నాటి పద్యానికి మేటి వారసుడు ‘కవి సమ్రాట్

గతం గర్భంలోకి పోయి శోధించి కొన్ని రత్నాలు ఏరుకుని నేటి సమాజపు విలువలకు అనుగుణంగా కావలసినంత వరకు మాత్రమే పొదిగి మాలికలు  గ్రుచ్చిన వారినే మనం అధికంగా చూశాం ఆధినిక సాహిత్య రంగంలో. కానీ నాటి రత్నాలనే తిరిగి శుభ్రం చేసి మరింత ప్రకాశమానం గావించి వాటి విలువను నేటి సమాజానికి నొక్కి చెప్పి మరీ వాటి వన్నె తగ్గకుండా ఉంచేందుకు జీవిత కాలంపాటు అచంచలమైన దీక్షతో సైనికుడిలా, ఋషిలా సాహిత్య ప్రస్థానం సాగించిన ఒక పరమ విశిష్టమైన తెలుగు వాడు విశ్వనాథ సత్యనారాయణ. పాత కథనైనా కొత్త బాణీలో చెప్ప గలిగిన ప్రతిభాశాలి. 

ప్రపంచ పుస్తకాల చరిత్రలో ఎక్కువగా  అమ్ముడు పోయిన రచన కార్ల్ మార్క్స్ డాస్ కాపిటల్.  ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మందిని ప్రభావితం చేసిందీ అదే. కారణం రచయిత కున్న తాత్విక భూమిక. పరిశోధనా విస్తృతి, తనవైపుకు లాక్కునే వాదనా పటిమ. సాహిత్య రంగానికొచ్చేప్పటికి ఏ ఇజాన్నైనా నైపుణ్యత ప్రదర్శించి మెప్పంచగలిగితే తనకూ కావలసినంత మంది అనుచరగణాన్ని పోగు చేసుకోవచ్చు, శిష్య పరంపరనూ కొనసాగించవచ్చు. ఆ దృష్టి కోణంలో చూస్తే విశ్వనాథ వారిది తెలుగు సమాజంపై నిర్దిష్టమైన ముద్ర అని చెప్పాలి. ఏ విలువలను నమ్మాడో వాటికాయన రక్షకుడు. వాటినే ప్రబోధించాడు చివరికంటానూ. “ఆయన సామాజిక దృక్పథం భారత జాతీయ సనాతన దృక్పథం” –  కేతవరపు రామకోటి శాస్త్రి గారు, విశ్వనాథ వైఖరి అనే గ్రంథంలో. 

కానీ ఆయన కేవలం ప్రాచీన కావ్య సారూప్యం కలిగిన వాటినే రాశాడనుకుని పక్కనబెడితే పాఠకులుగా మనం క్షమించరాని తప్పు చేసినట్టే. జీవిత కాలం పాటు అవిశ్రాంతంగా శ్రమించి రచనలు చేశాడు. మానవతా విలువలు, భావుకత, చరిత్ర, జాతీయ వాదం కలిగినవెన్నో ఆయన చేసిన మొత్తం 118 రచనలలో ఉన్నాయి. ఉదాహరణకు ఆంధ్రపౌరుషము, ఆంధ్రప్రశస్తి లఘకావ్యాలలో తెలుగు జాతిని ఉత్తేజపరచే ఎన్నో పద్యాలు స్వాతంత్ర్యానికి పాతికేళ్ళ ముందే ఆయన రాశారు. అంటే  స్వరాష్ట్ర సాధన కు చాలా ముందు. 

సీ||
రుద్రుడైన ప్రతాపరుద్రదేవుండోరుగల్కోట బురుజుపై గాలు మోప 
విద్యానగర రాజవీథి పట్టపుటేన్గుపై కృష్ణరాయలు పాఱుజూడ 
పిడుగుమొత్తము బొబ్బిలికోట పుండరీకము పాపరాయడుగన్ను లురుమ
చాళుక్యరా ట్ప్రతిష్ఠా కీర్తి చోళనాయక కీర్తి తోడ నెయ్యమ్ము నెఱప 

గీ।। 
పూర్వ సంపదలను కాలి బొటనవ్రేల 
నలుపు శౌర్యమ్ము లే మూల నక్కె నొక్కొ? 
పాడు దౌర్భాగ్య విధి నిలింప స్రవంతి 
నెండగట్టెడు కాలమ్ము నెఱిగె గాక! 
కొన్ని పదాల అర్థాలు:

పాఱజూడ = ఈ వైపునుండి ఆ వైపునకు పరీక్షగా చూడగా; పుండరీకము = తెల్లని పద్మము, పెద్దపులి; కన్నులు+ఉరుమ = కోపముగా నెఱ్ఱనైన కనులతో తీక్షణముగా చూచుచు హుంకరించు; నెయ్యమ్ము నెఱప=స్నేహము చేయగా; నిలింప స్రవంతి = గంగానది. 

తాత్పర్యము = ప్రళయరుద్రుడైన ప్రతాప రుద్రుడు ఓరుగల్లును పాలించిన కాలమును, విజయనగర వాసులయందు పట్టపుటేనుగు పై నెక్కిన శ్రీకృష్ణ దేవరాయని చల్లని చూపులు, శత్రువులపై బొబ్బిలి పెద్దపులి పాపరాయని కంటి పిడుగులు, చోళకీర్తితో నెయ్యము వియ్యము గలిగిన చాళుక్యుల శౌర్యతేజములు యే మూలనక్కి దాగెనోకదా? శత్రు శక్తిని కాలి బొటన వ్రేలితో అణగద్రొక్కగల ఆ తెలుగు పౌరుషమును, గంగా ప్రవాహమును కూడ నెండగట్టెడు కాలము వోలె, ఏ దుష్టశక్తి యో పూర్వ సంపదలు, సంప్రదాయములను కమ్మెనుగాబోలు! 

చరిత్రను రస రమ్యంగా కీర్తించి,  ఆ పూర్వ వైభవమిప్పుడేమాయెనని దిగులు చెందిన తెలుగు వాడు విశ్వనాథుడు. ఇటువంటి జాతి కీర్తనా శిల్పాలనెన్నో  పద్యాలలో చెక్కాడు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియలేదు. ఆయన రాసినదొక్కటే ఒక పెద్ద గ్రంథాలయం. బిరుదులు పదవులు ఒక వైపు తెలుగు వారిపై ఆయన వేసిన ముద్ర మరో వైపు. సెప్టెంబరు పదిన 125 ఏళ్ళయింది ఆయన జన్మించి. ఆయన్ను స్మరించుకోవడం తెలుగు భాషా ప్రేమికులుగా మనం తప్పక చేయవలసినది.

“ మాటలాడే వెన్నెముక
పాటపాడే సుషుమ్న
నిన్నటి నన్నయభట్టు
ఈనాటి కవి సమ్రాట్టు 
గోదావరి పలకరింత
కృష్ణానది పులకరింత
కొండవీటి పొగమబ్బు
తెలుగులాళ్ళ గోల్డునిబ్బు
ఆకారాదిక్ష కారాంతం
ఆసేతు మహికావంతం
అతవాడు తెలుగు వాడి ఆస్తి
అనవరతం తెలుగు వాడి ప్రకాస్తి
ఛందస్సు లేని ఈ ద్విపద
సత్యానికి నా ఉపద”

— శ్రీ శ్రీ 

లెనిన్ వేముల

లెనిన్ బాబు వేముల: వృత్తికి సాఫ్ట్ వేర్ ఇంజనీరు, ఎమ్మే లో చదువుకున్న తెలుగు భాషా సాహిత్యాల సౌందర్యం మత్తు వదలని పాఠకుడూ వ్యాఖ్యాత. ప్రస్తుతం అమెరికా, టెక్సాస్ రాష్ట్రం, డాలస్ నగరంలో నివసిస్తున్నారు. అక్కడి టాంటెక్స్ (తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్)  నెల నెలా తెలుగు వెన్నెల క్రియాశీలురలో ఒకరు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.