జర్నలిజం?

ఎన్ని తప్పులైనా చెయ్యి. ఒక్క తప్పును కూడా ఒక్కసారి కూడా పొరపాటున కూడా ఒప్పుకోవద్దు. మొహంలో ఇసుమంత పశ్చాత్తాపం కనిపించొద్దు. తప్పుడు పనుల మధ్య కాస్త తీరిక చేసుకుని, రచ్చబండ మీద నలుగురి మధ్యన కొలువుదీరి, నీ మీద దాడులు జరుగుతున్నాయని ధీరగంభీరంగా దుఃఖించు. ఏడుపు మధ్య ఎంచక్కా కొన్ని బాధితుడి తిట్లు కూడా వినిపించు. జనాలు కన్విన్స్ కాకపోయినా కన్ఫ్యూజ్ కావాలి. ‘అసలు తప్పేమీ జరగలేదేమో, అంతా సక్రమమేనేమో, ఇదంతా దుష్ప్రచారమేనేమో, వుట్టి వేధింపులేమో’ అని ఒక అనుమానం… నీకు పనికొచ్చే అనుమానం మొలకెత్తుతుంది. అది చాలు. అనుమానం మొలక వాడకుండా చూసుకోడమే ఇక నీ పని. ఆ మొలకను పెంచి మాను చెయ్యి. నువ్వొలికించే, నిజమేనేమో అనిపించే కన్నీళ్ళు ఏడుపు మొక్కకు నీళ్ళూ, ఎరువూ. నీ ఏడుపు-తోటకు నువ్వు మొదటి తోటమాలివి. కిరాయి ఆర్టిస్టులు ఎలాగూ వుంటారు. చెట్టును బట్టి గాలి అన్నట్టు ఆర్టిస్టులను బట్టి పేమెంట్లు. 

అవకాశం దొరికినప్పుడు ప్రత్యర్థుల పక్కలిరగదన్ను. వాళ్ళే నిన్ను తన్నినట్లు లేదా తన్నవచ్చినట్లు…  ఘాఠిగా అరిచి గీపెట్టు. అదను దొరికినప్పుడు దొరికిన వాళ్ళను దారి కాచి చంపెయ్. వాళ్లు నిన్ను చంపవచ్చినట్లు పోలీసు కేసు పెట్టు. నీ మీద వొచ్చే చిన్న  పెద్ద విమర్శలన్నీ నీ మీద జరుగుతున్న ఘోర కిరాట కీచక దాడులని రోడ్లెక్కి వలవల విలపించు. నిన్ను విమర్శించే వారు చేసే ప్రతి మంచి పనిలో ఏవో బొక్కలు చూపించి మరీ ఏడు. వాళ్ళు మంచి పనులు చేస్తున్నట్లు లోకం ఎప్పుడూ అనుకోగూడదు . అలా అనుకున్నారా యవ్వారం నీ చేజారిపోతుంది. 

ఏడుపు ఒక కళ. దాన్ని వాడుకోడం తెలియాలి గాని, బల్ చక్కని ఆయుధం. “ఆశ(యా)లు సంఘర్షించే వేళ ఆయుధం అలీనం కాదు’, ఏ ఆయుధమున్నూ. చిన్న పిల్లలు ఏడుస్తారే… ‘ఏదీ, ఎలా ఏడుస్తావో చూపించ’మంటే, కళ్ళల్లో నీళ్ళు  తెచ్చుకుని మరీ ఏడుస్తారే… అలా ఏడవాలి. దుఃఖం దుఃఖం. నీ యోపిన కొలది పబ్లిగ్గా దుఃఖించు. నీకు అయిన వారితో కూడా దుఃఖింపజెయ్యి. దుఃఖం కన్న సుఖం లేదు. 

చిన్న ఉదాహరణ. ఇటీవలిది. దైనందిన తెలుగు జీవితం లోంచి ఒక మచ్చుతునక. ఒక ప్రముఖ దినపత్రికలో వార్తాశీర్షిక. ‘కూల్చివేత – గుండె కోత’. ఆహా! ఏమి యమకంపు సొంపు?! పదాలకు ఒక అద్భుత శక్తి వుంటుంది. పదాలు తాము ఏ చెవులను తాకుతాయో ఆ చెవులను ఏదో ఒక వైపుకి మెలిపెట్టకుండా వదలవు. ఏదో ఒక వైపు మెలితిప్పుతాయి. ‘ఏ వైపు’కి అనేది ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ లా పదం మీద పడే మొదటి చూపుతోనే తేలిపోతుంది. ఇక దాన్నుంచి బయటపడ్డం కష్టసాధ్యం, లవ్వు లాగే. 

పత్రికలో ఇంత లావు అక్షరాలతో అలాంటి హెడ్డింగు కనపడగానే… దాని సందర్భం ఏమిటో కూడా చూడకుండా చదువరి గుండె వేగం పెరుగుతుంది. నెత్తుటి ప్రవాహవేగం మారుతుంది. పెరిగిన ఉద్వేగ కెరటాల మీద తేలుతూ ఆ శీర్షిక కింది వార్తను చదువుతారు జనం. వార్తలో ఒక భవంతి, దాని కూల్చివేత గురించిన సమాచారం. హెడ్డింగు వల్ల తయారైన సానుభూతి భవంతి మీద, ఆపైన భవంతి వోనరు మీద లేదా ‘వుపవోనరు’ మీద ప్రసరిస్తుంది.

అప్పటికే బరువెక్కిన లేదా కసి పెరిగిన గుండెతో వార్తను చదువుతారు. తాము వుంటానికి మంచి గుడిసెలున్నా లేకున్నా ఆ భవంతి వోనర్ల ఏడుపును తమదిగా చేసుకుని చదువుతారు. భవంతి యజమానుల లాభనష్టాల్ని తమ లాభనష్టాలుగా చేసుకుని చదువుతారు. (తనూ భార్య కామందుల ఇంట పాచిపనికి వెళ్లడం, పాములు తేళ్ళ కాట్లకు బిడ్డలను పోగొట్టుకోడం పేదలకు రోజువారీ బతుకు కావొచ్చయినా, చంద్రమతిని పోగొట్టుకుని, లోహితాశ్యుడు చనిపోయి, తనే కాటికాపరి అయిపోయిన రాజు హరిశ్చంద్రుని కోసం ప్రేక్షకులు కన్నీరు మున్నీరయిపోరూ, ‘గుండె కోత’ వార్త చదివే వాళ్లూ అలాగే.)

వార్తా శీర్షిక ఉదాహరణను మరింత నిర్దిష్టం చేద్దాం. దానికి మరి కాస్త కాంక్రీట్ రూపం ఇద్దాం. అది ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో డబుల్ కాలమ్ హెడింగ్. (‘జర్నలీజ్’ మరీ ఎక్కువయ్యిందా?! 🙂 ఇక్కడ ‘కాలమ్’ కాల విషయం కాదు, స్థల విషయం. జర్నలిస్టు భాషలో అది వార్తాశీర్షిక వెడల్పుకి కొలత). ముందే ప్రముఖ దిన పత్రిక. ఆపైన క్రిస్ప్ గా 8 అక్షరాలతో 2 కాలమ్స్ వెడల్పున్న శీర్షిక. వార్త మెదడుకు చేరకముందే మనస్సుకు చేరిపోతుంది. ఒక ఫీలింగ్ గా వార్త చదువరికి ‘సొంతం’ అయిపోతుంది. ఈ సంగతి పత్రికా గురూలకు తెలుసు. వారి రాజకీయ శిష్యులకూ తెలుసు. 

ఉదాహరణను ఇంకొంచెం నిర్దిష్టం చేద్దాం. ఆ వార్త లోని భవంతి కృష్ణా నది కరకట్ట మీద వుంది. నది కరకట్ట మీద, జలాల నిర్ణీత లెవెల్ కు లోపల ఇళ్లూ అవీ కట్టగూడదు. కూడదు అనేది ‘తల దువ్వుకోవాలి, స్నానం చేయాలి’ వంటి మామూలు సూచన కాదు. అత్యవసర నియమం. ఆ లెవెల్ లోపల నిర్మాణాలు జరిగితే, నిర్మాణాలు జలప్రవాహానికి అడ్డుపడతాయి. అడ్డుపడి, కృత్రిమ వరదలకు లేదా వరదల కృత్రిమ వుధృతికి కారణమవుతాయి. అందుకని ఆ లెవెల్ లోపల కట్టడాలు చేపట్టగూడదు. చేపడితే ఏమవుతుందో నదిలో నీళ్ళు తక్కువగా వున్నప్పుడు తెలీదు. ఎగువన వానలు కురిసి నీటి వడి పెరిగినప్పుడు నది వరదలెత్తి ఆ కట్టడంతో పాటు చుట్టుపక్కల జీవితానికి ప్రమాదం అవుతుంది. 

ఇదీ సంగతి. ఇప్పుడు వార్తల్లోని సదరు భవనరాజం అలా కృష్ణా నది కరకట్ట మీద వుంటానికి వీల్లేని నీటి లెవెల్ లో వుందని అన్ని పత్రికలు, నిపుణులు, పరిశీలకులు కోళ్లు, బాతులు, పిచికలు, కాకులై కూశారు. సాధారణ చేతన వున్న ఏ మనిషైనా ఆక్కడ ఇల్లు కట్టగూడదు. అలా కట్టిన ఇంటిలో మరే బాధ్యత కల్గిన మనిషైనా అద్దెకు వుండగూడదు. అక్కడ వుండింది మామూలు వ్యక్తి కూడా కాదు. ‘అసాధారణుడు’. వి వి ఐ పి. లోకానికి మేలు చేస్తానని మాటల వరదలెత్తించి, గణనీయ కాలం అధికారం చెలాయించిన రాజకీయుడు. 

సోదరా! ఇప్పుడు చెప్పు. ప్రముఖ తెలుగు దినపత్రిక ప్రచురించిన ఆ వార్తావిశేషం అంత విషాదకర, గుండెలవిసే, నెత్తురు మండే హెడింగుతో సానుభూతి సృష్టిస్తోంది ఏ  పేదవాడికి, ఏ నిస్సహాయుడికి వొచ్చిన కష్టం గురించి? 

పేదవాళ్ళు వేరే గతి లేక, అనుమతులు లేని చోట్లలో గుడిసెలు వేసుకుంటే, వాటిని కూల్చేస్తే, వాళ్ళకు నిలువ నీడ కరవైతే, పిల్లా పాపా రోడ్లపాలై రోదిస్తే కలగాల్సిన సానుభూతిని తీసుకెళ్లి పలు అక్రమాలు నీతిబాహ్య చర్యల మధ్య శ్లేష్మంలో ఈగల్లా ఈదులాడే కొందరు వ్యాపారుల కోసం, రాజకీయ జలగల కోసం ఖర్చు పెట్టే ప్రముఖ ‘జర్నలిస్టు’ల నుంచి తమను తాము కాపాడుకోడానికి ఒక ప్రజా వుద్యమం అవసరమా కాదా? 

సోషల్ మీడియా అనే జవాబు కూడా చాలదు. నేడు సోషల్ మీడియా సైతం పెట్టుబడి కోరలు పెంచుకుంటోంది. దానికి కూడా మతం గోళ్ళు మొలుస్తున్నాయి. మనిషి ఇవాళ దేన్నీ నమ్మలేడు. నమ్మకాన్ని కూడా నమ్మలేడు. అలాగని ‘ఉన్నదొకటే నాదం, ఆర్తనాదం’ అని విరాగియై వుండిపోలేడు. మనిషి ఆర్తనాదం వినడానికి మనిషి వినా ఎవరూ లేరు. జీవితానికి బయట జీవన స్థలం లేదు. ఇప్పుడు త్యాగాలు చేసేస్తే రేపు బాగుంటుందని అనుకోడం అర్థరహితమని తేలిపోయింది. నిన్నటి త్యాగులు తమ సమాధుల్లోంచి వేసే ప్రశ్నలకు మన వద్ద తగిన జవాబులు లేవు. నిన్నటి నిబద్దం నేటి అబద్ధం. దేనికీ నిబద్దుడివి కావొద్దు. ఎదురైన ప్రతిదాన్నీ ప్రశ్నించు. ఎదురైన ప్రతివాడినీ ప్రశ్నించు.

మరో దారి లేదు. సొంత రాజకీయ ప్రయోజనాలున్న పాలక ‘ప్రత్యర్థులే’ ప్రశ్నించేవారైతే… చూశాం కదా, ప్రభుత్వం ఏవైనా మంచి పనులు చేపడితే, వాటికి అడ్డుపడి తమ ఏడుపు తాము ఏడ్వడమే వీరి పని అవుతుంది. తమ అక్రమ కట్టడాల్ని కాపాడుకోడం, తమకు మునుపు ముడుపులిచ్చినోళ్ల కాంట్రాక్టుల్ని కాపాడుకోడం, ఎలాగో ప్రభుత్వ పక్షాన్ని అభాసుపాల్జేసి రేపటి తమ అధికారానికి బాటలు వేసుకోవడమే వారి ధ్యేయమవుతుంది. 

ఉన్నదొకే దారి. ప్రజల నిరంతర నిఘా. దానికీ ఒక రూపం అవసరమే. రాజకీయాధికారం అనే అజెండా లేని  ‘మానవహక్కుల సంఘా’లు ఇవాళ ప్రజలకు కనీస రక్ష. తక్షణ రాజకీయ అధికారం కాదు. నిరంతర ప్రజా వుద్యమమే ఆధునిక జీవితం వేసే పొడుపు కథకు జవాబు. అలాంటి సంస్థలే ప్రజల పక్షం వహించే నిజమైన ప్రతిపక్షం అవుతాయి.

29-9-2019

హెచ్చార్కె

8 comments

  • భాషలోని రాజకీయ లిపి కారణం కావొచ్చు. కొంత వాక్య సందోహం హడావుడిగా సాగింది. మీరూ జర్నలిస్టే కదా, అప్పట్లో ఇలాంటి హెడ్డింగులు లేవా ? ఆలాంటి భవనాలకింద చచ్చిన సామాన్యుడు లేడా ? అయితే ఇప్పుడు మరీ వ్యాపారం అయిపోయింది. తల్లిపాల సంగతే చెబుతున్నాను, అక్షరమూ అదే బాధని అనుభవిస్తోంది. కానీ సర్క్యులేషన్లు తగ్గడం లేదే ? పైపెచ్చు నాలుగో ఎస్టేట్లకు గౌరవ పదవులు కూడా ! గురుతరమైన బాధ్యత మోసిన సంపాదకులూ, పత్రికల్లోని ఉద్యోగులూ కరువైపోయిన కాలం. కర్తవ్యం గుర్తు చేశారు.

    అక్షరం బలికోరుతుందన్నాడుగా ఓ పెద్దాయన. ఆ నమ్మకముంది ఇంకా.

    థ్యాంక్యూ సర్

  • ఈ తరహా సంస్కృతి ఎలా మొదలైందో కానీ (అ)రాచకీయ లిపే! పత్రికలు భజనపరులుగా బ్లాక్ మెయిలింగ్ ఏజన్సీలుగా వికృత జన్మ పొందడం పాత్రికేయుల పాత్రలూ అలాగే మారడం నిజంగా దురదృష్టమే. మీ ఈ సందేశం ఇంకా ప్రజల్లోకి సూటిగా మీరు ఉద్దేశించిన వారికి చేరాలని ఆశిస్తాను. అభినందనలు సర్.

    • థాంక్స్‍ విజయ్‍. మ‍న‍ మాట మ‍నం ఉద్దేశించిన వారందరికీ కాకపోయినా, కొందరికైనా చేరుతోంది, సోషల్‍ మీడియా పుణ్యమా అని. దీన్ని మరింత శక్తిమంతం చేసుకోవాలి.

  • సార్! క్షణకాలం పతంజలిగారి ఎడిటోరియల్ ఏమైనా చదువుతున్నానా అనిపించింది. మీర్రాసింది ప్రత్యక్షర సత్యం. చదివించేలా చేస్తే చదివింపులుంటాయి మరి. సిగరెట్టు రేటు పెరిగితే ‘సిగ’రేటు పెరిగింది అని రాసినవాళ్ళు మిత్రులే. మహిళలంటే గౌరవం లేదా ‘సిగ’ రేటు పెరిగిందని రాస్తావా అని నాడు మహిళా సంఘాలు నిరసించలేదు. భలే కవిత్వం అనుకున్నారు. జర్నలిజంలోకి కవులు దూసుకు రావడంతో వచ్చిన తంటా ఇది. వార్త రాసినా, కవిత్వం రాసినా అంతా చదవాలని అదో ఉబలాటం. నేపధ్యాలు, పరిణామాలు, అబద్ధాలు అనవసరం. ఇప్పుడు ఎబిసి, టీఆర్పి రేటింగులే మీడియా మనుగడకు దిక్కు.

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.