మా అవ్వా తాతా నీరుగట్టు పనికి పోతుంటారు. శివరేతిరి నెల పెట్టేసుండాది. అరకవ నీల్ల పూట. ఈపొద్దు వంతు మాది. మేము పిల్లోళ్లం సంగటి తినేసి పణుకోనుండాము. మాయవ్వ నాపక్కనే పణుకుని ఆమాట ఈమాటా చెబతా ఉండాది.
తినేసి బయిటికి పొయుండిన తాత అప్పుడే ఇంట్లోకి వచ్చి “ఏయ్, లెయ్యి పోదాము, ఈపొద్దు పూట కదా” అన్నాడు అవ్వతో. ఆ మాటతో అవ్వ లేసి, పెనగాలు వేసుకుని సంగటి తిని, వక్కాకు నోట్లో దురుక్కుని, దూలాన ఉండే దుప్పటిని ఎత్తి బుజానేసుకుని యెలబారింది. మా తాత దొన్నెకట్టిని ఎత్తుకుని పారను బుజానికి తగిలించుకుని కదిలినాడు. “నేనూ వస్తాను తాతా” అంటా నేనూ లేస్తిని. వాళ్లు వద్దని ఎంత చెప్పినా నేను విన్లేదు. సరేనని పిలుచుకుని పోయిరి.
వెన్నిల పాలారబోసినట్లు కాస్తా ఉండాది. తాత ముందూ అవ్వ వెనకాలా ఇద్దరికీ నడాన నేనూ నడస్తా ఎండ్రకాయల గుంట కాడకి పోతిమి. అక్కడ నడిమి కయ్యకూ, పొడుగు సోగకూ నీళ్లు పెట్టల్ల. కాలవనీళ్లు సాగొస్తా ఉండాయి. ఎవరైనా నీళ్లదోవను మల్లిచ్చినారా, కాలవకు బొక్కలు పడి నీళ్లు పోతా ఉండాయా అని కాలవంటి చూస్తా ఒక మైలు దూరం పోవల్ల. నన్నూ అవ్వనూ ఎండ్రకాయల గుంటకాడనే ఉండమని, మా తాత కాలవంటి పొయినాడు.
అప్పుటికి నడిరేయ్యి దాటేసింటాది. విసనకర్రతో మెల్లింగా విసిరినట్లు గాలి సన్నంగా వీస్తా ఉండాది. గీమని ఎండ్రకాయిలూ కప్పలూ ఇసక జల్లిచ్చినట్లు అరస్తా ఉండాయి. గుంటకింది చెరుకుతోటలోకి, అడివినింటి నక్కల మంద వచ్చి దూరినట్లు ఉండాది, అయ్యి కుయికుయిమని మూలగతా ఊళలు తీస్తా ఉండాయి. నడుముకు చెక్కుకోనుండే వక్కాకు తిత్తిని తీసి, వక్కాకుని నోట్లో వేసుకుని నమలతా తాత కోసం ఎదురు చూస్తా ఉండాది అవ్వ. కొంచేపటికి నాకు తూగొచ్చి గెనిమివిందనే పడి నిదరబోతిని.
మేముండే కాడకి పదిబారల దూరంలో బాయి, ఆ పక్కనే పెద్ద చింతమాను ఉండాయి. అవ్వ తాతకోసం చూసి చూసి, లేసి బాయికల్లా నడిసిందంట. ఆ చింతమాను కింద ఆ తట్టుకు మళ్లుకుని కుచ్చుని ఉండాడంట తాత.
అవ్వ దూరం నించీ “ఏమే నువ్వేనా, నీ కోసం ఎంచేపని ఎదురు చూసేది. ఆయమ్మికి తూగొచ్చి గెనిమ్మింద పడి నిదరపోతా ఉండాది. ఏల ఈడకొచ్చి కుచ్చోనుండావు” అని తాతను పలకరిస్తా, బుజం మింద చెయ్యి వేసేదానికి దగ్గరికి పోతా ఉండాదంట. అదేయాలకి వెనకాలనిండి మా తాత వచ్చి “ఏయ్ గంగీ, ఏడకి పోతా ఉండావు అని పిలిసినాడంట. మా అవ్వ వెనక్కి తిరి చూసేతలికి, వెనకాల తాత ఉండాడు. అప్పుడు తెలిసిందంట ఆయమ్మకి, చింతమాను కింద కుచ్చోనుండింది దెయ్యమని.
అది తెలిసేటప్పటికి అవ్వకు ఒళ్లంతా చల్లంగా అయిపొయి, బిత్తరతో తాతను గట్టింగా పట్టుకునిందంట. తాత తెలివిగా ఒంటిమింద ఉండే బట్టల్ని ఇప్పి, చుట్టూ ఒంటికి పోస్తా తిరుక్కున్నాడంట. అవ్వ నన్ను జవురుకుని బుజాన వేసుకుని తాత వెనకంటి నడిసిందంట. ఊరి మొగసాలకి వచ్చి, బట్టలు కట్టుకుని వచ్చిరి. అప్పుటికి మెలకవ వచ్చింది నాకు. లేసిచూస్తే, అవ్వకు ఒళ్లంతా చెమట్లు పట్టేసి, వణకతా ఉండాది. ఏమి జరిగిందని అడిగితే, జరిగినదంతా చెప్పింది. ఆ పొద్దునించీ మా యవ్వ రెయ్యి నీళ్లపూటకు పొయ్యేది లేదు. నేనైతే పగులు కూడా ఆ తట్టుకు పొయ్యేది చాలించుకుంటిని.
బొమ్మ: చిత్రకారిణి, బి కిరణ్ కుమారి కి ‘రస్తా’ కృతజ్ఞతలు.
కథనం, కొత్త ఉంది..చదువుతుంటే!రచయిత్రి గారికి.. అభినందనలు!