాడు. ఈ రంకెలకు కారణం… అతడి అవినీతి డబ్బులు (కొన్ని) అమరావతి రియల్ ఎస్టేట్ ఇన్సైడర్ ట్రేడింగ్ లో వుండిపోవడమే గాని జనక్షేమం కాదు.

సుజనా చౌదరి మాటకు అంత బలం ఎక్కడినుంచి వొచ్చింది? బిజేపీ నుంచి వొచ్చింది. బిజేపీ ని కాదనే సాహసం… ఇంత పెద్ద మెజారిటీతో ఎన్నికైన వైకాపా ప్రభుత్వానికి లేదు. వైకాపా ఏమాత్రం సాహసించినా, సుజనా పూర్వ-శిబిరం, నేటి-ప్రతిపక్షం దాన్ని వాడేసుకోడానికి గుంటకాడి నక్కలా సిద్ధం.

‘మేము అన్నీ కేంద్రానికి (బిజెపీ కి) చెప్పే చేస్తున్నా’మని ఢిల్లీలో వైకాపా ప్రతినిధి విజయసాయిరెడ్డి చెప్పుకోడంలో నిస్సహాయత స్పష్టం. ఏమాత్రం సందు దొరికినా దూరడానికి చంద్రబాబు బృందం సిద్ధంగా వుంది. అమెరికా ‘తానా’ సభలో బీజేపీ నేత రామ్ మాధవ్ మీద కేకలేసిన పసుపు దళాలకు ఈ సినేరియో అర్థం కావడానికి కొంత సమయం పట్టి వుంటుంది. సంఘ్ పరివారానికి నీత్యవినీతులు కేవలం రాజకీయ పనిముట్లు. క్షీరసాగర మధనం తదితర పురాణ గాథల్లోని దేవతల నీతి రాహిత్యమే నేటి హిందూత్వేంద్రుని వజ్రాయుధం. 

నేటి సాంఘికార్థిక, నైతిక సంక్షోభం ఇంకా చాన్నాళ్లు వుండబోతోంది. సంక్షోభంలో సొంత క్షేమం చూసుకునే మేధావులకు కొదువ లేదు. ఇది ‘మాంద్యం కాదు, మామూలు వెనుకడుగు మాత్రమేన’ని ఒక ‘సత్తా’ వుడిగిన జేపీ వువాచ. మన్మోహన్ మొదలెట్టి సగంలో ఆపేసిన ‘సరళీకకరణ’ ను మరింత సరళం చేయడమే ఈ జబ్బుకు మందని డాక్టరు గారి ప్రిస్క్రిప్షన్.

సరళీకరణ (లిబరలైజేషన్) అంటే మరేం లేదు. పెట్టుబడిదారీ దోపిడి మీద ప్రభుత్వ (ప్రజా) నియంత్రణను తీసేయడం. సరళత్వం లేక ఉదారత్వం అనేవి ప్రజల పట్ల కాదు, పెట్టుబడిదారుల పట్ల. ఆ పని మన్మోహనాదులు బాగానే చేశారు. దరిమిలా ఉత్పత్తి, వాణిజ్యం కన్న ఎక్కువగా…  కొద్ది మంది వద్ద పెట్టుబడి పెంటపోగులు పెరిగాయి. ఆ పెంట మరింత పెరగాలని మన మహా మేధావుల ఉద్ఘాటన. బ్యాంకులను తక్షణం, పూర్తిగా ప్రైవేటు పరం చేయాలనేది జేపీ సూచించే ‘మరింత తలుపు తెరిచే’ చర్యల్లో ఒకటి. కేంద్రం ఆ పని నోట్ల డీనోటిఫికేషన్ తో మొదలెట్టి ఎంచక్కా కొనసాగిస్తోంది. ఇటీవలి ‘బ్యాంకుల విలీనం’ యోచన దానిలో మరో మెట్టు. ప్రైవేటురంగానికి అమ్మడానికి వీలుగా బ్యాంకులకు చేస్తున్న అలంకరణల్లో ఒకటి ‘విలీనీకరణం’. ఇన్నాళ్ల ‘సంస్కరణల’ ఫలితం: నేటి అంబానీ, అదానీల రాజ్యం. ఆ పని ఇంకా లోతుగా జరగాలని జేపీ మాటల సారం.  

మోదీ కాలపు పెట్టుబడి మునుపటి కన్న శక్తిమంతమైనది. ఎందుకంటే, ఇది సిగ్గు విడిచిన పెట్టుబడి. ఇది మనల్ని మనకు అమ్మేసి,  ఆ అమ్మకం మనకెంత లాభకరమో నిరూపించే నాటకాలు వేయగల్గిన పెట్టుబడి.

ఇప్పుడు మనం వేటాడబడుతున్నాం. ప్రజలు వేటాడబడుతున్నారు. మునుపట్లాగే ఈ వేటలో మధ్యతరగతి కీలక పాత్ర నిర్వహిస్తున్నది. తన కాళ్ల కింద ఇంకొంచెం నేల కోసం, ఒక భ్రమాన్విత భద్రత కోసం, తనలో కొందరు పైకి యెగబాకడానికి వున్న అవకాశం కోసం, ఆ కొందరిలో నేనెందుకు వుండరాదనే పేరాశ కోసం…. కొత్త పెట్టుబడికి తానే వాహకుడూ, వందిమాగధుడూ అవుతున్నది నేటి మధ్యతరగతి. దానికి మంచి ఉదాహరణ జేపీ మాట.

ఈ ప్రభుత్వం తొలివిడత కొత్తలో… వినయం వుట్టిపడే మొహంతో నిలబడిన మోదీ, ఆయన భుజం మీద ధీమాగా చెయ్యేసి నుంచున్న అంబానీ ఛాయాచిత్రం గుర్తుందా?! ఆ తరువాత… మొదట కాస్త బెట్టు చేసినా, పనిగట్టుకుని మోదీ యింటికి వెళ్లి, బొకే యిచ్చి లెంపలు వేసుకున్న రతన్ టాటా వార్తనూ మీరు చూసి వుంటారు. కొత్త అంబానీ, అదానీల ముందు పాత టాటాలు బిర్లాల వెనుకడుగుకు సంకేతమది. ఇదే ఈ సంక్షోభంలో కొత్తదనం.

ప్రపంచ వాస్తవ సంపద పెరిగింది. ప్రజలకు సంబంధించినంతవరకు సంపద (వెల్త్) అంటే తిండి గింజలు, బట్టలు, ఇళ్ల వంటి కనీసావసర వస్తుజాలం. ఇవాళ ఉత్పత్తి అయిన సంపదను ప్రజావసరాలకు అనుగుణంగా పంపిణీ చేస్తే ప్రపంచంలో తిండి, బట్ట, ఇల్లు, బడి, ఆరోగ్యం లేని వారెవరూ వుండరు. పంపిణీ మాత్రమే ఇవాళ సమస్య. ఉత్పత్తి కాదు. పంపిణీ బాగుంటే దరిద్రాన్ని కాదు, సంపదనే పంచుకోవచ్చు. ఉదాహరణకు ఇప్పుడు ‍ఇండియాకు ఎవరూ మొక్కజొన్నలు, పాలపొడి దానం చెయ్యక్కర్లేదు. తగినంత ఉత్పత్తి వుంది. లేనిది కొనుగోలు శక్తి. 

ఇది పెట్టుబడిదారీ విధానం పరిణామాలలో అనివార్యంగా వొచ్చిన మార్పు. కంప్యూటర్లకు, ఐటీకి చంద్రబాబు, సత్యం కారణం కానట్టే ఈ మార్పులకు పెట్టుబడిదారులు కారణం కాదు. వుత్పత్తి శక్తులలో వొచ్చిన అనివార్య అభివృద్ధి దీనికి కారణం. దానికి తగినట్లు వుత్పత్తి సంబంధాలు మారకపోవడమే సంక్షోభానికి మూలం. 

కనీసావసరాలు అందుబాటులో లేని పేదలు ఇవాళ కూడా వున్నారు. మునుపటి కన్న తక్కువ. అలాంటి పేదల సంఖ్య ఎంత తక్కువ అంటే అది సమర శీల పోరాటాలకు క్రిటికల్ మాస్ని యివ్వదు. వెంటనే అటోఇటో తేల్చాలని పోరాడే పేదలకు బదులు ఉన్న సంపదలో తమకు తగిన వాటా అడిగే మధ్యతరగతి సంఖ్య నేడు క్రిటికల్ మాస్’ అయ్యింది. ఆణిచివేత, దోపిడీ వంటి మాటలకన్న, ‘మరింత సంపన్నత’ అనే అసంతృప్తి జనాన్ని కదిలిస్తోంది.

దీన్ని మొదట గ్రహించింది ప్రజలు కాదు. పెట్టుబడి. దీనికి తగిన వ్యూహం రచించుకున్నది ప్రజలు కాదు. పెట్టుబడి. వేయి మాటలేల, ఇప్పటి వరకు పెట్టుబడే నిర్ద్వంద్వ విజేత. ఇవాళ భారత ప్రధాని క్యూబా వెళ్లడు. పాలస్తీనా కూడా వెళ్లడు. ఇజ్రాయెల్ వెళ్తాడు. డొనాల్డ్ ట్రంపును, బెంజమిన్ నెతన్యాహును కావిలించుకుంటాడు. మతం వొక తొడుగు. వొక బ్యానర్. మతరాజకీయాల అసలు సారం మతం కాదు. ఆర్థిక లాభం. ప్రజలు ఆర్థిక దోపిడీని వొదిలించుకోడానికి కూడా కుల, మతాల్ని వొదిలించుకోక తప్పదు.

అమెరికాలో ప్రజలు ట్రంపు నోటి నుంచి వెలువడిన మాటలను అరగదీస్తుంటారు. అమెరికా పాలకులు మధ్యప్రాచ్యంలో తమ ఆదాయ వనరులను పెంచుకుని, పదిలం చేసుకుంటూ వుంటారు. ఇండియాలో ప్రజలు… హిందూ, ఇస్లాం, క్రైస్తవాల గురించి లేదా కులాల గురించి వాదించుకుంటూ వుంటారు. పాలకులు ఈ చర్చకు కాస్త ఆవు మాంసం కూడా ఎర వేసి అడవులను, మైదానాలను, సముద్రాల్ని పిండుకుని తమ పశుల కొట్టాల్లో నిలువ చేసుకుంటూ వుంటారు.

ఎక్కడో ఏదో తిరకాసు లేదూ? ఈ దృశ్యం మారాలనిపించడం లేదూ? దృశ్యం మారకపోవడం వల్లనే, సరి దారి తొక్కలేక చౌరస్తాలో నుంచున్నామని, కదం మార్చి సరి దారి తొక్కాలని అనిపించడంలేదూ?! తప్పదు. మన మధ్య డైనమోలు తిరగాలి. లోకం కొత్త కదలికల కోసం ఎదురు చూస్తున్నది. 

ఆ కొత్త కదలికలు అమెరికాలో బెర్నీ శాండర్స్, అలెగ్జాండ్రియా ఒకాసియో-కోర్తెజ్ వంటి ‘డెమొక్రాటిక్ సోషలిస్టులు’ కావొచ్చేమో. ఇండియాలో అలాంటి కదలికలకు షెహ్లా రషీద్, జిగ్నేష్ మేవాని, కన్నయ్య కుమార్ లు తెర తీస్తారా? తెలుగు రాష్ట్రాల్లో పిడిఎస్యూ, ఆరెస్యూ, స్టూడెంట్ ఫెడరేషన్ల నుంచి అలాంటి అవసర కదలికల్ని ఆశిద్దామా?    

12-9-2019

ఫోటో: మా యింటికి దగ్గరగా, పెన్నింగ్టన్ (అమెరికా)లో, ఎండకాలమంతా, ప్రతి శనివారం జరిగే రైతుల సంత (ఫార్మర్స్ మార్కెట్)లో ఒక దృశ్యం. బోర్డు మీద రాసిన అక్షరాలు: మ్యూజిక్ బై డేనియల్ కస్సెల్. ఆయనకు ‘రస్తా’ కృతజ్ఞతలు.

హెచ్చార్కె

6 comments

  • థాంక్యూ. దీనికి గిరి గీసుకుని కూర్చునే లెఫ్టిస్టులు. కారణం జనాన్ని కేవలం ఓటర్లుగా చూసే రైటిస్టులు అనుకుంటాను, రామఫణి గారు.

 • ఎకనామిక్స్ ని తెలుగుతో బానే మిక్స్ చేశారు. అందుకే బోర్ కొట్టకుండా చివరకంటా చదవగలిగాం. లిబరలైజేషన్ నష్టాల్ని వినే స్తితిలో మన దేశం ఉందనుకోవడం లేదు. దాని ఉపయోగాన్ని, ఒప్పుకున్న పరమ కమ్యూనిస్టు దేశాల్నడిగినా ఇదే సాధానం వస్తుంది. అయితే దాన్ని అడ్డం పెట్టుకుని డ్యాన్సులేస్తున్న నీచ రాజకీయాన్నంటారా, ఒప్పుకుంటాను.

  అయినా, వీళ్ళు చేస్తున్న ప్రతీ పనీ,ఏదో ముతక సామెతలో అన్నట్టు మంచమెక్కేంతవరకే చేసే హడావుడి. ఆనక ప్రతాపమంతా తెలియంది కాదు. హడావుడే తప్ప ఫలితాలు శూన్యం. బ్యాంక్ మెర్జర్స్ చాలా సున్నితమైన సంస్కరణ. వేచిచూడాల్సిందే. ఇది ప్రయివేటు రంగానికి లాభం చేకూరేదిగానే ఉంది.

  దౌర్భాగ్యం బలమైన ప్రతిపక్షం లేకపోవడం. ఎర్ర జండాలకి ఏం చేయాలో తెలియకపోవడం. ఇది లిబరలైజ్డ్ కాలం. ఎవ్వరికైనా !

  మీ వచనం ప్రత్యేకమైనది సారు. మీరు ఇంకాస్త విలువైన పని చెయదగ్గ మనిషి. అంత ప్రభావ వంతంగా రాస్తున్నారు. థ్యాంక్యూ

  • థాంక్స్, శ్రీరామ్! ఎర్రజెండా పట్టినోడంతా కమ్యూనిస్టు కాడు. శ్రీశ్రీ గీతాల్ని అలవోకగా వల్లించే వాళ్లు ఆరెసెస్ లో ఇబ్బడిముబ్బడి, వాళ్ళకాయన కవిత్వం దిశ తెలిసిందని కాదు. ఇంతకీ.. నిజమైన ప్రత్రిపక్షం/కమ్యూనిస్టులు చైతన్యవంతులయిన ప్రజలే, వేషగాళ్లు కాదు.
   .

 • ఈ కాలపు వ్యవస్థను, పెట్టుబడి ఎత్తుగడను
  చాలా సరళంగా ,ఆలోచనాత్మకంగా చెప్పారు
  సార్
  ఇది మోడీకి,సుజనాకు చేరితే బాగుణ్ణు
  ఐనా మార్పు వస్తుందా
  మార్పు వాళ్లకు ఇష్టం ఉండదు పాపం

  • థాంక్యూ సో మచ్, గోపాలయ్య గారు. వాళ్ళ వేగులు వాళ్ళకుంటారు. వాళ్లు దుర్మార్గం తెలిసిన దుర్మార్గులు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.