రేపటి నిర్ణయం

రోజూ లాగే రోజు కూడా లంచ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం ఆమే నేనూ. రోజూ గలగలా నవ్వుతూ జీవితం ఇంత త్వరగా గడిచి పోతుందా అనిపించేలా మాటాడే మనిషి  ఈరోజేంటో  చాలా మౌనంగా ఆలోచనలతో వుంది. ‘ఏంటీ రోజు స్పెషల్స్అనడిగాను నేను. ‘మామూలే పెరుగన్నంఅంది. ఆఫీసులో మూడేళ్ళనుంచీ పనిచేస్తూ గమనిస్తున్నా. తన పని తాను చేసుకుపోతూ, ఎవరినీ పట్టించుకోక, పలకరిస్తే నవ్వుతూ తిరిగి ముక్త సరిగా మాట్లాడేది జ్యోత్స్న

ఎవరితోనూ అతిగా మాట్లాడని మనిషి. ఎందుకో నాతో చాలా ఆత్మీయంగా వుంటుంది. ఎవరెంతగా గుసగుసలు పోయినా నాకు ఎందుకో ఆమె ముక్కుసూటితనమంటే చాలా గౌరవం, అభిమానం. ‘ఏమైంది గలగలా పారే సెలయేరు నిశ్శబ్దమైంది?’ అడిగాను. మాట్లాడలేదు. ‘ఏంలేదుఅని దాటేయబోయింది కానీ  ఆమె కళ్ళలో సన్నని తడి. ఎవరైనా అలా వుంటే నాకు అసలే తోయదు. సరే టేక్ కేర్. అని లంచ్ ముగించి కొంత పెండింగ్ పని వుంటే పూర్తి చేస్తున్నాను

నాలుగౌతుండగా ఏదో ఫోన్ కాల్ మాట్లాడి హడావిడిగా నా టేబుల్ దగ్గరకొచ్చింది. ‘కొంచెం అర్జంటుగా ఇంటి కెళ్ళాలిఅంటూ. ‘ఎనీ ప్రాబ్లమ్అనడిగాను. ‘తర్వాత చెప్తానంటూ వెళ్ళిపోయింది. వారంరోజులు గడిచాయి తాను రాలేదు. నేను ఆదుర్దాగా ఫోన్ చేసినా తీయలేదు. మనసుకేమీ తోయలేదు. ఏవో పిచ్చి ఆలోచనలు

తరువాతి వారం వచ్చింది. ‘ఏమైందని అడిగాను. రెండుమూడు సార్లు అడిగాక చెప్పింది. తన భర్త కు బాగోలేదని. అంతకు ముందు కూడా అలాగే కొన్నాళ్ళు సెలవు పై వెళ్ళింది. అపుడూ ఇదే కారణం. నాకు అనుమాన మేసింది. ‘నిజంగా అదే కారణమాఅన్నాను. ‘కాదు ఉద్యోగం మానేయ మంటున్నాడుఅంది. ‘అదేంటి ఫూలిష్ గా. అసలే రోజులెలా వున్నై. ప్రమోషన్ తీసుకోబోతూ వుద్యోగం మానితే ఏం తింటారు? పిల్లలభవిష్యత్తేమిటి? అతని కేమన్నా పెద్ద జీతమా?’ అన్నాను ఆవేశంగా. నేను ఆమెను రెండు మూడు సార్లు ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టినపుడు చూశానతన్ని. ఇంట్రావర్ట్ లా దిగులుగా మొండితనంతో వుంటాడు. ‘జాగ్రత్తగా ఆలోచించు. కన్విన్స్ చెయ్అన్నాను

అసలు ప్రాబ్లమ్ అదికాదు. అతనికి అనుమానపు రోగం పట్టుకుంది. ఎవరితో మాట్లాడినా అనుమానంపైగా తక్కువ జీతంగల వుద్యోగమవడంతో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నా సంతోషం అతనికి కంటగింపవుతోంది. అందుకే ఇలా సతాయింపు. పొద్దస్తమానం తిడుతూంటాడు. అరుస్తాడు. పిల్లలకూ అసహ్యమేస్తోంది.’ అని నవ్వింది. నవ్వులో జీవం లేదు. మనాలో తెలీడం లేదు. ‘నువ్వేమనుకుంటున్నావ్అన్నాను.  ‘ఉద్యోగం మానితే జీవితమెలా. ఇన్నాళ్ళూ నన్ను నా పిల్లల్నీ నిలబెట్టిందిదేగా. రెండే నిర్ణయాలు. ఒకటి ఇన్నాళ్ళలాగా భరిస్తూ కన్నీళ్ళు తాగుతూ అతనితో బతకడం. లేకుంటే …’ అంటుండగా నాకు కంగారు వేసింది. ‘లేకుంటే…?’అడిగాను ఆదుర్దాగా

ఆందోళన పడకండి. ముళ్ళకంచె తోటే బతకాల్సొస్తే రోజూ గాయపడలేం కదా, మంచినిర్ణయమే తీసుకుంటా రేపటికల్లా.’ అని సుడిగుండాలు మోసుకెళ్ళే గోదారిలా నవ్వుతూ వెళ్తోంది. అవును అలాంటపుడు కంచె తొలగించేయాలి లేదా  తాక కుండా కంచెకు దూరంగా వుండాలి. కానీ మాటలే ముళ్ళను చేసే కంపతో ….? రేపటి తన నిర్ణయ మేమిటో!?

డాక్టర్ విజయ్ కోగంటి

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు
drvijaykoganti@gmail.com

M: 8801823244

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.