తన కాలం మీద
వల్లభరాయని వ్యంగ్యాస్త్రం

క్రీడాభిరామ కర్తృత్వ విషయంలో పలువురు పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. క్రీడాభిరామ కావ్యాన్ని శ్రీనాథుని ప్రభావానికి లోనైన వల్లభాయుడే రచించాడని, అందుచేతనే క్రీడాభిరామంలోని శైలి అక్కడక్కడ శ్రీనాథుని కవితా శైలిని పోలి ఉందని సహేతుకంగా ఉంటుంది. ఆనాటి కవులకు శ్రీనాథుని జీవితం, విద్వత్తు, కవితా పటిమ, రాజు గారి కొలువులో ఆధికారిక పదవి, పలుకుబడి ఇవన్నీ ఆయనను ఒక ఫాషన్ ఐకాన్ గా నిలిపాయి. అటువంటి శ్రీనాథునిపై గల మక్కువతోనే వల్లభరాయడు శ్రీనాథుని అనుసరించాడని చెప్పడం సమంజసం.

క్రీడాభిరామం ప్రతాపరుద్రుని నాటి ఆస్థాన వైభవాన్ని, సైనికుల పరాక్రమాన్ని, గృహస్థ జీవనాన్ని సమగ్రంగా చిత్రించకపోయినప్పటికీ నాటి సంఘంలోని మానవులు సహజమైన మనోదౌర్భల్యంతో ధర్మాన్ని అతిక్రమించడం మాత్రం ఎగతాళిగా ఎత్తిచూపింది. 

“ప్రకృతివశ్యులైన ఆ దుర్బల హృదయుల చేష్టలకు వారిని వెన్ను చఱచి మందలించి నట్లుండునే గాని ఆగ్రహముతో శపించినట్లుండదు ” (సా.శి.సమీక్ష – పి.ఎల్.కాంతం.) అన్న మాట మాత్రం క్రీడాభిరామానికి చక్కగా సరిపోతుంది.

శబ్దరత్నాకర’ కారుడు  క్రీడ ‘ అనే పదానికి ఆట్లాట, పరిహాసము, దూఱు అనే అర్థాలనిచ్చాడు.అభిరామము అనే పదానికి మనోజ్ఞము, ఒప్పిదమైనది అనే అర్థాలున్నాయి. మొత్తంమీద క్రీడాభిరామం అంటే మనోజ్ఞమైన పరిహాసమని పేరు పెట్టి వల్లభరాయడు రూపక నామౌచిత్యం కూడా సాధించాడు. 

క్రీడాభిరామం శృంగార రస పూర్ణ రూపకం. నాటి పాఠకుల అభిరుచి కొరకేమో అన్నట్లుగా అక్కడక్కడా ఈ శృంగారం శృతి మించినట్లు కనిపిస్తుంది. శ్రీకాకుళ దేవుని తిరునాళ్ళలో వర్ణించిన విధవా దుర్వర్తనాలలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి సందర్భంలోనే ఇది శ్రీనాథుని కృతం కాదనిపిస్తుంది కూడా. 

కథా ప్రారంభంలోనే సూర్యోదయ కాలంలో ఓరుగల్లు నగరంలోని సౌధాల పై పడిన ఈరెండ అనగా లేత ఎండ ఎర్రగా మెరుస్తూ, ఘనమైన స్తనాలపై ఉండి, భర్తల గాఢమైన ఆలింగనం వల్ల రాలి పడిన కుంకుమపువ్వు పొడేమో అన్నట్లు ఉందని వర్ణించి కవి తన శృంగార పూర్ణ దృష్టిని చాటుకొన్నాడు. (క్రీడాభిరామం – 64)

క్రీడాభిరామం కాలం నాటి ప్రజల్లో అనేక విశ్వాసాలు కనిపిస్తాయి. ప్రయాణానికి అనువైన కాలాన్ని నిర్దేశిస్తూ,

గోధూళి లగ్నంబున బురంబు ప్రవేశింప వలయు విశేషించి యుషః కాలంబు సర్వ ప్రయోజనారంభంబులకు ప్రశస్తంబు” (క్రీడాభిరామం – 65)  అన్న మాట కనిపిస్తున్నది. దీన్నిబట్టి సకల కార్యాలకు ఉషః కాలంలో ప్రయాణం ప్రశస్తం గా ఉంటుందన్న నమ్మకం వారికి ఉండేది. 

అలాగే, ప్రయాణ సమయంలో అశాస్త్రీయమైన అనేక శకునాలను కూడా పరిగణించేవారు.

చుక్క యొకింత నిక్కి బల
సూదను దిక్కున రాయుచుండుట….

అనే పద్యంలో అనేక శకునాలను కవి వెల్లడించాడు.

మా గిలి మా గిలి వృక్షము
పూ గొమ్మున నుండి షడ్జము ప్రకాశింపన్
లేగొదమ నెమలి పల్కెడు
గేగోయని వైశ్య మనకు గెలుపగు జుమ్మీ ” (క్రీడాభిరామం – 51) 

నెమలి ‘గేగోయ్’ అని అరిస్తే కార్యం సిద్ధిస్తుందట. 

అలాగే ” కొనకొనం గోడి, యేట్రింత, కొంక నక్క, నమలి ” ఇవి నాలుగు కనిపిస్తే కొంగుబంగారం అవుతుందని శాకనిక వరులు చెబుతున్నారట. 

ఇక్కడ, వేశ్యల కొరకు వెళ్ళే విటులు కూడా శకున గణన చేయడం, అంతేకాకుండా ముహూర్తాలను గణించే సిద్ధాంతాల గురించి మంచన గంభీరోపన్యాసం చేయడం వ్యంగ్యాత్మక ధోరణికి ప్రతీకలు. ఈ సందర్భంలో శ్రీనాథుడు భీమేశ్వర పురాణం (3-41) చెప్పిన పద్యంలోని మూడు పాదాలను వల్లభరాయడు యథాతథoగా చెప్పాడు.

గార్గ్య సిద్ధాంతమత ముషః కాల కలన
శకున మూనుట యది బృహస్పతి మతంబు
వ్యాస మతము మనః ప్రసాదాతిశయము
విప్రజన వాక్యమరయంగ విష్ణు మతము ” (క్రీడాభిరామం – 66)

ఓరుగల్లులోమరొక ముఖ్యమైన దైవం మైలార దేవుడు. 

భైరవుని తోడి జోడు మైలార దేవుడోరు గంటి నివాసి ” (క్రీడాభిరామం – 145) 

భైరవ స్వామి భక్తుడైన వల్లభరాయడు మైలార భటుల వీర భక్తిని వర్ణించే సందర్భంలో మాత్రం అతనిలోని శివభక్తి సురగంగా ప్రవాహం లాగా దుముకుతుంది. మైలార భటులు భక్త్యావేశంతో చేసే సాహసకృత్యాలు చూస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. 

“ఱవ ఱవ మండు ఎఱ్ఱని చండ్ర మల్లెల 
చోద్యంపు గుండాలు చొచ్చు వారు
కరవాఁడి యలుఁగుల గనప పాఁతర్లలో
నుట్టి చేరులు గోసి యుఱుకువారు
గాలంపుఁగొంకిఁ గంకాళ చర్మము గ్రుచ్చి
యుడువీధి నుయ్యాల లూఁగువారు
కటికి హోన్నాళంబు గండ కత్తెర పట్టి
మిసిమింతులును గాక మ్రింగు వారు ”
సందులను నారసంబులను సలుపువారు
యెడమకుడిచేత నారతులిచ్చువారు
సాహసము మూర్తి గైకొన్న సరణి వారు
ధీర హృదయులు మైలారవీరభటులు “(క్రీడాభిరామం – 142) మైలారవీరభటులు ధీర హృదయులని చెప్పడం ద్వారా ఇక్కడ గాంభీర్యం కన్పిస్తుందిగానీ వ్యంగ్యం కన్పించడం లేదు. కాబట్టి వల్లభరాయనికి వ్యంగ్య, గాంభీర్యాలు రెండింటినీ నడపగల సామర్థ్యం ఉందన్నది స్పష్టం. మిగిలిన సన్నివేశాల్లో అల్పమైన విషయాలకు అతి గంభీరమైన సంభాషణలను బుద్ధిపూర్వకంగా కల్పించడం ద్వారా అతడు సాధించిన వ్యంగ్యం ఎన్నదగింది.

భోగ జీవనంపై భలే సెటైర్లు :

నిజానికి క్రీడాభిరామంలో మనకు ప్రధానంగా దర్శనమిచ్చేది నాటి భోగజీవనమే. శీతాకాలంలో చలి తీవ్రతను ఎదుర్కోడానికి, శీతోపద్రవం లేకుండా సుఖ నిద్రను పొందడానికి భోగ జీవన కాముకుడయిన మంచన శర్మ ద్వారా కవి కొన్ని సూచనలు చేశాడు.

ఎడతెగని ధూపోపచారములు,
కాలాగుర్వును లేపనములు,
వధూ గాఢోపగూహనములు (కౌగిలింతలు),
కేళీగర్భ నికేతనము, అనగా రసకేళికి  అనువైన ఇల్లు లేకుంటే చలి తీవ్రతను తట్టుకోవడం ఎలా ? అని మంచన శర్మ తన మిత్రుడైన టిట్టిభ సెట్టితో అంటాడు.  (క్రీడాభిరామం – 48) 

ఆనాడు పూటకూటి ఇళ్ళు కూడా విటులు, వేశ్యల మధ్య రాయబారం నడిపేవని కవి చమత్కరించాడు. భోజనానంతరం తాంబూల సేవనం సామాన్యంగా ఉండేది. తాంబూలానికి కూడా తెల్లని తమలపాకులు వాడేవారు. ఇక, జాజికాయ, జాపత్రి, పచ్చ కర్పూరం, లవంగ, యాలకులు వంటివి చెప్పనవసరం లేదు.  పూటకూటి వంటకాలు పెట్టే ఇళ్లు కూడా ఆహార, విహారాలకు వేరు వేరుగా ఉండేవని ముందే చెప్పుకున్నాం. అయితే, మధ్యాహ్న సమయంలో అక్కల వాడకు వెళ్లడం వేడుకగా ఉంటుందని, ఇక్కడ నివసించే వెలయాండ్రకు ఉన్న మేని పసలు మరెవరికీ ఉండవని చెప్పడం చూస్తే, వేశ్యల్లో కూడా ఉత్తమ, మధ్యమ, అధమ శ్రేణుల విభజన, వారికి ప్రత్యేక నివాస ప్రాంతాలు ఉండేవేమో అనిపిస్తుంది(క్రీడాభిరామం – 114).  

వేశ్యా వాటికల్లో చందనపు కల్లాపి చల్లి, కుంకుమ పువ్వు తో ముగ్గులు వేసి, ఇందురజం అంటే తెల్లని పొడి కావచ్చు దానితో రంగవల్లులు తీర్చి, కంజములు అనగా తామరలతో తోరణాలు కట్టేవారు. (క్రీడాభిరామం – 178) అంతేకాకుండా వార వనితలు చిత్రశాలలను కూడా ఏర్పాటు చేసుకునేవారు. 

ముకుర వీక్షణంతో వేశ్యలకు వృత్తిలోకి పచ్చజెండా :

వేశ్యలు బిడ్డలను తమ వృత్తిలో ప్రవేశ పెట్టేటప్పుడు ముకుర వీక్షణము అనే ఉత్సవం చేసేవారు. ముకుర వీక్షణము అంటే అద్దంలో చూసుకోవడం. ఈ తంతు పూర్తి అయిన తర్వాతనే వేశ్యలు వృత్తిని అవలంబించేవారు. (క్రీడాభిరామం – 196) 

వేశ్యలు తమ సంతానానికి కూడా తండ్రిని నిర్ధారించి చెప్పటం కన్పిస్తుంది. పునర్భువైన కామమంజరి 

“అత్రి సమాన ! నేటి యప
రాహ్ణసమాగమ వేళఁబుష్యన
క్షత్రమునందు నీయనుఁగు
గాదిలి కూఁతురు చూచు నద్దమున్”  (క్రీడాభిరామం – 194) అని చెప్పడం, అందులోను మంచనను అత్రి సమాన అని సంబోధించడం వ్యంగ్య ధోరణికి పరాకాష్ట.

వేశ్యలు అద్దాన్ని శ్రీ మహాలక్ష్మిగా భావించేవారని చెప్పే చోట కూడా కామమంజరి 

“లంజెవారికి శ్రీ మహాలక్ష్మి గాదె
దర్పణము విప్ర ముఖ్య “  (క్రీడాభిరామం – 197) అంటుంది. మొత్తంగా ఇటువంటి సన్నివేశాల్లో అధిక్షేపణ లేదుగానీ, వ్యంగ్యం మాత్రం పుష్కలంగా ఉంది.

ఆనాటి అనాచారాలపై వ్యంగ్యాత్మక విమర్శ :

క్రీడాభిరామం నాటి అనాచారాలపై ఎక్కుపెట్టిన వ్యంగాస్త్రం అన్న భావన మనకు తప్పకుండా కలుగుతుంది. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు తిరునాళ్ళలో జరిగే సంగతులు గురించి విస్తారమైన వర్ణనలు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని కవి హేళన స్వరంతో విమర్శించినట్లు మనం గుర్తించాలి. ఈ తిరునాళ్ళు జరిగే పర్వ కాలంలో పన్నెండు క్రోసుల చుట్టుకొలత కలిగిన శ్రీకాకుళం క్షేత్ర ప్రాంతంలో జరిగే పరనారీ సంగమాదులు పాపాలు కావని భావిస్తారని చెప్పడం ఇందుకు ఉదాహరణ. (క్రీడాభిరామం – 208) 

ఈ తిరునాళ్ళలో కామాంధలైన వెలనాటి కోడె విధవలు చేసే హేలా రతిక్రీడను భరించడం భీమసేనునికి తప్ప వేరొకరికి సాధ్యం కాదని చెప్పడం కవి వ్యంగ్యాత్మక ధోరణికి ప్రతీక. (క్రీడాభిరామం – 209) “ ముంజెపద నైనశంబరభంజను గేహములు గలుగు బ్రాహ్మణ విధవా పుంజములు “ కూడా ఈ తిరునాళ్లకు వస్తున్నపుడు ఇక వేశ్యలతో పనియేమని ? ప్రశ్నించడం నిజంగా దెప్పి పొడుపే. (క్రీడాభిరామం – 211) మొత్తంమీద  ఆనాడు తిరునాళ్ళలో జరిగే ఇటువంటి అకృత్యాలపై కవి మర్మ గర్భంగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. 

అలాగే, వేశ్యావృత్తిలోని వారు లేదా విటులు ఎవరు తప్పు చేసినా ఆనాడు జార ధర్మాసనం విచారించి తీర్పు చెప్పేది. ఈ జార ధర్మాసనం కూడా ఓరుగల్లు కోటలోని భైరవ ఆలయ ద్వారం వద్ద తీర్చేవారు. వేశ్య మాతలు తప్పు చేస్తే కందర్ప శాస్త్రంలో చెప్పినట్లుగా జుట్టు గొరిగించడం, ముక్కు సోణంబు దాకా (నాసా మూలము) చెక్కించడం, బోసినోరుగా పండ్లూడ కొట్టించడం. గూబలు అంటే విధంగా రెండు చెవులు కోయించడం వంటి శిక్షలు ఉండేవని కవి చెప్పడం నాటి విటుల విశృంఖలతకు, వేశ్యల వ్యాపారదృష్టికి నిదర్శనంగా ఉంది (క్రీడాభిరామం – 270). ఈ విధంగా చేసిన పునర్భువులకు గౌరవం తగ్గించి అధమజాతిగా నిదించి విటులు తమ ఇక్యతను చాటుకోనేవారు (క్రీడాభిరామం – 271). 

ప్రజలు రకరకాల వినోదాలతో ఆనందించేవారు. వాటిలో పాములాట, గడి యాట, మేష యుద్ధం, కోడిపుంజుల పోరు వంటివి ఉండేవి. పోరులో చచ్చిన కోడిపుంజులు రంభ, తిలోత్తమ, మేనకలను భోగిoడానికి స్వర్గానికి పోతున్నాయని కవి చమత్కరించడం క్రీడాభిరామంలోని వ్యంగ్య, హేళనాత్మక ధ్వనికి నిదర్శనం. అంతేకాకుండా, క్రీడాభిరామంలో నాటి జీవన విధానంలోని తప్పొప్పులను సుతిమెత్తగా ఎత్తిచూపిన వైఖరి మాత్రం ప్రశంసా పాత్రం.

  • ఆంధ్ర సాహిత్య చరిత్ర – పింగళి లక్ష్మీ కాంతం 
  • తెలుగు సాహిత్య సమీక్ష – డా. జి. నాగయ్య
  • శ్రీ ప్రభాకర సంపూర్ణ గ్రంథావళి, క్రీడాభిరామం, పరిష్కృతం శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి – సంపాదకులు డా. వేటూరి ఆనందమూర్తి
  • శ్రీనాథ విరచిత శ్రీ కాశీఖండము – వ్యాఖ్యాత శ్రీ మల్లంపల్లి శరభేశ్వర శర్మ
  • ఆంధ్రుల సాంఘిక చరిత్ర – సురవరం ప్రతాప రెడ్డి
  • రెడ్డి రాజ్యాల చరిత్ర – మల్లంపల్లి సోమశేఖరశర్మ

డాక్టర్ పళని

డాక్టర్ పళని ద్రావిడ భాషల సాహిత్యం తులనాత్మక పరిశీలనపై ఆసక్తిగల పరిశోధకుడు. నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల్లో సమర్పించిన ' ద్రావిడ భాషల్లో భారతేతిహాసం ', అలాగే సి.ఐ.ఐ.ఎల్, మైసూరు వారి కోసం రాసిన ' తెలుగు కన్నడ భారతాలు - కవిత్వ దృక్పథం' వంటి వ్యాసాలు ఇందుకు నిదర్శనాలు. ఈయన రాసిన " సంగీత రారాజు - త్యాగరాజు" పుస్తకాన్ని తెలుగు అకాడమీ, హైదరాబాద్ వారు, " తేటల మాటలు, అన్నమయ్య అమృతధారలు పుస్తకాలను ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం వారు ప్రచురించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారి ఆర్థిక సాయంతో "మాండలిక కథల్లో - సామాజికాంశాలు (తెలంగాణ, రాయలసీమ కథలు) అనే అంశంపై మేజర్ రిసెర్చ్ ప్రాజెక్టును పూర్తి చేశారు.
ద్రావిడ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సహాయ ఆచార్యులు సేవలందిస్తున్న డాక్టర్ పళని, 2015 నుండి మూడు సంవత్సరాలకు పైగా మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రికి ఓ.ఎస్.డి (ప్రత్యేక విధుల అధికారి) గా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పని చేశారు. ప్రాచీన సాహిత్యం పై ఆసక్తి కలిగిన ఈయన యాబైకి పైగా వ్యాసాలను రాశారు.
చరవాణి 9912343804

1 comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.