ఎగిరి కాళ్లతో తొక్కాను
ఎంతకీ రాదే
ఇంతలో వాళ్ళొచ్చారు
పాపాయి బుగ్గని తాకినట్టు తాకారు
బుజ్జి నవ్వుల్లా కాలాన్ని చీల్చుతూ
బయటకొచ్చింది… చరిత్ర
కలని ఆవిష్కరించడానికి
చేతినే కుంచెని చేశాను
ప్చ్
కుంచె వేళ్ళన్నీ
కాన్వాస్ మీద రక్తం రాలుస్తున్నాయి
ఆమె రక్తాన్నీ కాన్వాస్ నూ
చెరిపింది. ఓ చిత్రాన్ని కురిసింది
కలంతో కాలాన్ని
మారుద్దామనుకున్నాను
చిలికి చిలికి
ఓ విధ్వంస ఇజం పురుడుపోసుకుంది
అతనొచ్చి విధ్వంసాన్నీ కాగితాన్నీ
సిరాతో తుడిపేసి మనిషిని రాశాడు
రాయిని వొలిచి
విగ్రహం మలుద్దామనుకున్నా
కానీ
మరో రాయి నా చేతికొచ్చింది
రాయిని చెక్కినా రాయే మిగుల్తుంది
నిరాశలో నిండా మునిగాను నేను.
అప్పుడు ఒక ఉలి వొచ్చి ముద్దిచ్చింది
రాయి వలువలు జార్చి శిల్పమైంది
ఈ సారి
మనిషి మొలవని ఎడారి భూమిలో
నాగలయ్యాను మనిషిని పండిద్దామనుకున్నా..
అప్పుడు
ముడతల బరువులు మోస్తూ
ఓ ముసలమ్మ
నా దగ్గరకొచ్చి రహస్యం చెప్పింది
మట్టి పొరల్లో చరిత్ర దాగినట్టే
చిత్రమూ, ఇజమూ, శిల్పామూ కూడా
కాగితం కిందనో..
కాన్వాస్ కడుపులోనో..
రాయి లోపల్నో దాక్కున్నాయనీ
కలమొక హలమనీ.. కుంచె ఒక యరేజరనీ..
అలాగే
కాంక్రీట్ చినుకుల్లో తడిసిన
పువ్వే ఇప్పటి మనిషని
మనిషిని చూడాలంటే
మనిషిలో దాక్కున్న మనిషిని చూడాలంటే..
మూతుల మూతలు పీకి
గోడలు రాల్చే మాటలు వినాలని
ఇప్పుడామె ముడతలు
కాలం పేర్చిన పాఠాలుగా కనపడ్డాయి.
Add comment