ఒక బుజ్జిగాడి బర్త్ డే…

అనగనగా వొక బుజ్జిగాడు!

వాడెవడో కాదు, మా తమ్ముడే!

వాడిదే బర్త్ డే!

వాడి బర్త్ డే కోసం వాడు వెయిట్ చెయ్యలేదు! వెయిట్ చెయ్యకపోయినా బర్త్ డే వస్తుంది! మనమయితే మన బర్త్ డే కోసం వెయిట్ చేస్తాం!

ఎందుకంటే బర్త్ డే వస్తుంది అంటే హేపీ ఫీలవుతాం! కేక్ కట్ చేస్తాం! కొత్త బట్టలు వేసుకుంటాం! చాక్లెట్లు పంచుతాం!

ఆ రోజు యింట్లో మనల్ని యెవ్వరూ యేమీ అనరు! స్కూల్లో కూడా ఫనిష్మెంట్లు యివ్వరు! కొట్టరు! తిట్టరు! అందరూ మనతో కూల్ గా వుంటారు! మనల్ని కూల్ గా వుంచుతారు! వద్దన్నా ముద్దు పెడతారు! ప్రేమగా మాట్లాడుతారు! విసుక్కోరు! కనీసం కసురుకోరు! హోం వర్క్ చెయ్యకపోయినా యేమీ అనరు! కొందరయితే గిఫ్ట్లు కూడా యిస్తారు!

అసలు ప్రతిరోజూ పుట్టిన రోజు అయితే యెంత బాగుంటుంది?

పుట్టినరోజులానే అన్నిరోజులూ అందరూ మనతో ప్రేమగా వుంటే యెంత బాగుంటుంది?

సారీ… తమ్ముడి గురించి చెప్పాలని అనుకొని మర్చిపోయి నా గురించి చెప్పేస్తున్నా… ప్చ్!

ఇంత గొప్ప బర్త్ డే తమ్ముడికి అర్థం కాదు?!

నీ బర్త్ డే రా- అన్నా నవ్వడు! ఒక్కోసారి యేడుస్తాడు! మరొక్కోసారి లెక్కే చేయడు! వినడు!

ఔన్లే… తమ్ముడి కి బర్త్ డే టేష్టు తెలీదు!

ఎందుకంటే తమ్ముడికిది ఫస్ట్ బర్త్ డే!

వాడి బర్త్ డే ని వాడు ఎంజాయ్ చెయ్యడం లేదు! పైగా ఆ కొత్త బట్టలకు చిరాకు పడతాడు! బెలూన్స్ చూసి నవ్వుతాడు! అవి పేలితే యేడుస్తాడు!

తమ్ముడికి కొవ్వొత్తి వూదడం కూడా రాదు?! ఔను, అమ్మే వూదేసింది! మా ఫ్రెండ్ అభి వాళ్ళ చెల్లెలి ఫస్ట్ బర్త్ డే కి వాళ్ళ డాడీ కొవ్వొత్తి ఆర్పేశాడు!

తమ్ముడు కూడా చాక్లెట్లు పంచమని యిస్తే నోట్లో పెట్టుకుంటాడు!

ఔన్లే… వొక్క యేడాదికే యెవరికైనా యేమి వొస్తుంది? ఏమి తెలుస్తుంది?

ఔనూ… తెలియనప్పుడు పుట్టినరోజు చేయడం యెందుకు?

తెలిసీ తమ్ముడు ఎంజాయ్ చేసినప్పుడే కదా- అది పుట్టినరోజు!

వాడి పుట్టినరోజు వాడు ఎంజాయ్ చెయ్యకుంటే అదేం పుట్టినరోజు?

అదేదీ అమ్మానాన్నా తెలుసుకోరు! తెలుసుకోకుండా మావాడి పుట్టినరోజు చాలా గ్రాండ్ గా చేశాం అంటారు! అల్లా హోటల్లో ఇల్లీ హోటల్లో గ్రాండ్ పార్టీ యిచ్చామని చెపుతుంటారు! అప్పు చేసి పప్పు కూడు వండడం దేనికి?- అంటుంది నాయనమ్మ! ఏం వండినా యెలా వండినా తమ్ముడు తిననిది యెందుకు?

ఇవన్నీ పెద్దవాళ్ళకి చెప్పినా అర్థం కావు!

అప్పటికీ తమ్ముడు పెద్దయ్యాక పుట్టినరోజు చేద్దాం అని చెప్పానా? నా మాట వింటేనా? పెద్దయితే పెద్ద పట్టింపు వుండదు అని అమ్మ అంటుంది! పెద్దయితే కదా పుట్టినరోజు పండగ అర్థమయ్యేది? తెలిసేది? అసలు ఈ పెద్దవాళ్ళకొకటి తెలిస్తేగా?

నిజం… నా బర్త్ డే కూడా బాగా గ్రాండ్ గా చేశారట! నాకయితే గుర్తు లేదు! లేనిదెందుకు?

నాకొకటి అర్థమయ్యింది పిల్లల పుట్టిన రోజులు పిల్లల కోసం కాదు! పెద్దల కోసం! వాళ్ళ డాబు కోసం! దర్పం కోసం! డబ్బు చూపించుకోవడం కోసం! మేము యెవరికన్నా తక్కువ కాదని చెప్పుకోవడం కోసం! ప్రెస్టేజ్ కోసం!

అమ్మా నాన్నమ్మా దెబ్బలాడుకున్నప్పుడు నాకు అర్థమయ్యింది! ఔను, అమ్మే అంది! పిల్లల పుట్టిన రోజులు కూడా చెయ్యలేదు… వాళ్ళెంత దివాళా తీసారోనని అంతా అనుకుంటారట! గ్రాండ్ గా పుట్టినరోజు చెయ్యకపోతే అప్పు పుట్టదట?! మళ్ళీ అమ్మే నాన్నతో అంటుంది… మీరూ మీ ఫ్రెండ్సూ తాగడానికి యిదో అవకాశం అని! అయితే కావచ్చు! ఏదైనా కావచ్చు! పుట్టినరోజు మన కోసమయితే కాదు! డేమ్ స్యూర్!

మనకి మన పుట్టిన రోజు తెలిసినప్పుడు పుట్టినరోజు జరపొచ్చుగా? జరపరు!

ఏమన్నా అంటే ఫస్ట్ బర్త్ డే అంటారు! బర్త్ డే మనకోసమో- అమ్మానాన్నల సంతోషం కోసమో తెలీదు!

అయినా పుట్టినరోజులన్నీ వొకటి కావు! అందరి పుట్టినరోజులూ వొకటి కావు!

మా ఫ్రెండ్ బంటిగాడు లేడూ? వాడిని చూశాక నాకు పుట్టినరోజు అంత బాగా అనిపించలేదు! వాడి పుట్టిన రోజు కొత్త బట్టలు తీసుకోలేదు! కేకు కొయ్యలేదు! చాక్లెట్లు పంచలేదు! ఇవన్నీ చెయ్యలేదని వాడు పడ్డ బాధ వాడు యేడ్చిన యేడుపూ అన్నీ నా పుట్టినరోజు వాడ్ని చూస్తే గుర్తుకొచ్చి అదోలా అనిపించింది! చెప్పాలంటే సిగ్గనిపించింది!

ప్చ్… వాళ్ళ చెల్లెలి బర్త్ డే కూడా తమ్ముడికి చేసినట్టు చెయ్యలేదు! అందుకని బంటిగాడు సిగ్గుపడి పార్టీకి పిలవలేదు! మర్చిపోయానని నాతో అబద్దం చెప్పాడని నాకు తెలుసు!

అసలు స్కూలుకు యూనిఫామ్ వున్నట్టు పుట్టినరోజులకి వొక యూనిఫామ్ వుండాలి! అందరూ వొకేలా బర్త్ డే జరుపుకోవాలి! అప్పుడు బంటిగాడిలా యెవరూ అబద్దం చెప్పరు! షై ఫీలవరు!

అసలు ఫ్రెండ్సుని విడదీసే బర్త్ డే లు బర్త్ డే లు కావు! అలాంటి బర్త్ డే లు మాకొద్దు!

అంతెందుకు… తమ్ముడికి బర్త్ డే విషెస్ చెప్పానా? వాడు తిరిగి థాంక్స్ కూడా చెప్పలేదు! వాడికి బర్త్ డే అంటే కూడా తెలీదు! తెలీని వాడికి బర్త్ డే ఏంటి?

తెలిస్తే మీరయినా చెప్పండి?

-అక్షర్,

మూడో తరవతి, సెక్షన్ ‘బి’

లిటిల్ బడ్స్ స్కూల్.

Mini birthday cake with a single candle

 

  

  

 

బమ్మిడి జగదీశ్వరరావు

బమ్మిడి జగదీశ్వరరావు: పుట్టిన తేదీ: 07 జనవరి 1969. తలిదండ్రులు : సరోజిని, రామన్న. స్వస్థలం : కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా. ప్రస్తుత నివాసం : హైదరాబాద్ (ఇరవై యేళ్ళకు పైబడి). పుస్తకాలు : కథా సంపుటాలు: 1. రెక్కల గూడు 2. పిండొడిం 3.దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ 4. మట్టితీగలు 5. హింసపాదు 6. రణస్థలి జానపద కథా సంపుటాలు: 1. అమ్మ చెప్పిన కథలు 2. అమ్మ చెప్పిన కయిత్వం 3. అనగనగనగా 4. పిత్తపరిగి కత 5. అనగా వినగా చెప్పగా 6. ఊకొడదాం. పిల్లల కథలు: అల్లిబిల్లి కథలు. ఒక్కక్క కథ ఒక్కో పుస్తకంగా వచ్చినవి. పురాణ సంబంధమైన జాతీయాలపై వచ్చిన పుస్తకం: పురాణ పద బంధాలు...మొత్తం 26 పుస్తకాలు వెలువడ్డాయి.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.