నా రూపం
నాటి నుండి
నేటి దాకా మారుతూనే
మారకం లో
వ్యత్యాసాలు
విన్యాసాలు
సగటుజీవి చేతిలో
నేను అపురూపాయి
నేనే బొమ్మా నేనే బొరుసు
బిళ్ళని పిల్లల చేతుల్లో
పెట్టుబడిదారుల చేతుల్లో
అంగడిబొమ్మని
మాంద్యం
తరుముకొస్తుంటే
వినియోగదారుడు బేలగా
పెట్టుబడిదారుడు దర్జాగా
రాయితీలు వాడికే
ఎర్రతివాచీ పరచి
దేశం దాటేదాకా
దాటించేవాడి నినాదం వెనుక
రహస్యమెరుగని సామాన్యుడు
బ్యాంకులు అత్తలైతే
పాలకులు అల్లుల్లు
పందికొక్కులు గాదెలనే
తొలిచేస్తున్న వైనం
రాజ్యం దివాళా
ఖజానా ఖాళీ
నేనేమో సత్తు బిళ్ళ నౌతున్నా
వైచిత్రి? భళా!
భలే భలే….