ఔను, ఒఖడే !

ఒక్కో కవిత్వం ఒక్కో రకంగా ఉంటుందెందుకని ? రకం అంటే, అది రాయబడ్డ విధానమనేనా ? లేదూ, దాని లక్ష్యం, గమ్యం అనుకోవచ్చునేమో. చెప్పదలుచుకున్న భావాన్ని ఏ రకంగా, ఏ వాహకాన్ని ధరింపజేసి ఆ కవిత్వ రూపాన్ని మనకి సాక్షాత్కరింపజేయవచ్చునో అది ఆయా కవులకి సులభసాధ్యమైన విషయం కాకపోయినా, వాళ్ళెంచుకున్న అవగాహన లోనిదే అయిఉంటుంది. దానికి ఏ వాదం పేరో పెట్టుకుంటే అది ఖచ్చితంగా మన అమాయకత్వమే తప్ప, తొలుత అది ఆ కవుల నిర్దిష్టమైన అభివ్యక్తి మాత్రమే. అందులో గల ప్రత్యేకత వలనే వన్నె చేకూరి ఆ తర్వాత ఏ విశ్లేషణకైనా పాత్రమవుతుంది. ప్రత్యేకత, కల్పన వలనో, దాన్ని చిత్రిక పట్టిన భాషవలనో, తీవ్రమైన భావ సంచలనాన్ని కలిగించిన కవి అభిరుచి వలనో చేకూరి ఉంటుంది. అందుకే ఒక కవి గురించి చేకూరి ఇలా అంటాడు: ‘స్మైల్ బహు కావ్యాలు రాసి మేజర్ కవి కాలేదని నాకు దిగుల్లేదు. సమకాలికులే కాక తరువాత వారు కూడా పదే పదే చదువుకుని మూడ్ లోకి వెళ్ళిపోగల కవిత్వం రాశాడన్న సంతోషం నాకు చాలు. ‘ఒకడు నాచన సోమన’ లాగా తెలుగు కవిత్వం లో ‘ఒఖడే స్మైల్’.

ఏ మూడ్ లోకి స్మైల్ కవిత్వం మనల్ని తీసుకుపోతుందో ఇప్పుడు చెప్పుకుందాం. ఈ ఒఖడే పుస్తకంలో పట్టుమని పన్నెండు కవితలుంటాయంతే. వందల వందలు కవితల్ని పేజీలు పేజీలు నింపి సంపుటుల్ని తెచ్చే కవులకి కేవలం పన్నెండు కవితల్తో పుస్తకం తీసుకురమ్మని చెబితే ఇపుడీకాలంలో వింటారా? వస్తు వైవిధ్యం, శిల్పావగాహన లేకపోయినా రాసిన ప్రతీదాన్నీ సంపుటిలోకి చేర్చేయడం పరిపాటయిపోలేదూ? స్మైల్ ని తలచుకుని ఇది నేర్చుకోదగ్గ లక్షణమే. అంత జాగ్రత్తగా రాశాడన్నమాట. ఈ కవితలన్నీ 1966-1990, పాతికేళ్ళలో రాశాడని తెలిసినపుడూ ఆశ్చర్యంలోంచి బయటపడలేం. అది స్మైల్ కవిత్వాన్నెంచుకున్న పద్దతి. అందుకే “నేను చాలా స్లో రచయితను . కాయితం మీద దిగే నా ప్రతి మాటకీ దాదాపు కష్ట ప్రసవమే . నేను రాయబోయే విషయం, మాట అంతకు ముందు ఎవరైనా చెప్పేసి ఉన్నారేమో అన్న సందేహం, నేను నాదిగా చెప్తున్న మాట సూటిగా, స్పష్టంగా వస్తున్నదా అనే భయం నేనేం రాసినా కలుగుతుంటాయి. ఈ సందేహ భయాలు నేను రాసిన వాటిని హేంపర్ చేశాయి అనడం కంటే కొంత వరకు అయినా సెన్సిబుల్ గా చేశాయి అనే హంబుల్ ఒపీనియన్ వుంది. ఈ నా అభిప్రాయానికి మీ లాంటి గుడ్ రీడర్స్ గీటురాళ్ళు” అంటాడు. ఈ కొద్ది కవితల పుస్తకమూ త్రిపిర్నేని శ్రీనివాస్ అధ్వర్యంలోని ‘కవిత్వం ప్రచురణలు’ చొరవతో వెలువడినదే. 

స్మైల్ కవిత్వాన్ని తనకు తాను ఎంత ప్రత్యేకంగా చెప్పాడో చూడాల్సిందే. కొన్ని ఉదాహరణలు చూడండి:

అప్పుడు ఆలోచించని
ఐదు నిముషాలు

ఇప్పుడు కడుపులో క్రీస్తుకు
శిలువ వేస్తున్న విషాలు (కటి తప్పు) అంటాడు. ఇంకో చోట:

ఫ్యాక్టరీ పొగ గొట్టాలు మొలిచి
కొండంత ఎత్తుకు ఎదిగి
ఆకాశాన పొగ పూలు పూస్తూ
సైరన్ సంగీతం జనాన్ని పరుగెత్తిస్తూ

ఇప్పుడిక్కడ నా దగ్గు ఎవరికీ
వినిపించదు కదా (కాలి కింద కొండ).

ఈ రెండు కవితల నేపధ్యాన్నీ, వెనుకనున్న సందర్భ వివరణల్ని నేను అర్ధమయ్యేట్టు చెప్పబోను. వాటికవే స్వకీయమైనవి. అయితే అతని బ్రివెటీ ని గురించి చెప్పుకోవలసినంత ఉన్నదనిపిస్తోంది. బ్రహ్మాండమంత విషయాన్ని ఆవగింజంత పరిమాణంలో కూర్చగలగడం పరిశీలించాలి. సంక్షిప్తంగా చెప్పడం వల్ల సాధారణంగా కొంత అస్పష్టతకు ఆస్కారముంది. సరైన పదాల్ని ఎంచుకోలేకపోతే కవి భావం రూపు కట్టదు. కత్తిమీద సాముగరిడీలాంటి పరిస్తితంటే ఇదే మరి. ఒక విషయాన్ని కవిత్వాన్ని చేయగల నేర్పు బయటపడే సందర్భాల్నింతకన్నా వేరుగా అంచనా కట్టలేము. స్మైల్ సంక్షిప్తంగా చెప్పే పద్దతిలో కూడా స్పష్టత కోల్పోకుండా కవిత్వీకరించడం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే అతని దగ్గు ఎఖోలా వినిపించలేకుండా కొండని తొలిచేసిన దుక్ఖాన్ని కవి భరించలేనితనాన్ని కవిత చేస్తాడు. స్మైల్ ని అర్ధం చేసుకోవడంలో అతని సునిశితని ఎంతమాత్రమూ నిర్లక్ష్యం చేయలేము. అంత సూక్ష్మ తలాన కవిని పరిశీలించాలి.

ఈ పుస్తకం కవర్ పేజీ ని చూస్తే పొడుగాటి మీసాలతో పెదపేద్ద కనుగుడ్లతో ఒక మనిషి ముఖం ఉంటుంది. అతను స్పానిష్ చిత్రకారుడు, శిల్పి, రచయత సాల్వెడార్ డాలీ. చిత్ర రచనలో సర్రియలిజాన్ని, క్యూబిజాన్ని పాపులారిటీలోకి తెచ్చిన ఈ ఆర్టిస్టంటే స్మైల్ కి ఎంతో ఇష్టం ఉండి ఉండాలి. అందుకే కవర్ పేజీ గా వేసుకుంటాడు. అతనిపై ఒక కవిత కూడా రాస్తాడు. ద పెర్సిస్టెన్స్ ఆఫ్ మెమరీ అనే బొమ్మని ఆధారంగా కవిత రాశాడేమో అనిపిస్తుంది. ఆ కవితలో:

డాలీ !
జీవితం ఏం అర్ధమవుతుంది
ఏ వేదాంతి దంతపు మెరుపులు ఏం చెబుతాయని
ఏ సంసారి చిక్కుల అడవులు
ఏం దారులు విప్పుతాయని

…..
డల మధ్య నుంచి భూగోళాలు
>శూన్యంలో స్నేహాల కోసం పెదవులు తడుపుకుంటుంటాయి
డాలీ, నీకు నేనేం అవను; అర్ధం అవనే అవను –
నువ్వూ నాకు నీలానే అర్ధం అయీ అవవు
జీవితం లాగే
శాశ్వతంగా జీవితం లాగే

శాశ్వతం లాగే……..అంటాడు. ఈ కవిత కూడా సర్రియలిజాన్ని పోలి ఉంటుంది. అధివాస్తవిక దృశ్యచిత్రాల్ని అక్షరాల్లోకి తీసుకురావడం. వాస్తవికతని దాటి జీవితాన్ని నిర్వచించడానికి సాహిత్యంలోనూ ఇతర కళారూపాల్లోనూ సర్రియలిజాన్ని ఆశ్రయించడం కొత్తేమీ కాదు. శ్రీ శ్రీ, నారాయణబాబు, బైరాగీ లాంటివాళ్ళు ఈ తరహా కవితా సృష్టిచేయడం కూడా జరిగింది. అయితే ఎక్కువ కాలం మనగలిగిన దాఖలాలు లేవు. మన స్థానికతను అది మెప్పించలేకపోయింది. ఆ అస్పష్ట భావ చిత్రణ ఈ కవితలో ఉన్నప్పటికీ పుస్తకం మొత్తంలో ఆ సమస్య ఉండదు. డాలీ తత్వమ్మీద గల ప్రేమ జీవితంపట్ల ఉన్న హెల్ప్లెస్నెస్ గా అని పూర్తిగా అనలేం కానీ, అర్ధం అయీ కానీతనం గా మాత్రం ప్రదర్శిస్తాడు. ఎవర్నన్నా ఆరాధిస్తే వచ్చే ప్రభావ తీవ్రతలివి. తప్పించుకోవడం చాలా అసాధ్యం. మోనో, అజంతానో ప్రాణప్రదంగా చదివి చూడండి, అంత తేలిగ్గా బయట పడలేం. ఈ స్మైలూ అంతే.

కవి జీవితాన్ని తనకు వీలైన అద్దాల్లోంచి తొంగి చూస్తాడు. చూడ్డమే కాదు:
“ఆవిడ కౌగిల్నీ, పిల్లల నవ్వుల పూరేకుల్నీ
సిగరెట్లనీ, విస్కీ సీసాల్ని, పేక ముక్కల్నీ
హస్య సుఖాల జిలుగు దారిలో
మంచి కవిత్వాల కాయితాలనీ
అభాగ్యుల జాలి చూపుల చూరు చివర్లని పట్టుకుని మూడొందల అరవయ్యైదు కల్లోల సముద్రాల్ని
ఈదాలి మళ్ళా….

నేను..” (కొత్త సముద్రం) అని వర్ణిస్తాడు. ఒక్కోరోజుని ఒక్కో కల్లోల సముద్రంతో పోల్చడాన్ని విశేషంగా చెప్పను గానీ, ఈదాలి మళ్ళా నేను అన్న ముక్తాయింపులో ఎంత బలాన్ని తీసుకొస్తాడో బాగుంటుంది. ఈ కవిలో శృంగార పరమైన ఆలోచనలు ఎక్కువ బయల్పడుతున్న సందర్భాలు చాలాచోట్ల కనిపిస్తాయి. కటి తప్పు లో సబ్జక్టు కానీ, వీర్యాల వానలో తడవమని (డాలి నుంచి ఓ కాస్త గాలి) అన్నపుడు కానీ, భగ్న కామం కవితలో కానీ అతను వాడిన లైంగిక ప్రతీకలు అధివాస్తవికత ని ఆధారం చేసుకున్నవేనేమో అనిపిస్తుంది. కొన్ని కవితా ఖండికల్ని గమనిస్తే:

నిన్న
నా చేతి వేళ్ళను కొవ్వొతులుగా వెలిగించాలనుకున్నా
రేపు
నీ నరనరాల శిఖరారోహణ చూడాలనుకున్నా
ఇవాళ
ఒక్ఖణ్ణే చీకటి తిమింగలం కడుపులో తొడలు విరిగి పడుకున్నా — (భగ్న కామం) అన్నా గానీ, లేదా అబ్బాయిని కొట్టినప్పుడు అన్న కవితలో :–
ఆ నిమిషాన ఏమిటా తృప్తి –
రోజంతటి క్రౌర్యాన్నీ సంభోగంలో
కుక్కుకుంటున్నట్టు
ఏమిటా తృప్తి — అన్నపుడు గానీ, కొంత ఇబ్బందిగా ఉంటుంది. సంభోగలో కుక్కుకున్న క్రౌర్యాన్ని పిల్లాణ్ణి కొట్టినప్పుడు ఫీల్ అయ్యాననడం అసహజం కాకపోయినా, ఒప్పుకునేనంతగా ఉండదు. అయితే వస్తునిర్వహణని ఈ ప్రతీక డిస్టర్బ్ చేయదు కానీ అవసరం లేని ఎక్స్ప్రెషన్ అనిపిస్తుంది. ఆ తర్వాత కవితని నడిపించిన విధం చాలా బాగుంటుంది. చూడండి కావల్సొస్తే :-

కోటానుకోట్ల పిల్లల ఏడుపులు
రిగిన హిమాలయాలు
మునిగిపోతూ నేను ఏడుస్తూ —

అబ్బాయి అర్ధం కాక
జాలిగా ప్రేమగా చిర్నవ్వుగా నన్ను
చూస్తూ —
ఓదారుస్తూ — అంటాడు. గుండె మెలితిరిగిపోతుంది. పై మొదటి పంక్తిలో కలిగిన తృప్తిని చెప్పడం కొంత రుచించలేదు. ఎందుకిలాంటి అన్వయాలు చేస్తారనుకుంటే మళ్ళీ సిగ్మండ్ ఫ్రాయిడ్ ని చదివి చెప్పాలేమో తెలీదు.

స్మైల్ కవితల్లో తూనీగ, ఒఖడే కూడా చెప్పుకోదగ్గవి. వాటిల్లో కూడా అతని అభివ్యక్తుల్ని నిశితంగా పరిశీలించాలి.

వేళ్ళు తొండలైపోయేవి తూనీగ దొరికేదాకా అని మొదలెడతాడు కవితని. సహజాన్వయం. తూనీగల్ని పట్టుకోవాలన్న ఆత్రుత లో దాని దైన్యంకన్నా తన ఉత్సుకతనే ఎక్కువ చిత్రిస్తాడు.

తోకకి దారం కట్టి వొదిలేవాణ్ణి
గింజుకునే మా కుక్కపిల్ల మెడకి పటకా మల్లే
ఓ కాస్త ఎత్తుకి ఎగిరి దారపు బరువుకి
చడీ చప్పుళ్ళేకుండా కింద పడిపోయేది —
వెర్రి ఆనందంగా ఉండేది నాకు – రెండో క్లాసునుంచి మూడో క్లాసుకి ఎగిరినప్పుట్లా, మా అన్నయ్య నాకివ్వని వాడి బంతి పగిలిపోయి ఎగరనప్పట్లా –
నా సంతోషపు రూపం ఆ సన్నటి దారం అప్పుడు.

…..
తూనీగ వొదిల్తే వెళ్ళిపోతుంది
నా సంతోషం నా నుంచి యెగిరిపోతుంది
అది అలాగే ఉండిపోవాలని తహ తహ
తుమ్మ ముల్లుకి తూనీగని సిలువ వేసేశా కదలకుండా మెదలకుండా
బాధకి అరుపుల్లేవు, రెక్కల రెప రెపలు తప్ప
తూనీగ చచ్చిపోయింది

ముల్లు మాత్రం అలాగే ఉంది — మొన మీద గుచ్చుకున్న గుండెతో, నా గుండెతో, నా గుండెతో, నా గుండెతో…..అని ముగిస్తాడు. చిన్నతనంలో తూనీగల్తో ఎలా ఆడుకుంటామో కళ్ళకి దృశ్యం కట్టే పనిలో కవి చాలా సక్సస్ అవుతాడు కానీ, అతని వర్ణన్లో క్రౌర్యం కనిపిస్తుంది. మొన మీద పాఠకుల గుండెలు విలవిల్లాడకుండా ఉండవంటే అతిశయోక్తి కాదు. ఇక్కడే కవి లోని కొన్ని స్వభావ లక్షణాలమీద ఆసక్తి హెచ్చి అవేమన్నా కవిత్వంలోకి చొరబడ్డానికి ఆస్కారమిచ్చాయా అన్న అనుమానం కలుగుతుంది.

మొదట్లో స్మైలన్నా, ఇస్మైలన్నా ఒకరేనేమో అన్న కన్ఫ్యూజన్ ఉండేది. చెట్టు ఇస్మైలు వేరు, ఈయన వేరు. స్మైల్ అసలు పేరు మహమ్మద్ ఇస్మాయిల్. కృష్ణాజిల్లా తేలప్రోలు సొంతూరు. 65 ఏళ్ళు బతికి 2008 లో కాలం చేసిన ఈ కవి, కధలు రాశాడు. నాటకాలూ రాశాడు. అతని ఖాళీ సీసాలు కధ చాలా పేరుగాంచినది. అలాగే వల, సముద్రం కధలు, ఆ అనే నాటకం ఆయన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చాయి. ప్రపంచ కవిత్వానువాదాలు, హైకూలు అతని సాహిత్య కృషిలో గుర్తుంచుకోదగిన విషయాలు. కవిగా ఇతను పోషించిన పాత్ర చాలా చిన్నగానే కనిపిస్తుంది. కాని రాసికన్నా అతని వాసి మెచ్చుకోదగ్గది. అంత స్పెషల్ గా రాశాడు. చూడండి :

పొండి వెళ్ళిపోండి
ఆటలొద్దు, పాటలొద్దు, మీ బాల్యం అడవిపూవై వికసించొద్దు
వెళ్ళిపోండి చడీ చప్పుళ్ళేకుండా నీడల్లా నిష్క్రమించండి
మా నిద్రలు చెడతాయి, మా నిషాలు వొదుల్తాయి
మా చట్రాలు పేలివిడతాయి
మా ఫ్రిజ్ లు, ఫోం పరుపులు బ్రాలు, అండర్వేర్లు, బ్లేడ్లు సబ్బులు, సెంట్లు తిరగబడతాయి

….
మేం మా టెర్లిన్ల కింద తప్ప నగ్నం గా లేంకదా మరి
మేం మా రాతల్లో ఊహల్లో తప్ప మీకోసం సిగ్గుపడం కదా మరి (కనిపించని చావులు సముద్రాల్ని లేపవు). ఈ కవితలో ఇతని రాజకీయ ఉనికి తెలుస్తుంది. కేవలం కల్పనలోని ఆనందాన్నికాక కవిత్వంలో వాస్తవికతని ఆహ్వానిస్తాడు. అతని సర్రియలిస్టు డాలీ, వామపక్ష భావజాలం పట్ల అస్పష్టతని కలిగి ఉంటాడు గానీ, స్మైల్ మాత్రం ఏ అనుమానం రానివ్వని సామాజిక సమ భావాన్ని కవిత్వంలో జొప్పిస్తాడు. అందుకే నచ్చుతాడు అన్నా తప్పేమీ కాదు. నా చిన్నప్పటినుంచీ దేశాన ఇంకా ఆకు రాలు కాలమే అనడంలో కూడా కవి సామాజిక బాధ్యత తెలుస్తుంది. ఇతను విరసం అభిమానని కూడా ఒకచోట చలసాని ప్రస్తావిస్తాడు (చ. ప్ర సాహిత్య సర్వస్వం-1 చూడండి)

తెలుగు సాహిత్యంలో స్మైల్ ఒఖడే అనే ప్రయోగం బహుళ ప్రచారానికొచ్చినమాట వాస్తవం. అందుకతని ఒఖడే కవిత కారణం కావొచ్చు. అందులో :

అసలు ఎవడికి వాడే అంతవరకూ స్వీయ శవ వాహకుడంటాడు.
ఒకడు
కంట ఆశా నక్షత్రం మెరుస్తాడు
చేతిలో చలచ్చలన జీవన కేతనంతో
కాదిది కాదిదంటూ
కేకై నింగికి లేచి మోగుతాడు
మరొకడు అతని కంఠనాళానికి గాలం వేసి
నేలకి లాగుతుంటాడు

….
ఒక కేక ఒక సజీవ గీతమై సంగీతమై
సుసందేశమై సుభిన్న ఆలోచనై
నా మనసు మెదడుల గట్లని కోసుకు లోపలికెళుతుంది

ఓ పూవు పూస్తుంది
జీవితం సంపన్నమవుతుంది
అర్ధవంతమై సాగుతుంది

ఆ ఒఖడి వల్లే.

నిజం కూడా అంతే !
ఆ ఒఖడూ చాలామందిలో ప్రత్యేకంగా స్మైల్లానే కనబడతాడు. ఆరుద్రన్నట్టు అతనివి చదివితే జ్వరం తిరగబెట్టినట్లుండే రచనలే మరి.

శ్రీరామ్

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో కవితా ఓ కవితా శీర్షిక నిర్వహిస్తున్నారు. అద్వంద్వం తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

29 comments

 • స్మైల్ ను విస్తారంగా సమీక్షించారు. బహుశా ఇదంతా ఒఖ్ఖడే కాదనుకుంటాను. మొత్తం అత్యాధునిక కవితా విశ్లేషణలా వుంది. అభినందనలు.

 • ఒక సద్విమర్శ లక్షణం మంచిని ఒత్తి చెప్పాలి తప్పును సున్నితంగా ఎత్తి చూపాలి.మీ విమర్శలో ఎప్పుడూ ఒక లోచూపు ఉంటుంది.అది చాలా బాగుంటుంది. స్మైల్ ని బాగా చదివారు

  • మీ సూచన పాటిస్తాను సర్. థ్యాంక్యూ. మీరీమధ్య ఏమీ రాయడం లేదు. ఎందుకని ?

 • ఇదంతా చదివాక నేను నాలో లేను. అసలెక్కడా లేను. ఉన్నానో లేదో తెలియని రకరకాల ఊహలు.. నన్ను నేనే అధివాస్తవికత లో మెర్జ్ చేసుకున్నట్లు…………………….
  ………….
  …….
  ……

 • స్మైల్ గారి గురించిన మీదైన సమీక్ష/విశ్లేషణ తో, వారి కవిత్వాన్ని మరింతగా చదవాలనే తపన మొదలైంది.అధివాస్తవికత ధోరణి అయినప్పటికీ నా లాంటి సాధారణ పాఠకుకుడికి అర్ధమయ్యేది గా ఉంది వారి కవిత్వం. బహుశా అది మీ విశ్లేషణ తో సాధ్యమైందేమో!! చాలా బాగా రాశారు. అభినందనలు👌👌💐💐💐💐

  • పూర్తిగా అధివాస్తవిక కవి కానే కాదు సర్. దాని చాయలు చూపించాడంతే ! మరీముఖ్యంగా డాలీ బొమ్మల్ని ఇష్టపడ్డం, అతని మీద రాసిన కవితా లాంటివి కొంత దానికి దగ్గరచేశాయేమో అనిపిస్తుంది. నైరూప్యాని కారణం అదేనేమో ?

   థ్యాంక్యూ సర్.

 • శూన్యంలో స్నేహాల కోసం పెదవులు తడుపుకుంటుంటాయి..చాలా బావుంది…

  స్మైల్ ని, ఇస్మాయిల్ ని కూడా కలిపి చెప్పడం… చాలా చక్కని విశ్లేషణ…
  అభినందనలు

  • థ్యాంక్సండీ ! మీలాంటివాళ్ళు చదివి అభిప్రాయం చెప్పడాన్ని గౌరవంగా భావిస్తాను.

   మీరూ రస్తాలో ఆర్టికల్స్ రాస్తే బాగుంటుందని నాకనిపిస్తుంటుంది. ఏ మంటారు ?

 • కవి విషయం లోను ఆయన కవిత్వం పై మీ విశ్లేషణ చాలా సవివరంగా ఉంది. సందర్భోచితంగా కవితలపై వివరణ విశ్లేషణ బాగా చేశారు. కవులు రాసే కవిత్వం వాళ్ళు జీవించే కాలమాన పరిస్థితుల సమాహారం అనుకుంటాను. అంతే మీరు విశ్లేషణ లో విమర్శను కూడా పొందుపరిచారు. ఇంగ్లీష్ సాహిత్యం లో క్రిటికల్ అనాలైషిస్ చేస్తారు . ఆ పధ్ధతి మీ విశ్లేషణలో కనిపించింది. ముఖ్యంగా మీరు కవితల్ని ఉల్లేఖించి వాటి ప్రాముఖ్యతని లోతుని బాగా వివరించారు. అభినంనలు సర్.

 • ఈ వ్యాసం చదివాక నన్ను నేను గిల్లి చూసుకుని నేనసలు ఏం చదువుతున్నాను,ఏం రాస్తున్నాను..అని తరచి తరచి చూసుకున్నాను..ఒఖడే చదివాను..కానీ ఈ వ్యాసం చదివాక ఈ దృష్టి కోణంలోంచి చదవాలని నిర్ణయించుకున్నాను..మంచి వ్యాసం సోదరా..

  • అన్నా, నా రాతల వెనుకున్న మరో చోదక శక్తివి నీవు. కృతజ్ఞుణ్ణి.

 • చాలా బాగుంది..
  కవితల్లో ఆత్మను ఆవిష్కరించడం అద్భుత శిల్పమే
  కవిని…అతని రచనలోని జీవాన్ని బతికిండం…
  వ్యక్తీకరణ చాలా బాగుంది..

 • నిజానికి ఇది మీరు మాత్రమే రాయదగిన వ్యాసం .. నానుంచి మీరు మీకు తెలియకుండా లాగేసుకున్న నాకు ఇబ్బంది లేదు చాలా బాగా రాశారు .నిజానికి ఒఖడే చాలా ఆధునికుడు నేను ఈయన కధల ప్రేమికుడిని నిజానికి వాటి మాయలో పడి వ్యాసం రాయడం ఆలస్యం చేసాను. మీ వ్యాసం విలువైంది అభినందనలు

  • సారీ అనిల్…..తెలీకుండా జరిగిపోయింది.

   🤭 థ్యాంక్యూ

 • ఒఖడే కవిత్వం చాలా రోజుల క్రితం చదివా…చదవడంలో కూడా తేడాలుంటాయి….విలక్షణమైన కవిత్వం చదివి ఎంజోయ్ చేయడం వేరు… ఆ కవిత్వాన్ని పూర్తిగా మనలోకి‌ ఇంకించుకొని మాట్లాడటం వేరు….మిత్రమా మీరు ఏ పుస్తకాన్ని ముందేసుకొని చదివినా …నాలుగు మాటలు రాసినా….సమర్ధత కనిపిస్తుంది… శ్రీరాం ఇలా రాస్తుంటే నాలాంటి‌వాడికి ఎప్పుడూ ఆనందమే

  • మురళీ, ఈ వ్యాస పరంపర వెనుక మన మిత్ర బృందమంతా ఉందన్న సంగతి మళ్ళీ చెప్పలేను. మీరూ, గోపాల్ ఎన్నేసి మాటలనుకున్నాం ఇవి మొదలెట్టిన తొలినాళ్ళలో !

   రాయవు. రాస్తే బంగారం పోద్దన్నట్టు. రాయండి సర్. 🙏

 • స్మైల్ గారి కవిత్వవిశ్వదర్శనం కనిపించింది సార్ ఈ వ్యాసంలో.రాసిన ప్రతీకవిత మీద పిచ్చిప్రేమతో పుస్తకాలలో ఉండాలనీ అనుకునే మా లాంటి కవులకు ఇది ఎంతో ఉపయోగకరమైన వ్యాసం.సంక్షిప్తతలో కూడా స్పష్టతను కోల్పోయి లక్షణం స్మైల్ గారిలో బాగ నచ్చింది సార్ .అద్భుతమైన వ్యాసం

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.