అణుదౌష్ట్యానికి సజీవ ఖండన
‘సిల్క్‌వుడ్’ బయోపిక్ (1983)

సినిమాల్లో బయోపిక్కుల హోరు సాగుతోందిప్పుడు. ఆయన చాయ్ అమ్మాడనీ, గుజరాత్ అల్లర్లు చూసి నిజంగానే తల్లడిల్లాడనీ సినిమా వచ్చింది. సినిమా అయితే హిట్టు కాలేదు గానీ రెండోసారి కూడా అయన సిక్సర్ కొట్టాడు. సిక్సర్ అంటే గుర్తొచ్చింది. మన దర్శకులు సచిన్, ధోనీల గురించి సినిమాలు తీస్తే ఎక్కడో విదేశాల్లో వాళ్ళు మన రామానుజన్ గురించి సినిమా తీశారు. నల్లమల యురేనియం మైనింగ్ రేడియేషన్ హడావిడిలో గుర్తొచ్చే బయోపిక్ ‘సిల్క్ వుడ్’. నలభై అయిదేళ్ళ క్రితం, అమెరికా అణు వ్యతిరేక కార్యకర్త కరెన్ గే సిల్క్‌వుడ్ కారు ప్రమాదంలో మరణించింది. అది ప్రమాదం కాదనీ, కెర్ మెక్‌గీ అణు సంస్థ చేసిన హత్య అనీ చాలా మంది భావిస్తారు.

టెక్సాస్ లోని పెట్రోకెమికల్ పరిశ్రమ కేంద్రమైన నేడర్‌ల్యాండ్‌లో సిల్క్‌వుడ్  పెరిగింది. వివాహబంధం తెగిపోగా తన ముగ్గురు పిల్లల కస్టడీని భర్తకు కోల్పోయింది. ఆ తర్వాత పని కోసం ఓక్లహోమా నగరానికి వెళ్లింది. 1972 లో ఆమె కెర్ మెక్‌గీ మెటలోగ్రఫీ ప్రయోగశాలలో చేరింది.

కెర్ మెక్‌గీలో పరిస్థితులు సవ్యంగా లేవని తెలియడానికి ఆమెకు అట్టే సమయం పట్టలేదు. ఆరోగ్య నిబంధనల  ఉల్లంఘన జరుగుతోంది. కార్మికులు అనునిత్యం ప్లుటోనియం కాలుష్యానికి గురౌతున్నారు. లోపభూయిష్ట శ్వాసకోశ పరికరాలు, డెస్క్ డ్రాయర్లలో నిల్వ చేసిన ప్లూటోనియం నమూనాలు, స్థానిక పాఠశాలల్లో ప్రదర్శించి చెప్పడానికి ప్లూటోనియం నమూనాలు బయటకు తీసుకువెళ్ళడాలు – ఏవీ సరిగా లేవు.

ప్లాంట్ లో ప్రతి షిఫ్టులోనూ 75 మంది కార్మికులు పనిచేస్తుంటారు. వారి కాలుష్యహరణం కోసం కేవలం రెండు విశేష స్నానాల గదులు మాత్రమే వున్నాయి. ఉద్యోగ సమయంలోనే స్నానం కోసం సమయం కేటాయింపు లేనందున చాలా మంది కార్మికులు స్నానం చేయకుండానే ఇళ్ళకు వెళ్ళిపోతుంటారు.

సినిమా సమీక్షలో అప్రస్తుతమనిపించినా ఇక్కడ ప్లుటోనియం గురించి కొంచెం చెప్పాలి. యురేనియంతో నడిచే అణుశక్తి కర్మాగారంలో తప్పనిసరి ఉపోత్పత్తిగా ప్లుటోనియం పుడుతుంది. యురేనియం (235)తోనే కాక ప్లుటోనియం (239) తో కూడా అణుబాంబులు తయారుచేస్తారు కనుక ‘అణ్వస్త్ర రాజ్యాలు’ ‘శాంతి కోసం అణుశక్తి’ మంత్రాన్ని జపిస్తుంటాయి. రేడియోధార్మిక పదార్థాలకు ‘అర్ధాయువు’ అనేది ఒకటుంటుంది. ఒక గ్రాము పదార్థం రేడియేషన్ వదుల్తూ వదుల్తూ అర గ్రాము పదార్థంగా మారడానికి పట్టే కాలాన్ని అర్ధాయువు అంటారు. ఒక రేడియోధార్మిక పదార్థం సంపూర్ణంగా నిష్క్రియం కావడానికి పది అర్దాయువుల కాలం పడుతుంది. ఆ విధంగా చూస్తే  ప్లుటోనియం (239) అర్ధాయువు 24,400 సంవత్సరాలు. అనగా ఒకసారి తయారైన ప్లుటోనియం 2,44,000 సంవత్సరాల పాటు రేడియో ధార్మిక కిరణాలను వదుల్తూ జీవరాశి మనుగడకు నష్టం కలిగిస్తుంది. అందుకే దీన్ని మనిషి చేతిలో తయారైన ఆధునిక భస్మాసురుడు అని చెప్పొచ్చు. ఒక గ్రాము ప్లుటోనియంలోని పది లక్షలవంతుల్లో ఒక వంతును పీల్చితే చాలు ఆ మనిషికి కాన్సర్ వస్తుంది. అంటే 200 గ్రాముల ప్లుటోనియంతో ప్రపంచ జనాభాను హతమార్చవచ్చన్నమాట! అణు రియాక్టర్ల పుణ్యమా అని టన్నుల కొద్ది ప్లుటోనియం ప్రపంచంలో పోగైవుంది.

ప్లాంట్లో ఉద్యోగం పొందిన కొద్ది నెలల్లోనే, కెర్ మెక్‌గీలో ఆయిల్, కెమికల్ అండ్ అటామిక్ వర్కర్స్ యూనియన్‌లో మొదటి మహిళా కమిటీ సభ్యురాలిగా ఎన్నికవుతుంది సిల్క్‌వుడ్. “పూర్వం బొగ్గు గనులలోకి వెళ్ళే కార్మికులు తమతో పాటు పంజరంలో ఒక కానరీ పక్షిని తీసుకెళ్ళేవారు. (కార్బన్ మోనాక్సైడ్) గ్యాసు లీకు జరిగితే ఆ పక్షి చనిపోతుంది. ఆ ప్రమాద హెచ్చరికతో కార్మికులు గని నుండి బయటపడేవారు. ఇది (అణుశక్తి) సరికొత్త  పరిశ్రమ. ఇక్కడ కార్మికులే కానరీ పక్షులు.” అని ఒక కార్మిక నాయకుడు చెప్పిన మాట ఆమెలో కార్మిక చైతన్యం నింపుతుంది. కార్మికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య ప్రమాదాలపై అప్రమత్తమైన ఆమె ఆరోగ్యభద్రతా లోపాలను పట్టిచూపే ప్రమాణాలను సేకరించడం ప్రారంభిస్తుంది. అధిక నిరుద్యోగం వలన, యూనియన్లో చేరే వారిని కంపెనీ ఆగ్రహంతో చూడడం వలన కార్మికులను తనవైపు తిప్పుకోవడం కష్టంగా వుంటుంది.

అటామిక్ ఎనర్జీ కమిషన్ మద్దతుతో తయారైన కెర్ మెక్‌గీ కి “గౌరవనీయమైన” సంస్థగా పేరుంది. అణు పరిశ్రమలో అవినీతి ప్రబలంగా ఉన్నందున నిశ్శబ్దంగా పనిచేయాలని సిల్క్‌వుడ్ ను హెచ్చరిస్తుంది యూనియన్.  ఒక అణుశక్తి సంపన్న రాజ్యంలో అణు పరిశ్రమ తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంతకు తెగిస్తుందో ప్రపంచంలో ఆ సరికి ఎవరికీ తెలీదు.

సాక్ష్యాలను సేకరిస్తున్నప్పుడు, సిల్క్‌వుడ్ ఫోన్ బగ్ చేశారు.  ఆమె కదలికలపై నిఘా వేశారు. అంతకంటే హేయంగా ఆమెను ఉద్దేశపూర్వకంగా ప్లూటోనియంతో కలుషితం చేశారు. ఎంతగా అంటే ఆమె అపార్ట్మెంట్ నుండి తొలగించబడిన బట్టలు, వస్తువులను సీలు చేసిన డ్రమ్ముల్లో ఉంచాల్సివచ్చింది.

కొన్ని నెలల సాక్ష్యాల సేకరణ తరువాత సిల్క్‌వుడ్ ఈ కథను జనం ముందుకు తీసుకుపోవాలని ‘న్యూయార్క్ టైమ్స్’ జర్నలిస్టుతో పరిచయం చేసుకుంటుంది. ఆ రోజు నవంబర్ 17, 1974 రాత్రి. యూనియన్ సమావేశం తర్వాత  తను సేకరించిన సాక్ష్యాలను జర్నలిస్టుకు అప్పగించడానికి కారులో బయలుదేరింది. అదే ఆమె ఆఖరు ప్రయాణమైంది.

హైవేకి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆమె కారు రహదారిని వదిలి కాంక్రీట్ కల్వర్టును ఢీకొట్టింది.  అంత నిర్జన ప్రాంతంలో అనుభవజ్ఞురాలైన డ్రైవర్ అలా ఎందుకు చేస్తుందో ఎవరికీ అర్ధం కాలేదు. ఆమె వద్ద వున్న డాకుమెంట్లు మాయమయ్యాయి. ఆమె కుటుంబం ప్రకారం, ఆమె మరణానికి ముందు చాలా బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. కెర్ మెక్‌గీ (ప్రభుత్వ ఏజెంట్ల మద్దతుతో) సిల్క్‌వుడ్‌ను హత్య చేసినట్లు చాలా మంది సానుభూతిపరులు అనుమానించారు, కాని ఎటువంటి ఆధారాలు లేవు. అయితే, ప్లాంట్ వద్ద ప్లూటోనియంతో ఆమెను కలుషితం చేసినందుకు కెర్ మెక్‌గీపై సివిల్ దావా వేసి కోర్టు యుద్ధం తర్వాత ఔట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంటుతో US $ 1.3 మిలియన్ డాలర్ల జరీమానాను గెలిచారు ఆమె సన్నిహితులు. ఈ రకమైన కేసు కోసం ఇప్పటివరకు ఇచ్చిన అతిపెద్ద మొత్తం ఇదే.  కెర్ మెక్‌గీ తన అణు ఇంధన కర్మాగారాన్ని 1975 లో మూసివేసింది.

రిచర్డ్ ఎల్. రాష్కే పుస్తకం ‘ది కిల్లింగ్ ఆఫ్ కరెన్ సిల్క్‌వుడ్’ (2000) ప్రకారం, సిల్క్‌వుడ్ మరణం, కెర్-మెక్‌గీ కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్న అధికారులు హత్య బెదిరింపులను అందుకున్నారు. పరిశోధకులలో ఒకడు చాలా రహస్యంగా అదృశ్యమయ్యాడు. ప్లాంట్ లో జరిగిన సంఘటనల గురించి కెర్-మెక్‌గీ కార్పొరేషన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన సాక్షుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.

కేవలం 28 సంవత్సరాల వయసులో సిల్క్‌వుడ్ మరణం ‘అణు పోలీసు రాజ్య’ దురాగతానికి నిదర్శనంగా నిలిచింది. ప్రపంచమంతా అణుశక్తి  వ్యతిరేక పోరాటాలకు ప్రేరణగా ‘విజిల్‌బ్లోయర్‌’ కరెన్ సిల్క్‌వుడ్ ను గుర్తుంచుకుంటారు. లాభాల సంపాదన కార్మికుల, ప్రజల భద్రతకు, పర్యావరణ పరిరక్షనకూ పెనుముప్పుగా  మారినపుడు దానికి వ్యతిరేక పోరాటం తప్పదని సిల్క్ వుడ్ త్యాగం వృధా పోదని ప్రపంచ అణువ్యతిరేక పోరాటాలు రుజువు చేశాయి.

మెరిల్ స్ట్రీప్ కొద్దిపాటి మేకప్ తో నిజజీవిత సిల్క్ వుడ్ పోలికను సంతరించుకోవడమే కాక, కేర్ లెస్ గా ఉంటూ, తను నమ్మిన ఆదర్శం కోసం ఏమైనా చేయగల ఉక్కు మహిళ వ్యక్తిత్వంతో చాలా హుందాగా నటించింది. వ్యాపారపరంగా విజయవంతమవడమే కాక, 56 వ అకాడమీ అవార్డులలోఈ సినిమా మొత్తం ఐదు నామినేషన్లను అందుకుంది.  వీటిలో ఉత్తమ నటిగా స్ట్రీప్, ఉత్తమ సహాయ నటిగా చెర్, ఉత్తమ దర్శకుడిగా మైక్ నికోలస్ ఉన్నారు. మెరిల్ స్ట్రీప్ ఉత్తమ నటిగా కాన్సాస్ ఫిలిం క్రిటిక్స్ అవార్డు అందుకోగా, సిల్క్‌వుడ్ స్నేహితురాలి పాత్రలో ఉత్తమ సహాయ నటిగా చెర్ గోల్డెన్ గ్లోబ్ గెలుచుకుంది. ‘నాయకుడు’ సినిమాలో ‘నా చిట్టి తండ్రీ నిన్నెవరు కొట్టారు’ పాట చాలా మందికి గుర్తుండే వుంటుంది. ఈ సినిమా ఆఖర్లో వచ్చే పాటనూ ఓసారి గమనించండి.

బాలాజి (కోల్ కతా)

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు.
మొబైల్: 9007755403

1 comment

ఇటీవలి వ్యాఖ్యలు

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.