‘బాసిటివిస్ట్’ వైఖరి
విజయానికి రహదారి

Don’t blame the boss; he has enough problems. 
-Donald Rumsfeld

బాస్‘ – ఈ పదం ఎంతో మందిలో ఎన్నో రకాల భావాలను రేకెత్తిస్తుంది. కొంత గౌరవం, కొంత ఉద్వేగం, కొంత స్ఫూర్తి, కొంత తాత్కాలిక అసహ్యం – ఇటువంటి భావాలన్నీ బాస్ అనే పదం వినగానే మనసులో బుల్లెట్ ట్రైన్ లాగా పరుగెడతాయి. కారణం – బాస్ కూడా మనలాంటి మనిషే; అతను కూడా బలహీనతలకు, తప్పులకు అతీతుడు కాదు అని మనం గుర్తించకపోవడమే. బాస్ అంటే మనకు సమస్యలు సృష్టించే, మన జీవితాన్ని నియంత్రించే నిలువెత్తు మనసు లేని మనిషి అని అనుకుంటాం. ఉద్యోగం వచ్చేంతవరకు కాళ్ళ బేరం; వచ్చాక అదో పెద్ద ఘోరం; ఇచ్చినవాడొక పెద్ద భూతం! ఇలా సాగుతాయి మన భావనలు! బాస్ ని తిట్టడం మొదలు పెడతాం! తర్వాత కంపెనీని తిట్టడం మొదలవుతుంది. ఎవ్వరినీ ఎవరూ అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించరు. ఒకరికొకరు ప్రియమైన శత్రువుల్లా తయారవుతారు. వీడెప్పుడు పోతాడ్రా అని మనసులో పరస్పర శాపనార్ధాలు పెట్టుకుంటారు. బాస్ కి మీకు మధ్య ఒక మంచు కొండని సృష్టించుకుంటారు. అది పగలకొట్టడం రామగుండం ఎండల వల్ల కూడా కాదు. ఎందుకిలా జరుగుతుంది? అజ్ఞానంతో వేసుకునే అంచనాలే దీనికి కారణం. బాస్ తన పని తాను చేసుకుంటున్నాడు. మీతో పని చేయించడం అతని పని. ఏదో ఒక ఉద్యోగం; ముందు చేరదాం; డబ్బులొస్తాయిగా; తర్వాత చూద్దాం అనే మధ్య తరగతి ధోరణిలో దొరికిన ఉద్యోగంలో చేరితే మీ ఆలోచనలు, అంచనాలు తలకిందులవుతాయి. పని గురించి తప్ప మీరు తక్కిన అనుత్పాదక (unproductive aspects) విషయాలన్నింటి గురించి అమితంగా ఆలోచిస్తుంటారు. అవన్నీ మీకు భారీ సమస్యల్లా అనిపించి మిమ్మల్ని అనుక్షణం నిరుత్సాహపరుస్తుంటాయి. ఉదాహరణకు సంవత్సరమయ్యాక జీతమెంత పెరుగుతుంది? ప్రమోషన్ ఎప్పుడొస్తుంది? వంటి అంశాలపై అతిగా దృష్టి పెడితే కాలహరణం తప్ప మరే ప్రయోజనం లేదు. ఆ సమయంలో ఏ నైపుణ్యాలు నేర్చుకుంటే ప్రమోషన్ వస్తుంది? ఉద్యోగంలో ఎదగడానికి అవసరమయ్యే సాంకేతిక నైపుణ్యాలెలా పెంచుకోవాలి? ప్రవర్తనా నైపుణ్యాలు ఎలా పెంచుకోవాలి వంటి వృత్తి వికాస శిక్షణపై  దృష్టి సారిస్తే విజయం తధ్యం. మీ చుట్టు ఉన్నవారు పని మీద ఎంతో కొంత  శ్రద్ధతో ఉద్యోగం చేసుకుంటూ మొదటి ప్రమోషన్ కొట్టేస్తే, మీరు గోరంతలు కొండంతలు చేసుకుని మిమ్మల్నెవరో నియంత్రిస్తున్నారన్న భావనలో గందరగోళంలో పడిపోతూ ఉంటారు.  

ఒక ఉద్యోగంలో చేరబోయే ముందు మనం అందులో చేరాక ఏమి చేయాలో, నిరంతరం నేర్చుకుంటూ ఉద్యోగంలో ఎంత అభివృద్ధి సాధించవచ్చో ముందుగా తెలుసుకోకపోవడం కూడా కొన్ని సందర్భాల్లో అసంతృప్తికి కారణమవుతుంది. ప్రయివేటు కంపెనీల్లో అయితే బాస్ సంతృప్తి కోసం మనకు సంబంధం లేని పనులు కూడా చేయాల్సి వస్తుంది. కొంత మంది బాస్ ని బుట్టలో వేసుకుని పబ్బం గడుపుకోవాలనుకునే వాళ్ళు తమకు సంబంధం లేని పనులు చేస్తూ ప్రమోషన్ల నిచ్చెన ఎక్కేస్తూ ఉంటారు. ఇటువంటి గుంపులో మనం చేరితే గుంపులో గోవిందాఅన్నట్టు గుర్తింపు లేకుండా; కేవలం గుర్తింపు కార్డులతో మిగిలిపోతాం.  గుర్తింపు కావాలా లేక కేవలం గుర్తింపు కార్డులతో జీవితాన్ని జీవించాలా అన్నది మీరే నిర్ణయించుకోవాలి.   ప్రభుత్వ ఉద్యోగంలో అయితే ఈ పని నాది కాదుఅని చెప్పినా ఎవ్వరూ ఏమీ అనుకోరు. అదే ప్రయివేటు కంపెనీలలో అయితే కృష్ణుడు శిశుపాలుని వంద తప్పులు లెక్కపెట్టి తలకాయ తీసేసినట్టు; మీ తప్పులు కూడా లెక్కపెట్టి పొమ్మనకుండా పొగ పెడతారు. వీటన్నింటికి మించి మీకు తగిన సాంకేతిక, ప్రవర్తనా నైపుణ్యాలు లేకపోవడం మీ ఉద్యోగంలో ఎదుగుదలకు అతి పెద్ద అవరోధంగా నిలుస్తుంది. ఒక వేళ ఉన్నా మీరు చేయాల్సిన పని ఏమిటో తెలుసుకోకుండా అంటే  Job description మీద అవగాహన లేకుండా చేరడం వలన నిరంతరం అసంతృప్తితో ఉంటారు. పైగా మీ నైపుణ్యాలు పెంచుకోవడం మీద దృష్టి పెట్టకుండా, ఒక మంచి ఉద్యోగిగా, ప్రొఫెషనల్ గా మీరు తయారయ్యే క్రమంలో అటువంటి ఆలోచనలన్నీ మీకు మానసిక అవరోధాలుగా (mental blocks) తయారవుతాయి. మీ స్వీయ అపజయ ప్రవర్తనల (Self defeating behaviours) వల్ల మీకు తెలీకుండానే మనశ్శాంతిని కోల్పోతారు. 

    

 ఇటువంటి మానసిక అవరోధాలను (mental blocks) అధిగమించి మీ కంపెనీని, మీ పై అధికారులను అర్ధం చేసుకుని, ఉద్యోగ జీవితాన్ని అద్వితీయంగా తీర్చిదిద్దుకోవాలంటే ఏం చేయాలి? అమెరికాకు చెందిన ఈరా షాలెఫ్ (Ira Chaleff) అనే ప్రముఖ  ఆర్గనైజేషనల్ కన్సల్టెంట్ (Organisational  Consultant) ఇటువంటి అంశాలపై సుదీర్ఘ పరిశోధన చేసి ‘The Courageous Follower – Standing up to and for our Leaders’ అనే  పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకానికి అమెరికాలో అత్యున్నత పురస్కారం కూడా లభించింది.   పుస్తకాన్ని ఆధారం చేసుకుని    ‘Bossitive Attitude – How about your Boss’ అనే వ్యాసాన్ని రచయిత అమెరికన్ అంతర్జాల వ్యాసాల వెబ్ సైట్ ezinearticles.com లో రాశాడుస్థూలంగా ఆయన ఈ  పుస్తకంలో బాస్ ని ఏ విధంగా ధైర్యంగా అనుసరించాలి? బాస్ కి కూడా మనం ఎలా నొప్పించకుండా సలహాలు చెప్పవచ్చు వంటి ఎన్నో అంశాల్ని  శాస్త్రీయంగా, మానవ మనస్తత్వానికి అనుగుణంగా  విశదీకరించారు. ఆయన దగ్గర శిక్షణ తీసుకొని వీటిని నేర్చుకోవడం వలన బాస్ మీద, వాళ్ళ ప్రవర్తన మీద నాకున్న (ఈ రచయితకు) అపోహలన్నీ తొలగిపోయాయి. నాటి నుండి ఎటువంటి ఉద్యోగమైనా, ప్రతి చిన్న విషయాన్ని నేర్చుకుంటూ, ఎంతో అవగాహనతో, మనశ్శాంతితో ఉద్యోగాలు చేశాను. చేస్తున్నాను. మరి మీరు కూడా బాస్ పట్ల సదవగాహన పెంచుకోవాలంటే ఈ పదిహేను సూత్రాలు ఆచరించండి. విజేతలు కండి.
1. నా బృందానికి (Team or group) నేను ధర్మకర్తని. దాని విజయానికి నాదే బాధ్యత.

 1. నేను అత్యున్నతమైన విలువలను పాటిస్తూ నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తాను. 
 2. నా విజయాలకు, అపజయాలకు నేనే బాధ్యుణ్ణి. వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ వృత్తిగత జీవితంలో ముందడుగు వేస్తాను.
 3. నేనేమిటో నా చుట్టూ ఉన్నవాళ్ళకు స్పష్టం చేసే నాలో ఉన్న ఆకర్షణలకు, వికర్షణలకు నేనే బాధ్యుణ్ణి. 
 4. ఎదుటివారిలో ఉన్న అస్తవ్యస్త అసంపూర్ణ తత్వం పట్ల నేను సానుభూతి చూపించగలను.
 5. నా సహోద్యోగులతో నేను కలసి మెలసి పని చేస్తూ, వారి నాయకత్వ లక్షణాలను ఆమోదిస్తూ, అందుకు అనుగుణంగా, సమయానుకూలంగా నడచుకుంటాను.
 6. నేను పని చేసే ప్రదేశంలో నాయకులకు మద్దతునిస్తూ వారికి కౌన్సెలింగ్ చేయగలను. వారి మద్దతు స్వీకరిస్తూ, వారి కౌన్సెలింగ్ ను ఆమోదిస్తాను.
 7. మా సామూహిక లక్ష్యమే మాకు మార్గదర్శనం చేస్తుంది
 8. నాయకులకు సహాయం చేసే శక్తి నాకుంది. వారి అధికారాన్ని సక్రమంగా, సద్వినియోగం చేసేలా చూడగల సత్తా నాకుంది
 9. నాయకులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే నేను వారి ప్రవర్తనను సరిదిద్దగలను.
 10. నేను అధికారాన్ని దుర్వినియోగం చేస్తే తోటివారి నుండి నేర్చుకుని, నా తప్పులను సరిద్దిద్దుకోగలను.
 11. అధికారాన్ని దుర్వినియోగం చేసే నాయకులు ప్రవర్తనను మార్చుకోకపోతే, వారికి నా మద్దతును ఉపసంహరించుకుంటాను. శక్తి నాకుంది.
 12. నేను నా విలువలకు లోబడి ఎదుటివారికి చక్కగా సేవ చేస్తూ, నా పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకోగలను.
 13. ధైర్యంతో వేలాది అనుచరులు చేసే ఒక్కొక్క పని వలన ప్రపంచం మారిపోతుంది
 14. ధైర్యం ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. మరి ఇప్పుడు మీ ధైర్యాన్ని ఎలా ఉపయోగించబోతున్నారు?

ఎవరినీ ఒప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేయకండి. మీరే తప్పుకోండి అని చెబుతూ విశ్వవిఖ్యాత ట్రయినర్ జిగ్ జిగ్లర్ ఇలా అంటాడు.  ‘జీవితం చాల విలువైనది. అనునిత్యం నిరుత్సాహంతో, విషాదంలో మునిగి తేలేవాళ్ళని ఒప్పించేందుకు ప్రయత్నిస్తూ మీ విలువైన కాలాన్ని వృధా చేసుకోకండి. మీ శక్తివంచన లేకుండా అటువంటివారిని పైకి తీసుకురావడానికి ప్రయత్నించండి. మరీ అతిగా చేస్తే వారి ప్రతికూల దృక్పథం మిమ్మల్ని కూడా కిందకు లాగేస్తుంది. ఎల్లప్పుడూ సానుకూల దృక్పథం ఉన్నవారితోనే ఉండండి.’

వ్యక్తిత్వ వికాస జీవన పయనంలో ఇంత కంటె వేద వాక్యాలేముంటాయి? అనుక్షణం మీ బాస్ కి తలలో నాలుకలా మెలగుతూ, అతనితో లేదా ఆమెతో కలసి పని చేసేటప్పుడు పై సూత్రాలను తు.చ. తప్పకుండా పాటించండి. వృత్తిగత జీవితంలోను, వ్యక్తిగత జీవితంలోను విజయం మీ వశమవుతుంది. తధాస్తు!   

(Picture before the heading: Donald Rumsfeld)

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.