వీరశైవ ధిక్కారం: అక్కమహాదేవి!

12 వ శతాబ్దం లో శైవమత ప్రాబల్యం బాగా ఎక్కువగా ఉండటం తో పాటు, కొన్ని భయంకర మూఢాచారాలు అమలు లో ఉండేవి. శివుడి ఎదురుగా తలలు నరుక్కోవడం, శివార్పణగా అంగాలు ఛేదించు కోవడం, ఆత్మ హింసలు, తనకు తానే తల నరుక్కోవడం వంటివి ఉండేవి. వీటిని అప్పట్లోనే వ్యతిరేకిస్తూ యధావాక్కుల అన్నమయ్య  అనేక పద్యాలు రాసారు. సమాజం లో ఎప్పటికప్పుడు తలెత్తే ఈ భయంకర మూఢ భక్తి ని కవులు ఖండిస్తూనే వచ్చారు. ఇప్పటికీ ఇలాంటివి తారస పడినప్పుడు కవులు తమ కలాలను ఝుళిపించాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది. ఈ దిగువ పద్యం గమనిస్తే, ఎంత తీవ్రంగా ఈ మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తూ ధైర్యం చేసారో గమనించగలము,

 
అమితోత్సాహం నంది నీకు దన సర్వార్థంబులం గూర్చి నే
మముతో నిచ్చుట కంటే శౌర్యగుణ సామర్త్యంబునుం బొంది ప్రా
ణము  నీ కిచ్చుటకంటె దుస్తఃరభవోన్మాదంబు మర్దించి చి
త్తము నీ  కిచ్చుట పెక్కు భంగుల మహో దార్యంబు సర్వేశ్వరా!!

 
అప్పట్లో మతోన్మాదానికి వ్యతిరేకంగా రాసిన ఈ పద్యం  సమజాన్ని చైతన్య పరిచే దిశగా సాగిన కవిత్వమే. అప్పటి వరకు నెలకొన్న ఆ మత మౌఢ్యం ను “యధావాక్కుల అన్నమయ్య” తన పద్యాల్లో రాసారు.   “దుస్తఃరభవోన్మాదంబు” అంటే, ఆనాటి మతోన్మాదానికి పర్యాయ పదంగా వాడారు. యధావాక్కుల అన్నమయ్య , ఇప్పుడు ప్రాశస్త్యం లో ఉన్న అన్నమయ్య కంటే కొన్ని వందల ఏళ్ల క్రితం సమాజాన్ని చైతన్య పరిచే దిశగా రాసారు.

అప్పట్లో పాతుకొని పోయిన వీర భక్తి ని, మతోన్మాదాన్ని  ఎలాగైతే నిరసించాడో, అలాగే అద్వైతాన్ని, అహం బ్రహ్మాస్మి తత్వాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. ఇలాగే కాకుండా భక్తి పేరిట తీర్థయాత్రలు అప్పట్లో బాగా అమలు లో ఉండేవి. ఆ తీర్థ యాత్రల విధానాన్ని కూడా అయన తప్పు పడుతూ రాసిన ఈ పద్యం చూడగలరు. సమాజాన్ని ఒకరకంగా చైతన్య పరిచే దిశగా సాగే ఈ తరహా పద్యాలు అప్పట్లోనే ఆయన రాయడం చాలా విశేషము.

“పలు తీర్థంబులు గ్రుంకు కంటే
మహిలో భక్తాంఘ్రిపానీయముల్ తలమీదం జిలికించుకో దగును
తీర్థంబాడ భారంబు:
తత్ఫల మత్యల్పము”
అదే విధంగా,
రమణన్ భక్త సమగ్ర దర్శనము తీర్థశ్రేణి
తద్గోష్టి తీర్థము తద్దివ్యదయా లోకనము  తీర్థం
బెన్నగా  నిట్టి జంగమ తీర్థాంబుధి నోల లాడక
వివేకభ్రష్టు లైపోయి  లోకమునం దీర్థము లంచు నెరులు సారంగా నేల సర్వేశ్వరా!!

ఇలా యధావాకుల అన్నమయ్య ఈ మూఢ భక్తి పై అనేక పద్యాలు రాయడం, ఒక రకంగా సమాజం లో ఎదురు ఈదడమే.  యధావాక్కుల అన్నమ్మయ్య వాస్తవానికి దండనాధుడు తన పద్యాల్లో కత్తి, ఒర, బాణం వేయడం, గుర్రానికి తర్ఫీదు ఇవ్వడం వంటి అనేక అంశాలను ఉపమానాలుగా ప్రస్తావిస్తారు.  ఈయన రాసిన సర్వేశ్వర శతకం క్రీ.శ.1242 లో రాసారు. యధావాక్కుల అన్నమయ్య కర్నూలు జిల్లా, ప్రత్తి కొండ సమీపం లోని దూది కొండ కు చెందినవాడిగా కొందరు అంటే, గోదావరి తీరం లోని పట్టిస  అని, అక్కడి నుండి శ్రీశైలం తీర్థ యాత్ర కు వెళ్లి తిరుగు ప్రయాణం లో పల్నాడు తాలుకాలో కృష్ణా తీరాన జెట్టి పాలెం దగ్గరలోని సత్రశాల అనే చోట స్థిర పడినాడని ఈ ప్రదేశాన్ని విశ్వామిత్రక్షేత్రం  అని కూడా అంటారట..

****
సరిగ్గా అదే కాలానికి చెందిన బద్దెన భూపాలుడు (1220-1280) కూడా సమాజాన్ని చైతన్య పరిచే దిశ లో,  ఇంకో కోణం లో ప్రక్షాళన జరిపే క్రమం లో అనేక హిత వాఖ్యాలు, చైతన్య పరిచే పద్యాలు పుంఖాను పుంఖాలుగా రాసారు. ఆయన  రాసిన పద్యాలు ఇప్పటికీ తెలుగు ప్రజల నోటిలో నానుతూ ఉంటాయి. బద్దెన నన్నె చోడుని కి బంధువు గా చెప్పే ఆధారాలు ఉన్నాయి. కావ్య చతుర్ముఖుడనే బిరుదు కూడా ఇతనికి వచ్చింది. ఈయన అప్పట్లోనే నీతి శాస్త్ర ముక్తావళి రాసారు. ఆ గ్రంథం లో తాను అనేక పేర్లతో పిలిపించుకొంటారు. ఈయనే సుమతి శతకం రాసారు. ఈ శతకము లోని పద్యాలు కనీసం  ఒక్కటైనా తెలుగు వారికి తెలిసే ఉంటుంది. అయితే సుమతి శతకం కూడా ఇతను రాసినది కాదని కొందరు అభిప్రాయ పడినా, సుమతి శతకం బద్దెన జీవించిన కాలం నాటిదే. తెలుగు లో అతి పాత కాలం నాటి శతకాల లో ఇది ఒకటి.

ఆయన రాసిన పద్యాలలో ఒకవైపు చైతన్యం, మరోవైపు హితబోధ, సామాజిక ధోరణులు, కనిపిస్తాయి. ఎంతో ముందు చూపు తో ఆయన రాసిన ఈ పద్యాలు  ఈ నాటికి వాడుకలో ఉన్నాయి.

పద్యం:
వఱదైన చేన్ము దున్నకు
కరువైనను బంధుజనులకేడ కేగకుమీ,
పరులకు మర్మము డెప్పకు,
పిఱిపికి దళవాయితనము బెట్టకు సుమతీ.
తాత్పర్యం:
వరద వచ్చినచో పొలమున వ్యవసాయము చేయకుము కరువు వచ్చినచో చుట్టములకడ కరుగకుము,ఇతరులకు రహస్యము చెప్పకుము.భయము గలవాడికి సేనా నాయకత్వము నీయకుము.

……
మానధను డాత్మదృతి చెడి
హీనుండగువాని నాశ్రయించుట యెల్లన్
మానెఁడు జలముల లోపల
నేనుగు మెయిదాచినట్టు లెరుగుము సుమతీ.
తాత్పర్యం:
అభిమానవంతుడు ధైర్యమును తొలగి నీచుని సేవించుట, కొంచెము నీళ్ళలో ఏనుగు శరీరమును దాచ్కొను విధముగా నుండును.

 
పద్యం:

పొరుగునఁ పగవాడుండిన
నిరవొంఁదగ వ్రాతకాడె యేలికయైనన్
ధరగాఁపు గొండెయైనను
గరణాలకు బ్రతుకులేదు గదరా సుమతీ.
తాత్పర్యం:
ఇంటిపొరుగున విరోధికాపురమన్ననూ, వ్రాతలోనేర్పరియైన వాడు పాలకుడైననూ ,రైతు చాడీలు చెప్పెడివాఁడైననూ కరణములకు బ్రతుకుతెరు వుండదు.

 
పద్యం:

మండలపతి సముఖంబున
మెండైన ప్ర్దానిలేక మెలగుట యెల్లన్
గొండంత మదపుటేనుఁగు
తొండము లేకుండినట్లు తోచుట సుమతీ.

తాత్పర్యం:
కొండంత ఏనుగునఁకు తొండము లేనిచో ఎట్లు నిరర్దకమో,అట్లే రాజుయొక్క సముఖమున సమర్దత గల మంత్రి లేనిచో రాజ్యము నిరర్ధకము .

 
పద్యం:
‘రా,పొ’మ్మని పిలువని యా
భూపాలునిఁగొల్వ భుక్తిముక్తులు గలవే?
దీపంబులేని యింటనుఁ
జే పుణికి ళ్ళాడినట్లు సిద్దము సుమతీ.

తాత్పర్యం:
దీపము లేని ఇంటిలో చేతులతో యెంత తడుములాడిననూ పట్టు దొరకని యట్లే’రమ్ము పొమ్ము’అని యాదరింపని రాజును సేవించుట వలన భుక్తిముక్తులు గల్గవు.

.
ఇలా రాజు ఎలా వ్యవహరించాలి, రాజు మదాందుడైనప్పుడు ఎలా వ్యవహరించాలి? ప్రజలు ఎంత చైతన్యంగ ఉండాలి అన్న కోణం లో బద్దెన అనేక శతకాలు రాసారు. సమాజాన్ని  చైతన్య పరిచే దిశలో బద్దెన.


1230 కాలము నాటి తొలి తెలుగు రచయత్రి  కుప్పాంబిక గోన బుద్ధా రెడ్డి కుమార్తె, గోన గన్నా రెడ్డి చెల్లెలు. ఈమె ను తొలి తెలుగు రచయత్రి గ బుద్దరాపురం శాసనాల్లో లిఖించ బడింది. ఈమె కృష్ణ దేవరాయల కొలవులో రాజు, ప్రజల ముందు తన కవిత్వాన్ని వినిపించే వారు.  యవ్వన దశ లోకి అడుగిడిన యువతి లో పెరిగే మోహం తన ప్రియ సఖులతో కూడా చెప్పు కోలేకపోవడం పై అయ్యల రాజు సంకలనం లో కుప్పాంబిక రాసిన కవిత అప్పట్లో ఒక సెన్సేషన్ అయ్యిందని అంటారు. ఈ దిగువ పద్యం ఆమె రాసినదె …

వనజాతాంబకుడేయు సాయకములన్ వర్జింపగా రాదు, నూ
తన బాల్యాధిక యౌవనంబు మదికిన్ ధైర్యంబు రానీయద
త్యనురక్తిన్ మిముబోంట్లకున్ దెలుప నాహా! సిగ్గుమైకోదు పా
వన వంశంబు స్వతంత్రమీయదు చెలీ! వాంఛల్ తుదల్ముట్టునే

 
యవ్వన స్త్రీ ఇలా బాహాటంగా తనలో కలిగే కోరికలను చెప్పడం అప్పట్లో ఒక  చైతన్య ధోరణి గానే చెప్పవచ్చును.

ఇదిలా ఉంటె, అదే కాలానికి చెందినా అక్కమహాదేవి అనే కన్నడ రచయిత్రి కూడా ఎన్నో పద్యాలను రాసారు. చాల వరకు సమాజాన్ని మేలుకొలిపే దిశగా సాగినవి. ఆమె రాసిన “అక్కమహాదేవి వచనములు” ను రేకళీగే మఠం వీరయ్య అనే అతను అనువాదం చేసారు. దీనిని తెలంగాణా సాహిత్య అకాడమి వారు ప్రచురించారు. పుట్టిల్లు కర్నాటక అయినా , మెట్టినిల్లు శ్రీశైలం . ఆమె ఆ చెన్న మల్లికార్జునిడినే తన భర్తగా  భావించి, అక్కడే కొండ గుహ లో తపస్సు చేసుకొంటూ గడిపింది.

ఒక వైపు భక్తి, మరోవైపు  మోటివేషనల్ దిశగా ఆమె కవితలు ఉంటాయి,,,

 
తెలియనివారితో చెలిమ చేసిన
రాళ్లను గొట్టి మిరుగుళ్లను తీసి నట్టులయ్యా!
తెలిసినవారితో చెలిమి చేసిన
చల్లను చిలికి వెన్నను దీసినట్టులయ్యా!
చెన్నమల్లికార్జునా మీ శరణులతో చెలిమి
కర్పూరము గిరిని జ్వాలలు మ్రింగి నట్టులయ్యా!

 ఆధునికులైన స్త్రీలు ఒబిసిటి ని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు.  తిండి విషయం లో ఆ కాలం లోనే ఆమె తన వచనం లో జాగ్రత్తలు చెపుతూ పద్యాలు రాసారు. దేహ విషయమై జాగ్రత్త లు చెప్పిన ప్రధమ కవియత్రి అక్కమహాదేవి.

ఆహారాన్ని తక్కువ చేయండన్నా
ఆహారాన్ని తక్కువ చేయండి
ఆహరం వల్ల వ్యాధులొచ్చి
పట్టుకుంటామయ్య!
ఆహారం వల్ల నిద్ర , నిద్రతో తామసం
అజ్ఞానం, మైమరపు, మనోవికారం , భావవికారం, ఇంద్రియ వికారం, వాయు వికారం వంటి పంచ వికారాలను కలిగించి
ప్రకృతి వికటిస్తుంది,….ఇలా  చెపుతూ, చివరగా
చెన్న మల్లికార్జునిడిని
ప్రేమించుటకుపయోగపడే
కాయాన్ని చెడి పోనీక కాపాడు కోండయ్యా!  అని

అంతే కాక అక్కమహాదేవి దేహానికున్న బాహ్యమైన కట్టుబాట్లను ఛేదించదలచింది. స్త్రీ పురుషుడు అన్న ఆకార బేధాలు మనిషి దురాశతో కల్పించాడని నిర్ధారించింది.  “పాముకు గల కోరలు పీకి ఆడించ గలిగితే పాముతో స్నేహం చేయడం సులభం” అని శరీరానికున్న అడ్డు గోడలు తొలగించాలని అప్పుడే నిజమైన స్వేఛ్చ లభిస్తుందని నమ్మింది.  తాను దిగంబరి గా సంచరించింది. అప్పట్లో సమాజం స్త్రీ ని సతిగా, వేశ్యగా మాత్రమే గుర్తించింది. తాను సతిని కాను, వేశ్య ను కాను నేను మనిషిని అని మొట్ట మొదటి సారిగా తెలిపింది.

ఆమె రాసిన కొన్ని పద్యాలు  చదివితే ఆమె లోని చైతన్య స్ఫూర్తి, సమాజాన్ని ఎలా అవగాహన చేసుకొని మార్గ దర్సకమైంది  మొదలైన విషయాలన్నీ గోచరమవుతాయి.

చదువ చదువ వేదములు వాదములు దెచ్చె
వినగ వినగ శాస్త్రములు సందేహమును దెచ్చె
తెలిసె తెలిసె నని ఆగమము సగమై పోయె
పూరించితి పూరించితి నని పురాణము
పూర్యము దారికే పోయె
నేనెక్కడ, తానెక్కడ
బ్రహ్మ శూన్యము చెన్న మల్లికార్జునా !!

 
ఆమె రాసిన వచన పద్యము
అంగ లింగ దొళగాయిత్తు మనలింగన వేదిసి
మన లింగ దొళగాయిత్తు భావలింగన వేదిసి
భావలింగ  దొళగాయిత్తు చెన్న మల్లికార్జునా
నిమ్మ వొళుమెయ సంగ దల్లిద్దు సవ్య లింగ వాయిత్తు

 
ఈ పద్యాన్ని ప్రేరణగా తీసుకొని ఆధునిక కవులు  విప్లవ కవితలను రాసే అవకాశంలేక పోలేదు… ఆ కవితలో ఉద్రేకం, ఆవేశం ఆ సృజనాత్మకత ఆధునిక కవులు ఇలా

విప్లవ కారుల్ని జైల్లో పెడతావా?
విప్లవ కావ్యాన్నై అక్షర వృష్టిని కురిపిస్తాను
విప్లవ కావ్యాల్ని నిషేదించి వేస్తావా??
విప్లవ గీతాన్నై ఆకలి డొక్కల్లో  ప్రతిధ్వనిస్తాను
విప్లవ గీతాల గొంతు నులిమి వేస్తావా???
నేనే విప్లవాన్నై పోతాను”” అని ఇలా రాసే అవకాశం కూడా లేక పోలేదు..

ఆమె ను మోహించి వచ్చిన వారికి కనువిప్పు కలిగినప్పుడు … స్త్రీ దేహాన్ని గురించి ఎంత వైరాగ్యంగా చెప్పారో… గమనించ వచ్చు.

చూచు కన్నులకు రూపమింపుగానున్న
చూచి మనసున స్సిగ్గు లేక వచ్చితిరన్నా
వినెడి చెవులకు సోంపు గలిగిన మరులు జెంది వచ్చితిరన్నా
నారియను రూపమును జూచి వలచి వచ్చిరన్నా
మూత్రపు బిందువులు నొదులు నాళమని
తెలిసియు కన్ను గానక గతిజెడి వచ్చితిరన్న
బుద్ధి హీనతచే పరమార్థ సుఖమును
తప్పించు కొనుట యెందుకని అరయక
నరక హేతువనున దెరింగియు మనసున రోయక వచ్చితిరన్నా
చెన్న మల్లికార్జునుడు గాక, తక్కిన మగవారు
అన్నలు నాకు ఛీ పొమ్మా మూర్ఖుడా “  అని హితము పలికారు.

 
ఆమెను నూటికి నూరుపాళ్లు వీరశైవ ధిక్కార కవిగా చెప్పుకోవచ్చు. స్త్రీలపై అన్యాయంగా అమలవుతున్న అనేక ఛాందస నియమాలను వ్యతిరేకించింది.

 
నీ ఊపిరి
నాసికల్నిండా నిండినంక
ఇక సువాసనల పూలెందుకు?
శాంతీ, నెనరూ, అంతులేని ఓపికతో
నీకు నువ్వే యజమాని వైనంక
ఇంకా కా ళ్ళు మడుచుకు కూర్చుని
తెలుసుసుకోవడానికి యెముంటుంది?
మొత్తం ప్రపంచమే నీవైనంక
ఇంకా ఒంటరితనం యేమిచెయ్యగలుగుతుంది

….
>భూమ్మీద పైపైన ఎగిరే రాబందుకు
ఆకాశం లో లోతులు తెలుస్తాయా
చంద్రునికి తెలిసినట్టు?

 
నడిఒడ్డున తేలే నాచుమొక్కకు
తెలుస్తాయా  నీటి లోలోతులు
కలువపూలకు తెలిసినట్టు

 
చుట్టూ ఎగిరే ఈగలకు తెలుస్తాయా
అద్భుతమైన పూల పరిమళాలు
తేనెటీగలకు తెలిసినంత?

 
దున్నపోతులమీద ఎగిరే
ఈ దోమల కెట్లా తెలుస్తుంది

……
ఒకటి కాదు రెండు కాదు
మూడూ నాలుగూ కాదు
ఎనభై నాలుగు యోనుల్నుండి
వచ్చాన్నేను

 
వచ్చాన్నేను అసంభావ్యమైన
ప్రపంచాలనుండి

తాగేసానెంతో నెప్పినీ,  ఆనందాన్నీ
గత జన్మల్లో ఏమన్నా కానీ

……………….

ఇలా విప్లవాత్మకంగా ఆమె తన సాహిత్యాన్ని తన వచనములు లో వ్యక్తీకరించారు.

 
“కలవాడు పాతర దీసి గింజల బెట్టు వరకు
బీదవాని ప్రాణము పోయెనటు లయ్యే  “ అని రాసిన ఈమె మార్క్సిజం ధోరణి ని తెలియ చేస్తుంది.

 
పగలు నాల్గు జాములు ఆశనమునకై  చింతింతురు
రాత్రి నాల్గు జాములు వ్యసనమునకై చింతింతురు
నీటిదున్న చాకలి నోరెండి చచ్చినటులు
తమలో నున్న మహా ఘనమును
గన జాల రీజనులు ……….

ఇలా ఎన్నో పద్యాలను ఆమె తన వచనములలో  సమాజ చైతన్య ధోరణులను అద్భుతంగా తెలిపారు

 

సి వి సురేష్

సి.వి. సురేష్: కడప జిల్లా ప్రొద్దుటూరు స్వగ్రామం. పూర్తి పేరు చెన్నూరు వంకదార సురేష్, వృత్తి రీత్యా న్యాయవాది, కవిత్వం, అనువాదాలు, విశ్లేషణలు రాస్తున్నారు. సాహిత్యాన్ని ఎక్కువగా ప్రేమించే మనస్తత్వం ఉన్న ఈయన తెలుగు కవుల కవిత్వాన్ని ఆంగ్లం లోకి అనువాదం చేస్తున్నారు సురేష్ ఆంధ్ర భూమి, డెక్కన్ క్రానికల్ పత్రిక కు స్టాఫ్ రిపోర్టర్ గా కూడా పని చేసారు.

8 comments

 • భవోన్మాదం అంటే మతోన్మాదం కాదు.భవం అంటే జన్మ.జనన మరణ చక్రంలో ఇరుక్కుని బాధపడడమే భవోన్మాదం.
  భవ దు రిత శాత్రవ కరాసి వారణాసి (హరి శ్చ0ద్ర నాటక పద్యం) అంటే పుట్టుక అనే పాపం నుండి విముక్తి చేసేదే పవిత్రమైన కాశి. అంటే భవం అర్థం పుట్టుక

 • ఎంత సవివరంగా కుప్పాంబిక అక్కమహాదేవి బద్దెన గురించిన వివరాలు అరుదైన పద్యాలు సేకరించారు.
  రంగ నాధ రామాయణం రాసిన గోన బుద్దారెడ్డి గురించి తెలుసినా వారింట ఉన్న మరో కవయిత్రి గురించి ప్రచారం లో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.. కుప్పంబిక గురించిన వివరాలకు ధన్యవాదాలు సర్..కొత్త విషయాల్ని వెలికితీస్తున్న మీ ఆసక్తి చాలా విలువైనది…మీరు ప్రస్తావించిన బద్దెన పోయెమ్స్ కూడా ఇంతవరకు చదవలేదు..బద్దెన గురించిన సమాచారం బాగుంది..
  యదావాక్కుల అన్నమయ్య రచనలలో ఉన్న సమాజ చైతన్య అంశాలు ఇప్పటికీ ప్రాసంగికతను కలిగి ఉండడం విశేషం..
  మూఢ భక్తిని నిరసిస్తూ ఆత్మార్పణలు తీర్థయాత్రలు దాదాపు 12వ శతాబ్దంలోనే నిరసన పొందడం ఆశ్చర్యమే..
  అక్కమహాదేవి రచనల్లో ఆమె వీరశైవ తత్వాన్ని సామాజిక నిరసన గురించిన వివరాలు తెలిపే వాక్యాలు బాగున్నాయి..
  మొత్తంగా ఈ వ్యాసాలన్నీ తెలుగు సాహిత్యలో ఓ విస్తృత కాలానికి సంభందించిన స్వేచ్ఛ అధ్యయనం అవ్వడం వల్ల స్థల వస్తు వైవిధ్యతతో ఆసక్తిదాయకంగా సమాచారయుక్తంగా ఉన్నాయి…ఇందులో సంతోషం కలిగించే అంశం యధావాక్కుల అన్నమయ్య, బద్దెన ,కుప్పాంబిక , మన ప్రాంత వాసులవ్వడం..
  ఈ వ్యాసం చూశాక నాకనిపించింది ఏమంటే ఆకాలంలోనే ఇక్కడ గొప్ప విప్లవాత్మక సాహితీ వికాసము ఉందనీ.. మన ప్రాంత వాసులుగా మరింత ప్రాచుర్యంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని అనిపిస్తోంది.
  చాలా వివరాలు తెలుసుకున్నాను సర్ ధన్యవాదాలు….
  మీ విస్తృత అధ్యయనానికి జోహార్లు..

 • సామాజిక స్పృహవైపు తమ కలాన్ని స్పృజించి
  ఎన్నో వైషమ్యాలను ఎత్తిచూపుతూ
  మరెన్నో దురాచారాలను ఎండగడుతూ
  వ్రాసిన సాహిత్యం…కొన్ని వందల ఏండ్లు గడిచినా ఇప్పటికీ వీరి కవితలు..పద్యాలు నేటి సామాజిక అంశాలకు నిలువెత్తు అద్దంలా ఘోచరిస్తూనేవున్నాయి.
  మంచి అంశాన్ని మాకందరికి అందించిన సురేష్ గారికి అభినందనలు💐

 • మంచి కలెక్షన్ ఇచ్చారు.ఇంతమందిని ఓకే ఆర్టికల్ కాకుండా ఎవరికి వాళ్ళవే వ్రాయాల్సిన అంత గొప్పవాళ్ళు 👌👌

 • అసలు విననే వినని గొప్ప కవుల, కవయిత్రుల గురించిన సవివర సమాచారం, వారి నుంచి ప్రేరణ పొందగలిగే లాంటి పద్యాలు , కవితలు ఇంత అందంగా పొందుపరిచిన మీ ఉత్సాహానికి, ఓపికకు వేల వేల నమస్సులు… ముఖ్యంగా అక్క మహాదేవి గారి కవిత్వం చదువుతూ ఉంటే అప్పటికీ , ఇప్పటికీ మార్పు రాని కాలాన్ని శపించాలో,మార్పు తీసుకురాలేని మన చేతకానితనాన్ని ప్రశ్నించుకోవాలో అర్థం కావడం లేదు… లింగ వివక్షపై ఆమె దూసిన అక్షర కత్తి నేడు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉంది… మీకు మరో మారు ధన్యవాదాలు….

 • ఒంటరితనం, నిర్వచనం చూపిన అక్క మహాదేవి.. గురించి,చదవడం, గొప్ప మహదావకాశం.. నాకు.మొత్తం ప్రపంచ మే నీవేనంక..ఇక ఒంటరి తనం ఏమిచేయగలుగుతుంది?..వివరంగా రాసిన మీకు ప్రేమపూర్వక కృతజ్ఞతలు CV సర్!💐👌

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.