“మౌనవ్రతంతో అసత్యాల్ని నియంత్రించొచ్చు”

(విపశ్యన సిరీస్ లో ఇది ఆఖరుది. వొచ్చే సంచిక నుంచి ఎప్పట్లా నవ్వులే. 🙂 )

రాత్రి అందరూ గదులు ,హాలు వరండా చకచకా శుభ్రం చేసేస్తున్నారు. కొందరు  టాయిలెట్లు క్లీన్ చేస్తామని అడిగి మరీ తీసుకుని చకచకా క్లీన్ చేసేసారు. అన్నీ అయ్యాక ఒకే గదిలో కూచుని కాసేపు సరదా కబుర్లు,  ఇంకాసేపు విషాదాల వీచికలూ పంచుకుని బాగా పొద్దుపోయాక నిద్రపోయామనిపించాము. ఇంటికెళ్లే రోజు కాబట్టి ఇంకా తెలవారదేమి అనిపించింది అందరికీ. పొద్దున్నే అల్పాహారం అవగానే   అంత పెద్ద ధ్యానమందిరాన్నీ ఆరుగురం కలిసి గబగబా వ్యాక్యూమ్ చేసి మాప్(mop) చేసేసాము. అన్నీ సర్దుకుని భోజనాల గదికి వెళ్ళాము. మనకి ఇష్టమైతే మన తరువాత వచ్చే యోగార్థుల ఖర్చు నిమిత్తం విరాళాలు ఇవ్వమని చెప్పారు. కానీ అది నిర్బంధం కాదనీ ఈ పైకం ముత్తం  ఇవ్వడం, ఇవ్వకపోవడం భవిష్యత్తులో ఇక్కడికి రావడానికి అనుమతించే విషయంలో ఎలాంటి పాత్రా వహించదని నొక్కి చెప్పారు. 5 సంవత్సరాల క్రితం వచ్చిన ఒకావిడ నిన్న 20 డాలర్ల చెక్ పంపుతూ “ఇన్నాళ్ళకి ఈ కాస్త పైకం పంపే అవకాశం వచ్చింద”ని వ్రాసిన ఉత్తరం సంతోషం కలగచేసిందని చెప్పారు. 

మాలో కొందరు మొదటి రోజే ఇచ్చేస్తామని అడిగినపుడు కాదన్నారెందుకని అడిగాము  .

మనం ముందుగా చెల్లిస్తే ఇంత చెల్లించామనే భావన మనకి ఉంటుందనీ ఆ భావన వల్ల మనము మనకి దొరికే సేవలను (గది, భోజనము వగైరా) లెక్క కట్టి మనము చెల్లించిన మొత్తం తో బేరీజు వేసే అవకాశం ఉందనీ ,  అలా కాకుండా ఇప్పుడు భవిష్యత్తులో వచ్చేవారికోసం ఇవ్వాలనిపిస్తే తోచినంత ఇవ్వడం (బలవంతం లేకుండా) సరి అయినదనీ వివరించారు. మౌనవ్రతం వల్ల కూడా అసత్యాలని నియంత్రించవచ్చని చెప్పారు. ఈ విషయంం నాకు చాలా నచ్చింది. భోజనం చేసి వంటింట్లోకి వెళ్ళాను. అక్కడ నా అప్సరస పేరు అడిగాను. లోపల ఉందని చెప్పారు. బిజీ గా ఉన్నట్టు కనబడింది. ఫర్వాలేదు ఊరికెనే కలవడానికొచ్చానని చెప్పాను. చెప్పండి ఫరవాలేదంటూ చేతులు తుడుకుని వచ్చి కూచుంది. నా తపో భంగము గురించి చెప్తూ ఇంద్రుడిని అప్సరసలని ఇంట్రడ్యూస్ చేసాను. భలే ఆసక్తి గా విని, పురాణాల గురించి కొన్ని ప్రశ్నలు వేసింది . చివరగా తనే నా అప్సరస అని తెలుసుకుని ఒకటే మురిసిపోయింది బిగ్గరగా నవ్వుతూ. యెప్పుడో కొన్నేళ్ళ క్రితం ఎవరి వల్లో పరిచయమయిందిట విపశ్యన. అప్పటి నించీ సమ్మర్ లో ఇంకేమీ పెట్టుకోకుండా ఇక్కడ సేవకి వచ్చేస్తుందిట. 

శ్రీలంక నించిట . అమ్మా నాన్న “ఉన్న ఒక్క కూతురూ ఇలా సన్యాసాశ్రమాలు పట్టి పోతోంద”ని వాపోతుంటారుట..చుట్టాలలో ఎవరి పెళ్ళి అయినా , “నువ్వెందుకే ఇలా చంపుకుతిింటున్ననావు..ఎక్కడికెళ్ళినా  ‘మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడని అడుగుతున్ననారని” గోలట. 

దాంతో చిర్రెతుకొచ్చి అసలు ఇంటికి వెళ్ళడం మానేసానని చెప్పింది.  ఇవన్నీ చెప్పి విసుక్కుంది. నా పిల్లల గురించి అడిగింది. వాళ్ళ చదువులు తన చదువు ఇలా చాలా సేపు సంభాషణ  సాగాక నాకూ కాస్త చనువొచ్చి, నా స్నేహితుల గురించి చెప్తూ , అమ్మా నాన్న ల వైపు ఎలా ఆలోచిస్తారో వారి పిల్లలు పిల్లా పాపలతో చల్లగా ఉండాలని ఎలా కలలు కంటారో , సంఘం లో వారికి ఉన్న ప్రెషర్ ఎలా ఉంటుందో చెప్పాను (డిగ్రీ పిల్లలకి చదువు చెప్పిన అనుభవం ఊరికే పోలేదు.. అమ్మ నాన్న కాకుండా ఇంకెవరైనా లెక్చర్ లా కాకుండా అదెవరి గురించో చెప్తున్నట్టు చెప్తే బాగానే ఎక్కుతుందని మనందరికీ తెలుసుగా).. అన్నీ చాలా జాగ్రత్తగా వింది. ఇన్నేళ్ళ నించీ ధ్యానం అలవాటయిన పిల్లకి ఆ మాత్రం ఫొకస్ ఉంటుందనుకుంటా.. కొన్నేవో నోట్ బుక్ లో కూడా వ్రాసింది మరి (?) 

అలా అరగంట దాటి గంట అయినా, మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాము. చివరగా, “ఇదంతాా చాలా ఆసక్తి కరం గా ఉంది. ఇవన్నీ నేనెప్పుడూ ఆలోచించలేదు. ఈ రోజు మా పేరెంట్స్ తరఫున కొన్ని ఆలోచనలు తెలుసుకోవడానికి ధమ్మ మిమ్మల్ని కలిపినట్టుంది” అనగానే , నాలోని ఉపాధ్యాయురాలు కాస్త గర్వపడబోయి.. పది రోజుల విపశ్యన సాధన జరిగి పది నిమిషాలు కాలేదు అప్పుడే నువ్వు, నీ అహంకారము అని తిట్టింది. “బై ద వే, మీరు చెప్పిన అప్సరస కథ నాకు భలే నచ్చింది, మీరు దీనిని వ్రాయగలరా “అని అడిగింది. తెలుగులో అయితే వాకే, ఇంగిిిలిపీీసు రాదు  అని చెప్పాను. “మీరంటూ వ్రాయండసలు ఆంగ్లం లో ఎలా చెయ్యాలో చూద్దాం” అంది అనునయం గా. ఈ లోపు నాకు ముందు రోజు రాత్రి పరిచయమై, ఎన్నెన్నో జన్మల నించి తెలుసు అనిపించే అనుభూతి కలిగించిన స్నేహితులు, చివరిసారి సెలవు తీసుకోవడానికి (కొందరికి ల్యాండ్ లయిన్ ఫోన్ మాత్రమే ఉంది, సోషల్ మీడియా తెలియదు ఇంకా) నా కోసం అంతా వెతుకుతున్నారని ఒకబ్బాయి వచ్చి చెప్పగా ఆ బంగారు అప్సరస నవ్వు మోముని కళ్ళలొ నింపుకుని ఆనందం గా బయటకొచ్చా..

అప్పటి వరకే ఆ అనుబంధాలు… ఒక రోజు కాగానే అన్నీ మరచి రొటీన్ లోకి… అదొక బంగారు లోకం.. మళ్ళీ వెళ్ళాలని ఉంటుంది.. కానీ మన సెలవులు మన ఉద్యోగాలు అంటూ కథ మొదటికొస్తుంది కదా.. అలాంటి కథలు కంచికి మనం ఇంటికి…

(ఈ కాలమ్ మొదట వున్న బొమ్మ చిత్రకారిణి రావెల గీతిక గారికి  రస్తా కృతజ్ఞతలు)

ఎన్నెల

రచయిత స్వీయ పరిచయం
కలం పేరు: ఎన్నెల. అసలు పేరు: లక్ష్మి రాయవరపు(గన్నవరపు). వృత్తి: చిత్రగుప్తుల వారి పని (చిట్టాపద్దులు వ్రాయడం). నిర్వహిస్తున్న బ్లాగ్: www.ennela-ennela.blogspot.com . అడ్రస్: 8 Skranda hill, Brampton, Ontario, Canada . ఈ మెయిల్ : ennela67@yahoo.ca

సికందరాబాద్ ఆల్వాల్ లో పుట్టి పెరిగి,  ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి , హిందూ మహా సముద్రం మధ్య ఎక్కడో (మాల్దీవుల్లో) ఉద్యోగాలున్నాయని వెళ్ళి అక్కడ మునిగి ఈదుకుంటూ కెనడా లో తేలాను. హాస్య కథలు వ్రాయడం, హాస్య నాటికలు వ్రాసి తెలుగు అసోసియేషన్ జనాల్ని భయపెట్టడం నా హాబీస్. జ్యోతిర్మయిగారి పరిచయంతో గజల్స్ మీద ఆసక్తి కలిగింది. ప్రస్తుతం గజల్స్ వ్రాసేసి, పాడేసి దొరికిన వాళ్ళందరినీ భయపెట్టే బృహత్ప్రణాలిక వేసుకున్నా మరి! ఆగండాగండి.. అయ్యో అలా పారిపోతున్నారేంటీ!!!!!!!!

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.