అందరి చూపు డెట్రాయిట్ వైపు
జి. ఎం. సమ్మె

“మీరు లాభాల్లో ఈదులాడుతున్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. వారికి అవసమైన సౌకర్యాలు కల్పించడం లేదు. మీరు చేస్తున్న పనులు మాకిష్టం లేదు. మేము వీటిని తిప్పికొడతాం. మాకు కావలసినవి రాబట్టుకుంటాం’’ అమెరికాలో సమ్మె కట్టిన జనరల్ మోటార్(GM) వర్కర్లు అంటున్న మాటలివి.

సెప్టెంబర్ 16 నుంచి అమెరికాలోని 10 రాష్ట్రాల్లో నెలకొని ఉన్న 55 జనరల్ మోటారు కంపెనీల్లో పని చేస్తున్న 46,000 మంది ఉద్యోగులు యూనియన్ ఆఫ్ ఆటో వర్కర్స్ (UAW) నాయకత్వంలో సమ్మె చేస్తున్నారు. “”ఇది జీత భత్యాల కోసం సాగుతున్న సమ్మె కాదు. విలువల కోసం సాగుతున్న సమ్మె””గా కొందరు అభివర్ణిస్తున్నారు.

“గంటకింత అని చెల్లించే వేతనం కోసం పనిచేసే ఫ్యాక్టరీ వర్కర్ కు, మల్టీ బిలియన్ డాలర్ గ్లోబల్ కార్పొరేషన్ కు మధ్య జరుగుతున్న పోరాటం ఇది. కేవలం GM వర్కర్ల్ కు సంబంధించిన సమ్మె కాదు. టెక్ వర్కర్ల్ కు, టెక్ ఎగ్జిక్యూటివ్ లకు ఒక దశా దిశా నిర్దేశం చేస్తున్న సందర్భం అని సిలికాన్ వాలీ నిపుణులు అంటున్నారు. ఇంకా వారు “ప్రజలు ఇప్పుడు డెట్రాయిట్ వైపు చూస్తున్నారు.  కార్పొరేట్ మేనేమెంట్లకు వ్యతిరేకంగా సంఘాలుగా ఎలా సంఘటితం కావాలో ఒక నమూనాగా డెట్రాయిట్ ను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు “ అని అంటున్నారు

“సరైన వేతనాల కోసం, హెల్త్ కేర్ కోసం, లాభాల్లో సరైన వాటా కోసం, జాబ్ సెక్యూరిటీ కోసం ఈ సమ్మెను చేపట్టారు. తాత్కాలిక ఉద్యోగులైన సోదర సోదరీమణులు కాల పరిమితి లేకుండా తక్కువ వేతనాలకే పనిచేస్తూ కార్మికులు సాధించుకున్న అనేక హక్కులు, బెన్ఫిట్స్ పొందడం లేదు. వారి కోసం కూడా మేము సంఘటితమై సమ్మె చేస్తున్నాం. మేము ఇప్పుడు బలంగా ఉన్నాం. మేము దీన్ని ఇక ఎంత మాత్రం తేలికగా తీసుకోం.” అని యూనియన్ ఆటో వర్కర్స్ కమిటీ నాయకుడు టెడ్ క్రుమ్మ్  ఒక న్యూస్ కాన్ఫరెన్స్ లో అన్నారు. 

ఆయన ఇంకా ఇలా అన్నారు. 2007 లో రెసెషన్ సమయంలో నష్టపోయిన GM కు అండగా మేమున్నాం. ఎన్నో సౌకర్యాలను వదులుకున్నాం. ఇప్పుడు లాభాలు పొందుతున్న సమయం. ఈ కంపెనీ లాభాల బాట పట్టడానికి మేము చాలా శ్రమించాం. ఇప్పుడు మాకోసం మేం నిలబడుతున్నాం. మేం తప్పుచేయడం లేదు. దేశ వ్యాప్తంగా ఒకే సారి సమ్మె చేపట్టాం. మధ్యతరగతి భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నాం”. 

గత శతాబ్దిలో శ్రామిక సంఘాలు ( యూనియన్లు) ప్రతి రోజు పనికోసం వెతుక్కొనే పనివాళ్ళ నుంచి మధ్య తరగతి ఉనికిలోకి రావడానికి అద్భుతంగా పనిచేశాయి. రోజుకు 8 గంటల పనిదినంతో వారాంతం సెలవులు, గనులు, కార్ఖానాలు వంటి ప్రదేశాలు సురక్షితంగా వుండేట్లు అనేక సౌకర్యాలు కార్మికులకు కల్పించగలిగాయి. అయితే గత 20,30 సంవత్సరాలుగా యూనియన్లు అంతకంతకు బలహీన పడ్డాయి. ముందుగా పబ్లిక్ సెక్టార్ లో యూనియన్లు బలహీనపడడంతో, కార్పొరేషన్లు, గ్లోబలైజేషన్ కు అడ్డు ఆపు లేకుండా పోయింది. కార్పొరేట్లు రికార్డ్ స్థాయిలో లాభాలు గడించుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్ట్లు రికార్డ్ స్థాయిలకు చేరుకుంటున్నాయి. మరోవైపు యూనియన్లు ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అనేక కార్పొరేషన్ కంపెనీల్లో యూనియన్ల ఊసే వినిపడదు. ఈ సమస్య ప్రపంచమంతటా  శ్రామికులు ఎదుర్కొంటున్నారు. పైగా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వారిని శ్రామికులుగా పరిగణించవచ్చా అని ఒక అమాయకమైన ప్రశ్న మన మధ్యలోనే చక్కర్లు కొడుతూ ఉంటుంది. 

హెల్త్ కేర్  బూచీ:

ఆటో వర్కర్లు సమ్మె చేపట్టిన రెండు రోజులకు GM కంపెనీ పూర్తి కాలం పనిచేస్తున్న ఉద్యోగులకు ఆరోగ్య బీమా( health care) చెల్లించడం లేదని ప్రకటించింది. ఇలా బెదరించడం వల్ల కొందరు ఉద్యోగులు సమ్మెకు దూరం అవుతారని, ఆ విధంగా సమ్మెను నిలిపివేయవచ్చని ఆశించింది. కానీ GM కంపెనీ చర్య అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఆటో వర్కర్లు మరింత కోపోద్రిక్తులయ్యారు. వారంలోగా తన బెదరింపును వెనక్కి తీసుకుంది. సమ్మె సమయంలో హెల్త్ కేర్ ను కొనసాగిస్తానని ప్రకటించింది.

 అమెరికాలో ప్రజలు హెల్త్ కేర్ లేకుండా బతకడమంటే  భయపడతారు. అమెరికా ప్రజల ఆరోగ్యంతో ఆసుపత్రులు, మందుల కంపెనీలు, ఇన్సురెన్స్ కంపెనీలు కలిసి ఆడుతున్న నాటకంతో లాభాలు పండించుకుంటున్నాయి. పది పదేహేనేళ్ల క్రితం ఉన్న హెల్త్ కేర్ ప్రిమియం విలువ  నేడు 200% పెరిగింది. (ఈ సమస్యను ఎన్నికల ఎ జెండా మీదకు తీసుకరాగలిగారు వర్మాంట్ సెనేటర్ బెర్నీ శాండర్స్.) GM కంపెనీ ఇన్నాళ్ళు తన ఉద్యోగులకు చెల్లిస్తున్న హెల్త్ కేర్ ప్రిమియం చెల్లింపులో కోత విధించింది. సమ్మెకు ఇది కూడా ఒక ప్రధాన కారణంగా ముందే చెప్పుకున్నాం. ఉద్యోగులు 3% చెల్లిస్తే కంపెనీ మిగిలిన 97% చెల్లించేది. ఇప్పుడు 15% ఉద్యోగులే చెల్లించుకోవాలని. హెల్త్ కేర్ కోసం చెల్లిస్తున్న మొత్తం చాలా ఎక్కువగా వుంటున్నదని GM కంపెనీ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయంలో GM కంపెనీ విజయవంతమైతే అమెరికాలో వున్న అనేక కంపెనీలు హెల్త్ కేర్ ను వదిలించుకునే ఎత్తుగడలు ప్రారంభిస్తాయనడంలో ఎలాంటి అనుమానం లేదు. 

తమ కోసం, అందరి కోసం

యూనియన్లు శ్రామికుల ఆర్థిక విషయాలకే పరిమితయ్యాయని, అందుకే అవి సమాజంలో ఇతర ప్రజల నుంచి వేరయ్యాయనే అపవాదు ఉంది. ఇందులో నిజం లేకపోలేదు. అందుకేనేమో సమ్మె అనగానే అశేష ప్రజల మద్ధతును కూడగట్టలేకపోతున్నాయి యూనియన్లు. అయితే ఈ అపవాదు నుంచి యూనియన్లను బయటపడేసి సమ్మెకు కొత్త దారి చూపుతున్నారు టీచర్లు. గత ఏడాది అమెరికాలో జరిగిన టీచర్ల సమ్మెలను GM వర్కర్లు మార్గదర్శకంగా తీసుకున్నారని చెప్పవచ్చు. వర్జీనియా రాష్ట్రంలో ప్రారంభమైన టీచర్ల్ సమ్మె అది విజయవంతమైన తీరు ఇతర రాష్ట్రాల టీచర్లు అనుసరించారు. టీచర్లు ప్రారంభం నుంచే చెప్పారు, మేము మా జీతాల కోసం మాత్రమే సమ్మే చేయాలనుకోవడం లేదు. పాఠశాలల్లో సౌకర్యాలు పెంచాలని,ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడానికి సమ్మె చేయాల్సి వస్తున్నదని, విద్యార్థుల తలిదండ్రులకు, ప్రజలకు తెలియజేస్తూ వారి మద్ధతును కూడగట్టుకున్నారు. ఇప్పుడు సరిగ్గా GM వర్కర్లు కూడా అదే పని చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను, హెల్త్ కేర్ సమస్యలను ముందుకు తెస్తూ ప్రజల మద్ధతు కూడగడుతున్నారు. 

“మాకోసం మాత్రమే కాదు,  కమ్యూనిటీకి (ప్రజలకు) సహాయం చేయడానికి   మేము సమ్మె చేస్తున్నాం. ఇందుకోసం మేము మా కమ్యూనిటీలోని వారితో, పర్యావరణ పరిరక్షణ కోసం పని చేస్తున్న కార్యవాదులతో ( యాక్టివిస్టులను), ఇమ్మిగ్రెంట్స్ గ్రూపులతో మేము కలుస్తున్నాం. వారికి మా మద్ధతు తెలుపుతూ, వారినుంచి మద్ధతు పొందుతున్నాం. చుట్టూ కమ్ముకున్న సమస్యలపై కలిసికట్టుగ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా వుంద”ని వారు ప్రకటిస్తున్నారు. *

ఎస్. జయ

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.