తొలి వందరోజుల
చలనం సంచలనం!

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఎక్కువ శాతం సంచలనాలే. అయితే వాటి వల్ల ఒనగూరబోయే ప్రయోజనాల పట్ల  ప్రజల అభిప్రాయాలు ఎలా ఉంటాయనేది ప్రధానం. గత నాలుగు నెలల ప్రభుత్వ పనితీరులో తీసుకున్న నిర్ణయాల్లో ప్రజల్లో ఎక్కువ  అలజడి రేపిన అంశం ఇసుక కొరత. గత ప్రభుత్వం ఇది వరకు వాడుకలో వున్న రాయల్టీ విధానాన్ని రద్దు చేసి ఉచిత ఇసుక పేరిట ఇసుక దోపిడీకి తెరలేపింది . అటువంటి పద్ధతి వల్ల ఇసుక వ్యాపారులు లాభపడుతున్నారే కానీ సామాన్యులకు ఉపయోగమేమి లేదని కొత్త ప్రభుత్వం నూతన పాలసీ రూపొందించింది. ఈ కొత్త విధానంలో ప్రైవేట్ వ్యక్తులు ప్రత్యక్షంగా నదుల్లోకి పోయి ఇసుక తోడుకోకూడదు. ప్రభుత్వమే రీచులు నిర్వహించి ఇసుకను అమ్ముతుంది.ఈ నిర్ణయం వల్ల వ్యాపారాల, దళారీల జోక్యం లేకుండా పోతుంది. అయితే ప్రస్తుతం ఇసుక అమ్మకం ఆ విధంగా జరపడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలంటే ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి కొంచెం సమయం పట్టడం సహజం. అందుకే ప్రభుత్వం మూణ్ణెల్ల కిందటి నుంచి ఇసుక అమ్మకాలు, రవాణా నిలిపివేసింది. దాంతో నిర్మాణ రంగ కార్మికుల్లో అసంతృప్తి చెలరేగింది. సందట్లో సడేమియా అన్నట్లు ప్రతిపక్ష నేతలు తెగ బాధపడిపోతూ ఇది చేత కానీ ప్రభుత్వం అని విమర్శలు చేస్తున్నారు. అయితే ఇక్కడ కేవలం రోజువారీ కూలీలైన సామాన్య జనాలది మాత్రమే దర్మాగ్రహం అవుతుంది కానీ బడా కాంట్రాక్టర్లది కాదు. ఎందుకంటె వారేమి రెండు నెలలు నిర్మాణాలు ఆగిపోతే తిండికి ఇబ్బంది పడేంత దైన్యంలో వుండరు. సామాన్యులకు అవకాశం లేకుండా పలుకుబడి కల్గిన నాయకులు మాత్రమే ఉచిత ఇసుకను తెచ్చుకుని సామాన్యులకు అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకోవడం గత ప్రభుత్వ హయాంలో చూసాం. ఇక ఇప్పుడు కొత్త ఇసుక పాలసీ వచ్చేసింది. ప్రభుత్వమే ఇసుకను అమ్మడంతో పాటు ఏకంగా కోరిన వారి ఇంటికే చేర్చేలా ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.ఇసుక రవాణా చేయబోయే వాహనాలకు జియో ట్యాగింగ్ వంటి అత్యాధునిక పద్దతిని ఉపయోగించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఆలోచిస్తోంది. ఈ కొత్త విధానం వల్ల ప్రజలకు మునుపు కంటే నాల్గు రూపాయల తక్కువ ధరకే ఇసుక అందుబాటులోకి వస్తే ఇంకేం. ప్రజలు గత రెండు నెలలు ఇబ్బందిని కూడా మర్చిపోతారు.

పోలవరంలో రీ టెండరింగ్

పోలవరం ప్రాజెక్టులో వైసీపీ ప్రభుత్వం రీ టెండరింగ్ నిర్వహించడం పట్ల ప్రాజెక్టును ఆపేసినట్టు గగ్గోలు పెడుతున్నారు తెలుగుదేశం నేతలు. నిజానికి ఈ నిర్ణయం సరైందే. ఎందుకంటె 2014 లో తెలుగుదేశం  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్ ధరలను ఎన్నో సార్లు ఇష్టానుసారం పెంచేశారు. పైగా నాసిరకం పనులు కూడా. రోజుకొక సంస్థను తీసుకు వచ్చి వాటికి కన్సల్టేషన్ ఫీజుల కింద కోట్లాది రుపాయలు వృధా చేసారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం తాము ఆ కాంట్రాక్టర్లను తొలగించి ప్రస్తుత ధరలకంటే తక్కువగా కోట్ చేయించి రీ టెండరింగ్ నిర్వహిస్తామని చెబుతోంది. పైగా దీని వల్ల ప్రజాధనం అదా చేస్తామంటోంది.

రాజధాని అమర చర్చ

బొత్స సత్యనారాయణ గారు చేసిన వాఖ్యల వల్ల రాష్ట్రంలో మళ్ళీ రాజధాని అంశం ఊపిరి పోసుకుంది. నిజంగా ఈ ప్రభుత్వం రాజధాని పై పునరాలోచన చేస్తే అది మంచి నిర్ణయమే అవుతుంది. ప్రస్తుతం అమరావతిలో కట్టినవన్నీ ఎలాగూ తాత్కాలిక నిర్మాణాలే కనుక ఇంకా అవకాశం వుంది. చారిత్రక ఒప్పందాల్ని గౌరవిస్తూ వెనుకబడిన ప్రాంతాలకు అనుకూలంగా పునరాలోచన చేయడం తప్పక మంచి పని అవుతుంది. ఏకపక్షంగా ఎన్నుకున్న అమరావతి ప్రాంతం పై ఎన్నో చిక్కుముడులు కూడా వున్నాయి. నాడు రాయలసీమ, ఉత్తరాంధ్రలను సంప్రదించకుండా కేవలం అమరావతి పేరిట ఒక రియల్ ఎస్టేట్ రాజధానిని అన్ని ప్రాంతాలపై బలవంతంగా రుద్దిన తెలుగుదేశం ప్రభుత్వం కనీసం అభివృద్ధి వికేంద్రీకరణ సూత్రాన్ని కూడా పాటించలేదు. అటువంటి తెలుగుదేశం పార్టీవారు ఇప్పుడు రాజధానిని మారిస్తే మారణ హోమమే అని కామెంట్లు చేస్తున్నారు. వారికి అమరావతితో ముడిపడిన  తమ ఆర్థిక అవసరాలే తప్ప అన్ని ప్రాంతాల పట్ల పాటించాల్సిన సమన్యాయ భావన ఏ కోశానా లేదని మరోసారి రుజువయ్యింది. కనుక కనీసం ఈ ప్రభుత్వమైనా వెనుకబడిన ప్రాంత ప్రజల మనోభావాల గురించి పునరాలోచన చేయాల్సిందే. లేకపోతే గత ప్రభుత్వానికి జరిగినట్టే వీరికి జరగొచ్చు.

ఊరూరికి పాలన అందుబాటు

అక్టోబరు నుంచి మొదలు కాబోతున్న గ్రామ సచివాలయ పాలన మరో ముఖ్య విషయం. రాష్ట్రంలో ఏకంగా ఒకేసారి లక్ష ముప్పై వేల ఉద్యోగాలు గ్రామ సచివాలయాల పేరిట విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.ఈ నిర్ణయం పట్ల యువతలో సదభిప్రాయం నెలకొంది. రెండు వేల మంది జనాభా కలిగిన ప్రతి గ్రామ పంచాయితీకి ఒక గ్రామ సచివాలయం నెలకొల్పి అందులో ప్రధాన శాఖలకు సంబంధించి ఒక్కొక్క శాఖకు ఒక అసిస్టెంట్ ని నియమిస్తున్నారు. వారు గ్రామ పాలనలో ప్రజల సమస్యల త్వరిత పరిష్కారం కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాల పట్ల స్థానికంగా వుండే ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అందుకు కారణం సొంత ఊరిలో పుట్టి పెరిగి అదే ఊరిలోని కార్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తుంటే మనకేమి అవసరం వచ్చినా  మన పిల్లలు వున్నారు అనే భావంతో వున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చే ఉద్యోగుల కంటే తమ వారైతే మొహమాటం లేకుండా ఉండొచ్చనే మానసిక భావన వారిని ఆసక్తులను చేస్తోంది.

వరదకు కారణం ఈ పడవ అని నారా లోకేశ్ వువాచ.

రాజకీయ వరదకు అడ్డుకట్ట లేదు 

వరద రాజకీయం మళ్ళీ మొదలయ్యే అవకాశం వుంది. నెల రోజుల కిందట ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని రెండు ప్రధాన నదులైన కృష్ణా గోదావరీలలో ఒకేసారి పెద్ద ఎత్తున వరద వచ్చింది. అన్ని పెద్ద డ్యాములు పొర్లి పొంగి నీరు సముద్రం పాలైంది. ఆ సమయంలో రాజధాని అమరావతిలో వుండే కొండవీటి వాగుకు కూడా వరద రావడంతో కృష్ణా నది కరకట్ట మీద వున్న చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఆ సమయంలో ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన చంద్ర బాబు నాయుడు, అయన పరివారం హుందాతనం మరిచి వ్యవహరించారు. ఇల్లు అక్రమమా సక్రమమా అన్న విషయాన్ని పక్క దారి పట్టించేలా వరదలో బురద రాజకీయం చేసారు. చంద్రబాబు ఇల్లు నీళ్లలో ముంచడానికి ప్రభుత్వమే కావాలని వరద నిర్వహణను సరిగ్గా చేయలేదని వితండవాదం చేసారు. దేవినేని ఉమా అయితే చంద్రబాబు ఇంట్లోకి నీళ్లు తెప్పించాలని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు నీళ్లు వదలకుండా ఆపేశారని వాఖ్యానించారు. ఇదే దేవినేని ఉమా ఒకప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు ఎక్కువ నీళ్లు తీసుకుపోతే తలలు తెగిపడతాయని అన్న కాలం వుంది. ఇక నారా లోకేష్ అయితే ఏకంగా తమ ఇల్లు ముంచడానికి ప్రభుత్వమే ప్రకాశం బ్యారేజి గేట్లకు పడవలు అడ్డుపెట్టి వరదను పెంచిందని ప్రకటించి తన అజ్ఞానాన్ని మరోసారి చాటుకున్నాడు. ఇప్పుడు మరోసారి రెండు నదులకు భారీ వరద రాబోతోంది. కనీసం ఇప్పుడైనా అసలు విషయం పక్కదారి పట్టించని కామెంట్లు వారి నుంచి ఆశిద్దాం.

వంశీ పులి

వంశీ పులి: పూర్తి పేరు పులి. వంశీధర రెడ్డి. స్వస్థలం: కర్నూలు జిల్లా లోని వెల్గోడు గ్రామం.
డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి,. ప్రస్తుతం కర్నూలులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు .

3 comments

 • మీ రాత బాగుంది. భావజాలం లో పూర్తిగా వన్ సైడెడ్ ధోరణి కనిపిస్తోంది. కొంత మిశ్రమ, సమదూరమైన చర్చలు చేయడం నిష్పాక్షమైన విధి.

  ఏ మంటారు ?

  • ధన్యవాదాలు శ్రీరామ్ గారూ ,
   నిజానికి అబద్దానికి సమదూరం ఎందుకు పాటించాలి సార్ ?.
   నేను ఎప్పుడూ నిజం వైపు మాత్రమే నిలబడతాను. నేను అలా నిలబడలేదంటే చెప్పండి ( ఎలా నిలబడలేదో ) .
   తప్పక నిజం వైపే జరుగుతాను.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.